Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ ఖనిజ వనరులను కేవలం తక్షణ ఆదాయ వనరుగా కాకుండా, రాష్ట్ర భవిష్యత్ ఆస్తిగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. మైనింగ్ శాఖపై అధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీఎండీసీని (APMDC) దేశంలోనే అత్యున్నత స్థాయి మైనింగ్ సంస్థగా నిలబెట్టేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని ఆదేశించారు.
వచ్చే ఏడాది డిసెంబర్‌లో ఐపీఓ
ఏపీఎండీసీ పరిధిలో సుమారు రూ.7.8 లక్షల కోట్ల విలువైన ఖనిజ నిక్షేపాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. సంస్థ ఈక్విటీ విలువ రూ.86,290 కోట్లుగా లెక్కించగా.. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి ఏపీఎండీసీని స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ చేసేలా ఐపీఓ (IPO) ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించారు. అలాగే, ఖనిజాల నిర్వహణ కోసం ప్రత్యేకంగా ‘ఏపీ రేర్ ఎర్త్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్’ (APREDC) ఏర్పాటుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
విదేశీ గనులపై గురి.. ఏఐతో అన్వేషణ
భవిష్యత్ అవసరాలైన లిథియం, కోబాల్ట్, నికెల్ వంటి రేర్ ఎర్త్ ఖనిజాల కోసం విదేశాల్లో మైనింగ్ ఆస్తులను కొనుగోలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. మరోవైపు, థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు కొరత రాకుండా ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లోని మూడు బొగ్గు బ్లాకుల వేలంలో ఏపీఎండీసీ పాల్గొంటోంది. వీటిలో 1,774.6 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి. రాష్ట్రంలో 74,860 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఏఐ , మెషిన్ లెర్నింగ్ సాయంతో 582 మినరల్ పొటెన్షియల్ ఏరియాలను గుర్తించి వాటిని 209 క్లస్టర్లుగా విభజించారు.
పెండింగ్ లీజుల క్లియరెన్స్‌తో రూ.400 కోట్ల ఆదాయం
ఖనిజ అన్వేషణ, వేలం ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఐదేళ్ల రాష్ట్రస్థాయి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. దీనితో పాటు రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 6,500 క్వారీ లీజు దరఖాస్తులు, 223 రెన్యువల్స్ పరిష్కారానికి గడువు పొడిగించాలని ప్రతిపాదించారు. వీటిని క్లియర్ చేయడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.400 కోట్ల అదనపు ఆదాయం సమకూరనుంది.
Also Read: దమ్ముంటే సిద్దిపేటలో నాపై పోటీ చెయ్.. సీఎం రేవంత్‌కు హరీశ్‌రావు సవాల్