పిల్లికి చెలగాటం.. ఎలుకకు ప్రాణ సంకటం అంటే ఇదేనేమో! ఓవైపు కరువు పరిస్థితులు సర్కార్‌ను తీవ్ర ఇబ్బందులు పెడుతోంది. జనం కరువుతో ఎంత అల్లాడితే అంతలా సర్కార్‌పై వ్యతిరేకత పెరగడం సహజం. కరువుకు, సర్కార్‌కు సంబంధం లేదు వాస్తవానికి. కానీ ఆ కరువు తీవ్రతను తగ్గించే చర్యలు, ప్రజలకు ఉపశమనం కలిగించే పథకాలను కోరుకుంటారు ఈ సమయంలో.
ఈ విపత్కర పరిస్థితుల నుంచి బయటపడేందుకు జనాలను అవగాహన పర్చడమొక్కటే పరిష్కారం కాదని సర్కార్ కూ తెలుసు. వరి వేసుకోవద్దని అంత గట్టిగా చెబుతున్నప్పుడు, కరువు పరిహారం ప్రకటించి ఉపశమనం కలిగించే బృహత్తర బాధ్యత కూడా సర్కార్ పై ఉంటుంది. అంతే కాదు.. ఉపాధి అవకాశాలు మృగ్యమై జీవన ప్రమాణాలు పడిపోతున్న తరుణంలో కార్మిక, కర్షక వర్గానికి అంతో ఇంతో వెన్నుదన్నుగా నిలబడాల్సిన అనివార్యత ఉంటుంది.
ఇలాంటి ఆపత్కాలంలో ప్రతిపక్షాల నుంచి సపోర్టు దొరకుతుందనుకోవడం సర్కార్ పొరపాటుగానే చూడాలి. ఇక్కడ ప్రతిపక్షం బీఆరెస్ బలంగా ఉంది. పదేండ్లు అధికారం అనుభవించిన పార్టీ. తృటిలో తమకు అధికారం చేజారిపోయిందని భావిస్తున్న పార్టీ. వచ్చేది మేమే అని గట్టిగా నమ్ముతున్న పార్టీ. అందుకే ఈ సర్కార్‌ను ఇరుకున పెట్టి ..ప్రజల వ్యతిరేకతను అమాంతం పెంచేందుకు ఇదే మంచి తరుణం అని భావిస్తున్నట్టుగానే ఆ పార్టీ వ్యవహారం ఉంటుందంటున్నారు.
ప్రత్యేకించి, పనిగట్టుకుని మరీ సర్కార్‌పై కరువు వేళ ముప్పేట దాడికి దిగుతోంది గులాబీ దళం. ఇప్పట్నుంచే ఎన్నికల ఏడాదిగా భావిస్తున్నట్టుంది బహుశా. కరువు కూడా ప్రతిపక్షానికి కలిసి వచ్చింది. అందుకే కేటీఆర్ సారథ్యంలో తన టీమ్‌తో ఈ రకమైన దాడిని ముమ్మరం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువంటూ విస్తృతంగా ప్రచారం చేస్తూ వస్తోంది గత కొన్ని నెలలుగా.
ఈ విమర్శలను కాంగ్రెస్ శిబిరం గట్టిగా తిప్పికొట్టలేక చతికిలబడిందనే చెప్పాలి. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డే దీనిపై మాట్లాడాల్సి వచ్చింది. కాంగ్రెస్ మంత్రుల బృందం గోదావరి పరిహాక ప్రాంతాలను సందర్శించాలని, నీటిని వృథాగా కిందకి పంపలేదని ప్రజలకు తెలియజెప్పాలని ఆయనే స్వయంగా సూచించారంటే బీఆరెస్ విమర్శల తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ప్రాజెక్టులపైనే సీఎం రివ్యూ చేయడం కూడా పరిస్థితి తీవ్రతను తగ్గించడంలో భాగంగానే చూడాలి. కాళేశ్వరంపై ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం వెనుక కూడా కాంగ్రెస్ రాజకీయ వ్యూహం దాగుందని అంటున్నారు. మేడిగడ్డతో పాటు సుందిళ్ల, అన్నారం బ్యారేజీలను మరమ్మతులు చేపించే పనిని స్పీడ్ చేస్తోంది సర్కార్. దీనిపైనా వివరణ ఇచ్చి.. గత సర్కార్ తప్పిదాలను మరోసారి గుర్తు చేయడం, దాన్ని కాంగ్రెస్ సర్కార్ ఎలా సరిదిద్దుతూ వస్తోందో తెలియజెప్పేందుకు ఈ ప్రత్యేక అసెంబ్లీ వేదికను వాడుకోనుంది కాంగ్రెస్ సర్కార్.
తాజాగా రైతు భరోసా నిధులపై బీఆర్‌ఎస్ చేసిన రాజకీయం .. కాంగ్రెస్‌ను మరింత ఇరకాటంలో పెట్టేసింది. రైతు భరోసా రైతుల ఖాతాల్లో జమ అయ్యిందనే మెసేజ్ రైతులకు వెళ్లిందని, కానీ పైసలు మాత్రం రాలేదని విస్తృతంగా ప్రచారం చేసింది. ఇది సైబర్ తప్పిదం వల్ల జరిగిందా? దీని వెనుక ఎవరున్నారు? అనే అంశాలు పక్కన బెడితే.. ఈ సందర్భాన్ని తన రాజకీయానికి బాగా వాడుకున్నది బీఆరెస్. ఇంకా రైతు భరోసా వేయలేదు.. అని రైతులకు గుర్తు చేసి సర్కార్‌ను నిలదీసేలా పరిస్థితులను మార్చే వ్యూహంగా దీన్ని చూస్తున్నారు.
కరువు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యింది. బీఆరెస్ దాడి ఇప్పటికే ముమ్మరమైంది. ఇక మున్ముందు ఫక్తు రాజకీయానికే ప్రయార్టీ ఇస్తుంది తప్ప. ప్రజల గోసలపై కనికరమేమీ ఉండబోదనే అనిపిస్తోంది. తమను ఓడించి తప్పు చేశారనే భావనలోనే జనంపై అదే అసంతృప్తితో ఉన్న బీఆరెస్ అధినేతలకు, ఈ కరువు పరిస్థితుల్లో రాజకీయాలు చేయడానికి బాగా కలిసి వచ్చే రాజకీయ అంశంగానే కనిపించడంలో ఆశ్చర్యమేముంటుందని అంటున్నాయి కాంగ్రెస్ శ్రేణులు.