HCU Land Issue: అభివృద్ధి అవసరాలకు ప్రభుత్వ భూముల్ని అమ్మడం దీర్ఘకాలంగా కొనసాగుతున్న ప్రక్రియ. మారుతున్న ఆర్థిక పరిస్థితుల్లో ఆదాయ వనరుల కోసం అమ్మడం కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఓ విధానం. ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడులను ఉపసంహరించుకోవడం మొదలు డిఫెన్స్, రైల్వే తదితర శాఖలకు చెందిన భూముల్ని అమ్మడం, లీజుకు ఇవ్వడం కేంద్ర ప్రభుత్వానికి రెగ్యులర్ ప్రాక్టీస్‌గా మారింది. ఆ తరహాలోనే ఉమ్మడి రాష్ట్రంతో పాటు తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ప్రభుత్వ భూముల్ని అమ్మే ఆనవాయితీ మొదలైంది. గడచిన తొమ్మిదిన్నరేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం వివిధ కార్పొరేషన్లు, బోర్డులు, అథారిటీల ద్వారా 453.16 ఎకరాల భూముల విక్రయం జరిగినట్లు గణాంకాల ద్వారా తేలింది. దీంతో ప్రభుత్వానికి సుమారు రూ.31 వేల రూ.4 కోట్ల మేర ఆదాయం వచ్చింది.
హెచ్ఎండీఏ ద్వారా జరిగిన అమ్మకాల్లో కోకాపేట్‌లో ఒక్కో ఎకరం వంద కోట్ల రూపాయల చొప్పున గరిష్ట ధర పలికినట్లు గత ప్రభుత్వం గొప్పగా చెప్పుకున్నది. రాష్ట్రంలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయని, మూడెకరాల సాగుభూమి ఉన్న రైతులు కోటీశ్వరులంటూ అప్పటి సీఎం కేసీఆర్ గర్వంగా ప్రకటించారు. ప్రభుత్వ భూముల్ని తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, హెచ్ఎండీఏ ద్వారా విక్రయం చేయడంతో పాటు రాజీవ్ స్వగృహ ఫ్లాట్లు, ప్లాట్లు కూడా వివిధ దశల్లో నిర్మాణంలో ఉండగానే అమ్ముడుపోయాయి. వీటి ద్వారా సమకూరిన ఆదాయాన్ని కూడా కలిపితే మరింత పెరుగుతుంది. నగరానికి చుట్టూ ఉన్న వివిధ ప్రాంతాల్లో విడతలవారీగా ఈ భూముల విక్రయాలు 2015-23 మధ్య కాలంలో జోరుగా సాగాయి. కరోనా సమయంలోనూ రియల్ ఎస్టేట్ రంగం అద్భుతంగా ఉన్నదని బీఆర్‌ఎస్ ప్రభుత్వం గొప్పగా చెప్పుకున్నది.
ఇప్పుడు రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వం కూడా ఆర్థిక అవసరాలకు ప్రభుత్వ భూముల్ని అమ్మే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. అందులో భాగమే కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని మాస్టర్ ప్లాన్ లే ఔట్ చేసి దశలవారీగా విక్రయించేందుకు టెండర్లను ఆహ్వానించింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి చెందిన భూమి కూడా ఇందులో ఉన్నదని, ప్రభుత్వమే దాన్ని అక్రమించుకుని అమ్మేస్తున్నదని, జీవ వైవిధ్యం ఉన్నా ప్రకృతిని పరిరక్షించాల్సిన బాధ్యతను విస్మరించి రియల్ ఎస్టేట్ వ్యాపారి తరహాలో వ్యవహరిస్తున్నదని బీజేపీ, బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. ఆ రెండు పార్టీల నేతలు గతంలో చేసింది, ఇప్పుడు చేస్తున్నదీ అదే పని అయినా రాజకీయం కోసం ఇప్పుడు ప్రభుత్వం మీద విరుచుకుపడుతున్నాయని కాంగ్రెస్ నేతల నుంచి ప్రతివిమర్శలు వస్తున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో గడచిన తొమ్మిదిన్నరేండ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని భూములు అమ్మింది, వాటి ద్వారా ఎంత ఆదాయాన్ని సమకూర్చుకున్నది.. సేకరించింది. కొన్ని చోట్ల చదరపు గజాల రూపంలో అమ్మితే మరికొన్ని చోట్ల ఎకరాలవారీగా విక్రయించింది. ఒక్కో ప్రాంతంలో ఉన్న మార్కెట్ ధరకు అనుగుణంగా ఖజానాకు నిధులు సమకూరాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2017 వరకు మూడేండ్ల పాటు హెచ్ఎండీఏ భూముల విక్రయానికి దూరంగానే ఉన్నది. అప్పటివరకూ టీజీఐఐసీ ద్వారానే కొన్ని విక్రయాలు జరిగాయి. 2017 తర్వాత నుంచి హెచ్ఎండీఏ ల్యాండ్ సేల్స్ మీద దృష్టి పెంచింది. ప్రభుత్వ భూముల్ని అమ్మే వ్యాపారిలా కాంగ్రెస్ ప్రభుత్వం మారిందంటూ విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటిదాకా బీఆర్ఎస్ అమ్మిన భూముల వివరాలు ఇప్పుడు బయటికి వచ్చాయి.
Also Read: నిత్యం జనాల్లో ఉండండి.. ఆ తేడా జనాలకు తెలిసింది.. కేసీఆర్ కామెంట్స్
మొత్తం 13 వాయిదాల్లో 338.62 ఎకరాల భూ విక్రయాల ద్వారా ప్రభుత్వానికి మొత్తం 11 వేల 875 కోట్ల మేర ఆదాయం సమకూరింది. ఇది కాక తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ద్వారా జరిగిన 114.54 ఎకరాల భూవిక్రయాలతో రూ.19 వేల రూ.129 కోట్ల మేర సమకూరింది. మొత్తం 485.82 ఎకరాలను విక్రయించాలని ప్రణాళిక రూపొందించుకున్నా అందులో నాల్గోవంతు మాత్రమే సాకారమైంది.
మొత్తంగా 13 ఇన్‌స్టాల్‌మెంట్లలో మొత్తం 485.82 ఎకరాల భూమిని విక్రయించాలనుకున్నా 114.54 ఎకరాలు అమ్ముడుపోవడంతో ప్రభుత్వానికి రూ.19,129 కోట్ల మేర ఆదాయం సమకూరింది. ఈ రెండు ఫేజ్‌లలో మొత్తం 453.16 ఎకరాల భూమిని విక్రయించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ అమ్మకాల ద్వారా ఖజానాకు రూ.31 వేల రూ. 4 కోట్ల మేర ఆదాయం వచ్చింది.