Gulf Threat: పశ్చిమాసియాలో మొదలైన యుద్ధంతో.. ప్రపంచమంతా ఇరాన్ తీరును నిశితంగా పరిశీలిస్తోంది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న భీకర పోరులో గల్ఫ్ దేశాలు బలిపశువులవుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ ఒకవైపు, ఇరాన్ మరోవైపు తలపడుతుంటే, మధ్యలో అరబ్ దేశాల ఆర్థిక మూలాలు దెబ్బతినడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇరాన్ తన ప్రత్యర్థులైన ఇజ్రాయెల్, అమెరికాపై మిసైళ్లని ప్రయోగించాల్సిందిపోయి.. దుబాయ్, కువైట్, బహ్రెయిన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ లాంటి పొరుగు దేశాల వైపు మళ్లించడం అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది. ఇజ్రాయెల్‌ని వదిలేసి.. ఇరాన్ మిడిల్ ఈస్ట్‌లోని గల్ఫ్ దేశాలను ఎందుకు టార్గెట్ చేసిందనే చర్చ మొదలైంది.
ఇరాన్ తమ మిసైళ్లని పొరుగు దేశాల వైపు మళ్లించడానికి ప్రధాన కారణం.. ఆ దేశాల్లో ఉన్న అమెరికా స్థానిక స్థావరాలే. బహ్రెయిన్, ఖతార్, కువైట్, యూఏఈ లాంటి దేశాల్లో.. అమెరికాకు నేవీ, ఎయిర్‌బేస్‌లు ఉన్నాయి. ఇరాన్‌పై దాడులు చేయడానికి అమెరికా, ఇజ్రాయెల్ ఈ స్థావరాలను వాడుకుంటోందని ఇరాన్ బలంగా నమ్ముతోంది. దాంతో.. నేరుగా వాషింగ్టన్‌పై దాడి చేయలేని ఇరాన్, అమెరికా ప్రయోజనాలను దెబ్బతీసేందుకు.. పక్కనే ఉన్న ఈ లాజిస్టిక్ హబ్‌లను టార్గెట్‌గా చేసుకుంది. ప్రధానంగా చమురు మీదే ఆధారపడిన గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థని దెబ్బతీస్తే.. ఆ దేశాలు అమెరికాపై ఒత్తిడి తెచ్చి.. యుద్ధాన్ని ఆపుతాయనేది ఇరాన్ ఎత్తుగడగా కనిపిస్తోంది. అంటే, మాపై దాడులు ఆపకపోతే.. మీ మిత్ర దేశాలను కూడా దెబ్బతీస్తామనే హెచ్చరిక ఇది. ఇప్పటికే.. హర్మూజ్ జలసంధిని కూడా మూసేసింది. దీనివల్ల.. గల్ఫ్ దేశాల ఆయిల్ ఎగుమతులు ఆగిపోయి.. ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుందనేది ఇరాన్ వ్యూహంగా కనిపిస్తోంది. యుద్ధం ఇలాగే కొనసాగితే.. ఇరాన్ ఆర్థికంగా తట్టుకోవడం కష్టం. అందుకే, గల్ఫ్ దేశాల్లోని చమురు మౌలిక సదుపాయాలని టార్గెట్ చేయడం వల్ల.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను బ్లాక్ మెయిల్ చేసే వ్యూహాన్ని ఇరాన్ అమలు చేస్తోందనే అభిప్రాయాలున్నాయి.
గల్ఫ్ దేశాలు ఇప్పుడిప్పుడే.. ఇతర రంగాలపైనా ఫోకస్ పెట్టాయ్. కేవలం.. చమురు నిల్వలని మాత్రమే నమ్ముకోకుండా.. అనేక రంగాల్లో ఆర్థికంగా ఎదగాలని చూస్తున్నాయ్. బిజినెస్, షాపింగ్, రియల్ ఎస్టేట్, హౌజింగ్, బంగారం వ్యాపారం, ఎయిర్‌పోర్టులు.. ఇలా అనేక రంగాల్లో అభివృద్ధి సాధించాలని.. ప్రపంచం మొత్తానికి ఓ బిజినెస్ సెంటర్‌గా, సేఫ్ హెవెన్‌గా ఎదిగే దిశగా కృషి చేస్తున్నాయ్. అటు పశ్చిమ దేశాలకు, అటు ఆసియాకు మధ్యలో.. సెంటర్ పాయింట్‌గా, వన్ స్టాప్ డెస్టినేషన్‌గా ఉండాలని చూస్తున్నాయ్. దాంతో.. గల్ఫ్ కంట్రీస్ అంటే కేవలం చమురు మాత్రమే కాదనే ముద్ర తొలగిపోతోంది. అరబ్ దేశాలంటే.. సేఫ్ హెవెన్‌గా, వ్యాపార కేంద్రాలుగా మారిపోయాయ్. అయితే.. ఇజ్రాయెల్-అమెరికా చేస్తున్న యుద్ధంతో సంబంధం లేకపోయినా.. ఇరాన్ దాడులతో అరబ్ కంట్రీస్.. ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదముంది. ముఖ్యంగా.. టూరిజం, వ్యాపారంపై గట్టి దెబ్బ పడుతోంది. దోహా లాంటి నగరాలు ప్రపంచానికి బిజనెస్ సెంటర్‌గా ఉంది. ఎయిర్‌పోర్టులు, నౌకాశ్రయాలపై దాడులు జరగడం వల్ల.. విదేశీ పెట్టుబడిదారులు, టూరిస్టులు.. గల్ఫ్ దేశాలకు వచ్చేందుకు ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సి వస్తుంది.
ఇక.. సౌదీ అరేబియాలోని రిఫైనరీలు, ఖతార్‌లోని గ్యాస్ ప్లాంట్లు ఇరాన్ డ్రోన్లు, మిసైళ్ల దాడికి గురవుతున్నాయ్. దుబాయ్ ఎయిర్‌పోర్టుపైనా దాడులు జరిగాయ్. వీటిని మళ్లీ నిర్మించాలంటే.. బిలియన్లకొద్దీ డాలర్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. యుద్ధం వల్ల గల్ఫ్ మీదుగా ప్రయాణించే షిప్పులకు ఇన్సూరెన్స్ ప్రీమియంలు విపరీతంగా పెరిగిపోతాయ్. ఇది.. ఆ దేశాల ఎగుమతి, దిగుమతి ఖర్చులను పెంచుతుంది. కొన్ని దశాబ్దాలుగా గల్ఫ్ దేశాలు చమురుపై మాత్రమే ఆధారపడకుండా.. తమ ఆర్థిక వ్యవస్థని మిగతా రంగాలతోనూ సెటిల్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయ్. అయితే.. ఇరాన్ చేస్తున్న ప్రతీకార దాడులు ఈ ప్రయత్నాలను దారుణంగా దెబ్బకొడుతోంది. ముఖ్యంగా.. దుబాయ్ అంటే సేఫ్ హెవెన్ అనే లేబుల్ ఉంది. కానీ.. ఈ దాడులతో అది ఎగిరిపోయింది. చాలా దేశాలు గల్ఫ్ దేశాల్లోని తమ పౌరులను తిరిగి వెనక్కి రమ్మని ప్రకటించేశాయ్. జాగ్రత్తగా ఉండాలని చెప్పాయ్. వీలైనంత త్వరగా అక్కడి నుంచి ఖాళీ చేసేయమంటున్నాయ్. అయితే.. ఇలా వెళ్లిపోయిన వాళ్లంతా.. తిరిగి గల్ఫ్ దేశాలకు వస్తారా? లేదా? అనే అనుమానాలు కూడా వెంటాడుతున్నాయ్. ఈ ఉద్రిక్తతలు త్వరగా తగ్గకపోతే.. గల్ఫ్ దేశాలు ఊహించనంత నష్టం చవిచూడాల్సి వస్తుంది. మళ్లీ పూర్వవైభవం అందుకునేందుకు.. చాలా ఏళ్లు పట్టొచ్చు.
మిడిల్ ఈస్ట్ అంటే.. 3 దశాబ్దాల కిందట ఓ అస్థికరమైన ప్రాంతం. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి. కానీ.. 30 ఏళ్లుగా.. బహ్రెయిన్, ఖతార్, కువైట్, ఒమన్, యూఏఈ, సౌదీ అరేబియా లాంటి గల్ఫ్ దేశాలు.. ఓ స్థిరత్వాన్ని తీసుకొచ్చాయ్. కానీ.. ఇరాన్ మిసైళ్లు, డ్రోన్లు.. గల్ఫ్ దేశాల్లోని యూఎస్ స్థావరాలనే కాదు, దుబాయ్, అబుదాబిలోని లగ్జరీ హోటళ్లు, నివాస ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నాయ్. దాడులు చేశాయ్. దాంతో.. గల్ఫ్ దేశాల్లోని నిర్మాణాలే కాదు వాటికున్న ఇమేజ్ కూడా డ్యామేజ్ అయిపోయింది. ఇరాన్.. అరబ్ దేశాల్లోని పౌర నివాసాలపై దాడులు చేసినా.. ఆ దేశాలు సంయమనం పాటిస్తున్నాయ్. ఇది.. వ్యూహాత్మక మౌనమా? లేక.. మతపరమైన కోణం ఉందా? అనే చర్చ మొదలైంది.
అయతుల్లా అలీ ఖమేనీ.. ఇరాన్ దేశానికి అధిపతి మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న షియా ముస్లింలకు నాయకుడు. గల్ఫ్ కూడా ముస్లిం దేశాలున్న ప్రాంతమే. అయితే, యుద్ధం వల్ల తలెత్తిన పరిణామాలతో.. అరబ్ దేశాలు కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్నాయ్. ముస్లిం ఉమ్మాలో భాగమైన దేశంపై వారు ప్రతీకారం తీర్చుకుంటే.. వారు పెద్ద ఇస్లామిక్ సమాజానికి వ్యతిరేకంగా వ్యవహరించేవారిగా ముద్రపడటమే కాకుండా, ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలిచినవారిగా పరిగణిస్తారు. పైగా.. ఖమేనీ లాంటి షియా ముస్లిం నాయకుడి తర్వాత.. అరబ్ దేశాలు తిరిగి దాడులు చేస్తే.. ముస్లిం సమాజానికి మరో విధంగా సంకేతాలు వెళ్తాయనే భావన ఆ దేశాల్లో ఉంది. పైగా.. ఇప్పుడు రంజాన్ మాసం కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో మిడిల్ ఈస్ట్ మొత్తం తీవ్రమైన సంఘర్షణలో చిక్కుకుంది. అయితే.. ఒక్క సౌదీ అరేబియా నుంచి మాత్రమే ఇరాన్‌కి హెచ్చరికలు వెళ్లాయనే చర్చ జరుగుతోంది. దాడులు ఇలాగే కొనసాగితే ప్రతీకారం తీర్చుకోవాలని.. క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ రాయల్ సౌదీ సాయుధ దళాలకు అధికారం ఇచ్చారని రిపోర్ట్స్ చెబుతున్నాయ్.
మధ్యప్రాచ్యంలో ఆధిపత్యం కోసం.. సౌదీ అరేబియా, ఇరాన్ మధ్య దీర్ఘకాలికంగా శత్రుత్వం నడుస్తోంది. ఇరాన్ కూడా ఇదే అదనుగా.. సౌదీలోని అరాంకో శుద్ధి కర్మాగారంపై దాడులు చేసింది. రియాద్‌లోని యూఎస్ ఎంబసీపైనా ఎటాక్స్ జరిగాయ్. వాణిజ్యపరంగా, శాంతియుతంగా ఉండే మిడిల్ ఆస్ట్ దేశాల్లోని నగరాలు కాలిపోతుంటే.. అరబ్ దేశాలు ఇరాన్‌కు వ్యతిరేకంగా వెళ్తాయా? లేదా? అనేది ఇప్పుడు బిగ్ క్వశ్చన్. అయితే.. ఇరాన్‌పై దాడి తర్వాత.. అనేక అరబ్ దేశాలు సైనిక దాడిలో చేరేందుకు ముందుకు వస్తున్నాయని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ చెబుతున్నారు. కానీ.. ఇది దాదాపు అసాధ్యం. ఎందుకంటే.. ఆ దేశాలు సంయమనం పాటించడానికి మున్సిం ఉమ్మా కారణమనే వాదన వినిపిస్తోంది. అరబిక్ భాషలో ఉమ్మా అంటే జాతి, సమాజం, ప్రజలు అని అర్థం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలందరినీ ఒకే సమాజంగా, ఒకే కుటుంబంగా పరిగణించడాన్ని ఉమ్మా అంటారు. ఈ భావన ఖురాన్ ద్వారా ముస్లింలందరిలోనూ పాతుకుపోయింది. ఇస్లామిక్ బోధనల ప్రకారం, అల్లాని, మహ్మద్ ప్రవక్తని విశ్వసించే వారంతా.. ఏ దేశంలో ఉన్నా, ఏ భాష మాట్లాడినా వారంతా ఒకే సమాజం అనే భావన ఉంది. ముస్లిం దేశాలన్నీ కలిసి ఒకే గొంతుకగా, ముస్లిం సమస్యలపై పోరాడాలనే ఈ భావన ప్రేరేపిస్తుంది.
షియా-సున్నీ విభజన కూడా ఇప్పుడు చర్చకు వస్తోంది. అరబ్ దేశాల్లో సున్నీ ముస్లింల జనాభా ఎక్కువగా ఉంది. ఇరాన్.. పూర్తిగా షియా ముస్లింల దేశం. ఇరాన్ కాకుండా, ఇరాక్, లెబనాన్, పాకిస్థాన్‌లో.. షియా జనాభా అధికంగా ఉంది. గతంలో కూడా కొన్ని కీలక సమయాల్లో.. షియా-సున్నీ విభేదాలను పక్కనపెట్టారు. అయితే.. 1948లో ఇజ్రాయెల్ ఏర్పాటుతో ముస్లింలు, యూదుల మధ్య శతాబ్దాల తరబడి కొనసాగుతున్న శత్రుత్వం మరింత తీవ్రమైంది. ఇది, మరో సంఘర్షణాత్మక అంశంగా మారింది. ఇజ్రాయెల్ చర్యలు తరచుగా ముస్లిం ప్రపంచంపై దాడులుగా చిత్రీకరిస్తున్నారనే వాదనలున్నాయ్. అయితే.. ఇప్పడున్న సంక్షోభంలో.. ఇరాన్ గల్ఫ్ దేశాలను లక్ష్యంగా చేసుకుంది. ఇందుకు.. ఆ దేశాల్లో అమెరికా స్థావరాలు ఉండటమే కారణమని తెలిపింది. దాడుల తర్వాత.. గల్ఫ్ దేశాలన్నీ ఓ జాయింట్ స్టేట్‌మెంట్ రిలీజ్ చేశాయ్. ఇరాన్ దాడులు తమ దేశాల సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించే చర్యగా, తమ పౌరులను ప్రమాదంలో పడేసే ప్రయత్నమని ఖండించాయ్. గల్ఫ్ కో-ఆపరేషన్ కౌన్సిల్ కూడా ఎమర్జెన్సీ మీటింగ్ నిర్వహించి.. హేయమైన ఇరాన్ దాడులను ఖండించింది. ఆత్మరక్షణ కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకునే హక్కుని గుర్తుచేసింది.
ఇరాన్.. అమెరికా స్థావరాలే తమ టార్గెట్ అని చెబుతోంది. అయితే.. ఈ సున్నీ మెజారిటీ అరబ్ దేశాలు.. అమెరికా-ఇజ్రాయెల్ ఆపరేషన్‌లో చురుగ్గా పాల్గొనలేదు. జోర్డాన్, సౌదీ అరేబియాతో సహా చాలా దేశాలు.. ఇరాన్‌పై దాడులకు తమ గగనతలాన్ని వాడేందుకు ఒప్పుకోలేదు. భద్రతపరంగా మద్దతు కోసం వారి ఆర్థికవ్యవస్థలను, కీలకమైన చమురు సౌకర్యాలు, హర్మూజ్ జల సంధి లాంటి సముద్ర మార్గాలను రక్షించుకునేందుకు.. అమెరికాతో స్నేహపూర్వక సంబంధాలను కలిగి ఉండాలనే అరబ్ దేశాల ప్రయోజనాలకు ఈ వైఖరి అనుగుణంగా ఉంది. ఎదురుకాల్పుల్లో చిక్కుకున్నా, ఇప్పటివరకు గల్ఫ్ దేశాల నుంచి ఎలాంటి సైనికపరమైన ప్రతీకారం రాలేదు. పైగా.. ఇప్పుడు ఇరాన్‌పై దాడి చేస్తే.. అది అమెరికాకు, ఇజ్రాయెల్‌కు అనుకూలంగా ఉన్నారనే సంకేతం వెళ్తుంది. అందుకే.. గల్ఫ్ దేశాలన్నీ సంయమనం పాటిస్తున్నాయనే చర్చ కూడా ఉంది. తాము కూడా ప్రతీకారం తీర్చుకుంటే.. ఇరాన్ నేరుగా టార్గెట్ చేసుకొని దాడులు పెంచుతుందనే ఆలోచనలోనూ ఉన్నాయ్. అరబ్ దేశాల అధికారిక వైఖరి ఏమైనప్పటికీ.. ఖమేనీ మరణఆన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలంతా.. ఒక ఇస్లామిక్ నాయకుడిని హత్య చేసినట్లుగా భావిస్తున్నారు.
Story by: Anup, Big Tv