E-Paper
Advertisement

రాష్ట్రంలో సబ్సిడీ విత్తనాలు ఎక్కడ.. దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు!

రాష్ట్రంలో సబ్సిడీ విత్తనాలు ఎక్కడ.. దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు!
Advertisement

Rabi Seeds: యాసంగి సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. దక్షిణ తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే వరినార్లు అలుకుతున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు. విత్తనాలు, ఎరువుల కోసం ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరోవైపు ప్రభుత్వం మాత్రం వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని రైతులకు సూచిస్తోంది. పప్పుధాన్యాలు, నూనెగింజల సాగును ప్రోత్సహించాలని వ్యవసాయశాఖ అధికారులకు ఆదేశాలిస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలనుకున్న రైతులకు అవసరమైన విత్తనాలే అందుబాటులో లేవు. జింక్‌, పెసర విత్తనాలు మినహా ఇతర పంటలకు సంబంధించి సబ్సిడీ విత్తనాల సరఫరాపై స్పష్టత కనిపించడం లేదు. ఒకవైపు సాగు సమయం సమీపిస్తుండగా.. మరోవైపు విత్తనాల కోసం రైతులు ఎదురుచూడాల్సి వస్తోంది. ప్రత్యామ్నాయ సాగుపై ప్రభుత్వ ప్రకటనలకు, క్షేత్రస్థాయిలో విత్తనాల లభ్యతకు మధ్య పొంతన లేకపోవడంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.

విత్తనాలేవి?

రాష్ట్రంలో యాసంగి సాగులో వరి విస్తీర్ణాన్ని తగ్గించి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోంది. నీటి వినియోగం తక్కువగా ఉండే పంటలతోపాటు పప్పుధాన్యాలు, నూనెగింజల సాగుపై దృష్టి సారించాలని సూచిస్తోంది. రైతులు కూడా కొంతమేర ప్రత్యామ్నాయ పంటల సాగుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఆయా పంటలకు అవసరమైన విత్తనాలు మాత్రం అందుబాటులో లేకపోవడం సమస్యగా మారింది. జింక్‌, పెసర విత్తనాలు మినహా ఇతర పంటలకు సబ్సిడీ విత్తనాల పంపిణీపై స్పష్టత కరవైంది. శనగ, మినుము, వేరుశనగ తదితర పంటలు సాగు చేయాలనుకునే రైతులకు విత్తనాలు ఎప్పుడు అందుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రైవేటు మార్కెట్లో కొనుగోలు చేయాలంటే అధిక ధరలు చెల్లించాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇంకా యాప్‌లోనే ఇండెంట్‌!

Advertisement

యాసంగి సీజన్‌కు సంబంధించి విత్తనాల అవసరాలను గుర్తించే ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. రైతులు ఏయే పంటలు సాగు చేయాలనుకుంటున్నారు? ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తారు? ఎంత మొత్తంలో విత్తనాలు అవసరం? అనే వివరాలను వ్యవసాయశాఖ అధికారులు యాప్‌లో నమోదు చేయాలని సూచిస్తున్నారు. ఈ వివరాల ఆధారంగా విత్తనాల ఇండెంట్‌ రూపొందించి ఉన్నతాధికారులకు పంపించాల్సి ఉంటుంది. విత్తనాల కేటాయింపు, సరఫరా, పంపిణీ ప్రక్రియ చేపట్టాల్సి ఉంది. ప్రస్తుతం మండల కేంద్రంలో పెసల్లు మాత్రమే ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. అయితే ఇప్పటికే దక్షిణ తెలంగాణలో వరినార్లు అలుకుతున్న సమయంలో కూడా ఇండెంట్‌ నమోదు ప్రక్రియ కొనసాగుతుండటంపై రైతుల్లో అసహనం వ్యక్తమవుతోంది. ఇండెంట్‌ పూర్తయి, విత్తనాల కేటాయింపు జరిగి, అవి రైతులకు చేరేలోగా మరెంత సమయం పడుతుందోనని ఆందోళన చెందుతున్నారు.

Also Read: తాండూరులో కారు బీభత్సం.. 12 బైకులు, ఆటో ధ్వంసం!

సాగు సమయం దాటితే ఇబ్బందులే!

Advertisement

ప్రతి పంటకు విత్తనాలు వేసేందుకు అనువైన సమయం ఉంటుంది. సాగుకు కార్తెల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వాటిని బట్టే సాగుచేస్తుంటారు. ఆ సమయంలో విత్తనాలు అందకపోతే సాగు ప్రణాళిక దెబ్బతినడమే కాకుండా దిగుబడిపైనా ప్రభావం పడే ప్రమాదం ఉంది. ప్రత్యామ్నాయ పంటలు వేయాలనుకునే రైతులు విత్తనాల కోసం ఎదురుచూస్తూ విలువైన సమయాన్ని కోల్పోతున్నారు. సమయానికి విత్తనాలు అందకపోతే చివరకు వరి సాగు వైపు వెళ్లాలా? లేక ప్రైవేటు మార్కెట్లో అధిక ధరలకు విత్తనాలు కొనుగోలు చేసి ప్రత్యామ్నాయ పంటలు వేయాలా? అన్న సందిగ్ధంలో పడుతున్నారు. సబ్సిడీ విత్తనాల కోసం ఆశగా ఎదురుచూస్తున్న రైతులకు నిరాశే మిగులుతోంది.

ప్రచారానికి.. ఆచరణకు పొంతనేది?

ప్రత్యామ్నాయ పంటల సాగుతో రైతులకు ప్రయోజనం చేకూరుతుందని చెబుతున్న ప్రభుత్వం.. అందుకు అవసరమైన విత్తనాల సరఫరాపై ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పంటల మార్పిడి గురించి గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న అధికారులు.. రైతులకు అవసరమైన విత్తనాలు ఎప్పుడు అందిస్తారన్న దానిపై మాత్రం స్పష్టమైన సమాచారం ఇవ్వడం లేదు. ప్రత్యామ్నాయ పంటలు వేయాలని చెప్పడం ఎంత ముఖ్యమో.. వాటికి అవసరమైన నాణ్యమైన విత్తనాలను సకాలంలో అందించడం అంతకంటే ముఖ్యమని రైతులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం ఒకవైపు వరి సాగును తగ్గించాలని చెబుతుంటే.. మరోవైపు ప్రత్యామ్నాయ పంటలకు అవసరమైన సబ్సిడీ విత్తనాలు అందుబాటులో లేకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

రైతులకు భరోసా కల్పించేదెప్పుడు?

యాసంగి సీజన్‌ ప్రారంభానికి ముందే పంటల వారీగా విత్తనాల అవసరాలను అంచనా వేసి నిల్వలు సిద్ధం చేయాల్సిన వ్యవసాయశాఖ.. ఇంకా ఇండెంట్‌ ప్రక్రియలోనే ఉండటంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏ పంటకు ఎంత విత్తనం అందుబాటులో ఉంది? ఏయే ప్రాంతాలకు ఎంత కేటాయించారు? పంపిణీ ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు? అనే వివరాలను వెల్లడించాల్సి ఉంది. ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతుల్లో నమ్మకం కలగాలంటే ముందుగా సబ్సిడీ విత్తనాలను అందుబాటులోకి తేవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. లేదంటే ప్రభుత్వం చెబుతున్న పంటల మార్పిడి క్షేత్రస్థాయిలో ఆచరణకు నోచుకోదని అంటున్నారు. యాసంగి సాగు ముంచుకొస్తున్న వేళ విత్తనాల కోసం రైతులు పడుతున్న ఎదురుచూపులకు వ్యవసాయశాఖ ఎప్పుడు తెరదించుతుందో చూడాలి. ప్రచారానికే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో విత్తనాలు అందించి ప్రత్యామ్నాయ సాగుకు భరోసా కల్పించాలని అన్నదాతలు కోరుతున్నారు.

Also read: ఈ బైక్‌ ప్రమాదాన్ని ముందే గుర్తిస్తుంది.. హోండా టెక్నాలజీ చూస్తే మతిపోవాల్సిందే!

Tags

Related News

కాంట్రవర్సీలకు కేరాఫ్​‌గా కార్మిక శాఖ.. పీక్స్‌కు చేరిన అంతర్గత పోరు!

‘ఇందిరమ్మ బీమా’పై సర్వత్రా ఆసక్తి! రేషన్‌ కార్డు దారులందరికీ వర్తించేలా పథకం..! రూ. 4వేల కోట్లు కేటాయించిన సర్కార్‌..!

మైక్రోసాఫ్ట్ నుంచి బ్యాంకుల వరకు.. అమెరికాలో అసలేం జరుగుతోంది?

స్టేట్‌లో సిద్దాంతపర విమర్శల దాడి! సెంట్రల్‌లో కేంద్ర సాయం కోరి..! భారత్‌ సమ్మిట్‌తో విమర్శలు గుప్పించినా.. ప్రధానితో సమస్యలు విన్నవించినా..!

అసదుద్దీన్ మోదీకి శత్రువా? మిత్రుడా? యూపీలో ఏం జరుగుతోంది?

ఐదు లక్షల మందికి పైగా ఉపాధి కూలీ పనులకు హాజరు! గత ఏడాదితో పోలిస్తే 15 రెట్లు ఎక్కువ..! నల్లగొండలో అత్యధికంగా ఉపాధి కూలీలకు!

3 వారాల్లో 3 తుఫానులు.. బంగాళాఖాతంలో అసలేం జరుగుతోంది?

Big Stories

Advertisement
×