ప్రకాశం జిల్లా కనిగిరి వైసీపీలో ముసలం పుట్టింది. ఇన్చార్జ్‌గా ఉన్న దద్దాల నారాయణ యాదవ్‌కు, స్ధానిక వైసీపీ నాయకులకు మధ్య ఇన్నర్ ఫైట్ జరుగుతోంది. దద్దాలను ఇన్చార్జ్‌గా తొలగించాలంటూ క్యాడర్ నుండి రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే దానికి సంబంధించి జిల్లా నేతలకు బోల్డు ఫిర్యాదులు వెళ్లాయంట. పార్టీను నడిపించడంలో దద్దాల విఫలమౌతున్నారనే టాక్ కార్యకర్తల నుండి వినిపిస్తుంది. క్యాడర్‌ను ఏకతాటి పైకి తెచ్చి నడిపించడం దద్దాల వల్ల కాదనే అభిప్రాయం మెజారిటీ నాయకుల్లో వ్యక్తం అవుతుంది.
అధిష్టానం దద్దాల నారాయణనే ఇన్చార్జ్‌గా కంటిన్యూ చేస్తే, పార్టీ తీవ్రస్ధాయిలో నష్టపోతుందనే టాక్ ఆ పార్టీ నేతల నుండి వినిపిస్తుంది. మండల స్ధాయి నాయకుడికి నియోజికవర్గం భాధ్యతలు అప్పజెపితే ఎలా మెయింటన్ చేయగలడని సొంతపార్టీ నేతలే గుస గుస లాడుకుంటున్నారట. దద్దాలకు, నియోజకవర్గంలోని ఇతర నాయకులకు మధ్య ఉన్న విభేదాలతో పార్టీ రెండుగా చీలిపోయింది. ఆ క్రమంలో వెంటనే దద్దాలను మార్చాలంటూ వ్యతిరేకవర్గం అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తుందట.
2019 ఎన్నికల్లో కనిగిరిలో వైసీపీ నుండి బుర్రా మధుసూదన్ యాదవ్ పోటీ చేసి గెలుపొందారు. 2024 ఎన్నికల్లో కూడా తిరిగి ఇక్కడ నుంచే పోటీ చేసేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. అయితే బుర్రా ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరయ్యాయ్. ఎన్నికలకు ముందు వైసీపీలో జరిగిన పొలిటికల్ బదీలీలలో, బుర్రాను కనిగిరి నుండి కందుకూరు పంపింది వైసీపీ అధిష్టానం. కనిగిరిలోమాత్రం అదే సామాజికవర్గానికి చెందిన దద్దాల నారాయణ యాదవ్ కు టిక్కెట్ కేటాయించింది. అప్పటికే దద్దాల ఇదే నియోజికవర్గంలోని హనుమంతునిపాడు మండలం జడ్పిటీసీగా కొనసాగుతున్నారు. అయితే దద్దాలకు టిక్కెట్ కేటాయించడం పై బుర్రా వర్గం అప్పట్లోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
దానికి తోడు దద్దాల ఆర్ధికంగా స్ధితిమంతుడు కాకపోవడంతో ఎన్నికల సమయంలో పార్టీ క్యాడరును, ద్వితియశ్రేణి నాయకులను సమన్వయం చేయలేకపోయారనే టాక్ అప్పట్లో పెద్ద ఎత్తున నడిచింది. ఇక 2024లో మొదటసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన దద్దాలకు బ్యాడ్ లక్ షేక్‌హ్యాండ్ ఇచ్చింది. టీడీపీ అభ్యర్ధి ముక్కు ఉగ్రనరసింహరెడ్డి, దద్దాలపై 14వేల ఓట్ల మెజారిటీతో గెలుపు దక్కించుకున్నారు. అప్పటి నుండి ఇక్కడ వైసీపీ ఇంఛార్జీగా దద్దాల కొనసాగుతున్నారు. అయితే ప్రస్తుతం ఆయన ఇన్చార్జ్ పదవికి రెక్కలు వచ్చినట్టు కనిపిస్తుంది.
Also Read: విజయ్ సాయి రెడ్డి ప్లేస్‌లో రాజ్యసభకి వెళ్లేది ఎవరు?
కనిగిరి నుండి కందుకూరు వెళ్లి పోటీ చేసిన బుర్రా మధుసూదన్ యాదవ్ కూడా అక్కడ ఓటమి పాలయ్యారు. దాంతో తిరిగి తన సొంత నియోజికవర్గానికి వచ్చేందుకు పావులు కదుపుతున్నారట. ఇప్పటికే తన ఆలోచనను వైసీపీ పెద్దల చెవిలో వేశారట. దద్దాల పై క్యాడర్లో ఉన్న వ్యతిరేఖతను క్యాష్ చేసుకుంటూ అధిష్టానంపై వత్తిడి పెంచుతున్నారంట. మరోవైపు స్ధానికంగా ఉన్న బుర్రా వర్గం కూడా దద్దాల పై జిల్లా నేతల వద్ద ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేస్తోందట. బుర్రా తిరిగి నియోజికవర్గానికి వస్తేనే పార్టీ గాడిలో పడుతుందని ఆయన వర్గం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది.
దీంతో స్ధానిక కార్యకర్తలు బుర్రా వర్సస్ దద్దాల గ్రూపులుగా విడిపోయారు. పైకి అందరు కలిసికట్టుగా కనిపిస్తున్న ఇన్నర్ గా మాత్రం ఒక వర్గం పై మరొక వర్గం కత్తులు దూసుకుంటోంది. ఆ క్రమంలో అసలే ఓటమి పాలైన పార్టీ ప్రతిష్ట మరింత మసకబారుతుందని సామాన్య కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాజయం చూసిన జగన్ ఇప్పుడిప్పుడే పార్టీ బలోపేతం పై దృష్టి సారిస్తున్నారు. అలాగే కనిగిరి వైసీపీలో జరుగుతున్న ఇన్నర్ పాలిటిక్స్ పై అధినేత దృష్టి సారించాలని స్ధానిక క్యాడర్ కోరుతోంది. దద్దాల విషయంలో అధిష్టానం ఎదో ఒక క్లారిటీ ఇవ్వాలని కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నాయి. మరి వరుస స్ర్టోక్, రాజీనామాల షాక్‌లతో తల్లడిల్లు జగన్ కనిగిరి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.