మా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టమా? అన్నట్టుగా రేవంత్ టార్గెట్‌గా ఆ ఇద్దరూ చెలరేగుతున్నారు. మాటకు మాటగా వెనువెంటనే కౌంటర్ ఎటాక్ చేయడం మూలంగా నష్టనివారణ చేసుకోవడంతో పాటు.. కాంగ్రెస్ సర్కార్‌ను ఇరుకున పెట్టాలనే ఈ ఇద్దరూ ఇప్పుడు తమ వ్యూహాలకు మరింత పదును పెడుతున్నారట.
సీఎం రేవంత్ సభలను బావబామ్మర్దులిద్దరూ లైట్ తీసుకోవడం లేదట. రేవంత్ తన దూకుడు పెంచేందుకు ఏ విధంగానైతే గళం పెంచుతున్నారో.. కేటీఆర్, హరీశ్ రావులిద్దరూ అంతే స్థాయిలో సీఎంతో ఢీ అంటే ఢీ అనడానికి సిద్దపడుతన్నట్టుగా కనిపిస్తున్నది. తాజాగా సిద్దిపేట సభ తరువాత ఇద్దరూ సీఎం సభను విమర్శిస్తూ.. లోపాలను ఎత్తిచూపుతూ వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేయడం కొత్త చర్చకు తెరలేపింది. గతంలో ఈ సంస్కృతి బీఆర్‌ఎస్‌లో కనిపించలేదంటున్నారు గులాబీ శ్రేణులు.
కేటీఆర్ అడ్డా సిరిసిల్లపై సీఎం సభ పెట్టి తీవ్రంగా విమర్శించిన అనంతరం హరీశ్ స్పందించారు. కేటీఆర్ లైట్ తీసుకున్నాడు. ఎంతలా లైట్ తీసుకున్నాడంటే.. అసలు సీఎం సభ తరువాత కనీసం సిరిసిల్ల నియోజవకర్గానికి కూడా వెళ్లలేదు. అక్కడి ప్రజలకు సమాధానం ఇవ్వాలనే కనీస మర్యాద కూడా పాటించలేదు. అసలు అక్కడ నుంచి మళ్లీ కేటీఆర్ పోటీ చేయడు కావొచ్చు బహుశా అనేలా ఆయన ప్రవర్తన ఉందంటున్నారు. కానీ సిద్దిపేట సభ తరువాత ఇద్దరూ వేర్వేరుగా దూకుడుగా స్పందించారు. హరీశ్ ఓ ప్రెస్‌నోట్ రిలీజ్ చేయగా.. కేటీఆర్ ట్విట్టర్ వేదికగా సీఎం ప్రసంగాన్ని, సభ తీరును ఎండగడుతూ తీవ్ర విమర్శలు గుప్పించారు.
అదే రోజు తెలంగాణ భవన్‌లో జరిగిన ఓ పార్టీ మీటింగులో కేటీఆర్ మాట్లాడిన తీరు కూడా ఆ పార్టీ వేస్తున్న సీరియస్ అడుగులకు నిదర్శనమని చెబుతున్నారు. రేవంత్ ను అన్ని మూలాల నుంచి ఒత్తిడి పెంచి, రాజకీయంగా ఒంటరిని చేయడం ద్వారా, ప్రజల్లో వ్యతిరేకతను పెంచడం వల్ల తమ విజయం సులభతరమవుతుందనే దోరణిలో కేటీఆర్ కామెంట్స్ ఉంటున్నాయి. రేవంత్ పాలనలో అవినీతిని ఆ పార్టీ నేతలే బయటపెడుతున్నారని ఉదాహరణలతో సహ చెప్పడం ద్వారా ప్రజలు దీన్ని గమనంలోకి తీసుకోవాలని పరోక్షంగా కోరినట్టుగా ఉంటున్నాయి కేటీఆర్ మాటలు. తమను టార్చ్‌లైట్ పెట్టుకుని మరీ వెతుక్కుంటూ వచ్చి గెలిపిస్తారని కేసీఆర్ అందుకే చెప్పారని, కాంగ్రెస్ పాలన ఎంత దరిద్రంగా ఉంటుందో.. జనాలే తెలుసుకుంటారని ఆ పార్టీ క్యాడర్‌లో అగ్రనేతలు ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు.
అంతే కాదు, రేవంత్ .. తన అక్రమ సొమ్ముతో ఓటుకు పదివేలు, పదిహేను వేలిచ్చైనా గెలుద్దామనుకుంటున్నారనే ఆరోపణలను ఇప్పట్నుంచే తీవ్ర ప్రచారంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఎంతిచ్చినా తీసుకోండి.. కానీ ఓటు మాత్రం మనకే వేయండి.. అనే ఎన్నికల టైం ప్రచారాన్ని ఇప్పట్నుంచే స్పీడప్ చేయడాన్ని చూస్తే.. ఇప్పట్నుంచే ఎన్నికల ఏడాదిగా కేటీఆర్ భావిస్తున్నారా? అనే విధంగా సీఎంపై సీరియస్ దాడి కొనసాగుతోందనే పొలటికల్ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
సిద్దిపేట సభలో సీఎం మాట్లాడిన తీరును బట్టి.. తాము మరింత సీరియస్‌గా రేవంత్ పై వ్యక్తిగతంగా విమర్శలు, ఆరోపణల దాడికి దిగకపోతే.. బీఆరెస్‌ను నైతికంగా దెబ్బతీసి, గెలుపు అవకాశాలకు గండి కొడతారనే భయం ఆ పార్టీ అగ్రనాయకత్వాన్ని పట్టి పీడిస్తున్నట్టుగా కనిపిస్తోంది. రేవంత్ సింగిల్ హ్యాండ్‌తోనే పోరాడుతున్నారనే విషయం వారికి అర్థమైంది. ఒంటి చేత్తో మళ్లీ పార్టీని గెలుపించుకునేందుకు, తమను బలహీన పరిచే ఎత్తుగడ వ్యూహాలు, ఆరోపణల అస్త్రాలు, నైతికంగా దెబ్బ తీసే ప్రసంగాలతో అప్రమత్తంగా ఉండాలనే జాగురుకత అగ్ర నాయకత్వంలో కనిపిస్తుందంటున్నారు.
అందుకే సిద్దిపేట సభ అనంతరం.. ఇద్దరు బావ బామ్మర్దులు పోటీలు పడి మరీ వేర్వురుగా తమ తమ స్లైల్‌లో ప్రెస్ కు తమ అభిప్రాయాలు వెల్లడించారు. మేమిద్దరమూ ఒకటే.. కేసీఆర్ చూపిన మార్గనిర్దేశంలో కొనసాగుతాం.. మా ఇద్దరి లక్ష్యం బీఆరెఎస్‌ను అధికారంలోకి తేవడమేననే సంకేతాలు కూడా పార్టీ శ్రేణులకు ఇచ్చేలా తమ దూకుడు వ్యూహాన్ని అమలు పరుస్తున్నారంటున్నారు.