India’s Warning To Pakistan: కశ్మీర్ ఇష్యూని మళ్లీ కెలుకుతోంది పాక్… తాజాగా, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య మరోసారి అగ్గిని రాజేశాయి. ఇటీవల, పాక్ ప్రధాని మాట్లాడుతూ… సమస్యలన్నింటిపై భారత్‌తో చర్చలు చేస్తామని అనిన తర్వాత… తాజాగా ఆయన సమక్షంలోనే పాక్ ఆర్మీ చీఫ్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే, దీనిపై భారత్ కూడా ఘాటుగానే స్పందించింది. మీ స్థానమేంటో తెలుసుకుంటే బాగుంటుందంటూ చురకలు పెట్టింది. ఇంతకీ, పాక్ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలేంటీ..? వాటి అర్థంమేంటీ..?
మతిలేక రెచ్చిపోతున్న పాకిస్తాన్
మరోసారి కశ్మీర్‌పై అనుచిత వ్యాఖ్యలు
టూ కంట్రీ సిద్ధాంతానికి పాక్ టచ్
ఓవరాక్షన్ చేసిన పాక్ ఆర్మీ చీఫ్
కశ్మీర్ తమకు జీవనాడి వంటిదన్న పాకిస్తాన్
పిచ్చి ముదిరి రోకలి తలకు చుట్టమన్నట్లు.. పాకిస్తాన్ వైఖరి రోజు రోజుకూ మరింత ముదిరిపోతోంది. మైక్ దొరికితే చాలా పాక్ లీడర్లంతా భారత్‌పై అక్కసు వెళ్లగక్కడానికే టైమ్ వెచ్చిస్తున్నారు. పాకిస్తాన్‌లో సవాలక్ష సమస్యలుంటే.. వాటిని ప్రపంచానికి కనిపించనీయకుండా చేయడం కోసం… భారత్‌పై బురదచల్లడం అలవాటుగా మార్చుకున్నారు. ముఖ్యంగా, భారత కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న కశ్మీర్ అంశంలో నోరుపారేసుకుంటున్నారు. తాజాగా, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కూడా మళ్లొకసారి కశ్మీర్ ఇష్యూని కెలికారు. కశ్మీర్ తమకు జీవనాడి వంటిదని, దాన్ని ఎన్నటికీ విస్మరించే ప్రసక్తే లేదని వ్యాఖ్యానించారు. ఏప్రిల్ 16న ఇస్లామాబాద్‌లో జరిగిన ఓవర్సీస్ పాకిస్థానీస్ కన్వెన్షన్‌లో మాట్లాడుతూ మునీర్ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ వేదికలపై పలుమార్లు వ్యతిరేకత ఎదురైనప్పటికీ.. కశ్మీర్ విషయంలో పాకిస్థాన్ తన పాత వైఖరినే కొనసాగిస్తున్నట్లు మునీర్ మాటలు స్పష్టం చేస్తున్నాయి.
కశ్మీర్‌పై తమ వైఖరి చాలా స్పష్టంగా ఉందన్న మునీర్
ఈ సమావేశంలో విదేశాల్లో నివసిస్తున్న పాకిస్థానీయులను ఉద్దేశించి మునీర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా కశ్మీర్ అంశంపై తమ వైఖరి చాలా స్పష్టంగా ఉందని మునీర్ పునరుద్ఘాటించారు. “కశ్మీర్ సోదరులను మేం అలా వదిలేయం” అంటూ కశ్మీర్‌పై తమ విధానంలో మార్పు లేదని ఆయన తేల్చిచెప్పారు. ఈ వ్యాఖ్యల ద్వారా కశ్మీర్ అంశాన్ని పాకిస్థాన్ అంత తేలిగ్గా వదిలిపెట్టదని ఆయన మరోసారి సంకేతాలు పంపారు. కాశ్మీర్ ఎల్లప్పుడూ పాకిస్తాన్‌కు కీలకమైనదిగా ఉంటుందని, కాశ్మీరీ ప్రజల “హీరోయిక్ స్ట్రగుల్”లో పాకిస్తాన్ వారిని విడిచిపెట్టదని ఆయన పేర్కొన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలతో… భారత్-పాకిస్తాన్ మధ్య కాశ్మీర్ వివాదంలో పాక్ స్థిరమైన వైఖరిని మరోసారి వెల్లడించినట్లు అయ్యింది.
రెండు-జాతుల సిద్ధాంతాన్నిసమర్థించిన మునీర్
అదనంగా, జనరల్ మునీర్ రెండు-జాతుల సిద్ధాంతాన్నిసమర్థించారు. హిందూ ముస్లింల.. మతం, ఆచారాలు, సంప్రదాయాలు, ఆకాంక్షలు వేర్వేరు అంటూ వ్యాఖ్యానించారు. అందుకే పాకిస్తాన్ సృష్టి జరిగిందని వాదించారు. అలాగే, “విదేశాల్లో ఉన్న మీరంతా పాకిస్థాన్ రాయబారులు. మీరు ఉన్నతమైన భావజాలం, సంస్కృతికి చెందినవారనే విషయాన్ని మర్చిపోవద్దు అని అన్నారు. హిందువులతో పోలిస్తే మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆశయాలు భిన్నమని మన పూర్వీకులు భావించారు. అదే రెండు దేశాల సిద్ధాంతానికి పునాది వేసిందని అన్నారు.
పాకిస్థాన్‌కు బలోచిస్థాన్ గర్వకారణమని వ్యాఖ్యానం
పాకిస్తాన్ కోసం మన పెద్దలు ఎంతో పోరాడారనీ.. ఈ గాథను తర్వాతి తరాలకు చెప్పడం మర్చిపోవద్దనీ.. అప్పుడే వారికి పాకిస్థాన్‌తో ఉన్న బంధం బలంగా ఉంటుంది” అని మునీర్ అన్నారు. దేశంలో ఉగ్రవాద కార్యకలాపాల వల్ల పెట్టుబడులు రాకపోవచ్చని కొందరు భయపడుతున్నారని ప్రస్తావిస్తూ, “ఉగ్రవాదులు దేశ భవిష్యత్తును హరించగలరని మీరు భావిస్తున్నారా?” అని మునీర్ పరోక్షంగా ప్రశ్నించారు. పాకిస్థాన్‌కు బలోచిస్థాన్ గర్వకారణమని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇక, ఈ వ్యాఖ్యలు భారత్-పాకిస్తాన్ సంబంధాలలో ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉంది.
జమ్మూ కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం
అయితే, పాక్ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా తోసిపుచ్చింది. విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ…. జమ్మూ కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమైన కేంద్రపాలిత ప్రాంతమని అన్నారు. పాకిస్తాన్‌కు కాశ్మీర్‌తో ఏకైక సంబంధం అక్రమంగా ఆక్రమించిన భూభాగాలను ఖాళీ చేయడమేనని పేర్కొన్నారు. “అసలు, ఒక విదేశీ అంశం తమ జీవనాడిలో ఎలా ఉంటుంది?” అని ఆయన ప్రశ్నించారు.
పాక్‌కు కాశ్మీర్‌తో ఏకైక సంబంధం అక్రమించిన భూభాగం
అయితే, పాకిస్తాన్ చేస్తు్న్న రెచ్చగొట్టే వ్యాఖ్యలు.. ముఖ్యంగా జనరల్ అసిమ్ మునీర్ చేసిన “జీవనాడి” వ్యాఖ్య.. కశ్మీర్ అంశంలో పాకిస్తాన్ దృఢమైన వైఖరిని తెలియజేయడంతో పాటు.. భారత్‌తో ఉద్రిక్తతలను కొనసాగించే ఉద్దేశాన్ని స్పష్టంగా సూచిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత దిగజార్చడమే కాకుండా… అంతర్జాతీయ వేదికలపై వివాదాస్పద చర్చలను రేకెత్తిస్తాయనడంలో సందేహం లేదు. అయితే, భారత్ ఈ వ్యాఖ్యలను దౌత్యపరంగా, దృఢంగా ఎదుర్కొవడం మాత్రమే కాకుండా, కశ్మీర్ తన సార్వభౌమ భూభాగంలో అంతర్భాగమని మరోసారి స్పష్టం చేసింది.
దుష్ప్రచారమే జీవనాడిగా చేసుకున్న పాకిస్తాన్.
దుష్ప్రచారమే జీవనాడిగా చేసుకున్న పాకిస్తాన్.. గతంలో కూడా ఇలాగా విషాన్ని వెళ్లగక్కింది. అంతర్జాతీయ వేదికలపై ఎన్నోసార్లు వ్యతిరేకత ఎదురైనా.. పాక్ వైఖరిలో మాత్రం పాత పాటే వినిపిస్తోంది. భారత్‌ను కశ్మీర్ పేరుతో నిందించడాని.. పాడుబడిన రెండు జాతుల సిద్ధాంతాన్ని ఆయుధంగా చేసుకుంటుంది. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో మళ్లీ మళ్లీ భారత్‌పై అక్కసు వెళ్లగక్కుతుంది.
చరిత్రను వక్రీకరించే ప్రయత్నాల్లో భాగం
కశ్మీర్ అంశంలో పాకిస్తాన్.. ముఖ్యంగా దాని సైనిక, రాజకీయ నాయకులు.. తరచుగా భారత్‌ను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఈ వ్యాఖ్యలు కశ్మీర్ వివాదాన్ని కేంద్రంగా.. భారత్‌పై ఆరోపణలు, రెచ్చగొట్టే డ్రామాలు, చరిత్రను వక్రీకరించే ప్రయత్నాల్లో భాగంగా ఉన్నాయి. చారిత్రకంగానే కాక.. ఇటీవలి కాలంలో ఇవి మరింతగా పెరుగుతున్నాయి. ఇప్పుడు, జనరల్ అసిమ్ మునీర్ వ్యాఖ్యల కంటే ముందు కూడా.. దాని మాజీ నాయకులు ఇలాంటి ప్రేలేపనలే చేశారు. పాకిస్తాన్ నాయకులు, ముఖ్యంగా సైనికాధిపతులు… కశ్మీర్‌ను “పాకిస్తాన్ జీవనాడి”, “అసంపూర్తిగా ఉన్న ఎజెండా” అని పిలిచారు. గతంలో, జనరల్ పర్వేజ్ ముషారఫ్ తన పాలనలో కశ్మీర్‌ను పాకిస్తాన్ జాతీయ గుర్తింపుతో ముడిపెట్టారు. దీని తర్వాత, భారత్‌పై ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇచ్చినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు.
2019లో జమ్మూ కశ్మీర్ ప్రత్యేక హోదా-ఆర్టికల్ 370 రద్దు
ఇక, 2019లో జమ్మూ కశ్మీర్ ప్రత్యేక హోదా-ఆర్టికల్ 370ని ప్రధాని మోడీ ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత, పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్, ఇతర పాక్ నాయకులు భారత్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఇమ్రాన్ ఖాన్… అదే సంవత్సరం, ఐక్యరాజ్య సమితి జనరల్ సభలో భారత్‌ను “ఫాసిస్ట్” రాజ్యంగా అభివర్ణించారు. కశ్మీర్‌లో “రక్తపాతం” జరుగుతుందని ఆరోపించారు. అయితే, ఈ వ్యాఖ్యలు భారత్‌ను రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ అంతర్జాతీయంగా వివాదాస్పదమయ్యాయి.
కశ్మీర్‌లో “స్వాతంత్ర్య పోరాటం” జరుగుతోందనే పాక్
నిజానికి, పాకిస్తాన్ సైన్యం.. దాని ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్-ISI.. కశ్మీర్‌లో ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇస్తున్నాయని భారత్ ఎప్పటి నుండో ఆరోపిస్తోంది. లష్కర్-ఏ-తొయిబా, జైష్-ఏ-మహ్మద్ వంటి సంస్థలు పాకిస్తాన్ పంచలో బతుకుతూ.. భారతదేశంలో ఉగ్రవాద దాడులు చేసిన సందర్భాలు ఉన్నాయి. 2008 ముంబై దాడులు, 2016 ఉరి దాడుల వంటివి ఇందులో భాగంగానే ఉన్నాయి. అయితే, అన్ని సందర్భాల్లోనూ.. పాకిస్తాన్ నాయకులు మాత్రం.. తమ దేశం ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం లేదని, కశ్మీర్‌లో “స్వాతంత్ర్య పోరాటం” జరుగుతోందని వాదిస్తూ.. భారత్‌ను రెచ్చగొడుతూనే ఉన్నారు.
ఐక్యరాజ్య సమితి, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్
పాకిస్తాన్ మీడియా, రాజకీయ నాయకులు కలిసి.. కశ్మీర్‌లో ఇండియన్ ఆర్మీ, అత్యాచారాలు చేస్తోందని… మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. అయితే, ఈ ఆరోపణలను భారత్ ఖండిస్తూ, ఇవి తప్పుడు ప్రచారంలో భాగమని చెబుతూనే ఉంది. అయితే, పాకిస్తాన్ తరచూ ఐక్యరాజ్య సమితి, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ వంటి అంతర్జాతీయ వేదికలపై కశ్మీర్ అంశాన్ని లేవనెత్తి, భారత్‌ను విమర్శించడం అలవాటుగా మార్చుకుంది.
PoKని ఖాళీ చేయాలని భారత్ డిమాండ్
కాగా.. ఈ చర్యలను భారత్ దౌత్యపరంగా ఎదుర్కొంటుంది. ఎక్కడైనా, ఎప్పుడైనా.. కశ్మీర్ విషయంలో భారత్ స్థానం చాలా స్థిరంగా ఉందని చెబుతోంది. జమ్మూ కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమైన భూభాగమనీ.. పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించిన పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ భూభాగాన్ని ఖాళీ చేయాలని భారత్ డిమాండ్ చేస్తుంది. అలాగే, భారత్.. కశ్మీర్‌లో శాంతిని కాపాడటానికి ఉగ్రవాదాన్ని అరికట్టడం, పాకిస్తాన్ స్పాన్సర్ చేసే ఉగ్రవాద కార్యకలాపాలను నియంత్రించడం అత్యవసరంగా భావిస్తోంది. దీనికి తగ్గట్లు చర్యలు కూడా తీసుకుంటోంది.
హిందూ, ముస్లింలు రెండు వేర్వేరు జాతులని చెప్పే వాదన
ఇక, జనరల్ మునీర్ సమర్థించిన రెండు-జాతుల సిద్ధాంతం అనేది భారత ఉపఖండంలో హిందువులు, ముస్లింలు రెండు వేర్వేరు జాతులుగా ఉన్నారని చెప్పే వాదన. ఈ రెండు జాతుల మతం, సంస్కృతి, ఆచారాలు, జీవన విధానం, రాజకీయ ఆకాంక్షలు పరస్పరం విభిన్నమని వాదించే రాజకీయ భావజాలం. అయితే, ఈ సిద్ధాంతం 1947లో భారతదేశ విభజనకు, పాకిస్తాన్ సృష్టికి పునాదిగా నిలిచింది. అలాగే, ఇది కశ్మీర్ వివాదంతో కూడా ముడిపడి ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ ఈ సిద్ధాంతాన్ని కశ్మీర్‌ను తమ భాగంగా చేసుకోవడానికి ఆధారంగా ఉపయోగిస్తుంది.
1947లో భారతదేశంలో విలీనమైన కశ్మీర్
ఈ సిద్ధాంతం ఫలితంగా హిందూ-మెజారిటీతో భారతదేశం.. ముస్లిం-మెజారిటీతో పాకిస్తాన్‌లు ఏర్పడ్డాయి. కాగా, విభజన సమయంలో జరిగిన హింస, వలసలు, సామాజిక ఉద్రిక్తతలు ఈ సిద్ధాంతంలోని సంక్లిష్టతను హైలైట్ చేశాయి. అయితే, పాకిస్తాన్ ఈ రెండు-జాతుల సిద్ధాంతాన్ని కశ్మీర్ వివాదంలో తన వైఖరికి ఆధారంగా ఉపయోగిస్తుంది. కాగా.. కశ్మీర్, ముస్లిం-మెజారిటీ జనాభా కలిగిన ప్రాంతమే అయినప్పటికీ.. 1947లో భారతదేశంలో విలీనమైంది. అయితే, పాకిస్తాన్ మాత్రం.. ఈ సిద్ధాంతం ఆధారంగా దానిని తమ భూభాగంగా భావిస్తోంది.
రెండు-జాతుల సిద్ధాంతం విభజనతో ముగిసిన అంశం
పాకిస్తాన్ వాదనను భారత్ తిరస్కరిస్తూనే ఉంది. జమ్మూ కశ్మీర్ భారతదేశ సార్వభౌమ భూభాగంలో అంతర్భాగమని… రెండు-జాతుల సిద్ధాంతం చారిత్రకంగా విభజనతో ముగిసిన అంశమని పేర్కొంటుంది. భారత్ తన మల్టీ కల్చురల్, మల్టీ రిలిజియన్ సమాజంలో హిందువులు, ముస్లింలు… ఇతర మతాల ప్రజలు సమైక్యంగా జీవిస్తున్నారని వాదిస్తుంది. ఈ సిద్ధాంతం గతంలో హిందూ-ముస్లిం ఐక్యతను దెబ్బతీసిందని.. విభజన సమయంలో హింస, వలసలకు కారణమైందని విమర్శకులు కూడా అంటున్నారు.
1971లో బంగ్లాదేశ్ విడిపోవడం దీనికి నిదర్శనం
అంతెందుకు, పాకిస్తాన్‌లోనే, ఈ సిద్ధాంతం ఏకైక ముస్లిం గుర్తింపును సృష్టించడంలో సవాళ్లను ఎదుర్కొంది. ముఖ్యంగా 1971లో తూర్పు పాకిస్తాన్.. అంటే, బంగ్లాదేశ్ విడిపోవడం దీనికి అతిపెద్ద ఉదాహరణగా ఉంది. అందుకే, కొందరు విశ్లేషకులు ఈ సిద్ధాంతాన్ని కాలం చెల్లినదిగా పేర్కొంటారు. ఎందుకంటే, ఆధునిక దేశాలు మతం కంటే ఆర్థిక, సామాజిక అభివృద్ధిపై దృష్టి పెడుతున్నాయి. ఇంత ఆధునిక ప్రపంచంలో కూడా పాక్ పాత పాటే పాడటం దాని ఛాదస్తానికి నిదర్శనంగా ఉంది.