Indigo Airlines Crisis: ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో క్రైసిస్ వస్తే.. ఇండియా గవర్నమెంట్ తగ్గింది! డీజీసీఏనే ముందుకొచ్చి.. FDTL నిబంధనలను సడలించింది. నిర్వహణపరమైన లోపాలతో ఇండిగో విమాన సర్వీసులకు అంతరాయం కలిగింది. దీనికి పూర్తి బాధ్యత.. ఆ సంస్థదే. కానీ.. ఇబ్బందులు మాత్రం జనం పడ్డారు. విమర్శల్నీ ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎయిర్‌లైన్స్ బిజినెస్ మార్కెట్‌లో.. ఎవరో ఒకరే మార్కెట్ లీడర్‌గా ఎదిగితే.. సీన్ ఇలా ఉంటుందా? ఇండిగో సంక్షోభం.. ఇంట్రస్టింగ్ పాఠమేంటి?
ఇండిగో క్రైసిస్‌కి చెక్ పెట్టేలా.. రూల్స్ మార్చింది!
ఇండిగో ఆగితే.. డీజీసీఏ వెనక్కి తగ్గింది! ఇండిగో క్రైసిస్‌కి చెక్ పెట్టేలా.. నిబంధనల్ని సవరించింది. ఓ ప్రైవేట్ ఎయిర్‌లైన్స్‌లో సంక్షోభం తలెత్తితే.. జనం అనేక అవస్థలు పడ్డారు. ప్రభుత్వం.. అనేక విమర్శలు ఎదుర్కొంది. చివరికి.. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు.. ప్రభుత్వ వ్యవస్థలే దిగి రావాల్సి వచ్చింది. ఈ పరిణామం ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది. ఇక్కడ కొత్త FDTL నిబంధనల్ని అమల్లోకి తీసుకురావడంలో తప్పేమీ లేదు. వాటికనుగుణంగా.. ఇండిగో ఎయిర్‌లైన్స్ సిద్ధంకాకపోవడం వల్లే.. ఫ్లైట్ సర్వీసుల్లో అంతరాయం తలెత్తింది. ఈ పరిస్థితికి పూర్తిగా ఇండిగో సంస్థే కారణమైనా.. ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. వేలాది మంది ప్రయాణికుల పడిగాపులను, అవస్థలను దృష్టిలో ఉంచుకొని.. డీజీసీఏనే కాస్త తగ్గి రూల్స్‌ని సడలించాల్సి వచ్చింది. 4 రోజులవుతున్నా.. ఇండిగో విమాన సర్వీసుల్లో ఎలాంటి మార్పు లేదు. ఫలితంగా.. ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. శుక్రవారం కూడా 400 లకు పైగా విమాన సర్వీసులను ఇండిగో రద్దు చేసింది. ఈ క్రమంలో.. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. పైలట్ల విధులకు సంబంధించి ఇండిగోతో పాటు ఇతర ఎయిర్‌లైన్స్ సంస్థలకు ఊరట కల్పించేలా.. నిబంధనలను కాస్త సడలించింది. పైలట్ల వీక్లీ రెస్ట్ నిబంధనల్లో మార్పులు చేసింది.
ఫ్లైట్ సర్వీసుల రద్దుతో సతమతమవుతున్న ఇండిగో
వందలాది ఫ్లైట్ సర్వీసుల రద్దుతో సతమతమవుతోన్న ఇండిగో.. నిబంధనల సడలింపు కోసం డీజీసీఏను ఆశ్రయించింది. ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్‌లో కాస్త రిలీఫ్ ఇవ్వాలని కోరింది. దాంతో.. ఎయిర్‌లైన్స్ పైలట్ల విధులకు సంబంధించి మార్పులు చేసింది డీజీసీఏ. అయితే.. ఇవి తాత్కాలికం మాత్రమే! కొత్త నిబంధనల్లో పైలట్లకు వీక్లీ రెస్ట్ టైమ్ 36 గంటల నుంచి 48 గంటలకు పెంచింది. ఇప్పుడీ వీక్లీ రెస్ట్‌ని సెలవుగా పరిగణించనున్నట్లు డీజీసీఏ ప్రకటించింది. FDTL కొత్త రూల్స్ ప్రకారం.. వీక్లీ రెస్ట్‌ని సెలవుగా పరిగణించే అవకాశం లేదు. వీక్లీ రెస్ట్ పీరియడ్, సెలవులను వేర్వేరుగా చూసేవారు. పైలట్ల అలసట సమస్యను పరిష్కరించేందుకు ఈ కఠిన నిబంధనలు తీసుకొచ్చారు. అయితే ఇండిగోలో తలెత్తిన సంక్షోభంతో.. ఈ నిబంధనను కాస్త సడలించారు. ఇక, పైలట్ల రాత్రి విధులపై ఉన్న నిబంధనలకు సంబంధించి ఇండిగోకు భారీ ఉపశమనం దక్కింది. పైలట్లు వరుసగా రెండు కంటే ఎక్కువ నైట్ షిఫ్ట్‌లు చేయొద్దనే నిబంధనని కూడా తాత్కాలికంగా ఉపసంహరించుకుంది డీజీసీఏ. ఇండిగో విమానయాన సంస్థకు చెందిన పైలట్లు వారంలో ఆరు నైట్ డ్యూటీలు నిర్వహించే అవకాశాన్ని కల్పించింది. ప్రస్తుత గందరగోళాన్ని నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీజీసీఏ తెలిపింది. ఈ మినహాయింపులు వచ్చే ఏడాది ఫిబ్రవరి పదో తేదీ వరకు అమల్లో ఉంటాయ్.
కర్ణాటకలో ఆన్‌లైన్‌లో టెకీ కపుల్ రిసెప్షన్
ఇండిగో విమాన సర్వీసులు రద్దవడంతో దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కర్ణాటకలో ఓ టెకీ కపుల్ ఆన్‌లైన్‌లో రిసెప్షన్ నిర్వహించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. హుబ్బళ్లికి చెందిన మేధా క్షీర్‌సాగర్, ఒడిశాలోని భువనేశ్వర్‌కు చెందిన సంగమ దాస్ వివాహం నవంబర్ 23న జరిగింది. ఈ క్రమంలో.. బుధవారం వధువు స్వస్థలం దగ్గర రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు హాజరయ్యేందుకు కొత్త జంట.. భువనేశ్వర్ నుంచి బెంగళూరుకు ఇండిగో విమానంలో టికెట్లు బుక్ చేసుకున్నారు. ఇండిగోలో తలెత్తిన క్రైసిస్‌తో వారి ప్రయాణం రద్దయింది. కానీ.. వీరి రిసెప్షన్‌కు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయ్. అతిథులు కూడా వేడుకకు హాజరవడంతో.. వధూవరులిద్దరూ.. ఇలా వర్చువల్‌గా పాల్గొనాల్సి వచ్చింది. ఆన్‌లైన్‌లోనే కొత్త జంటను బంధువులు ఆశీర్వదించారు.
గోవాలో జరగాల్సిన డెస్టినేషన్ వెడ్డింగ్ వాయిదా..
ఇదొక్కటే కాదు.. గోవాలో జరగాల్సిన ఓ డెస్టినేషన్ వెడ్డింగ్.. ఇండిగో క్రైసిస్ కారణంగా వాయిదా పడింది. సుమారు 20 లక్షల ఖర్చుతో ఏర్పాటు చేసిన ఈ వివాహ వేడుకని.. వచ్చే నెలలో ఢిల్లీకి మార్చారు. ఇంకా.. ఎంతోమంది తమ ఫ్యామిలీని కలుసుకునేందుకు వెళ్లాలనుకున్న వాళ్లంతా.. ఎయిర్‌పోర్టులోనే గంటల తరబడి ఎదురుచూడాల్సి వచ్చింది. చివరకు.. వారి టూర్ రద్దయిపోయింది. ఎంతోమంది.. ఇతర నగరాల్లో ఇంటర్వ్యూలు మిస్ అయ్యారు. ఎందరో వ్యాపారులు.. తమ బిజినెస్ ట్రిప్స్‌ని కోల్పోయారు. ఫ్లైట్స్ రద్దుకు సంబంధించి.. సరైన సమాచారం లేక, ఏం చేయాలో తెలియక గందరగోళానికి గురయ్యారు.
ఇతర ఎయిర్ లైన్స్‌లో అత్యధిక రేట్లకు టికెట్లు కొనుగోలు
ఇండిగో ఫ్లైట్స్ రద్దవడంతో చాలా మంది ప్రయాణికులు.. ఇతర ఎయిర్‌లైన్స్ సంస్థల్లో అత్యధిక రేట్లకు టికెట్లు కొనాల్సిన పరిస్థితి వచ్చింది. ఇండిగో దెబ్బతో.. కొన్ని రూట్లలో ఫ్లైట్ టికెట్ రేట్లు సాధారణం కంటే 2, 3 రెట్లు పెరిగాయ్. ఎయిర్‌పోర్టుల్లో చెక్-ఇన్ చేసిన ప్రయాణికులు.. తమ లగేజీ దొరకక రోజుల పాటు ఇబ్బంది పడ్డారు. చాలా ఎయిర్‌పోర్టుల్లో.. ఇండిగో ప్యాసింజర్లకు ఆహారం, నీరు కూడా సరిగా అందక అవస్థలు పడ్డారు. సరైన చోటు లేక.. నేలపైనే నిద్రించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇండిగో ఇంటర్నేషనల్ ఫ్లైట్లలో.. విదేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. ఎంతోమంది.. ముందే షెడ్యూల్ చేసి పెట్టుకున్న తమ పనుల్ని మళ్లీ వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయ్. ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో తలెత్తిన సంక్షోభం.. వేలాది మంది ప్రయాణికులకు చుక్కలు చూపించింది.
ఎవరు ఔనన్నా.. కాదన్నా.. భారత విమానయాన రంగంలో ఇండిగో ఎయిర్‌లైన్సే తోపు. అది నడిపే ఫ్లైట్ సర్వీసుల సంఖ్య అలాంటిది మరి! ఫ్లైట్ సర్వీస్‌లో.. ఇండియా మార్కెట్‌ని ఇండిగో క్యాప్చర్ చేసింది. దాంతో.. ఇప్పుడెలాంటి పరిస్థితులు తలెత్తాయో చూస్తున్నాం కదా! మార్కెట్ లీడర్‌గా ఒకే సంస్థ ఉండటంతో.. ఎంత ప్రమాదమో అర్థమవుతోంది కదా! ఇండిగోలో ఇబ్బంది వస్తే.. ఇండియాలోని ఎయిర్‌పోర్టులన్నీ ప్రయాణికుల పడిగాపులతో స్తంభించిపోయాయ్. ఇదొక్క.. ఎయిర్‌లైన్స్‌కే పరిమితం కాదు. మిగతా రంగాల్లోనూ.. కాంపిటీషన్ లేకపోతే.. పరిస్థితి ఇంతే! వాళ్ల ఆదాయం వాళ్లకే ఉంటుంది.. ఆయాసం మాత్రం జనాలదే!
భారతీయ విమానయాన రంగంలో ఇండిగో ఓ బ్రాండ్..
ఇండిగో ఎయిర్‌లైన్స్ సంక్షోభం.. ఇండియన్ ఏవియేషన్ మార్కెట్ డైనమిక్స్‌ని మార్చేసింది. ఒకే సంస్థ మార్కెట్‌లో ఆధిపత్యం వహించడం వల్ల తలెత్తే పరిణామాలు ఎలా ఉంటాయో అందరి కళ్లకు కట్టింది. భారతీయ విమానయాన రంగంలో ఇండిగో ఓ బ్రాండ్‌గా సెటిలైంది. దాదాపు 60 శాతానికి పైగా మార్కెట్ వాటాతో.. తిరుగులేని మార్కెట్ లీడర్‌గా అవతరించింది. తాజాగా ఇండిగోలో తలెత్తిన సంక్షోభం, వందలాది ఫ్లైట్ సర్వీసుల రద్దు లాంటివి చూశాక.. అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయ్. ఇండిగో లాంటి సంస్థ.. అత్యధిక సర్వీసులను నడుపుతున్నప్పుడు.. అందుకు తగ్గట్లుగానే సిబ్బంది ఉండాలి. డీజీసీఏ రూల్స్‌కి తగ్గట్లుగా సంస్థ నడచుకోవాలి. కానీ.. ఈ విషయంలో ఇండిగో ఫెయిలైంది. సంస్థ వైఫల్యానికి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫలితంగా.. ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ సంక్షోభంలో.. విమానయాన రంగాన్ని నియంత్రించే డీజీసీఏ తీసుకున్న చర్య అత్యంత చర్చనీయాంశమైంది. ఇండిగో తమ సర్వీసులని పునరుద్ధరించేందుకు వీలుగా.. తాత్కాలికంగా FDTL రూల్స్‌ని సడలించింది. ఇందుకు.. మార్కెట్‌లో ఇండిగో ఆధిపత్యమే మేజర్ రీజన్. అది ఫెయిలైతే.. ఇండియన్ ఏవియేషన్ సిస్టమ్ మొత్తం స్తంభించిపోతుంది.
ప్రయాణికుల డిమాండ్ ని తీర్చలేని మిగతా ఎయిర్‌లైన్స్
ఒక సంస్థ విఫలమైతే.. ప్రయాణికులు వెంటనే ఆల్టర్నేట్ సర్వీసులకు మారడం కష్టమవుతుంది. మరీ ముఖ్యంగా.. తక్కువ టికెట్ రేట్లకు ఫ్లైట్ సర్వీసులని నడిపే.. ఇండిగో సేవలు నిలిచిపోతే.. మిగతా ఎయిర్‌లైన్స్ ఆ డిమాండ్‌ని తీర్చలేవు. దీనివల్ల.. టికెట్ రేట్లు పెరుగుతాయ్. ప్రయాణికులు మరింత ఇబ్బంది పడతారు. ఇప్పుడు జరుగుతోంది కూడా అదే. అందువల్ల.. ప్రజలకు మళ్లీ ఇండిగో సేవలు అందుబాటులోకి రావాలంటే.. డీజీసీఏ నిబంధనల్లో కొన్ని సడలింపులు ఇవ్వక పరిస్థితి తలెత్తింది. విమానయాన వ్యవస్థ మరింత గందరగోళానికి గురికాకూడదనే ఒత్తిడిలోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. దీనివల్ల అర్థమవుతున్నదేమిటంటే.. ఎయిర్‌లైన్స్ సేవల్లో ఇండిగో సంస్థ మాత్రమే మేజర్ మార్కెట్‌ని క్యాప్చర్ చేయడం వల్ల.. ఆ సంస్థలో తలెత్తే లోపాలు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే పరిస్థితులు ఎదురవుతున్నాయ్.
ప్రజలకు సేవలందించే రంగాల్లో ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి!
ఇది కేవలం.. ఏవియేషన్ మార్కెట్‌కు మాత్రమే కాదు.. ఇతర రంగాలకు కూడా వర్తిస్తుంది. ప్రజలకు వివిధ రకాల సేవలు అందించే ఎన్నో రంగాల్లో ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి. మార్కెట్ డైవర్సిటీ కనిపించాలి. ఒకే సంస్థ.. ఏకఛత్రాధిపత్యం కొనసాగిస్తే.. అది నిర్వహణపరంగా విఫలమైనా, ఇతర సమస్యలను ఎదుర్కొన్నా.. దాని ఇంపాక్ట్ ఆ సంస్థకే కాక.. మొత్తం ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అచ్చం.. ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో టికెట్లు బుక్ చేసుకొని ఎయిర్‌పోర్టుల్లో పడిగాపులు కాస్తున్న ప్రయాణికుల్లాగా! టెలికాం రంగంలోనూ.. దాదాపుగా ఇదే పరిస్థితి నెలకొంది. ఒకప్పుడు.. మొబైల్ వినియోగదారులకు ఎన్నో నెట్‌వర్క్స్ అందుబాటులో ఉండేవి. ఇప్పుడు ఇండియాలో కేవలం జియో, ఎయిర్‌టెల్ నెట్‌వర్క్స్ మాత్రమే మార్కెట్ లీడర్స్‌గా ఎదిగాయ్. ఇప్పుడు.. ఈ రెండు సంస్థలకే కస్టమర్లు ఎక్కువగా ఉన్నారు. వొడాఫోన్, ఐడియా కలిసి ఒకే సంస్థగా మారినా.. పెద్దగా బజ్ లేదు. అది ఉందో, లేదో కూడా తెలియదు. ఇక.. ప్రభుత్వరంగ సంస్థ బీఎస్ఎన్‌ఎల్ సంగతి సరేసరి. అందువల్ల.. జియో, ఎయిర్‌టెల్.. మొబైల్ ప్లాన్స్‌కి రేట్లు గట్టిగా పెంచేస్తున్నాయ్. అయినాసరే.. జనాలకు టెలికాంలో మరో ఆప్షన్ లేకుండా పోతోంది.
ఈ – కామర్స్ రంగంలో అమెజాన్, ప్లిప్కార్ట్ డామినేషన్
ఆన్ లైన్ షాపింగ్, ఈ-కామర్స్ సంస్థల్లోనూ ఇండియాలో కేవలం రెండు సంస్థల ఆధిపత్యం మాత్రమే కొనసాగుతోంది. మార్కెట్‌లోకి ఎన్ని ఈ-కామర్స్ సైట్లు వచ్చినా.. డామినేషన్ మాత్రం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ది మాత్రమే. ఎన్ని ఉన్నా.. జనం వాటిలో కొనుక్కునేందుకే మొగ్గు చూపుతున్నారు. ఏదైనా ఇబ్బంది తలెత్తితే.. మరో ప్రత్యామ్నాయ ఆన్ లైన్ షాపింగ్ యాప్‌పై ఆధారపడే పరిస్థితులు ఉండటం లేదు. ఏదైనా మొబైల్ కొనాలంటే.. ఆ సైట్లలో మాత్రమే తక్కువ ధరకు దొరుకుతోంది. మిగతా సైట్లలో అదే మొబైల్ పై ఆఫర్లు కనిపించవు. దానివల్ల.. కస్టమర్లు అంతా.. ఈ రెండు యాప్స్ మీదే ఆధారపడాల్సి వస్తోంది.
Also Read: షాకిచ్చిన ప్రజలు.. సుజనా చౌదరి కథ రివర్స్..
ఫిన్ టెక్ సంస్థల విషయంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. యూపీఐ పేమెంట్స్‌కి ఎన్ని యాప్స్ అందుబాటులో ఉన్నా.. మార్కెట్‌లో జీపే, ఫోన్ పే మాత్రమే ట్రెండింగ్‌లో ఉంటాయ్. చాలా మంది.. ఈ రెండు యాప్స్‌నే ఎక్కుగా వినియోగిస్తుంటారు. సడన్‌గా.. ఏదో ఒక రోజు వీటిలో సర్వర్ డౌన్ అయితే.. ఇక అంతే సంగతి. దేశవ్యాప్తంగా.. కొన్ని కోట్ల లావాదేవీలు నిలిచిపోయే పరిస్థితి నెలకొంటుంది. అప్పటికప్పుడు.. మరో ఫిన్ టెక్ యాప్‌కి మారేంత టైమ్ ఉండదు. ఈలోపు.. జరగాల్సిన ఆలస్యం జరిగిపోతుంది. ఇవి మాత్రమే కాదు.. ఏ రంగమైనా సరే.. కాంపీటీషన్ కంపల్సరీగా ఉండాలి. అన్ని రకాలు సేవలు.. అందరికీ అందుబాటులో ఉండాలి. వ్యవస్థ కూడా ప్రజలకు మేలు చేసేలా పనిచేస్తుంటారు. ఏ రంగంలోనూ మోనోపొలి అనేది కరెక్ట్ కాదనే వాదన ఇండిగో ఇష్యూ తర్వాత బలంగా వినిపిస్తోంది. అందువల్ల.. మార్కెట్ వాటాని సమతుల్యం చేసేందుకు.. కొత్త సంస్థలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి. చిన్న సంస్థల విస్తరణకు సాయం అందించాలి. అప్పుడే.. ప్రజలకు ఒకటి కాకపోతే.. మరొకటి అనే ఆప్షన్ ఉంటుంది. జనానికి ఇబ్బందులు, ప్రభుత్వాలకు నిందలు తప్పుతాయ్.
Story By Anup, Bigtv