Nalgonda BJP: జిల్లాలో అసలే ఆ పార్టీ పరిస్థితి అంతంత మాత్రం. అలాంటి పార్టీలో ఆధిపత్యం కోసం జరుగుతున్న పోరును చూసి ఆ పార్టీ కార్యకర్తలే ముక్కున వేలేసుకుంటున్నారు. ఏదైనా ఎన్నిక వస్తే చాలు పోటీ చెయ్యడానికి సై అంటే సై అంటు ముందుకు దూకుతుంటారు ఆపార్టీ నాయకులు. చివరకు పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చినట్లు కొత్త వ్యక్తి వచ్చి పోటీ చేస్తుంటాడు. ఇది ఆ జిల్లా పార్టీలో ఎప్పుడూ జరిగే తంతే. ఇక ఇప్పుడు కొత్తగా జిల్లా అద్యక్ష పదవి ఆ పార్టీలో పెద్ద చిచ్చే పెట్టింది. అధ్యక్షుడిని మార్చకపోతే మాదారి మేము చూసుకుంటాం అంటున్నారు ఆ పార్టీ సీనియర్ నేతలు. ఇంతకూ ఆ పార్టీ అంత గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్న జిల్లా ఏది? కొత్త అధ్యక్షుడిపై ఎందుకు అంత వ్యతిరేకత?
నల్గొండ జిల్లాలో గట్టి పునాదులు వేసుకోవాలని భారతీయ జనతా పార్టీ ఎంతోకాలంగా ప్రయత్నిస్తూనే వస్తుంది. కానీ మొదటి నుంచి ఆ పార్టీలో జరుగుతున్న వర్గ పోరు పార్టీ పరిస్థితిని ఎక్కడ వేసిన గొంగళి అన్నట్లు తయారు చేస్తుంది. అసెంబ్లీ ఎన్నికలు కానీ లోకసభ ఎన్నికలు గాని వచ్చినప్పుడు పార్టీలో ఎంతోమంది ఆశావాహులు పుట్టుకొస్తుంటారు. కానీ అధిష్టానం ఎవ్వరిని అభ్యర్ధిగా ప్రకటిస్తుందో? ఏ లెక్కలతో వారికి అవకాశం ఇస్తుందో ఆ పార్టీ సీనియర్ నేతలకే అంతు చిక్కేది కాదంట.
ఆశావహులందర్నీ కాదని రాష్ట్ర నాయకత్వం చివరకు ఎవరినో అభ్యర్ధిగా ప్రకటిస్తుంది. దాంతో ఆశావహులు ఎన్నికల సమయంలో ఆ అభ్యర్ధికి చుక్కలు చూపించడం కామన్ అయిపోతుందంట. చివరకు అన్నీ రెడడీ చేసుకుని ఎక్కడి నుంచో పోటీ చేయడానికి వచ్చిన సదరు నేత.. అన్నీ ఖాళీ చేసుకుని జిల్లాకు ముఖం చాటేసి వెల్లిపోతుంటాడు. అలా బీజేపీ పరిస్థితి నల్గొండ జిల్లాల్లో అత్యంత దయనీయంగా తయారవుతుంది. ఏదో కష్టపడి ఒక్క అడుగు ముందుకు వేసామనుకునే లోపే.. పార్టీ రాష్ట్ర పెద్దలు తమ ఏకపక్ష నిర్ణయాలతో పది అడుగులు వెనక్కి తోసేస్తున్నారని కాషాయ శ్రేణులు చిర్రుబుర్రులాడుతుంటాయి.
తెలంగాణ రాష్ట్రంలో ఎలాగైనా అధికారంలోకి రావాలని కలలు కంటున్నారు కమలనాథులు. ఢిల్లీ పెద్దలు కూడా అదే టార్గెట్‌గా పెట్టుకుని తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఆ క్రమంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో మిషన్ నైన్టీ(90) అని హడావుడి చేసిన బీజేపీ ప్రస్తుతం నల్గొండ జిల్లాలో నెలకొన్న లాంటి పరిస్థితులు ప్రతిబంధకంగా మారి ఎనిమిది సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే వచ్చే ఎన్నికలకు బీజేపీకి బీఆర్ఎస్ అయాచితవరంగా మారింది. వరుస పరాజయాలతో కుదేలవుతున్న గులాబీ పార్టీ బీజేపీ బలం పుంజుకోవడానికి అవకాశం కల్పించింది. అయినా దాన్ని బీజేపీ క్యాష్ చేసుకోలేక పోతుందంటున్నారు .
నల్గొండ జిల్లా విషయాన్నే తీసుకుంటే బీజేపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే వస్తుంది. తాజాగా జిల్లా పార్టీ అధ్యక్షుడి ఎన్నిక మరింత తలనొప్పిని తెచ్చిపెట్టిందంట. సంస్థాగత ఎన్నికల పేరుతో హడావుడి చేస్తున్న బీజేపీ జిల్లాలకు కొత్త అధ్యక్షులను ప్రకటించింది. గతంలో నల్గొండ జిల్లా బిజెపి అధ్యక్షుడిగా పనిచేసిన నాగం వర్షిత్ రెడ్డిని మరోసారి అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టింది. అదే కాషాయపార్టీలో మళ్లీ ముసలం రేపుతోంది. అందరి అభిప్రాయ సేకరణతో అధ్యక్షులను నియమిస్తామని ప్రకటించిన బీజేపీ పెద్దలు .. అదేమీ లేకుండా కొత్త ప్రెసిడెంట్లను జిల్లా కేడర్‌పై రుద్దుతున్నారంట.
Also Read: జనం సొమ్ముతో ఐటీ పన్ను.. బీఆర్ఎస్ పాలనలో విడ్డూరం, పాతిపెట్టిన జీవోల గుట్టురట్టు!
జిల్లా నాయకులు, మండలాల నేతల అభిప్రాయం తీసుకోకుండా, జిల్లా అధ్యక్ష పదవి ప్రకటించడం ఎంత వరకు సబబని నల్గొండ జిల్ల సీనియర్ నాయకులు బిజెపి అధిష్టానంపై ధ్వజమెత్తుతున్నారు. పార్టీని అన్ని రకాలుగా దివాలా తీయిస్తున్న వ్యక్తికి మళ్ళీ అధ్యక్ష పీఠం కట్టబెట్టడం ఏంటని ఒంటికాలిపై లెగుస్తున్నారు. ఆ క్రమంలో అధ్యక్షుడిని మారుస్తారా? లేదా మా దారి మమ్మల్ని చూసుకోమంటారా? అంటూ పార్టీ అధిష్టానానికి వారు అల్టిమేటం జారీ చేసారంట. బిజెపి జిల్లా అధ్యక్షుడి ఎంపిక ఏకపక్ష నిర్ణయమని, ఆయన్ని మార్చకపోతే మాత్రం తాము బీజేపి కార్యాలయ మెట్లు కూడా ఎక్కబోమని ఖరాఖండిగా చెప్పేసారంట.
రెండో సారి జిల్లా పార్టీ బాధ్యతలు చేపట్టిన నాగం వర్షిత్ రెడ్డి గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ ఫండ్ ను నొక్కేసి పార్టీ అభ్యర్దుల ఓటమికి కారణమయ్యారని పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. అలాంటి వ్యక్తికి మళ్ళీ అధ్యక్ష కట్టబెట్టడం ఏంటని నిలదీస్తున్నాయి . పార్టీ కొరకు నిరంతరాయంగా పని చేస్తున్న తమ అభిప్రాయాల్ని తీసుకొని కొత్త అధ్యక్షుడ్ని నియమించాల్సిందని… కాని పార్టీ పెద్దలు దేనికో లొంగిపోయి నిర్ణయాలు తీసుకొంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి . ఏదేమైనా తమను సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయాన్ని తీసుకోవడాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించే ప్రసక్తే లేదని వారు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మొత్తానికి నల్గొండ జిల్లాలో పార్టీ అధ్యక్షుడి ఎన్నిక బీజేపిలో పెద్ద రచ్చే రేపుతోంది.