E-Paper
Advertisement

ఇరాన్‌లో ‘కుర్చీ’ లాట.. యుద్ధం వేళ అధ్యక్షుడికే ఎదురుదెబ్బ!

ఇరాన్‌లో ‘కుర్చీ’ లాట.. యుద్ధం వేళ అధ్యక్షుడికే ఎదురుదెబ్బ!
Advertisement

Iran Conflict: యుద్ధంలోకి దిగిన తర్వాత, ప్రతీకార దాడులు మొదలుపెట్టాక.. ఏ దేశానికైనా ఐక్యతే తొలి రక్షణ కవచం. శత్రువు దాడి చేస్తున్నప్పుడు వ్యూహాలు సిద్ధం చేసి, తెలివిగా దెబ్బకొట్టాల్సిన చోట విబేధాలు పొడచూపితే, ఆ దేశం పతనం ఖాయమనే చరిత్ర చెబుతోంది. ఇప్పుడు.. ఇరాన్ పరిస్థితి సరిగ్గా అలాగే కనిపిస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్‌ నుంచి తీవ్ర ముప్పు పొంచి ఉన్న తరుణంలో.. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ చీఫ్ అహ్మద్ వాహిది మధ్య తీవ్రమైన అధికార, ఆధిపత్య యుద్ధం నడుస్తోంది. ఈ పరిణామాలు ఇరాన్ అంతర్గత భద్రతనే ప్రశ్నార్థకం చేస్తున్నాయనే వార్తలు హాట్ టాపిక్‌గా మారాయ్.

సీజ్ ఫైర్‌పై రాజకీయ తగాదా

యుద్ధ పరిణామాలు.. ప్రజల జీవితాలు, జీవనోపాధి, ఆర్థిక వ్యవస్థపై చూపే విధ్వంసకర ప్రభావాన్ని ప్రస్తావిస్తూ.. ప్రెసిడెంట్ మసూద్ యుద్ధ విరమణకు మొగ్గు చూపుతుండగా.. ఐఆర్‌జీసీ చీఫ్‌ మసూద్ మాత్రం ఆయనతో విభేదిస్తున్నారు. ఈ సమయంలో కాల్పుల విరమణ గనక జరగకపోతే, దేశ ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారుతాయని చెబుతున్నారు. మరో 3, 4 వారాల్లో ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని అధ్యక్షుడు మసూద్ హెచ్చరించారు. అలాగే, కార్యనిర్వాహక, నిర్వహణ అధికారాలు.. పరిపాలనా యంత్రాంగానికి తిరిగి అప్పగించాలని పెజిష్కియన్ చేస్తున్న డిమాండ్‌ని.. ఐఆర్‌జీసీ చీఫ్ అహ్మద్ తిరస్కరించారు. అంతేకాదు, యుద్ధ సంక్షోభం రాకముందు.. దేశంలో నిర్మాణాత్మక సంస్కరణలను అమలు చేయడంలో, పాలనా యంత్రాంగం విఫలం కావడాన్ని ఎత్తిచూపుతున్నారు.

గల్ఫ్ దేశాలపై దాడులపై అధ్యక్షుడి విమర్శలు

Advertisement

యుద్ధం వల్ల పెరుగుతున్న ఉద్రిక్తతలు, పొరుగున ఉన్న గల్ఫ్ దేశాలపై కొనసాగుతున్న దాడుల విషయంలో.. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ అనుసరిస్తున్న వైఖరిని.. ప్రెసిడెంట్ మసూద్ విమర్శిస్తున్నారు. ఈ పరిస్థితి వల్ల కలిగే ఆర్థిక పరిణామాల గురించి ఆయన హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యే.. కాల్పుల విరమణ జరగకపోతే, 3 వారాల నుంచి నెల రోజుల లోపు ఇరాన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయే ప్రమాదం ఉందని ఆయన నొక్కి చెప్పినట్లు తెలుస్తోంది. యుద్ధం మొదట్లోనే ఆయన అరబ్ దేశాలపై ఇరాన్ దాడులకు క్షమాపణలు చెప్పారు.

ప్రభుత్వ వైఫల్యమే కారణమా?

దాడులను ఆపాలని ఆదేశించారు. అయితే, ప్రెసిడెంట్ మసూద్ సందేశం విడుదలైన కాసేపటికే.. పొరుగు దేశాలపై ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ దాడులు కొనసాగాయి. అంతేకాదు, ఎగ్జిక్యూటివ్ పవర్, కార్యనిర్వాహక అధికారాలను.. తిరిగి ఇరాన్ ప్రభుత్వానికి అప్పగించాలని పెజెష్కియాన్ పిలుపునిచ్చారని, ఈ డిమాండ్‌ని ఐఆర్‌జీసీ చీఫ్ కమాండర్ అహ్మద్ వాహిది తిరస్కరించినట్లు ప్రచారం జరుగుతోంది. పైగా, ఇరాన్ ప్రభుత్వం నిర్మాణాత్మక సంస్కరణలను అమలు చేయడంలో విఫలం కావడం వల్లే.. ఈ పరిస్థితులు తలెత్తాయని ఐఆర్‌జీసీ కమాండర్ ఆరోపించినట్లు చెబుతున్నారు. ఈ మధ్యకాలంలోనే.. ఇరాన్ పాలక వ్యవస్థలో విభేదాలు తలెత్తిన సంకేతాలు కనిపిస్తున్నాయని ఇజ్రాయెల్ మీడియాలోనూ కథనాలు వచ్చాయ్.

సీజ్ ఫైర్‌పై విభేదాలు.. ప్రజలపై పడుతున్న ఆర్థిక భా

Advertisement

యుద్ధం ఐదో వారంలోకి ప్రవేశిస్తున్నకొద్దీ.. దాని తాలూకూ ఆర్థిక ప్రభావాలు మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయ్. ఇరాన్‌లోని ప్రధాన నగరాల్లో.. అనేక ఏటీఎంలలో క్యాష్ ఖాళీ అయింది.
ఏటీఎంలు పనిచేయడం మానేశాయ్. ఇదే సమయంలో, ప్రధాన బ్యాంకుల ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలకు కూడా అంతరాయం కలుగుతోంది. 3 నెలలుగా పెద్ద సంఖ్యలో ఉద్యోగులకు జీతాలు, ఇతర ప్రయోజనాలు క్రమం తప్పకుండా చెల్లించడం లేదని ప్రభుత్వ ఉద్యోగులు వాపోతున్నారు. యుద్ధం మొదలవడానికి ముందే.. నిత్యవసర వస్తువుల సగటు ద్రవ్యోల్బణం మూడు అంకెల స్థాయికి చేరింది. ఇది.. 105 నుంచి 115 శాతం ఉంటుందని అంచనా వేస్తున్నారు. యుద్ధం కొనసాగుతున్నకొద్దీ.. ఇరాన్‌లో ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తోంది. దాని ప్రభావం ఇంకొద్దిరోజుల్లో పూర్తి స్థాయిలో కనిపిస్తుందని ప్రెసిడెంట్ పెజెష్కియాన్ ఆందోళన చెందుతున్నారు. అయినప్పటికీ, కాల్పుల విరమణ విషయంలో వెనక్కి తగ్గేందుకు.. ఐఆర్‌జీసీ చీఫ్ సిద్ధంగా లేరు. ఈ విభేదాలు.. ఎక్కడికి దారితీస్తాయోనన్న ఆందోళన ఇరాన్ ప్రజల్లో కనిపిస్తోంది.

పశ్చిమాసియా టెన్షన్ క్లైమాక్స్‌లో

పశ్చిమాసియాలో తలెత్తిన ఉద్రిక్తతలు.. కీలక మలుపులో ఉన్నాయ్. నెల రోజుల యుద్ధం తర్వాత.. ప్రెసిడెంట్ ట్రంప్ చర్చలకు ప్రాధాన్యత ఇస్తుండటం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. అయితే, ఇరాన్ ప్రభుత్వంలో నెలకొన్న అంతర్గత విభేదాలు.. యుద్ధం ముగింపులో సవాల్‌గా మారింది. వేల కోట్ల డాలర్ల ఖర్చు, ఖర్చయిపోతున్న ఆయుధ నిల్వలు, ఎంతకూ లొంగని శత్రుదేశం.. యుద్ధంలో అమెరికాని అలసిపోయేలా చేశాయ్. ప్రెసిడెంట్ ట్రంప్ కూడా ఈ యుద్ధం నుంచి బయటపడాలని డిసైడ్ అయ్యారు. చర్చలకు సిద్ధమని బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. అయినప్పటికీ.. ఇరాన్ నుంచి స్పష్టమైన సమాధానం రాకపోవడానికి అక్కడ జరుగుతున్న అంతర్గత పోరే కారణమనే వాదన వినిపిస్తోంది. దేశం ఒకటే అయినా, గొంతులు మాత్రం రెండు వినిపిస్తున్నాయ్.

అమెరికాపై అవిశ్వాసం.. చర్చలకు ఐఆర్‌జీసీ నో

ఇరాన్ ప్రెసిడెంట్ మసూద్ పెజెష్కియాలన్.. యుద్ధం వల్ల తమ దేశం నష్టపోకూడదని, దేశ ఆర్థిక పరిస్థితిని ఎలాగోలో మెరుగుపరచాలని చూస్తున్నారు. అమెరికాతో చర్చలు జరిపి, యుద్ధాన్ని ఆపి, ఆంక్షలు తొలగించుకుంటే, దేశం గట్టెక్కుతుందనే ఆలోచనతో ఉన్నారు. అందువల్లే.. యుద్ధం కంటే దౌత్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. మరోవైపు, ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్.. అమెరికాని అస్సలు నమ్మట్లేదు. యుద్ధంలో పైచేయి సాధిస్తున్న సమయంలో చర్చలు జరపడమంటే.. అమెరికాకు లొంగిపోవడమేననే భావిస్తున్నారు. వీళ్ల చేతుల్లో ఆయుధాలు, మిసైల్ సిస్టమ్స్ ఉండటం వల్ల.. ప్రభుత్వ నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నారు.

యుద్ధం ఆగేందుకు కొన్న కీలక మార్పులు

ఈ గందరగోళ పరిస్థితుల్లో.. అమెరికా ముందు అతిపెద్ద ప్రశ్న కనిపిస్తోంది. యూఎస్ ఇప్పుడు ఎవరితో చర్చలు జరపాలి? అనేదే బిగ్ మెటీరియల్. ప్రెసిడెంట్ మసూద్ పెజెష్కియాన్‌తో మాట్లాడి ఒప్పందం చేసుకున్నా, ఐర్‌జీసీ దానిని ఉల్లంఘిస్తే, ఆ ఒప్పందానికి విలువ ఉండదు. అలాగనీ, ఆర్మీతో నేరుగా చర్చలు జరపడం దౌత్యపరంగా సాధ్యం కాదు. ప్రభుత్వంలోనే ఏకాభిప్రాయం లేనప్పుడు, చర్చలు విఫలమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయ్. అందువల్ల.. ఇరాన్ ప్రెసిడెంట్‌కు, ఆ దేశ ఆర్మీ మధ్య విభేదాలున్నంత కాలం యుద్ధ మేఘాలు తొలగిపోయే అవకాశమే లేదు. అందుకోసమే, యుద్ధం ఆగాలంటే కొన్ని కీలక మార్పులు జరగాలంటున్నారు.

ఇరాన్‌లో అధికార పోరుకు పరిష్కారం ఎక్కడ?

ముందుగా.. అధికార సమతుల్యతని నిర్ణయించాలని చెబుతున్నారు. సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ.. సైన్యాన్ని కట్టడి చేసి, దౌత్యానికి పూర్తి అధికారం ఇవ్వాలంటున్నారు. అమెరికా కేవలం మాటలతో కాకుండా, కొన్ని ఆంక్షలను సడలించడంతో.. ఇరాన్ ఆర్మీలో ఉన్న అనుమానాలని పోగొట్టాలి. నేరుగా మాట్లాడుకోవడం కుదరకపోతే, ఏదో ఒక దేశాన్ని వేదికగా మార్చుకొని చర్చలు జరపాలి. అమెరికా యుద్ధం ముగించాలని కోరుకుంటున్నా, ఇరాన్ అంతర్గతంగా రేకెత్తిన గొడవలను సర్దుబాటు చేసుకోలేకపోవడం శాంతికి అడ్డంకిగా మారింది. ప్రెసిడెంట్, ఆర్మీ కలిస్తే తప్ప.. పశ్చిమాసియాలో శాంతి సాధ్యం కాదంటున్నారు.

మసూద్ మాట ఎందుకు వినడం లేదు?

ఇరాన్‌లో ఎన్నికైన అధ్యక్షుడి కంటే, సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీకి అత్యున్నత అధికారాలు ఉంటాయ్. ఇరాన్‌లో ప్రెసిడెంట్ పరిపాలన చూస్తారు. కానీ, ఆయనకు పూర్తి పట్టు ఉండదు. అదే, ఐఆర్‌జీసీ విషయంలో పరిస్థితి మరోలా ఉంది. వీళ్లు శక్తివంతమైన ఆర్థిక, రాజకీయ సంస్థ. వీళ్లు నేరుగా సుప్రీంలీడర్‌కు మాత్రమే జవాబుదారీగా ఉంటారు. ఈ రెండు రకాల అధికార కేంద్రాల వల్లే.. ప్రస్తత అధ్యక్షుడు మసూద్ మాటని.. సైనిక కమాండర్లు పట్టించుకోవడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయ్.

ఇరాన్‌లో వ్యూహాత్మక విభేదాలు

ఏదేమైనా, యుద్ధం ఇలాగే కొనసాగితే.. దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని, సాధ్యమైనంత వరకు దౌత్యపరమైన చర్చలకు వెళ్లాలని ప్రెసిడెంట్ మసూద్ భావిస్తున్నారు. అదే, దేశ గౌరవం కోసం ఇజ్రాయెల్‌ని నేరుగా టార్గెట్ చేసి, బలమైన సైనిక చర్యలతో సమాధానం చెప్పాలని పట్టుబడుతున్నారు. ఇప్పటికే.. ఆయన పాశ్చాత్య దేశాలతో చర్చలు జరిపి, దేశంపై ఆంక్షలను తొలగించుకోవాలనుకుంటున్నారు. ఆంక్షలను తొలగించుకోవడం ద్వారా దేశ ఆర్థిక స్థితిని మెరుగుపరచాలని చూస్తున్నారు. కానీ, అమెరికాతో చర్చలు జరపడమనేది ఐఆర్‌జీసీకి అస్సలు పడదు. చర్చలు జరిగితే.. తమ ప్రాముఖ్యత తగ్గుతుందనే లెక్కల్లో ఉన్నారు.

నేతల మాట వినని సైన్యం? ఇరాన్‌లో విచిత్ర పరిస్థితి

కాల్పుల విరమణ చేయాలని ప్రెసిడెంట్ పెజెష్కియాన్ కోరుతుండగా, తమ అంతర్గత విషయాల్లో అధ్యక్షుడి జోక్యాన్ని సైనిక కమాండర్లు సహించడం లేదు. యుద్ధం సమయంలో దేశానికి చెందిన నేతలు ఓ మాట అంటే, సైన్యం దాన్ని తూ.చ తప్పకుండా పాటించాలి. కానీ, ఇరాన్‌లో సీన్లు చాలా డిఫరెంట్‌గా కనిపిస్తున్నాయ్. ప్రెసిడెంట్ మసూద్ శాంతి గురించి మాట్లాడుతుంటే, సైన్యం యుద్ధ విన్యాసాలు చేస్తోంది. ప్రభుత్వ యంత్రాంగం ఒకలా ఆలోచిస్తుంటే, సైనిక నిఘా సంస్థలు మరోలా ప్రదర్శిస్తున్నాయ్. అయితే, ఇరాన్ చరిత్రలో అధ్యక్షులు, ఐఆర్‌జీసీ మధ్య ఘర్షణలు కొత్తేమీ కాదు. గతంలోనూ ఇలాంటివి జరిగాయ్.

అంతర్గత విభేదాలే అసలు సవాలు

కానీ, ఇప్పుడు ఇజ్రాయెల్‌తో నేరుగా యుద్ధం వచ్చే సూచనలు ఉన్నందున, ఈ కోల్డ్ వార్ ఇరాన్‌ని బలహీనపరుస్తోంది. పశ్చిమాసియాలో ప్రస్తుతం జరుగుతున్నది.. ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ కాదు. దౌత్యం, మిలిటరిజం మధ్య జరుగుతున్న పోరాటం. సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ జోక్యం చేసుకొని.. ఈ విభేదాలను సర్దుబాటు చేయకపోతే, అమెరికా-ఇజ్రాయెల్ కంటే.. అంతర్గత కుమ్ములాటలు ఇరాన్‌కు ఎక్కువ నష్టం కలిగించే అవకాశం ఉంది. ఇరాన్‌లో సుప్రీం లీడర్‌ నిర్ణయమే ఫైనల్. ప్రెసిడెంట్, ఆర్మీకి మధ్య తలెత్తిన విభేదాల్లో.. సుప్రీం లీడర్ ఎవరి వైపు మొగ్గుతారనేది కూడా ఆసక్తిగా మారింది.

Also Read: అందరూ సారా అనుకుంటున్నారు కానీ.. ఇప్పపువ్వు అసలు కథ తెలిస్తే!

Story by: Anup, Big Tv

Related News

యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ వర్తింపు.. ఆ మూడు రోజుల్లోనే అకౌంట్లలోకి రూ. 13 వేలు!

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా ?

Big Stories

Advertisement
×