BigTV English

Vijay Political Party: తమిళ రాజకీయాల్లో రజినీ, కమల్ అలా.. మరి విజయ్? ఆ స్పేస్‌ను TVK భర్తీ చేయగలదా?

Vijay Political Party: తమిళ రాజకీయాల్లో రజినీ, కమల్ అలా.. మరి విజయ్? ఆ స్పేస్‌ను TVK భర్తీ చేయగలదా?

తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఒక స్పేస్ కనిపిస్తోంది. ప్రస్తుతం అక్కడ డీఎంకే, అన్నాడీఎంకే మాత్రమే ఉన్నాయి. జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకేలో అంతర్గత పోరు పెరిగి పరిస్థితి బలహీనంగా మారుతోంది. ఈ స్పేస్ ను విజయ్ పార్టీ TVK ఆక్రమిస్తుందా? తమిళ రాజకీయాల్లో, జనంలో చొచ్చుకుపోయే అవకాశాలు ఎంత ఉన్నాయి? ఓ రజినీకాంత్, ఓ కమల్ హాసన్, విజయ్ కాంత్ ఇలాంటి వారంతా తమిళ పాలిటిక్స్ లో అదృష్టం పరీక్షించుకునేందుకు వచ్చినా ముందుకు వెళ్లలేకపోయారు. మరి విజయ్ సక్సెస్ అవుతారా?


తమిళనాడు రాజకీయాల్లో స్పేస్ ఉన్న టైంలో విజయ్ కొత్త పార్టీ TVK స్పీడ్ పెంచింది. విల్లుపురం జిల్లా విక్రవాండిలో జరిగిన తొలి బహిరంగ సభ సూపర్ హిట్ అయింది. 3 లక్షలకు పైగా వచ్చిన అశేష జనవాహిని మధ్య తలపతి విజయ్ ప్రసంగం అందరినీ ఉర్రూతలూగించింది. ఏదో సినిమా ఫంక్షన్ మాదిరి కాకుండా పక్కా పొలిటికల్ సభ మాదిరి ఫుల్ ప్రాక్టికల్ గా వెళ్తున్నట్లుగా కనిపిస్తోంది. తమిళనాడులో డీఎంకేకు 75 ఏళ్ల చరిత్ర ఉండగా.. అన్నాడీఎంకేకు 50 ఏళ్ల హిస్టరీ ఉంది. తమిళనాడుకు ఇప్పుడు చరిత్ర కాదు.. భవిష్యత్ కావాలంటూ విజయ్ ముందుకొచ్చారు. తన స్పీచ్ లో సైన్స్ అండ్ టెక్నాలజీ మాత్రమే మారాల్సిన అవసరం ఉందా? అని ప్రశ్నిస్తూ.. రాజకీయాలు కూడా మారాలని పిలుపునివ్వడం వెనుక వ్యూహం పెద్దగానే ఉంది.

తమిళరాజకీయాల్లో అదృష్టం పరీక్షించుకుందామని చాలా మంది ప్రయత్నించారు. ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత దగ్గర్నుంచి ఇప్పుడు విజయ్ దాకా లిస్టు పెద్దగానే ఉంది. కానీ అక్కడ ముగ్గురు సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్న వాళ్లకే అధికారం చేతికొచ్చింది. మిగతా వారందరూ తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నారు. మంచి రోజు రాకపోతుందా అని ఎదురుచూస్తున్నారు. కానీ ఆ రోజు ఎప్పుడు వస్తుంది. శోధించి సాధించాలి అంటూ ఇప్పుడు విజయ్ స్పీడ్ పెంచుతున్నారు. నిజానికి విజయ్ కాంత్ పార్టీ DMDK ఇప్పటికే ఉంది. కానీ అధికారం చేజిక్కించుకునే స్థాయికి రాలేకపోయింది.


గతేడాది విజయ్ కాంత్ అనారోగ్యంతో కన్నుమూశారు. ఇక కమల్ హాసన్ పార్టీ కూడా పెద్దగా స్పీడ్ పెంచలేకపోతోంది. రజినీకాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై చాలా కసరత్తులు చేసి చివరికి అనారోగ్యకారణాలతో పొలిటికల్ ఎంట్రీ నుంచి తప్పుకున్నారు. సో ఇప్పుడు విజయ్ వంతు వచ్చింది. తన సినీ కెరీర్‌లో పీక్ స్టేజ్ ను వదిలి ప్రజలను నమ్మి రాజకీయాల్లోకి వచ్చానని విజయ్ అంటున్నారు. TVK ప్రాథమిక, లౌకిక, DMK వ్యతిరేక శక్తిగా ఆవిర్భవిస్తే తమిళ రాజకీయాల్లో కథ మారడం ఈజీనే అంటున్నారు. అన్నీ ఆలోచించే ఇక్కడికి వచ్చానని, వెనక్కి తగ్గే ప్రసక్తి లేదంటున్నారు విజయ్.

ద్రవిడ జాతీయవాదం, తమిళ జాతీయ వాదాన్ని వేరు చేయబోమని, తమిళనాడుకు అవి రెండు కళ్లులాంటివన్నారు. లౌకిక, సామాజిక న్యాయ సిద్థాంతాలే తమ భావజాలమంటున్నారు. అంతే కాదు పాలిటిక్స్ లో విజయం సాధించిన వారు, ఓడిన వారు ఇలా రెండు స్టోరీలనూ చదివే వచ్చానంటున్నారు. పనిలో పని ప్రత్యర్థులపై విమర్శించారు. ద్రవిడ, పెరియార్, అన్నా పేరుతో తమిళనాడును దోచుకుంటున్న కుటుంబ స్వార్థపూరిత వర్గాలు మన రాజకీయ శత్రువు అని విజయ్ చెప్పడం కీలకంగా మారింది.

సినిమా ఆర్టిస్ట్ అన్న విమర్శలకు MGR, NTR పేర్లు చెప్పి, వారి సక్సెస్ గురించి చెప్పి కౌంటర్ ఇచ్చారు. అభ్యుదయ సమాజంలో పుట్టి, అభ్యుదయానికి పాటుపడిన అంజలై అమ్మాళ్ మార్గదర్శి అని, ఆస్తులు పోగొట్టుకున్నప్పటికీ, అంజలై అమ్మాళ్ స్వాతంత్య్రం కోసం పోరాడారని గుర్తు చేసుకున్నారు. సర్వ జీవకోటికి అన్నదే పార్టీ సిద్ధాంతమని, మతం, కుట్రలతో తమిళనాడు ప్రజలను విడదీయకుండా ప్రజలందరి వ్యక్తిగత సామాజిక-ఆర్థిక రాజకీయ హక్కులను పరిరక్షించడం ద్వారా సమతుల్య సమాజాన్ని సృష్టించడమే పార్టీ ధ్యేయమంటున్నారు. దామాషా రిజర్వేషన్లే నిజమైన సామాజిక న్యాయం అని చెప్పడం ద్వారా రిజర్వేషన్ కోటాపై క్లారిటీ ఇచ్చేశారు. తమ విధానం నేతలను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం కాదని, అందుకోసం రాజకీయాల్లోకి రాలేదని స్పష్టత ఇచ్చారు. విధాన నిర్ణయాలపైనే పోరాటం అంటున్నారు.

రాజకీయాలంటే ఆవేశపూరితంగానే మాట్లాడాలన్న రూల్ లేదని, అందుకు భిన్నంగా కూడా మాట్లాడి అందరి మనసులో చోటు సంపాదించుకోవచ్చన్న ప్రయత్నం చేశారు విజయ్. విద్య, మహిళల భద్రత, సామాజిక న్యాయానికి ప్రాధాన్యమిచ్చే అజెండాతో పాటు విద్య, ఆరోగ్య సంరక్షణ , స్వచ్ఛత వంటి ప్రాథమిక వనరులను పొందేలా సంస్కరణలు తేవడం, మహిళలు, పిల్లలు, వృద్ధుల రక్షణ కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించడం వంటివి కీలకంగా మారాయి. అంతే కాదు 2026 ఎన్నికల్లో గెలుపు వరిస్తుందని, కలిసి వచ్చే మిత్రపక్షాలకు తమ తలుపులు తెరిచే ఉంటాయని చెప్పే ప్రయత్నం చేశారు.

Also Read: ఆ విషయంలో జగన్ ఒత్తిడి.. నో చెప్పిన బ్రదర్ అనిల్‌కుమార్

అయితే విజయ్ స్పీచ్ పై అన్ని పార్టీలు రియాక్ట్ అయ్యాయి. విజయ్ ప్రసంగం రెండున్నర గంటల సినిమా మాదిరి ఉందని తమిళనాడు బీజేపీ నాయకురాలు తమిళిసై సౌందరరాజన్ విమర్శించగా.. అన్నాడీఎంకే స్పేస్ కోసం విజయ్ ప్రయత్నించుకోవచ్చని డీఎంకే కౌంటర్ ఇచ్చింది. తమ మిత్రపక్షాలేవీ విజయ్ తో కలిసి వెళ్లబోవని అంటున్నారు. సో ఇక్కడ ఎవరి లెక్క వారిదే. ఎవరి రాజకీయం వారిదే. అంతిమ విజయం కోసమే ఈ పోరాటం. మరి విజయ్ పార్టీ మిగితా సినీ నటుల పార్టీల మాదిరిగా సైలెంట్ అవుతుందా.. లేదంటే ప్రభంజనం సృష్టిస్తుందా అన్నది తేలే సమయం కూడా ఎంతో దూరం లేదు.

Related News

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Nellore Politics: అనిల్ దెబ్బకు వేమిరెడ్డి వెనక్కి తగ్గాడా?

AP BJP: ఏపీలో బీజేపీకి అన్యాయం జరుగుతుందా?

AP Liquor Scam Case: జగన్‌ను ఇరికించిన చెవిరెడ్డి?

BIG Shock To Donald Trump: ట్రంప్‌కు మోదీ దెబ్బ.. అమెరికా పని ఖతమేనా

Big Stories

×