రెండు సార్లు మెదక్ ఎంపీ కొత్త.. ప్రస్తుతం దుబ్బాక ఎమ్మెల్యేగా గెలుపు
పాత పార్టీలోనే ఉంటారా.. కొత్త పార్టీ బాట పడతారా? దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. మెదక్ ఎంపీగా రెండు సార్లు గెలిచిన కేపీ.. గత ఎన్నికల్లో మాత్రం దుబ్బాక ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుత మెదక్ ఎంపీ రఘునందన రావుపై విజయం సాధించి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు.
బీఆర్ఎస్ అధినేతకు ఎంతో సన్నిహితుడిగా పేరున్న కొత్త
వ్యాపారవేత్త ప్రభాకర్ రెడ్డి గతంలో బీఆర్ఎస్ ఎంపీగా పనిచేయడంతో పాటు.. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కి అత్యంత సన్నిహితుడిగానూ పేరుంది. అయితే తనకు ఎమ్మెల్యే కావాలన్న కోరిక నెరవేరినా.. పార్టీ అధికారంలోకి రాక పోవడంతో తీవ్ర నిరాశకు లోనయ్యారట. అలాంటి కొత్త ప్రభాకర్ రెడ్డి.. గతంలో కాంగ్రెస్ తమ నియోజకవర్గంపై కక్ష కట్టిందన్న ఆరోపణలు గుప్పించారు. అభివృద్ధికి సహకరించడం లేదన్న కామెంట్లు చేసిన పరిస్థితులున్నాయి. ఇదంతా పక్కన పెడితే.. కొత్త ప్రభాకర్ రెడ్డి ఈ కొత్త సంవత్సరంలో కొత్త రూట్ ఫాలో అవుతున్నారట. ఉన్నట్టుండి సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపించారు. పైగా సొంత పార్టీపైనే విమర్శలు చేయడం కూడా చర్చనీయాంశమైంది.
BRS హయాంలోనూ దుబ్బాకకు నిధులు రాలేదన్న కొత్త ప్రభాకర్ రెడ్డి
దుబ్బాక నియోజకవర్గం మూడు ముక్కలుగా మారిందని.. ప్రభుత్వాలు మారినా దుబ్బాక రూపు రేఖలు మారలేదనీ అన్నారు ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి. తమ బీఆర్ఎస్ హయాంలోనూ దుబ్బాకకు సరైన నిధులు రాలేదని ఎమ్మెల్యే అనడంతో.. ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.
అసెంబ్లీ సమావేశాల అనంతరం సీఎంని కలసిన ఎమ్మెల్యే
అసెంబ్లీ సమావేశాలు అయిపోగానే సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరారు. కొత్త కోరిన వెంటనే నిధులు కేటాయించారు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో ఎమ్మెల్యే ముఖ్యమంత్రికి తన కృతజ్ఞతలు తెలిపారు. ఆ వెంటనే బీఆర్ఎస్ పై కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన కామెంట్లు ఇప్పుడు రచ్చ లేపుతున్నాయట. దుబ్బాక నియోజకవర్గానికి పార్టీలకతీతంగా.. పని చేయాలని, రాజకీయ కక్షలకు తావులేదనడంతో.. నియోజవకర్గంలో చర్చ మొదలైందట.
ప్రభాకర్ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, మాణిక్ రావు, మహిపాల్ రెడ్డీ సీఎంతో భేటీ
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకే.. ఉమ్మడి మెదక్ జిల్లాకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ ని కలిశారు. గతేడాది జనవరిలోనే దుబ్బాక, నర్సాపూర్, జహీరాబాద్, పటాన్ చెరు ఎమ్మెల్యేలైన.. ప్రభాకర్ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, మాణిక్ రావు, మహిపాల్ రెడ్డీ సీఎంతో భేటీ అయ్యారు. తమ నియోజకవర్గ సమస్యలపై తాము ముఖ్యమంత్రితో చర్చించామని చెప్పినా.. ఈ భేటీ రాజకీయ ప్రకంపనలు రేపింది. కేసీఆర్ సొంత జిల్లా ఎమ్మెల్యేలు ఇలా సీఎంని కలవడంపై ఊహాగానాలు వినిపించాయి. తర్వాత కొన్ని నెలలకు పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Also Read: 453.16 ఎకరాల భూముల విక్రయం.. బయటపడ్డ కేసీఆర్ బాగోతం
ప్రస్తుతం కొత్త.. సీఎంని పొగడ్డంపై ఎలాంటి ఉద్దేశముందో అన్న చర్చ
నిజానికి కొత్త ప్రభాకర్ రెడ్డి వివాద రహితుడన్న పేరుంది. వ్యాపారవేత్తగా ఉన్నా.. అన్ని పార్టీల నేతలతో ఆయనకు సత్సంబంధాలున్నాయి. అలాంటి ప్రభాకర్ రెడ్డి.. ఇప్పుడు ఒక్కసారిగా తానున్న పార్టీపై విమర్శలు చేయడం, అధికార పార్టీపై ప్రశంసలు కురిపించడంతో.. ఇటు బీఆర్ఎస్- అటు కాంగ్రెస్ లోనూ జోరుగా చర్చ సాగుతోందట. పార్టీ కి ఎంతో విధేయుడిగా ఉన్న ప్రభాకర్ రెడ్డి తన వ్యాఖ్యలపై ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలంటున్నారు. సీఎంని పొగడ్డం వెనక ఎలాంటి ఉద్దేశముందో చూడాలంటున్నారట. మరి రాబోయే రోజుల్లో కొత్త మనసు మారే అవకాశముందా? అన్న గుసగుసలు మొదలయ్యాయట.
ఇది దుబ్బాకపై ఉన్న బాధ్యతా లేక పార్టీ మారే ఉద్దేశమా?
కొత్త ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ పై ప్రశంసల వర్షం వ్యవహారం.. కేవలం నియోజకవర్గ అభివృద్ధి పై గల బాధ్యతా.. లేక, పార్టీ మారే ఆలోచన కొద్దీ ఇలా అన్నారా? అన్న చర్చ గులాబీ వర్గాల్లో ఒకింత జోరుగానే సాగుతోందట. మరి కొత్త ప్రభాకర్ పాత పార్టీలోనే ఉంటారా? లేక కొత్త కొత్తగా ఉన్నదీ అంటూ కొత్త పార్టీ బాట పడతారా? తేలాల్సి ఉందంటున్నారు.