Sunil Kumar Ahuja Scam: అప్పుల రూపంలో ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసుకున్న అహుజా ఫ్యామిలీ ఆగడాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఎవరెవరికి ఎంత అప్పు ఇచ్చారు? ఏ భూమి ఏ డాక్యుమెంట్ నెంబర్‌తో రిజిస్ట్రేషన్ అయింది? ఆ తర్వాత ఎంత సొమ్ము చెల్లించారు? ఇలా లెక్కలు బయటికి వచ్చాయి. అనుకున్నట్లు వడ్డీతో పాటు చెల్లించినా మళ్లీ బారు వడ్డీలు, చక్ర వడ్డీలు వేస్తూ ఆస్తి బహిరంగ మార్కెట్‌లో ఉన్న మొత్తానికి సమానంగా వసూలు చేసుకున్నారు. ఇవ్వడంలో బ్యాంకు నుంచి ట్రాన్స్‌ఫర్ చేయడం, తీసుకోవడం నగదు రూపంలో ఉండడంతో వేల కోట్ల భూములు ఇట్లే తన వశం అయిపోయాయి. ఆ ఆస్తులను కాపాడుకోవడానికి అధికార యంత్రాంగంలో కీలకంగా ఉన్న తన సొంత పనివారిని వాడుకున్నట్టు తేలింది. తాజాగా ఈడీ హవాలా డబ్బుల వ్యవహారంపై దృష్టి పెట్టడంతో కుమారుడు అశీష్ కుమార్ అహుజా, కూతురు సిమ్రాన్‌తో కలిసి దేశం నుంచి సునీల్ అహుజా పరారయ్యాడు.
వందల సంఖ్యలో బాధితులు.. వేల కోట్ల ఆస్తుల టోకరా
అనేక కంపెనీలు, సంస్థలకు వందల కోట్ల ఆస్తులను తాకట్టు పెట్టుకొని డబ్బులు ఇచ్చారు. ఇచ్చిన అమౌంట్‌కు.. వసూలు చేసిన అమౌంట్‌కు అసలు సంబంధం లేకుండా ఉంది ఈ చిట్టాను చూస్తే. కొందరి దగ్గర రెండింతలు.. మరికొందరి దగ్గర మూడింతల డబ్బును కూడా వసూలు చేయడంతో పాటు.. వారి ఆస్తులను కూడా కొట్టేశారు అహుజా అండ్ కో. సునీల్ కుమార్ అహుజా ఆస్తుల్లో బయటికి వచ్చినవి కేవలం 10 శాతం మాత్రమే. ఇంకా 90 శాతం ఆస్తులు వివిధ బినామీ కంపెనీలపై , ఫర్మ్స్ పై పెట్టినట్లు ఆధారాలు ఉన్నాయి. నగదు లేదని బ్యాంకు నుంచి బదిలీ చేస్తే ఏఏ అకౌంట్‌కు ఎంతెంత మొత్తం పంపించారు, ఆ కంపెనీలకు ఈ సునీల్ కుమార్ అహుజా కుటుంబానికి ఉన్న సంబందం ఏంటో త్వరలోనే బయటపడనుంది.
విలువలో 30 శాతం అప్పుగా ఇచ్చి ఆస్తులు కొట్టేయడంతో రోడ్డుపాలు
30 శాతం అప్పుతో పేపర్ల మీదనే ఆస్తి తన పేరుకి మార్చుకున్నాడు సునీల్. పొజిషన్ మాత్రం అప్పు తీసుకున్న వారే ఉంటారు. దీంతో లీగల్‌గా సమస్యలు తలెత్తుతున్నాయి. వివాదాలకు దారి తీస్తున్నాయి. శంకర్ పల్లిలో పొజిషన్‌లో ఉన్న భూమిలో గురువారం అహుజా మనుషులమని కొంతమంది వచ్చారు. దీంతో బాధితుడు పోలీస్ స్టేషన్‌కు వెళితే రివర్స్‌గా అతని పైనే కేసు నమోదు చేశారు.
Also Read: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్
వేల కోట్ల ఆస్తులు గుప్పిట్లో పెట్టుకున్న సునీల్ అహుజా కుటుంబం
ఎంతో మందిని మోసం చేసిన అహుజా ఇంకా తన మనుషులు షాడో లాగా పని చేస్తున్నారు. ఉమా మహేష్, అన్వర్ అనే వ్యక్తులు అహుజా తరుఫున ఫిర్యాదు చేయగానే గంటలోనే ఎఫ్‌ఐఆర్ చేశారు. 5 ఏండ్లుగా పొజిషన్‌లో ఉండి, అప్పుగా మాత్రమే అమ్మినందుకు పోలీసులు దర్యాప్తు సరిగ్గా చేయకుండానే కేసులు పెడుతున్నారు. దీంతో భూమి వద్ద పంచనామాలు చేయడం, పొజిషన్ ఎవరు ఉన్నారో కూడా తెలుసుకోకుండానే అహుజా కాసులకు కక్కుర్తి పడి కొంతమంది అతను పరారీ అయినా ఆ ఆస్తులకు రక్షణగా నిలుస్తున్నారని తెలుస్తున్నది. పేపర్‌లో కరెక్ట్ గానే ఉన్నట్లు కనిపించినా, మోసం జరిగిన తీరుపై ప్రభుత్వం స్పందించాలని, నిజ నిర్ధారణ, హవాలాపై నిగ్గు తేల్చి తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.