E-Paper
Advertisement

జనాభా సునామీ.. భారత్ ప్రపంచాన్ని శాసిస్తుందా? లేక నిరుద్యోగంలో మునిగిపోతుందా?

జనాభా సునామీ.. భారత్ ప్రపంచాన్ని శాసిస్తుందా? లేక నిరుద్యోగంలో మునిగిపోతుందా?
Advertisement

Population Growth: ఒకప్పుడు జనాభా అంటే అగ్రరాజ్యాలకు భయం.. కానీ ఇప్పుడు అదే జనాభా మన పాలిట వరం! అగ్రరాజ్యాలుగా వెలుగొందుతున్న అమెరికా, చైనా, జపాన్‌లు ఇప్పుడు వృద్ధాప్య కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతున్నాయి. జనాభా పెరగకపోగా.. ఉన్న జనాభా వృద్ధాప్యంలో కూరుకుపోతుండటంతో.. ఆ దేశాల ఆర్థిక చక్రం ఆగిపోతోంది. కానీ భారత్ కథ వేరు.. ఇది యువ భారతం. 142 కోట్ల జనాభాతో అగ్రపీఠాన్ని కైవసం చేసుకున్న ఇండియా.. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రపంచాన్ని శాసించేందుకు సిద్ధమవుతోంది. చైనా కుంచించుకుపోతుంటే.. భారత్ ఎందుకు దూసుకుపోతోంది? 2036 నాటికి మన దేశ ముఖచిత్రం ఎలా ఉండబోతోంది? ఈ జనాభా సునామీని మనం వరంగా మార్చుకోగలమా? లేక శాపంగా పరిణమిస్తుందా? పెరుగుతున్న జనాభాకు తగ్గట్లుగా సదుపాయాలున్నాయా..? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చర్యలేంటి.. ఈ రోజు వీక్షణంలో తెలుసుకుందాం..

ప్రపంచానికి హెచ్చరిక

ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఇంజిన్లుగా ఉన్న దేశాల్లో ఇప్పుడు సైలెంట్ డెత్ మొదలైంది. అమెరికా నుంచి దక్షిణ కొరియా వరకు తక్కువ జననాల రేటు అనే మహమ్మారి పట్టిపీడిస్తోంది. జపాన్‌లో ఇళ్ల కంటే వృద్ధాశ్రమాలు పెరుగుతున్నాయి. చైనాలో స్కూళ్ల కంటే ఆస్పత్రులు నిండుతున్నాయి. దీనికి కారణం ఏంటి? పెళ్లిళ్లపై పెరుగుతున్న విముఖత, విపరీతమైన జీవన వ్యయం, పిల్లల్ని కనడం వల్ల కెరీర్ దెబ్బతింటుందనే భయం. ఫలితంగా కొత్త తరం పుట్టడం లేదు.. పాత తరం పని చేయలేకపోతోంది. దేశాన్ని నడిపించే యువ రక్తం లేక ఆ దేశాలు వృద్ధాప్యంతో కునారిల్లుతున్నాయి.

చైనా ఎదుర్కొంటున్న వాస్తవం

Advertisement

ఒకప్పుడు జనాభా నియంత్రణ పేరుతో చైనా అమలు చేసిన వన్ చైల్డ్ పాలసీ ఇప్పుడు ఆ దేశానికే ఉరితాడుగా మారింది. చైనాలో 60 ఏళ్లు పైబడిన వారి సంఖ్య 20 శాతం దాటేసింది. అంటే ప్రతి ఐదుగురిలో ఒకరు వృద్ధులే. కానీ భారత్‌లో వృద్ధులు కేవలం 10 శాతం మాత్రమే. భారత్ ఇప్పుడు డెమోగ్రాఫిక్ డివిడెండ్ అనే గోల్డెన్ పీరియడ్ లో ఉంది. అంటే దేశ జనాభాలో ఇతరులపై ఆధారపడే వారి కంటే .., పని చేసే వయస్సు కలిగిన వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. మన దేశంలో 15 నుండి 64 ఏళ్ల మధ్య వయసున్న పని చేసే జనాభా ప్రపంచంలోనే అత్యధికం. సగానికి పైగా భారతీయుల వయసు 25 ఏళ్ల లోపే!

ప్రపంచాన్ని ఆశ్చర్యపరచే భారత్

కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన భారతదేశంలో పురుషులు-మహిళలు-2025 నివేదిక వెన్నులో వణుకు పుట్టించే వాస్తవాలను, అదే సమయంలో కొత్త ఆశలను రేకెత్తిస్తోంది. ప్రస్తుతం మన జనాభా 142.58 కోట్లు. పురుషులు 73.20 కోట్లు, మహిళలు 69.38 కోట్లు. ఏటా కోటి మంది కొత్తగా మన దేశంలో చేరుతున్నారు. 2036 నాటికి ఈ సంఖ్య 152.58 కోట్లకు చేరుకుంటుంది. అంటే మరో పదేళ్లలో భారత్ ఒక కొత్త ఆస్ట్రేలియా అంత జనాభాను తనలో కలుపుకోబోతోంది. 2047 నాటికి 100 కోట్ల మంది వర్క్ ఫోర్స్ సిద్ధంగా ఉండటమనేది ఏ దేశానికైనా అసూయ కలిగించే విషయం.

చైనాకు సవాల్

Advertisement

జనాభా విషయంలో భారత్ చైనాను వెనక్కి నెట్టింది. ప్రస్తుతం భారత్ 142.8 కోట్లతో ఉంటే, చైనా 140.9 కోట్లకు పడిపోయింది. చైనాలో 1960 తర్వాత తొలిసారిగా జనాభా క్షీణత మొదలైంది. 2036 నాటికి చైనా జనాభా 135 కోట్లకు పడిపోవచ్చని ఐక్యరాజ్యసమితి హెచ్చరిస్తోంది. అంటే.. భారత్ జనాభా పెరుగుతూ సంపదను సృష్టించడానికి సిద్ధమవుతుంటే, చైనా జనాభా తగ్గిపోతూ ఉన్న సంపదను కాపాడుకోవడానికి ఇబ్బంది పడాల్సి వస్తుంది. గడిచిన ఏడేళ్లలో దేశంలో లింగ నిష్పత్తి ఆశాజనకంగా మారింది. 1000 మంది బాలురకు బాలికల సంఖ్య 904 నుంచి 917కు పెరిగింది. 1085 నిష్పత్తితో అరుణాచల్ ప్రదేశ్ దేశానికే రోల్ మోడల్ గా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ 931 నిష్పత్తితో 17వ స్థానంలో ఉంటే, తెలంగాణ 906తో దేశ సగటు కంటే వెనుకబడి ఉంది. బీహార్, జార్ఖండ్ లు అట్టడుగు స్థానాల్లో నిలిచాయి.

కొత్త భారత్ ట్రెండ్..

దేశ సగటు అక్షరాస్యత 77.7 శాతానికి చేరింది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన మార్పు కనిపిస్తోంది. చదువుకున్న వారిలో సంతాన సాఫల్యత రేటు క్రమంగా తగ్గుతోంది. డిగ్రీ చదివిన వారిలో ఇది 69.7 శాతంగా ఉంటే, ప్రాథమిక విద్య లోపు వారిలో 70.3 శాతంగా ఉంది. అంటే విద్య పెరిగే కొద్దీ జనాభా నియంత్రణపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. అయితే.. వివాహ వయసు కూడా పెరుగుతోంది. 2023 నాటికి అమ్మాయిల వివాహ వయసు 22.4 ఏళ్లుగా ఉంది.

భారత్ ముందున్న కొత్త సవాల్

జనాభా విషయంలో గణాంకాలు ఘనంగానే ఉన్నా..దేశాన్ని అనేక సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. దేశంలో సగటు మనిషి ఆయుర్దాయం పెరుగుతున్నా, అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. 2036 నాటికి భారతీయుడు సగటున 71 ఏళ్లు, మహిళలు 74 ఏళ్లు బతికే అవకాశం ఉంది. కానీ ఊబకాయం అనే సైలెంట్ కిల్లర్ మన యువతను మింగేస్తోంది. ముఖ్యంగా 15 నుంచి 49 ఏళ్ల మధ్య మహిళల్లో ఊబకాయం 24 శాతానికి పెరిగింది. తెలంగాణలో హెచ్ఐవీ బాధితుల సంఖ్య జాతీయ సగటు 0.05 కంటే ఎక్కువగా ఉండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏపీలోనూ 2.35 లక్షల మంది చికిత్స పొందుతున్నారు. ఇది ఆరోగ్య వ్యవస్థపై భారంగా మారబోతోంది.

టాప్‌లో తెలంగాణ.. టాఫ్ 10లో ఏపీ

యువతకు నైపుణ్యం ఉంటేనే అది బలం అవుతుంది. అందుకే దేశంలో విద్యపై ఖర్చు పెరుగుతోంది. తెలంగాణ రాష్ట్రం ఒక్కో విద్యార్థిపై ఏటా రూ. 21,652 ఖర్చు చేస్తూ దేశంలోనే టాప్ లో ఉంది. ఏపీ కూడా రూ. 19,334తో 7వ స్థానంలో ఉంది. పట్టణ ప్రాంతాల్లో ఈ ఖర్చు రూ. 31 వేలు దాటుతుందంటే.. మధ్యతరగతి ప్రజలు తమ ఆదాయంలో అత్యధిక భాగాన్ని విద్యకే కేటాయిస్తున్నారని స్పష్టమవుతోంది.

వేతన వివక్ష ఎందుకు?

జనాభాలో సగం ఉన్న మహిళల భాగస్వామ్యం లేకుండా సూపర్ పవర్ కావడం అసాధ్యం. కానీ వాస్తవాలు వేరుగా ఉన్నాయి. సుప్రీంకోర్టులో మహిళా జడ్జీలు కేవలం 3 శాతమే. పార్లమెంటులో మహిళలు 13 శాతం మంది మాత్రమే ఉన్నారు. కానీ గ్రామాల్లో పంచాయతీ రిజర్వేషన్ల వల్ల 49.75 శాతం మహిళా ప్రతినిధులు ఉన్నారు. గృహ నిర్ణయాల్లో అమ్మ పాత్ర 90 శాతం ఇళ్లలో ఉంది. కానీ కూలి వేతనాల్లో మాత్రం పురుషుల కంటే మహిళలకు సగం వేతనమే అందుతోంది. కేరళ, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ వివక్ష ఎక్కువగా ఉండటం విచారకరం.

దేశానికి పెద్ద హెచ్చరిక

దేశంలో జనాభా పెరుగుదల – శాపమా? లాభమా? అనేది ఇప్పుడు అసలైన ప్రశ్న. జనాభా పెరగడం శాపం కాదు, అది ఒక శక్తి. కానీ దానికి సరైన దిశ చూపకపోతే అది డెమోగ్రాఫిక్ డిజాస్టర్‌గా మారుతుంది. దేశంలో నైపుణ్యం లేని యువత కోట్లాది మంది ఉన్నారు. చదువుకున్నా నైపుణ్యం లేకపోతే నిరుద్యోగం పెరిగి అశాంతికి దారితీస్తుంది. మౌలిక సదుపాయాలు అత్యంత కీలకం. పెరిగే 10 కోట్ల జనాభాకు ఇళ్లు, నీరు, ఆహారం, ఆస్పత్రులు ఎక్కడ నుంచి వస్తాయి? వృద్ధుల సంఖ్య పెరిగే కొద్దీ పెన్షన్లు, హెల్త్ కేర్ ఖర్చులు భరించడం దేశానికి సవాలుగా మారుతుంది.

యువశక్తిక అవకాశాల వేదిక

పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకుని కేంద్రం కౌశల్ వికాస్, మేక్ ఇన్ ఇండియా వంటి పథకాల ద్వారా ఉపాధి కల్పనకు ప్రాధాన్యత ఇస్తోంది. రాష్ట్రాలు విద్య, వైద్య రంగాల్లో బడ్జెట్ పెంచుతున్నాయి. ముఖ్యంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఐటీ, ఫార్మా రంగాల్లో గ్లోబల్ హబ్ గా మారడం ద్వారా ఈ యువశక్తిని ఒడిసి పట్టే ప్రయత్నం చేస్తున్నాయి.

భారత్ విజయ గాధ..

ప్రపంచం వృద్ధాప్యంతో కునారిల్లుతున్న వేళ.. భారత్ చిరునవ్వు చిందిస్తూ యువ రక్తంతో ఉరకలు వేస్తోంది. ఇది మన శతాబ్దం. 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా నిలవాలంటే.. మన దగ్గర ఉన్న 100 కోట్ల పని చేసే చేతులకు పని దొరకాలి. జనాభా పెరగడం అంటే కేవలం నోళ్లు పెరగడం కాదు.. చేతులు పెరగడం కూడా! ఆ చేతులకు నైపుణ్యం అందితే, ఆ మెదళ్లకు ఆధునిక ఆలోచనలు తోడైతే.. ప్రపంచంలో భారత్ ను ఆపే శక్తి ఏదీ లేదు. అంకెల్లో అగ్రస్థానం సాధించాం.. ఇక అభివృద్దిలోనూ అగ్రస్థానం మనదే కావాలి.

యువ భారత్ vs నిరోద్యోగ భారత్

142 కోట్లు.. ఇది కేవలం అంకె కాదు, ఒక దేశ భవిష్యత్తును శాసించే అస్త్రం. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించింది. ఒకవైపు యువ భారతం అంటూ పాలకుల నినాదాలు.. మరోవైపు ఆకలి కేకలు, నిరుద్యోగ సెగలు. చైనాలో జనాభా ఉన్నా వారికి మౌలిక సదుపాయాలున్నాయి.. మన దగ్గర పరిస్థితి ఏంటి? 2036 నాటికి మన జనాభా 152 కోట్లు దాటిపోతే.. ఈ దేశం ఆ భారాన్ని మోయగలదా? చంద్రబాబు వంటి నేతలు ఎక్కువ మంది పిల్లల్ని కనండి అని పిలుపునిస్తుంటే, సామాన్యుడు మాత్రం కనీస సదుపాయాల కోసం పోరాడుతున్నాడు. జనాభా పెరుగుదల నిజంగానే మనకు సువర్ణావకాశమా? లేక పెను విపత్తుకు సంకేతమా?

ఉద్యోగాల్లో భారత్ ఎందుకు వెనుక?

ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం భారత్ ఇప్పుడు జనాభాలో నంబర్ వన్. 142.58 కోట్ల జనాభాతో చైనాను వెనక్కి నెట్టేశాం. అయితే ఈ అగ్రస్థానం మనకు గర్వకారణమా అంటే.. సమాధానం చెప్పడం కష్టమే. ప్రస్తుతం మన దేశంలో 100 కోట్ల మంది పని చేసే జనాభా ఉంది. ఇది ప్రపంచంలో ఏ దేశానికీ లేని వరం. కానీ ఈ వరం కాస్తా శాపంగా మారుతోందా? చదువుకున్న చదువుకు, చేస్తున్న ఉద్యోగానికి సంబంధం లేని దుస్థితి ఎందుకు దాపురించింది? పీజీలు, పీహెచ్‌డీలు చేసిన వారు ప్యూన్ ఉద్యోగాలకు పోటీ పడుతుంటే.. మనం డెమోగ్రాఫిక్ డివిడెండ్ గురించి గొప్పలు చెప్పుకోవడంలో అర్థం ఉందా?

చైనా మోడల్.. భారత్‌కు మార్గదర్శకమా?

చైనా జనాభా 140.9 కోట్లు. మనకంటే తక్కువే అయినా, అక్కడ జనాభాకు తగ్గ మౌలిక సదుపాయాలు అద్భుతంగా ఉన్నాయి. చైనాలో మౌలిక సదుపాయాల కల్పన యుద్ధ ప్రాతిపదికన జరుగుతుంది. అక్కడి చట్టాలు పకడ్బందీగా ఉంటాయి. నిరుద్యోగ సమస్యను వారు ఉత్పాదకత ద్వారా అధిగమించారు.కానీ భారత్‌లో పరిస్థితి ఏంటి? జనాభా పెరుగుతోంది కానీ దానికి తగ్గట్టుగా రోడ్లు, ఆస్పత్రులు, విద్యా సంస్థలు పెరగడం లేదు. చైనాలో పేదరికాన్ని దాదాపు తుడిచిపెట్టే స్థాయికి వెళ్లారు. మరి మన దగ్గర? ఇప్పటికీ ఒక పూట భోజనం దొరకని వారు కోట్లలో ఉన్నారు. గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో మన స్థానం మనల్ని భయపెడుతోంది.

యువత ఉంది.. ఉద్యోగాలు ఎక్కడ?

భారత దేశానికి యువతే బలం అంటున్నాం.. కానీ ఆ యువతకు ఉపాధి ఎక్కడ? ఏటా కోటి మంది కొత్తగా జనాభాలో చేరుతుంటే, దానికి తగినన్ని ఉద్యోగాలు సృష్టించగలుగుతున్నామా? అసంఘటిత రంగంలో తక్కువ వేతనాలతో కూలీలుగా మారుతున్న చదువుకున్న యువత భవిష్యత్తు ఏంటి? అవినీతి వేళ్లూనుకుపోయిన వ్యవస్థలో సామాన్యుడికి ప్రతిభ ఉన్నా.. అవకాశాలు దక్కని పరిస్థితి. చైనా తన జనాభాను మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా మార్చుకుని ప్రపంచాన్ని శాసిస్తుంటే.. మనం మాత్రం ఇంకా సర్వీస్ సెక్టార్‌పైనే ఆధారపడుతున్నాం.

తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన

జనాభా పెరుగుదలతో పాటు భారత్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు పోషకాహార లోపం. 15 నుంచి 49 ఏళ్ల మధ్య ఉన్న మహిళల్లో 24 శాతం మంది ఊబకాయంతో ఉంటే, మరోవైపు లక్షలాది మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. తెలంగాణ, ఏపీ వంటి రాష్ట్రాల్లో హెచ్ఐవీ బాధితులు జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉండటం ఆందోళనకరం. జనాభా పెరిగే కొద్దీ ప్రభుత్వ ఆస్పత్రులపై ఒత్తిడి పెరుగుతోంది. బెడ్లు దొరకక, సరైన వైద్యం అందక సామాన్యుడు ప్రాణాలు వదులుతున్న దృశ్యాలు నేటికీ మనం చూస్తూనే ఉన్నాం.

జనాభా పెంపు పిలుపు

ఇన్ని సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతుంటే..ఏపీ సీఎం చంద్రబాబు వంటి నేతలు…ఎక్కువ మంది పిల్లల్ని కనండి అని పిలుపునిస్తున్నారు. దీని వెనుక ఉన్న ప్రధాన కారణం.. భవిష్యత్తులో దక్షిణ భారతదేశం ఎదుర్కోబోయే వృద్ధాప్య సమస్య. జనాభా నియంత్రణ పాటించడం వల్ల దక్షిణాది రాష్ట్రాల్లో యువత తగ్గి, వృద్ధులు పెరుగుతున్నారు. ఇది భవిష్యత్తులో ఆర్థిక స్తబ్దతకు దారితీస్తుందని వారి ఆందోళన. అయితే ఇక్కడే ఒక విరుద్ధమైన పరిస్థితి ఉంది. ఉన్న జనాభాకే సరైన తిండి, బట్ట, ఇల్లు కల్పించలేనప్పుడు.. మరిన్ని నోళ్లు పెరిగితే పరిస్థితి ఏంటి? సదుపాయాలు కల్పించకుండా జనాభాను పెంచమని చెప్పడం కత్తి మీద సాము లాంటిది కాదా..!

డిగ్రీలే ఎక్కువ.. నైపుణ్యం తక్కువ

పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని కీలక అడుగులు వేస్తున్నాయి. రవాణా వ్యవస్థను మెరుగుపరచడం, అందరికీ ఇళ్లు కల్పించడం. మారుమూల గ్రామాలకు ఇంటర్నెట్ చేరవేయడం వంటి సౌకర్యాలు కల్పిస్తున్నాయి. కానీ ఇవి జనాభా పెరుగుతున్న వేగానికి సరిపోతాయా? అవినీతి కారణంగా నిధులు పక్కదారి పడుతున్నాయా? అన్నదే అసలైన ప్రశ్న. విద్యా వ్యవస్థలో మార్పులు రానంత కాలం, యువతకు కేవలం డిగ్రీలే తప్ప నైపుణ్యం అందనంత కాలం.. ఈ జనాభా భారత్ కు భారం మాత్రమే అవుతుందన్నది విశ్లేషకుల అభిప్రాయం.

భారత్ అభివృద్ధి తివేణి

చదువుకున్న చదువుకు, పరిశ్రమల అవసరాలకు మధ్య ఉన్న అగాధాన్ని పూడ్చాలి. జనాభాకు ఆహార భద్రత కల్పించాలంటే టెక్నాలజీతో కూడిన వ్యవసాయం పెరగాలి. మహిళలను ఆర్థిక వ్యవస్థలో భాగం చేయాలి. గృహిణిగా నిర్ణయాలు తీసుకునే అమ్మ.. దేశ అభివృద్ధిలోనూ భాగం కావాలి. 2036 నాటికి వృద్ధుల సంఖ్య కూడా పెరుగుతుంది కాబట్టి, సామాజిక భద్రతా వ్యవస్థలను బలోపేతం చేయాలి.

జనాభా శక్తిని ఆర్థిక శక్తిగా మార్చగలమా?

నాభా అనేది ఒక శక్తివంతమైన ఆయుధం. అది మన చేతిని రక్షించే కత్తి కావాలా.. లేక మనల్నే గాయపరిచే ముల్లు కావాలా అన్నది మన విధానాల మీద ఆధారపడి ఉంటుంది. చైనా తన జనాభాను ఒక ఆర్థిక శక్తిగా మలిచింది.. భారత్ కూడా ఆ దిశగా వెళ్లాలి. కేవలం అంకెల్లో అగ్రస్థానం కాదు.. ఆకలి లేని భారతం, అవినీతి లేని వ్యవస్థ, నైపుణ్యం ఉన్న యువత ఉన్నప్పుడే 2047 నాటికి మనం వికసిత్ భారత్‌ను చూడగలం. జనాభా పెరుగుదల లాభమా, నష్టమా అన్నది కాలమే నిర్ణయిస్తుంది.. కానీ ఆ కాలాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవాల్సిన బాధ్యత పాలకులదే, ప్రజలదే!

Also Read: గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ సత్తా.. భారీ ఊరేగింపు

Story by: Anup, Big Tv

Related News

యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ వర్తింపు.. ఆ మూడు రోజుల్లోనే అకౌంట్లలోకి రూ. 13 వేలు!

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా ?

Big Stories

Advertisement
×