ISRO New Mission: కొత్త ఏడాది ప్రారంభంలోనే భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ-ఇస్రో, సరికొత్త చరిత్రను సృష్టించనుంది. తన 100వ రాకెట్ ప్రయోగంతో మరో అద్భుతమైన విజయాన్ని సెలబ్రేట్ చేసుకోడానికి సిద్ధంగా ఉంది. జనవరి 29న ఈ మైలురాయి చేరుకోనుంది ఇస్రో. గగనంలో ఇస్రో విజయాల పరంపర ఇటీవల కాలంలో ప్రపంచ దేశాలను నివ్వెరపోయేలా చేస్తున్న తరుణంలో.. ఈ వందో ప్రయోగం ఇస్రో సామర్థ్యానికి ప్రతీకగా నిలుస్తుంది. ఆరు దశాబ్దాలు దాటిని ఇస్రో ప్రయాణంలో.. ఈ సెంచరీ స్టెప్.. భారత వ్యోమోగామిని చంద్రుడిపైకి పంపడానికి ముందు కీలక ప్రయోగంగా మారనుంది. ఇంతకీ, ఇస్రో వందో ప్రయోగం విశేషాలేంటీ..? ఇంత వరకూ ఇస్రో చూసిన ఎత్తుపల్లాలేంటీ..?
చంద్రయాన్-3తో అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ అగ్ర స్థానం
ఇది దశాబ్ధాల కల.. భారత సంతతికి చెందిన వ్యక్తి అంతరిక్షాన్ని తాకారనే ఆనందం అయితే ఉంది కానీ.. భారతదేశం సొంత వ్యోమోగామిని అంతరిక్షంలోకి పంపడం అనేది అద్భుతమైన అనుభూతి. ఇటీవల స్పేడాక్ సక్సెస్ తర్వాత గగన్‌యాన్ పేరుతో స్పేస్ సెంటర్‌కి మనిషిని పంపే ప్రయోగంపై మరింత ఆసక్తి పెరిగింది. అయితే, గత కొన్నేళ్లుగా వేసిన ప్రతి అడుగులోనూ సక్సెస్ సాధించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్ధ-ఇస్రో ఇప్పుడు తన వందో ప్రయోగానికి సిద్ధమయ్యింది.
తాజాగా చేపట్టిన 99వ ప్రయోగం స్పైస్ డాకింగ్ మిషన్
ఇప్పటికే, చంద్రయాన్ 3తో ప్రపంచ అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ అగ్ర స్థానంలో నిలిచింది. అలాగే, సూర్యయాన్‌లో భాగంగా ఆదిత్య మిషన్ వంటి విజయాలతో అంతర్జాతీయంగా ఇస్రో పేరు మార్మోగింది. మంగళ్యాన్‌తో మార్స్ పరిశోధనల్లోనూ కీలక అడుగులు వేసింది. తాజాగా చేపట్టిన 99వ ప్రయోగం.. స్పైస్ డాకింగ్ మిషన్‌తో విజయాన్ని నమోదు చేసి, అగ్రదేశాల సరసన సగర్వంగా చోటు సంపాదించింది. ఈ క్రమంలోనే వందో మిషన్‌తో ఇస్రో సరికొతత్త మైలురాయిని చేరుకోనుంది.
జనవరి 29న షార్ నుండి 100వ ఉపగ్రహా ప్రయోగం
స్పేస్ మిషన్లలో భారత్ గేమ్ ఛేంజర్‌గా మారిందనడానికి ఇటీవల ప్రయోగాలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలోనే, శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి వందో ప్రయోగానికి సర్వం సిద్ధం చేసింది. జనవరి 29న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి 100వ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నట్లు ఇస్రో ఇటీవల ప్రకటించింది. స్వదేశీ క్రయోజెనిక్ స్టేజ్‌తో కూడిన GSLV-F15 రాకెట్‌తో NVS-02 మిషన్‌తో ఉపగ్రహాన్ని నింగిలోకి ప్రవేశపెట్టడం ఇస్రో చరిత్రలో కీలకంగా నిలవనుంది. NVS-02 ఉపగ్రహాన్ని జియోసింక్రోనస్ కక్ష్యలోకి పంపేందుకు ఇస్రో సైంటిస్ట్‌లు ఈ ప్రయోగాన్ని నిర్వహిస్తున్నారు. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లోని సెకండ్ లాంచ్ ప్యాడ్ నుంచి ఈ ప్రయోగం జరగనుంది.
2025 జనవరి 29వ తారీఖున ఉదయం 6.23 గంటలకు
2025 జనవరి 29వ తారీఖున ఉదయం 6 గంటల 23 నిమిషాలకు GSLV-F15 రాకెట్ ద్వారా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన NVS-02 ఉపగ్రహాన్ని ప్రయోగిస్తారు. 36 వేల 577 కిలోమీటర్ల దూరం ఎత్తున ఉన్న జియో స్టేషనరీ కక్ష లోకి దీన్ని పంపుతున్నారు. ఇక, GSLV రాకెట్ ప్రయోగ జాబితాలో ఇది 17వ ప్రయోగం కాగా… స్వదేశీ క్రయో స్టేజ్‌లో ఇది 11వ స్పేస్ ఫ్లైట్. ఈ ఉపగ్రహం దేశంలోని విమానయాన, నౌకాయాన మార్గాలకు, సైనిక అవసరాలకు కీలకమైన సమాచారాన్ని అందిస్తుంది.
భారత్‌తో పాటు 1500 కి.మీ. పరిధిలో ఉన్న ప్రాంతాలకు..
ఇస్రో తెలిపిన వివరాల ప్రకారం.. ఇండియన్ కన్స్‌టెలేషన్‌తో నావిగేషన్-Nav IC అనేది భారత స్వతంత్ర ప్రాంతీయ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ. అమెరికన్ GPS లాగా పనిచేస్తుంది. ఇది భారతదేశంతో పాటు 1,500 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రాంతాలకు ఖచ్చితమైన స్థానం, వేగం, సమయ సమాచారాన్ని అందిస్తుంది. అంయితే ఇందులో రెండు రకాల సేవలు ఉంటాయి. 20 మీటర్ల కంటే తక్కువ స్థాన ఖచ్చితత్వాన్ని, 40 నానోసెకండ్ల కంటే మెరుగైన సమయ ఖచ్చితత్వాన్ని అందించే స్టాండర్డ్ పొజిషనింగ్ సర్వీస్-SPS..
NVS-02 ఉపగ్రహం 2వ తరం NavIC వ్యవస్థలో భాగం
అలాగే ప్రత్యేక నావిగేషన్ సామర్థ్యాల కోసం రూపొందించబడిన రిస్ట్రిక్టెడ్ సర్వీస్-RS.. ఇది రక్షణ, వైమానికి, ప్రభుత్వ రంగాలకు మాత్రమే అందించే అత్యంత భద్రతతో కూడిన సేవలను అందిస్తుంది. ఇస్రో ప్రకారం NVS-02 ఉపగ్రహం రెండవ తరం NavIC వ్యవస్థలో భాగం. దీని బరువు 2,250 కిలోలు, 3 కిలో వాట్స్ వరకు శక్తిని తట్టుకోగలదు. ఇందులో L1, L5, S బ్యాండ్‌లలోని నావిగేషన్ పేలోడ్‌లు, C-బ్యాండ్‌లోని రేంజింగ్ పేలోడ్ ఉన్నాయి. ఇది IRNSS-1E ఉపగ్రహాన్ని భర్తీ చేస్తుంది. ఇక, ఈ మిషన్ తర్వాత నావిక్ వ్యవస్థలోని మిగిలిన ఉపగ్రహాలను కూడా ప్రయోగించాలని ఇస్రో ప్లాన్ చేస్తోంది.
ట్రాన్స్‌పోర్టేషన్, నావికా వ్యవస్థల్లో కీలకం
NVS-02 ప్రయోగం ద్వారా NavIC వ్యవస్థ మరింత పరిపుష్టమవడంతో పాటు భారతదేశానికి స్వంత నావిగేషన్ వ్యవస్థను మరింత బలపేతం చేస్తుంది. ఇది భద్రతా రంగం నుంచి సాధారణ వినియోగదారుల వరకు అనేక ఉపయోగాలను అందించనుంది. ట్రాన్స్‌పోర్టేషన్, నావికా వ్యవస్థల్లో కీలకంగా వ్యవహరిస్తుంది. అలాగే, ఖచ్చితమైన భౌగోళిక సమాచారంతో సుస్థిర వ్యవసాయ పద్ధతులకు ఉపయోగపడుతుంది. ఇక, అత్యవసర పరిస్థితుల్లో స్థానికీకరణ మరింత మెరుగుపడుతుంది. వాణిజ్య రవాణా వ్యవస్థలకు అధునాతన ట్రాకింగ్‌లో వినియోగించవచ్చు.
మొబైల్ యూజర్లకు మరింత ఖచ్చితమైన నావిగేషన్ సేవలు
ఇక, భారతదేశంలోని మొబైల్ యూజర్లకు మరింత ఖచ్చితమైన నావిగేషన్ సేవలు అందించడానికి ఇది కీలకంగా పనిచేస్తుంది. అయితే, 2023 మే 29న GSLV-F12 రాకెట్‌లో.. 2 వేల 232 కిలోల బరువున్న NVS-01 ఉపగ్రహాన్ని జియోసింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్‌లోకి విజయవంతంగా ప్రయోగించింది ఇస్రో. ఈ ఉపగ్రహం స్వదేశీ అటామిక్ క్లాక్‌ను కూడా కలిగి ఉంది. అలాగే, మరింత సర్వీస్ కవరేజ్ కోసం L1 బ్యాండ్ సిగ్నళ్లతో పాటు భారత నావిగేషన్, ఇండియన్ కాన్స్టిలేషన్ సామర్థ్యాలను కూడా మెరుగుపరచడానికి రూపొందించబడింది. అయితే, ఇప్పుడు ప్రయోగించబోయే 100వ ఉపగ్రహం GSLV NVS-02 భారత అంతరిక్ష పరిశోధనలో మరింత ఇన్‌పుట్‌ను ఇవ్వనుంది.
2040 నాటికి చంద్రునిపైకి వ్యోమగామిని పంపడం
పూర్తి స్వదేశీ పరిజ్ణానంతో ఉపగ్రహ వాహక నౌకల ప్రయోగంలో శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం అనేక చారిత్రక విజయాలకు సాక్ష్యంగా నిలిచింది. ఇందులో చంద్రయాన్ ప్రయోగం కీలకమైనది. ఇక, శ్రీహరి కోట నుండి చంద్రుడిపైకి మనిషిని పంపే ప్రయోగంలో భాగంగా తలపెట్టిన ఇటీవలి మిషన్లు భారత్ ప్రఖ్యాతిని మరింత పెంచాయి. ఈ మిషన్లతో.. భవిష్యత్తులో అంతరిక్షంలో భారత్ స్పేస్ సెంటర్ నిర్మాణానికి సంబంధించిన ఇన్‌పుట్‌లు కూడా అందుతున్నాయి. ఈ క్రమంలోనే.. 2040 నాటికి చంద్రునిపైకి వ్యోమగామిని పంపాలని, 2035 నాటికి అంతరిక్షంలో స్పేస్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలనే ప్రణాళికలతో భారతదేశం తన అంతరిక్ష కార్యక్రమానికి ప్రతిష్టాత్మకమైన లక్ష్యాలను నిర్దేశించింది.
వ్యోమగాములను 400 కి.మీ దూరంలోని కక్ష్యలో ప్రవేశపెట్టే ప్లాన్
ఈ క్రమంలోనే ముగ్గురు వ్యోమగాములను 400 కి.మీ దూరంలోని కక్ష్యలోకి ప్రవేశపెట్టే ప్లాన్ కూడా ఉంది. వీరిని, మూడు రోజుల పరిశోధనల తర్వాత, సురక్షితంగా భూమి మీదకు తీసుకొస్తారు. అయితే, ఈ ప్రయోగాలన్నింటికీ తాజాగా ప్రయోగించిన స్పేడెక్స్ మిషన్ కీలక సాంకేతికతను అందించింది. 2024 డిసెంబర్ 30న ప్రయోగించిన పీఎస్ఎల్వీ సి-60 రాకెట్ ప్రయోగం ద్వారా 99 రాకెట్ ప్రయోగాలు పూర్తి చేసుకున్న ఇస్రో.. జనవరి 29వ తారీఖున 100వ రాకెట్ ప్రయోగానికి రెడీ అయ్యింది.
1960–1970 మధ్య కేరళలోని తుంబ రాకెట్ కేంద్రం నుంచి ప్రయోగాలు
భారత్ అంతరిక్ష ప్రయోగాల కోసం తొలుత అమెరికా, రష్యా దేశాలపై ఆధారపడి అక్కడ తయారుచేసిన ఉపగ్రహాలను 1960–1970 మధ్య కర్ణాటకలోని తుంబ రాకెట్ కేంద్రం నుంచి ప్రయోగించేవారు. ఆ తర్వాత 1979లో శ్రీహరికోటలో ఇస్రో ఆధ్వర్యంలో ప్రయోగాలను మొదలుపెట్టిన తొలి ప్రయోగం విజయవంతం కాలేదు. శాటిలైట్ లాంచ్ వెహికల్-SLV… ఆగస్ట్ 10, 1979న శ్రీహరికోట నుండి లిఫ్ట్‌ఆఫ్ అయిన మొట్టమొదటి పెద్ద రాకెట్. కాగా, దాదాపు 46 సంవత్సరాల తర్వాత అంతరిక్ష శాఖ సెంచరీ కొట్టేందుకు సిద్ధంగా ఉంది. ఈ ప్రయాణంలో ఒక్కో అడుగు విజయం సాధిస్తూ నేడు ప్రపంచ అగ్రదేశాలు కూడా ఆశ్చర్యపోయేలా కీలక ప్రయోగాలను చేపడుతోంది.
చంద్రుని దక్షిణ ధ్రువాన్ని తాకిన మొదటి దేశంగా భారత్
ఇస్రో చేస్తున్న అద్భుతాల గురించి మనందరికీ తెలుసు. చంద్రయాన్ 3 విజయం తర్వాత ప్రపంచమంతా ఇస్రో సామర్థ్యాన్ని కొనియాడింది. 2024 ప్రారంభంలో.. చంద్రయాన్ 3 మిషన్‌తో చంద్రుని దక్షిణ ధ్రువం దగ్గర సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన మొట్టమొదటి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. రోవర్ ప్రగ్యాన్‌ను మోసుకెళ్లే విక్రమ్ ల్యాండర్ చంద్రుని ఉపరితలాన్ని విజయవంతంగా తాకి, ఇస్రో సాంకేతిక సామర్థ్యాలను ఇనుమడింపజేసింది. ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోయేలా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితాలను సాధించి ఔరా అనిపించింది.
భారత్ మొట్టమొదటి అంతరిక్ష ఆధారిత సౌర మిషన్ ఆదిత్య L1
ఆ తర్వాత, భారతదేశపు మొట్టమొదటి అంతరిక్ష ఆధారిత సౌర మిషన్ ఆదిత్య L1ని ప్రయోగించింది. భూమికి దాదాపు 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ మిషన్, అంతరిక్ష ఆధారిత అబ్జర్వేటరీ-క్లాస్ సోలార్ మిషన్‌లలో భారతదేశ ప్రవేశాన్ని ఘనంగా సూచించింది. ఇలా, ఇప్పటికే, అనేక దేశాలు, ప్రైవేట్ సంస్థలు అంతరిక్ష మిషన్‌ల కోసం ఇస్రోను సంప్రదించే స్థాయికి ఎదిగింది. అయితే, ఈ దశకు చేరుకోవడానికి ఇస్రో సుదీర్ఘ ప్రయాణం చేసింది. వచ్చిన ప్రతి వైఫల్యాన్నీ పాఠంగా నేర్చుకొని, ఇప్పుడు ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా మారింది.
బెంగుళూరు కేంద్రంగా ఏర్పాటైన ఇస్రో
భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ-ఇస్రో.. అంతరిక్ష పరిశోధనల కోసం భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థ. ఈ సంస్థ దేశాభివృద్ధి లక్ష్యంగా అంతరిక్ష విజ్ఞానాన్ని అభివృద్ధి చేసే ఉద్దేశంతో ఏర్పాటై… ప్రస్తుతం ప్రపంచంలోని అగ్రగామి అంతరిక్ష రంగ సంస్థల్లో ఒకటిగా నిలబడింది. బెంగుళూరు కేంద్రంగా ఏర్పాటైన ఇస్రోకు, దేశంలోని వివిధ ప్రదేశాల్లో పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు ఉన్నాయి.
హోమీ భాభా పర్యవేక్షణ కింద 1962లో INCOSPAR
1947లో స్వాతంత్ర్యం వచ్చినపుడు భౌగోళికంగా చాలా పెద్దదయిన భారతదేశానికి రక్షణ అవసరాలు, అభివృద్ధికి.. అంతరిక్ష పరిజ్ఞానం అవసరాన్ని గ్రహించి, భారత ప్రభుత్వం అంతరిక్ష పరిశోధనా వ్యవస్థ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు మొదలుపెట్టింది. ఈ క్రమంలో.. 1957లో రష్యా మొట్టమొదటి శాటిలైట్ అయిన స్పుత్నిక్‌ను ప్రయోగించినపుడు.. శాటిలైట్ ఆవశ్యకతను, అప్పటి భారత ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూకు వివరించింది. కాగా1962లో, భారత అణుశక్తి వ్యవస్థ పితామహుడయిన హోమీ భాభా పర్యవేక్షణలో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్‌ను ఏర్పాటు చేశారు.
కేరళలో తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్
అయితే, మొదటి నుండీ ఉపగ్రహాల నిర్మాణాన్నే దృష్టిలో పెట్టుకొని, దానికి అవసరమైన భూ ఉపరితల లక్షణాలను అధ్యయనం చేయడానికి, కేరళలో త్రివేండ్రం వద్ద తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ నెలకొల్పాలరు. అమెరికా, రష్యాల నుండి దిగుమతి చేసుకున్న రాకెట్లను ప్రయోగిస్తూ భూఉపరితలాన్ని అధ్యయం చేయడం మొదలు పెట్టారు. తక్కువ కాలంలోనే భారత్, స్వదేశీయంగా పూర్తి స్థాయి రాకెట్లను తయారు చేసి, ఉపరితల అధ్యయంలో పురోగతి సాధించింది.
1972లో ప్రత్యేక అంతరిక్ష విభాగం ఏర్పాటు
అయితే భవిష్యత్తులో ఉపగ్రహానికి అవసరమయిన అన్ని పరికరాలను ఇతర దేశాలు అందించక పోవచ్చని గ్రహించిన విక్రం సారాభాయ్.. ఉపగ్రహానికి అవసరమయిన అన్ని విడిభాగాలనూ దేశీయంగానే తయారు చేసే దిశగా పనిచేయడం ప్రారంభించారు. కాగా, 1969లో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్-ఇన్‌కోస్పార్.. ఇస్రోగా మారింది. 1972లో ప్రత్యేక అంతరిక్ష విభాగం ఏర్పడింది. 1972లో ప్రత్యేక అంతరిక్ష విభాగం ఏర్పాటయ్యింది. అయితే, కేవలం ఉపగ్రహాలను తయారు చేయడమే కాకుండా వాటిని ప్రయోగించే సామర్థ్యాన్ని కూడా పొందాలని గుర్తించిన సారాభాయ్, శాటిలైట్ స్పేస్‌షిప్ రూపకల్పన మొదలు పెట్టారు.
ఇస్రో తయారుచేసిన మొదటి స్పేస్‌షిప్ SLV
ఇస్రో తయారుచేసిన మొదటి స్పేస్‌షిప్ ‘సెటిలైట్ లాంచ్ వెహికిల్-SLV’. 1979 నాటికి శ్రీహరికోట నుండి ప్రయోగించిన SLV, రెండవ దశలో ఎదురయిన సమస్య వల్ల విజయవంతం కాలేదు. లోపాలను సరిదిద్ది 1980లో విజయవంతంగా ప్రయోగించిన SLVతో రోహిణి-1 ఉపగ్రహాన్ని అంతరిక్షంలో ప్రవేశపెట్టారు. భారతదేశం నుండి ప్రయోగించిన తొలి ఉపగ్రహంగా ఇది చరిత్రలో నిలిచిపోయింది. ఇక, SLV విజయంతో శాస్త్రవేత్తలు రాబోవు దశాబ్దాలలో ఉపయోగించడానికి వీలుగా పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్-PSLV నిర్మాణాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా పరీక్షలను నిర్వహించడానికి ఆగ్యుమెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికిల్-ASLV నిర్మించారు.
2001లో జియోసింక్రోనోస్ లాంచ్ వెహికిల్ (GSLV) నిర్మాణం
అలాగే 1987లో, 1988లో చేసిన ASLV ప్రయోగాలు రెండూ విఫలమయినప్పటికీ PSLVకి ఉపయోగపడే ఎన్నో విషయాలు శాస్త్రవేత్తలు తెలుసుకొన్నారు. చివరకు 1992లో ASLV ప్రయోగం విజయవంతమయింది. 1993లో PSLV ప్రయోగం విఫలమయింది. తిరిగి 1994లో చేసిన PSLV ప్రయోగం విజయవంతమయింది. PSLVతో దాదాపు 2000 కిలోల బరువు ఉన్న ఉపగ్రహాలను భూ నిమ్న కక్ష్యలో ప్రవేశపెట్టగలిగేలా రూపొందించారు. ఇక, 2001లో మరింత శక్తి సామర్థ్యాలు కలిగిన జియోసింక్రోనోస్ లాంచ్ వెహికిల్ -GSLV నిర్మాణానికి ఇస్రో శ్రీకారం చుట్టింది. దీనివల్ల 5 వేల కిలోల బరువున్న ఉపగ్రహాలను కూడా భూ స్థిర బదిలీ కక్ష్యలోకి ప్రవేశపెట్టవచ్చు. ఈ క్రమంలోనే… చంద్రుడి పైకి మనిషిని పంపే దిశగా కూడా ప్రయోగాలు ప్రారంభం అయ్యాయి.
PSLV వాహక నౌక నిర్మాణ టెక్నాలజీ, ఉపగ్రహ భాగాలను..
2001 నాటి మొదటి ప్రయోగం నుండి 2015 ఆగస్టు 27 వరకు ఇస్రో మొత్తం 9 జీఎస్ఎల్‌వి ఉపగ్రహ వాహకనౌకలను ప్రయోగించగా, క్రయోజనిక్ స్థాయిలో లోపం వలన మూడు ప్రయోగాలు విఫలమయ్యాయి. దీనితో, ఇస్రో అంతకుముందు రూపకల్పన చేసి, నిర్మించి విజయవంతంగా ఉపగ్రహాలను అంతరిక్షములోకి పంపిన PSLV వాహక నౌక నిర్మాణ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపగ్రహ భాగాలను, జీఎస్ఎల్వి వాహకనౌక రూపకల్పన నిర్మాణంలో వినియోగించారు. జిఎస్‌ఎల్‌విలో మూడు దశలు ఉండగా, అందులో మూడవ దశలో ఉపయోగించే క్రయోజనిక్ ఇంజన్, రాకెట్ సక్రమంగా పనిచేయటానికి అత్యంత కీలకమైనది.
1994 ఏప్రిల్‌లో క్రయోజనిక్ అప్పర్ స్టేజ్ ప్రాజెక్ట్ ప్రారంభం
అయితే, రష్యా, భారత్ మధ్య 1991లో కుదిరిన ఒప్పందం ప్రకారం.. రష్యా కంపెనీ గ్లావ్ కాస్మోస్ 5 క్రయోజనిక్ ఇంజన్లను, దానికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇవ్వాలి. కాని, 1992లో అమెరికా, ఇండియా మీద విధించిన ఆంక్షల వల్ల రష్యా తన ఒప్పందం నుండి వెనక్కి తగ్గింది. ఈ ఒప్పందం ప్రకారం కాక, కేవలం క్రయోజనిక్ ఇంజన్లను మాత్రమే సరాఫరా చేసింది, సాంకేతికతను ఇవ్వలేదు. దీనితో, ఇస్రో 1994 ఏప్రిల్‌లో క్రయోజనిక్ అప్పర్ స్టేజ్ ప్రాజక్ట్ ప్రారంభించి. క్రయోజనిక్ యంత్రాన్ని సొంతగా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేయడానికి పూనుకుంది.
దేశీయంగా తయారుచేసిన క్రయోజనిక్ ఇంజన్‌ను ఉపయోగించి
2010 లో ప్రయోగించిన రెండు GSLV వాహనాలు.. ఉపగ్రహాన్ని గమ్యం చేర్చడంలో విఫలమయ్యాయి. అయితే, దేశీయంగా తయారుచేసిన క్రయోజనిక్ ఇంజన్‌ను ఉపయోగించిన GSLV Mark-II GSLV-D5 ఉపగ్రహ వాహక ప్రయోగం మొదటిసారి విజయవంతం అయ్యింది. దీన్ని 2014 జనవరి 5న ప్రయోగించారు. ఇక, జీఎస్ఎల్‌వి శ్రేణి ఉపగ్రహ ప్రయోగ వాహనాలన్నీ ఆంధ్రప్రదేశ్, నెల్లూరుజిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంనుండి ప్రయోగించడం విశేషం. ఇప్పుడు, రాబోయే ప్రయోగాలకు కూడా ఇదే వేదిక అయ్యింది.
GSLV Mk IIIలో సిబ్బందితో కూడిన ఆర్బిటర్ గగన్‌యాన్ ప్రయోగం
గగన్‌యాన్ మూడో దశలో భాగంగా, GSLV Mk IIIలో ఇస్రో, సిబ్బందితో కూడిన ఆర్బిటర్ గగన్‌యాన్‌ను ప్రయోగించాలని ప్రణాళిక చేసింది. 1960లలో భారతదేశం అంతరిక్ష కార్యక్రమాలనున ప్రారంభించినప్పుడు, దేశం పరిమిత వనరులతో అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉంది. కానీ, రాను రానూ భారత్ అంతరిక్ష కార్యక్రమాల్లో తన సత్తాను చూపించింది. ఇప్పుడు, అంతర్జాతీయంగా ఇస్రో అతిపెద్ద స్టాప్‌గా నిలిచింది. ఈ ప్రయాణంలో ఇప్పుడు సెంచరీ పూర్తి చేస్తున్న ఇస్రో… భవిష్యత్తులో మరిన్ని సెంచరీలు మరింత వేగంగా చేస్తుందనడంలో సందేహం లేదు.