Israel Attacks Iran: మిడిల్ ఈస్ట్ మరోసారి భగ్గుమంది. ఇరాన్ కోలుకోలేని విధంగా దాడులు చేస్తోంది ఇజ్రాయెల్. అటాక్స్ చేస్తామని చెప్పి మరీ చేసిన దాడుల్లో ఇరాన్ తీవ్రంగా నష్టపోయింది. ఇరాన్ అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ చేస్తున్న తీవ్రమైన దాడుల్లో టాప్ కమాండర్లు, ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలు మరణించారు.
ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఇరాన్ మిలటరీ చీఫ్ మహమ్మద్ బాఘేరి మృతి చెందారు. ఐఆర్‌జీసీ చీఫ్ హొస్సేన్ సలోమితోపాటు మరికొందరు సీనియర్ అధికారులు ప్రాణాలు కోల్పోయారు. పలువురు అణు శాస్త్రవేత్తలు సైతం మరణించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్‌లోని నతాంజ్ అణుశుద్ధి కేంద్రం ధ్వంసమైంది. ఇదే అంశాన్ని IAEA చీఫ్ గ్రోసీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. రేడియేషన్ లీకేజీ ఏమైనా ఉందా అన్న కోణంలో పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.
ఇప్పటికే.. ఓవైపు మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు చల్లారకపోగా.. రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే మరోసారి ఇరాన్‌పై తీవ్రస్థాయిలో దాడులకు దిగింది ఇజ్రాయెల్. అత్యవసర పరిస్థితి ప్రకటించి మరీ అటాక్స్‌కు దిగింది టెహరాన్. వందల సంఖ్యలో క్షిపణులను ఇరాన్‌పై ప్రయోగించింది. దీంతో.. ఇరాన్ అప్రమత్తమయ్యేలోగానే జరగాల్సిన నష్టం జరిగింది. ఇప్పటికే ఇరాన్‌పై ఏ క్షణమైనా దాడులు జరగవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఇలా అనౌన్స్ చేసి కొన్నిగంటలు గడవకముందే.. అటాక్స్ జరిగాయి.
అసలే టెక్నాలజీకి, యుద్ధ నైపుణ్యాలకు ఇజ్రాయెల్ పెట్టింది పేరు. పైగా తమను కవ్విస్తే దాడులు తప్పవని ఇజ్రాయెల్ ఇప్పటికే ప్రకటించింది. పైగా ఇటీవలె అమెరికాతో ఇరాన్ పలు ఒప్పందాలు చేసుకుంది. వీటిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు. ఇలాంటి సమయంలోనే ఇరాన్ అణు సంబంధ కార్యక్రమాలకు వ్యతిరేకంగా తీర్మానం చేసింది IAEA. అణు సంబంధమైన కార్యక్రమాల విషయంలో నిబంధనలను ఇరాన్ అతిక్రమిస్తోందని వియన్నాలో జరిగిన ఐఏఈఏ ఏజెన్సీ బోర్డు సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ప్రపంచం మరో యుద్ధాన్ని ఎదుర్కోంటోంది. ఇప్పటికే రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్థాలు కొనసాగుతుండగా.. ప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్ మొదలవ్వడం మిడిల్ ఈస్ట్‌ను మరింత భయంకంరంగా మార్చబోతోందన్న భయాలు మొదలయ్యాయి.
ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఉన్న తమ సైనికులను, ఇతర సిబ్బందిని తగ్గించుకోవాలని నిర్ణయించింది. ఇరాక్, బహ్రెయిన్, కువైట్ సహా పలు దేశాల్లో ఉన్న యూఎస్ సైనికులు, సిబ్బందిని వెనక్కి రప్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది.
Also Read: బరువు తక్కువ ఇంధన వినియోగం ఎక్కువ.. ఇంతటి ఘోరానికి కారణం ఇదేనా.!
ఇక, ఇజ్రాయెల్ దాడులపై తీవ్ర ఆగ్రహంతో ఉంది ఇరాన్. అదను చూసి ప్రతిదాడి చేయాలని ఇప్పటికే ఇరాన్ సైన్యం వ్యూహాలు రచిస్తోంది. ఇదే సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును ఉద్దేశిస్తూ పోస్టులు పెడుతోంది. యుద్ధానికి ఆహ్వానించేవాడు నిరంకుశుడని, ఆ నిరంకుశుడి ఎప్పుడూ ఓడిపోతాడని ట్వీట్లలో రాసుకొచ్చింది.
మరోవైపు.. ఇరాన్‌పై ఏ క్షణమైనా దాడులు జరిగే అవకాశం ఉందంటూ హెచ్చరించింది అగ్రరాజ్యం అమెరికా. ఈ హెచ్చరికలు చేసి కొన్ని గంటలు గడిచాయో లేదో క్షిపణులతో ఇరాన్‌పై విరుచుకుపడింది ఇజ్రాయెల్. దీంతో.. ఇరాన్‌కు భారీ నష్టం వాటిల్లింది.