Kokapeta Land: అప్పుడు రాయదుర్గం.. ఇప్పుడు కోకాపేట.. రియల్ ఎస్టేట్‌లో రంగంలో హైదరాబాద్ ఇండియా మొత్తం స్టన్ అయ్యే రికార్డులు సృష్టిస్తోంది. ప్రైమ్ లొకేషన్‌లో స్థలం కొనాలంటే.. కోట్లు కావాలి. ఎంతలేదన్నా.. తక్కువలో తక్కువ ఎకరానికి వంద కోట్లైనా పెట్టాల్సిందే. తెలంగాణ రైజింగ్‌కి ఇదే బెస్ట్ ఎగ్జాంపులా? రియల్ ఎస్టేట్‌లో హైదరాబాదే రియల్ కింగ్ అని మరోసారి తేలిపోయిందా? హైదరాబాద్ భూమ్.. ఇప్పట్లో ఆగుతుందా?
హెచ్ఎండీఏ కోకాపేట భూముల వేలంలో.. పాత రికార్డులన్నీ బద్దలైపోతున్నాయ్. ఇటీవలే ఎకరం భూమి 137 కోట్ల 25 లక్షలు పలికింది. నవంబర్ 24న కోకాపేట నియోపొలిస్‌లో మొత్తం 41 ఎకరాల విస్తీర్ణంలోని ఆరు ప్లాట్లని హెచ్ఎండీఏ వేలం వేసింది. కోకాపేట్ ప్లాట్లకు.. ఎకరానికి 99 కోట్ల ఆఫ్‌సెట్ ధరతో రెండు ప్లాట్లని విక్రయించింది. 9.9 ఎకరాలకు గాను 1355 కోట్లకు పైనే ఆదాయం వచ్చింది. ఈ దెబ్బతో.. తెలంగాణ, హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం ఎంత బలంగా ఉందో మరోసారి అందరికీ తెలిసింది. ఔటర్ రింగ్ రోడ్డు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి.. కోకాపేట నియోపొలిస్ దగ్గరగా ఉండటం, అత్యాధునిక మౌలిక వసతులు, ఎన్ని అంతస్తులైనా నిర్మించుకునే అవకాశం ఉండటంతో.. ధరలు అమాంతం పెరిగాయి.
ఈ మధ్యకాలంలో భూముల ధరలు రికార్డు స్థాయిని దాటి.. అంచనాలకు అందని విధంగా అమ్ముడుపోతున్నాయి. సాధారణంగా.. భూముల ధరని పెంచే అంశాల్లో.. రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, విద్యుత్ లాంటి సదుపాయాలు మెరుగ్గా ఉండటం, ప్రముఖ ఐటీ కేంద్రాలు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, పారిశ్రామిక ప్రాంతాలకు దగ్గరగా ఉండటంతో పాటు అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించే విధానాలు ఉన్నాయి. ఈ మూడు అంశాలు.. హైదరాబాద్ చుట్టూ ఉన్న ప్రాంతాల్లో బలంగా ఉన్నాయి. ముఖ్యంగా.. రాయదుర్గం, కోకాపేట్ లాంటి ప్రాంతాలు.. ఐటీ హబ్‌కు దగ్గరగా ఉండటం వల్ల.. భూముల విలువ ఊహించని విధంగా పెరుగుతోంది.
ఇటీవలే.. రాయదుర్గంలో జరిగిన వేలంలో.. ఎకరం భూమి కనీస ధర 101 కోట్లుగా నిర్ణయిస్తే.. వేలంలో అది 177 కోట్లు పలికింది. 2023లో రాజేంద్రనగర్ బుద్వేల్‌లో భూములు వేలం వేస్తే.. ఎకరం దాదాపు 42 కోట్లు పలికింది. అప్పుడు.. 100 ఎకరాలకు పైగా భూములని వేలం వేయగా.. ప్రభుత్వానికి 3 వేల 625 కోట్ల ఆదాయం సమకూరింది. అక్కడ అత్యల్పంగా.. 33 కోట్ల ధర పలికింది. ఈ రేట్లు చూస్తే.. గ్రేటర్ హైదరాబాద్‌లో భూముల కోసం దిగ్గజ సంస్థలు ఎంతలా పోటీ పడుతున్నాయో అర్థమవుతోంది. ఈ ధరలు.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ బలాన్ని, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని, గ్రేటర్‌లో వేగవంతమైన వృద్ధిని సూచిస్తున్నాయి.
కోకాపేటలోని నియోపాలిస్ లేఅవుట్ ప్రాంతంలోనూ ఈ స్థాయిలో భూములు రికార్డు రేట్లు పలకడానికి బలమైన కారణాలున్నాయ్. వాటిలో.. గ్లోబల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడమే ప్రధానమైనది. హెచ్ఎండీఏ ఈ లేఅవుట్‌ని.. 300 కోట్లు ఖర్చు పెట్టి.. అత్యున్నత ప్రమాణాలతో అభివృద్ధి చేసింది. వెడల్పైన రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, పవర్ సప్లై, సైక్లింగ్ ట్రాక్‌ల లాంటి అత్యాధునిక మౌలిక వసతులను కల్పించారు. ఇక్కడ ప్లాట్లు కొన్నవారికి.. ఆకాశమే హద్దుగా హైరైజ్ బిల్డింగ్‌లు నిర్మాణం చేసుకునేలా అనుమతులు ఇస్తున్నారు. దీనివల్ల.. దేశీయ సంస్థలతో పాటు అంతర్జాతీయ సంస్థలు కూడా ఆసక్తి చూపుతున్నాయ్.
మరీ ముఖ్యంగా కోకాపేట్ నియోపొలిస్ ప్రాంతం.. ఔటర్ రింగ్ రోడ్డుకు కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. దాంతో.. సిటీలో ఎక్కడికైనా వేగంగా చేరుకునేందుకు వీలుంది. మరోవైపు.. రాయదుర్గం ఐటీ కంపెనీలు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు కూడా చాలా దగ్గరగా ఉంది. అందుకే.. వందల కోట్లు ఖర్చు పెట్టి స్థలాలు కొనుగోలు చేస్తున్నాయ్ సంస్థలు. అంతేకాదు.. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు కేవలం 20 నిమిషాల్లో చేరుకునే సౌకర్యం ఉండటం వల్ల.. దేశ, విదేశీ కంపెనీలు.. తమ గ్లోబల్ క్యాపబులిటీ సెంటర్లని.. ఇక్కడ ఏర్పాటు చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నాయ్. వీటన్నింటి వల్లే.. నియోపొలిస్ ప్లాట్‌లు రికార్డు ధరలు పలికాయ్. హైదరాబాద్ ఇప్పుడు ఒకప్పటిలా లేదు. సీన్ మారింది. స్టేట్‌లో సిచ్యువేషన్ మారింది. దిగ్గజ కంపెనీల గ్లోబల్ క్యాపబులిటీ సెంటర్లన్నీ ఇక్కడికే వస్తున్నాయ్. ఈ ఒక్క ఏడాదిలోనే.. 30 దాకా జీసీసీలు వచ్చినట్లు రిపోర్టులు చెబుతున్నాయ్. డిసెంబర్‌లో తెలంగాణ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ తర్వాత.. మరిన్ని కంపెనీలు హైదరాబాద్‌కు వచ్చే అవకాశం ఉంది.
గ్రేటర్ హైదరాబాద్.. దినదినాభివృద్ధి చెందుతోంది. ఫ్యూచర్ సిటీగా అంతర్జాతీయ స్థాయిలో దూసుకెళ్తోంది. ప్రపంచంలోని అత్యుత్తమ నగరాలతో పోటీ పడుతోంది. ఇక్కడి అనుకూలమైన వాతావరణం.. దిగ్గజ కంపెనీలకు బెస్ట్ డెస్టినేషన్‌గా కనిపిస్తోంది. అందువల్లే.. హైదరాబాద్ మహానగరం మరోసారి అంతర్జాతీయ ఖ్యాతిని గడించింది. ప్రపంచంలోని 100 అత్యుత్తమ నగరాల్లో స్థానాన్ని సంపాదించుకుంది. రెజోనాస్ సంస్థ ప్రకటించిన.. 2026 వరల్డ్ బెస్ట్ సిటీస్ రిపోర్టులో.. హైదరాబాద్ 82వ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ లిస్టులో భారత్ నుంచి మూడు నగరాలకు చోటు దక్కితే.. అందులో హైదరాబాద్ కూడా ఉండటం విశేషం.
ఎకరం భూమి.. కోటి, 2 కోట్లు పలికితేనే.. అమ్మో అంత రేటా అంటాం. కానీ.. హైదరాబాద్‌లో ప్రైమ్ లొకేషన్‌లో సర్కార్ వేలం వేస్తే.. ఎకరం భూమి వంద, 150 కోట్లు దాటుతోంది. అసలు.. ఇన్నిన్ని కోట్లు ఖర్చు పెట్టి.. భూములు ఎందుకు కొంటున్నారు? హైదరాబాద్ ఇప్పుడు.. గ్లోబల్ డెస్టినేషన్‌గా మారిందా? మరిన్ని.. జీసీసీలు రాబోతున్నాయా? మల్టీ నేషనల్ కంపెనీలన్నీ.. హైదరాబాద్ వైపు చూడటానికి రీజనేంటి? గ్రౌండ్‌లో కనిపిస్తున్న ఈ రియల్ భూమ్ వెనకున్న రియాలిటీ ఏంటి?
ఎకరం భూమి వందల కోట్లు పలకడమంటే.. అది కేవలం హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ భూమికి సంబంధించిన న్యూస్ మాత్రమే కాదు. భాగ్యనగరం.. గ్లోబల్ డెస్టినేషన్‌గా మారుతున్న వాస్తవానికి.. అద్భుతమైన నిదర్శనం. సాధారణంగా.. ఎకరం 2 కోట్లు, 3 కోట్లు పలికే చోట.. ప్రభుత్వ వేలంలోనే 177 కోట్లు, 137 కోట్లు, 100 కోట్ల లాంటి రేట్లు పలకడం వెనుక.. బలమైన కారణాలున్నాయ్. హైదరాబాద్‌లో భూమి విలువ ఇంత భారీగా పెరగడానికి.. కేవలం స్థానికంగా ఉన్న డిమాండ్, ప్రైమ్ లొకేషన్ మాత్రమే కాదు. అనేక అంతర్జాతీయ, ఆర్థిక అంశాలు కూడా కలిసొస్తున్నాయ్. హైదరాబాద్ అంటే ఇప్పుడు కేవలం తెలంగాణ రాజధాని మాత్రమే కాదు. భాగ్యనగరం భారతదేశంలోనే.. అతిపెద్ద ఐటీ, ఫార్మా, బయోటక్నాలజీ కేంద్రాల్లో ఒకటిగా నిలిచింది. మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, ఆపిల్ లాంటి ప్రపంచస్థాయి దిగ్గజ కంపెనీలు.. ఇప్పటికే నగరంలో తమ అతిపెద్ద క్యాంపస్‌లని కలిగి ఉన్నాయ్. మరెన్నో దిగ్గజ కంపెనీల.. గ్లోబల్ క్యాపబులిటీ సెంటర్స్ కూడా వరదలా హైదరాబాద్‌కు వస్తున్నాయ్.
మల్టీ నేషనల్ కంపెనీలు.. తమ అంతర్జాతీయ కార్యకలాపాలు, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, టెక్నాలజీ సెంటర్లని ఇండియాలో ఏర్పాటు చేయడానికి ముందుకొస్తున్నాయ్. దేశంలో ఇన్ని రాష్ట్రాలున్నా.. మరెన్నో మెట్రో నగరాలున్నా.. ఆ కంపెనీలన్నీ తమ జీసీసీలని ఏర్పాటు చేసేందుకు హైదరాబాద్‌నే ప్రత్యేకంగా ఎంచుకుంటున్నాయ్. ఇక్కడ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ అందుబాటులో ఉండటం, ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే.. కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువగా ఉండటం, వ్యాపార అనుకూల వాతావరణం ఉండటం.. జీసీసీలను అట్రాక్ట్ చేస్తోంది. ఈ దిగ్గజ ఐటీ కంపెనీల విస్తరణ వల్ల.. వేలాది కొత్త ఉద్యోగాలు వస్తున్నాయ్. దేశం నలుమూలల నుంచి యంగ్ ఎక్స్‌పర్ట్స్ అంతా.. ఇక్కడికే వస్తున్నారు. దాంతో.. హైదరాబాద్‌లోని రెసిడెన్షియల్, కమర్షియల్ స్థలాలకు డిమాండ్ అమాంతం పెరిగిపోయింది.
ఇప్పటికే.. హైదరాబాద్ అనేక జీసీసీలకు సెంటర్ పాయింట్‌గా మారింది. ఒకప్పుడు.. బ్యాక్ ఆఫీస్ ఆపరేషన్స్ నిర్వహించే లెవెల్‌ని దాటి.. ఇప్పుడు గ్లోబల్ ఇన్నోవేషన్, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ హబ్‌గా హైదరాబాద్ డెవలప్ అయింది. ఈ మహానగరంలో ఇప్పటికే వివిధ కంపెనీలకు చెందిన వందలాది గ్లోబల్ క్యాపబులిటీ సెంటర్లు ఉన్నట్లు రిపోర్టులు చెబుతున్నాయ్. దేశంలో కొత్తగా ఏర్పాటవుతున్న జీసీసీలలో.. సుమారు 40 శాతం వాటా హైదరాబాద్‌ది కావడమే.. లేటెస్ట్ గ్రోత్‌కు.. గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్. కేవలం ఐటీ రంగానికి చెందిన జీసీసీలే కాదు.. దాదాపు అన్ని ప్రధాన రంగాలకు చెందిన గ్లోబల్ సెంటర్లు ఇక్కడ కొలువుదీరాయ్.
బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, ఫార్మా అండ్ హెల్త్ కేర్, ఆటోమోటివ్ అండ్ ఇంజనీరింగ్, ఈ-కామర్స్ అండ్ రిటైల్, కన్సల్టింగ్ అండ్ సర్వీసెస్ రంగాలకు చెందిన కంపెనీల జీసీసీలు కూడా హైదరాబాద్‌లో ఏర్పాటయ్యాయ్. నైపుణ్యం కలిగిన ఇంజనీర్లు, డేటా సైంటిస్టులు, ఇతర టెక్నికల్ ఎక్స్‌పర్ట్స్ ఇక్కడ పెద్ద సంఖ్యలో అందుబాటులో ఉండటం వల్లే.. దిగ్గజ కంపెనీల చూపు హైదరాబాద్ మీద పడింది. బెంగళూరు, ముంబై లాంటి నగరాలతో పోలిస్తే.. ఇక్కడ ఆఫీస్ మెయింటెనెన్స్, కాస్ట్ ఆఫ్ లివింగ్ కొత్త తక్కుగా ఉండటం కూడా మరో కారణం. ముఖ్యంగా.. ఐటీ, పరిశ్రమలకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం, స్థిరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధిని కూడా గ్లోబల్ కంపెనీలు చూస్తున్నాయ్. ఇవన్నీ.. హైదరాబాద్‌ని గ్లోబల్ వాల్యూ సెంటర్‌గా మారుస్తున్నాయ్.
హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు.. రియల్ ఎస్టేట్‌కి మరో గేమ్ ఛేంజర్. దీనివల్ల.. సిటీ శివార్లు కూడా ప్రైమ్ లొకేషన్లుగా మారాయ్. ఓఆర్ఆర్‌కు అతి దగ్గరగా ఉన్న కోకాపేట్, నార్సింగి, నియోపొలిస్, రాయదుర్గం లాంటి ఏరియాల్లో రికార్డు ధరలు పలుకుతున్నాయ్. ఇక.. మెట్రో రైల్ నెట్‌వర్క్ విస్తరణ ప్రణాళికలు కూడా భవిష్యత్తుల్లో ఈ ప్రాంతాలకు కనెక్టివిటీని మరింత మెరుగుపరుస్తాయ్. రాష్ట్ర ప్రభుత్వం కూడా రోడ్లు, ఫ్లైఓవర్లు, నీరు, విద్యుత్ సరఫరాపై భారీగా ఖర్చు చేస్తుండటం, స్థిరమైన రాజకీయ వాతావరణం, రియల్ ఎస్ట్ రంగానికి బలమైన పునాదిగా మారాయ్. అంతేకాదు.. కోకాపేట్ నియోపొలిస్ లాంటి ప్రాంతాలను.. హెచ్ఎండీఏ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేసింది. ఇందులో.. 45 మీటర్ల వెడల్పు ఉన్న రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, విద్యుత్ లాంటి సదుపాయాలున్నాయ్.
Also Read: మేడ్చల్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ఎగసిపడ్డ మంటలు.. తగలబడిన టైర్ల షాప్..
ఈ ప్లాట్లలో.. కమర్షియల్, రెసిడెన్షియల్, వినోద అవసరాలకు అనుగుణంగా.. అతిపెద్ద, బహుళ అంతస్తుల నిర్మాణాలకు అనుమతులు ఉంటాయ్. సాధారణ ప్లాట్లతో పోలిస్తే.. ఇక్కడ ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ విలువ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ హైరైజ్ లగ్జరీ అపార్ట్‌మెంట్లు, విల్లాలు, అంతర్జాతీయ సంస్థలకు ఆఫీస్ స్పేస్‌లని నిర్మించుకునేందుకు వీలుంది. వీటికి.. మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు.. హైదరాబాద్ అంటే.. ఇండియాలో ఓ మెట్రో సిటీ మాత్రమే కాదు.. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో.. మేజర్ ఎకనమిక్ హబ్. ప్రపంచ స్థాయి కార్పొరేట్ కేంద్రాలకు.. మన గ్రేటర్ సిటీనే గ్రేట్ డెస్టినేషన్. అందువల్లే.. ఇక్కడి భూములు వేలంలో ఈ స్థాయి రేట్లు పలుకుతున్నాయ్.
Story By Anup, Bigtv