Puri Jagannath:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు పూరీ జగన్నాథ్ (Puri Jagannath). ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి, దర్శకత్వంలో మెలుకువలు నేర్చుకొని, ఆ తర్వాత ఎంతోమంది హీరోలకు మంచి లైఫ్ అందించారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్(Pawan Kalyan)తో ‘బద్రి’, రవితేజ(Raviteja) తో ‘ఇడియట్’, మహేష్ బాబు(Maheshbabu) తో ‘పోకిరి’, అల్లు అర్జున్ (Allu Arjun)తో ‘దేశముదురు’, రామ్ చరణ్ (Ram Charan) తో ‘చిరుత’ వంటి సినిమాలు చేసి, ఆ హీరోలకు మంచి విజయాలను అందించారు. ఆ తర్వాత కాలంలో ఏమైందో తెలియదు కానీ కొన్నాళ్లు ఇండస్ట్రీకి గ్యాప్ తీసుకున్న ఈయన, విజయ్ దేవరకొండ (Vijay deverakonda)తో ‘లైగర్’ అంటూ పాన్ ఇండియా సినిమా చేశారు. కానీ ఈ సినిమాతో భారీ నష్టాన్ని చవిచూశారు. ఆ తర్వాత రామ్ పోతినేని (Ram Pothineni)తో ‘డబుల్ ఇస్మార్ట్’ చేశారు కానీ ఇది కూడా డిజాస్టర్ గానే మిగిలింది.
మల్టీ స్టారర్ కి సిద్ధమవుతున్న పూరీ జగన్నాథ్..
ప్రస్తుతం పూరీ జగన్నాథ్ కి అవకాశాలు ఇవ్వడానికి యంగ్ హీరోలు కూడా సాహసం చేయలేదు. అయితే ఇలాంటి సమయంలో పూరీ జగన్నాథ్ ఇప్పుడు మల్టీ స్టారర్ సినిమా చేయబోతున్నారని సమాచారం. మరి ఆ హీరోలు ఎవరు అనే విషయానికి వస్తే.. తన కొడుకుతో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తన కొడుకు ఆకాష్ పూరీ (Akash Puri) హీరోగా ఎంట్రీ ఇచ్చి, పలు చిత్రాలు చేసినప్పటికీ ఆయన ఖాతాలో ఒక్క హిట్ కూడా పడలేదు. ముఖ్యంగా ఒకప్పుడు మన తెలుగు హీరోలందరూ ఫ్లాప్ లతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు పూరీ జగన్నాథ్ రంగంలోకి దిగి వాళ్ళందరికీ మంచి సక్సెస్ అందించారు. ఇప్పుడు తన కొడుకు విషయంలో కూడా అదే చేయబోతున్నారు పూరీ జగన్నాథ్. తన కొడుకు ఆకాష్ తో పాటు ఈ సినిమాలో మరో యంగ్ హీరో కూడా నటించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక త్వరలోనే వీటన్నింటి గురించి అధికారిక ప్రకటన కూడా వెలువడనుంది.
ఆకాష్ పూరీ కెరియర్..
ఆకాష్ పూరీ కెరియర్ విషయానికి వస్తే.. ఆకాష్ పూరీ 2007లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) డెబ్యూ మూవీ అయిన ‘చిరుత’ సినిమా ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి అడుగు పెట్టారు. ఈ సినిమా తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas )2008లో చేసిన ‘బుజ్జిగాడు’ సినిమాలో చిన్ననాటి ప్రభాస్ క్యారెక్టర్ లో నటించి ఆకట్టుకున్నారు. ఈ సినిమాతో ఆకాష్ పూరీకి మంచి గుర్తింపు లభించింది. ఇప్పటికే ఆకాష్ పూరీ తొలి చిత్రం అంటే ‘బుజ్జిగాడు’ అనే చెబుతారు. ఆ తర్వాత ఏక్ నిరంజన్, ది లోటస్ పాండ్, బిజినెస్ మాన్, ధోని, గబ్బర్ సింగ్ వంటి చిత్రాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఆకాష్ పూరీ 2016 లో వచ్చిన ‘ఆంధ్ర పోరి’ అనే సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ సినిమా పెద్దగా ఈయనకు గుర్తింపును అందించలేదు. ఆ తర్వాత 2018లో మెహబూబా, 2021 లో రొమాంటిక్, చోర్ బజార్ వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన, ఈ సినిమాలతో పెద్దగా పాపులారిటీని దక్కించుకోలేకపోయారు. అందుకే తన కొడుకు కెరియర్ ను నిలబెట్టడానికి పూరీ రంగంలోకి దిగబోతున్నట్లు సమాచారం. మరి ఈ మల్టీస్టారర్ మూవీ ఆకాష్ పూరీకి ఎలాంటి సక్సెస్ ను అందిస్తుందో చూడాలి.