ISRO: మన ఇస్రో.. మరో ఘనత సాధించింది. కమర్షియల్ ప్రయోగాల్లో.. కీలక మైల్‌స్టోన్ అందుకుంది. బాహుబలి రాకెట్ LVM3-M6 ప్రయోగం సూపర్ సక్సెస్ అయింది. ఈ ప్రయోగంతో.. అమెరికాకు చెందిన అధునాతన కమ్యునికేషన్ శాటిలైట్.. బ్లూ బర్డ్ బ్లాక్-2ని ఇస్రో విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగంతో.. ఇస్రో పేరు మరోసారి గ్లోబ్ వైడ్ వినిపించింది. ప్రతిష్టాత్మక గగన్‌యాన్ కోసం సిద్ధమవుతున్న వేళ.. ఈ ప్రయోగం ఎంత కీలకమైంది? ఇస్రో నెక్ట్స్ ప్రాజెక్టులకు.. ఇదెలా సాయపడనుంది?
అంతరిక్షంలోనే కాదు.. అంతర్జాతీయ వేదికపైనా ఇస్రో మరోసారి విజయకేతనాన్ని ఎగరేసింది. తన అత్యంత శక్తిమంతమైన రాకెట్.. లాంచ్ వెహికిల్ మార్క్-3 బాహుబలి రాకెట్‌తో.. అమెరికాకు చెందిన బ్లూ బర్డ్ బ్లాక్-2 కమ్యూనికేషన్ శాటిలైట్‌ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ విజయం.. కేవలం ఓ ప్రయోగం మాత్రమే కాదు. ఇంటర్నేషనల్ కమర్షియల్ శాటిలైట్ లాంచ్ మార్కెట్‌లో.. ఇండియా ఆధిపత్యానికి ఇదో గ్రేట్ ఎగ్జాంపుల్. LVM3-M6 మిషన్ పూర్తిగా కమర్షియల్. అమెరికాకు చెందిన ఏఎస్‌టీ స్పేస్ మొబైల్ సంస్థతో కలిసి.. ఇస్రో కమర్షియల్ విభాగం న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. ఇందులో భాగంగా.. అడ్వాన్స్‌డ్ కమ్యూనికేషన్ శాటిలైటన్లు.. ఇస్రో విజయవంతంగా రోదసీలోకి పంపింది. ఈ బ్లూ బర్డ్ బ్లాక్-2 శాటిలైట్.. నేరుగా మొబైల్ ఫోన్లకు సెల్యులార్ బ్రాడ్‌బ్యాండ్ సేవల్ని అందించే సామర్థ్యం కలిగి ఉంది. అంటే.. భూమిపై టవర్లు లేని చోట కూడా ఈ ఉపగ్రహం ద్వారా ఇంటర్నెట్, ఫోన్ కాల్స్ అందుకోవచ్చు. ఈ శాటిలైట్ బరువు సుమారు 6,100 కిలోలు. ఇంతటి భారీ ఉప్రగహ ప్రయోగం చేపట్టడం ఇస్రోకు ఇదే తొలిసారి. 43 మీటర్ల పొడవైన LVM3 రాకెట్.. నిప్పులు కక్కుతూ నింగిలోకి దూసుకెళ్లింది.
మొత్తం మూడు దశల్లో ప్రయోగం పూర్తయింది. శ్రీహరికోట నుంచి బయల్దేరిన 15 నిమిషాల తర్వాత బ్లూ బర్డ్ బ్లాక్-2 శాటిలైట్.. స్పేస్‌క్రాఫ్ట్ నుంచి విడిపోయి 520 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్ష్యలో విజయవంతంగా చేరింది. శాటిలైట్ల నుంచి నేరుగా మొబైల్ కనెక్టివిటీ అందించడమే లక్ష్యంగా.. బ్లూబర్డ్ బ్లాక్-2 మిషన్ చేపట్టారు. దీని సాయంతో ప్రపంచంలో ఎక్కడ ఉన్నా.. ఏ సమయానికైనా, ఎవరికైనా 4జీ, 5జీ వాయిస్, వీడియో కాల్స్, మెసేజ్‌లు, ప్రసారాలు అందించాలని అమెరికా సంస్థ భావిస్తోంది. ఇస్రో చేపట్టిన అత్యుత్తమ ప్రయోగాల్లో ఇదీ ఒకటి. LVM3 రాకెట్ ప్రయోగాల్లో వంద శాతం విజయాలు సాధిస్తున్నారు మన శాస్త్రవేత్తలు. అతి తక్కువ సమయంలో రాకెట్ రూపొందించి.. విజయవంతంగా ప్రయోగించారు. భారత నేల నుంచి పైకెగసిన అతి భారీ రాకెట్ ఇదే. ఇస్రో ప్రస్తుతం 34 దేశాలకు సేవలందిస్తోంది. గగన్‌యాన్ కోసం సిద్ధమవుతోన్న వేళ ఈ ప్రయోగం మరింత ఆత్మవిశ్వాసం పెంచిందని.. ఇస్రో చేతిలో ఇంకా చాలా ప్రాజెక్టులు ఉన్నాయని.. ఇస్రో ఛైర్మన్ డాక్టర్ వి.నారాయణన్ చెప్పారు.
LVM3-M6 రాకెట్ ప్రయోగం సక్సెస్ కావడంపై.. ప్రధాని మోడీ కూడా హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలియజేశారు. ప్రపంచ వాణిజ్య ప్రయోగాల్లో భారత్ మరోసారి సత్తా చాటిందని ఇస్రోను కొనియాడారు. అంతరిక్ష రంగంలో మన దేశం అత్యున్నత స్థానానికి ఎదుగుతూనే ఉందన్నారు మోడీ. ఈ విజయం ఆత్మనిర్భర్ భారత్‌వైపు మన ప్రయత్నాలను ప్రతిబింబిస్తోందని ట్వీట్ చేశారు. ఈ ప్రయోగంతో.. గ్లోబల్ స్పేస్ మార్కెట్‌లో ఇస్రో హవా మొదలైందనే చర్చ జరుగుతోంది. గతంలో భారీ శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపాలంటే.. ప్రపంచ దేశాలు.. అమెరికా, యూరప్ లాంటి దేశాల వైపు చూసేవి. కానీ ఇప్పుడు సీన్ మారింది. ఇతర దేశాలతో పోలిస్తే ఇస్రో చాలా తక్కువ ఖర్చుతో.. ఎంతో కచ్చితత్వంతో ప్రయోగాలు చేస్తోంది. LVM3 రాకెట్ ప్రయోగాలు.. వరుసగా విజయాలు సాధిస్తుండటంతో.. అంతర్జాతీయ సంస్థలకు ఇస్రోపై నమ్మకం పెరిగింది. బ్రిటన్‌కు చెందిన వన్ వెబ్ తర్వాత.. అమెరికా సంస్థలు కూడా భారత్ వైపు రావడం బిగ్ అచీవ్‌మెంట్.
ఈ ప్రయోగం సక్సెస్ కావడంతో.. ఇస్రో తదుపరి ప్రాజెక్టులు మరింత సులభతరం కానున్నాయి. చంద్రుడి పైనుంచి మట్టి నమూనాలను తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్న చంద్రయాన్-4 మిషన్‌లో.. LVM3 రాకెట్ కీలక పాత్ర పోషించనుంది. 2035 నాటికి సొంతంగా స్పేస్ స్టేషన్ నిర్మించాలన్న లక్ష్యానికి.. ఈ భారీ రాకెట్లే ఆధారం. ఈ సక్సెస్‌తో.. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్‌కి.. మరిన్ని విదేశీ ఒప్పందాలు వచ్చే అవకాశం ఉంది. ఇస్రో సాధించిన ఈ విజయం శాస్త్రీయంగానే కాకుండా, ఆర్థికంగానూ ఎంతో ఉపయోగపడనుంది. అంతరిక్ష రంగంలో భారత్ గ్లోబల్ హబ్‌గా ఎదుగుతోందని చెప్పడానికి.. ఈ ప్రయోగం విజయవంతం కావడమే నిదర్శనం.
ఇస్రో.. ఆకాశమే హద్దుగా ముందుకెళ్తోంది. కమర్షియల్, నాన్ కమర్షియల్ అనే తేడా లేకుండా ప్రయోగాలు చేపడుతోంది. ఈ లెక్కన.. స్పేస్‌లో ఇండియా డామినేషన్ పెరగబోతోందా? మరో ఆరు ప్రయోగాలతో ఇస్రో రేంజ్ మారిపోతుందా? 2026లో ఇస్రో లైనప్‌లో ఉన్న ప్రాజెక్ట్‌లేంటి? అంతరిక్ష ప్రయోగాల్లో.. ఇస్రో ఖ్యాతి ఎంత పెరగనుంది?
2026లో.. ఇండియా అంతరిక్షంలో ఓ నిర్ణయాత్మక మలుపుగా మారనుంది. కీలకమైన గగన్‌యాన్ మిషన్ సహా.. ఆరు మిషన్లతో ఇస్రో సిద్ధంగా ఉంది. భారత మానవ అంతరిక్ష ప్రయాణం కలని.. LVM3 మిషన్‌తో నెరవేర్చుకోవాలని ఇస్రో భావిస్తోంది. ఇది గానీ సక్సెస్ అయితే.. అంతరిక్ష రంగంలో ఇండియా మరో లెవెల్‌ని తాకుతుంది. 2025 మొత్తం.. న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ ద్వారా కీలకమైన కమర్షియల్ ప్రయోగాలు జరిగాయ్. ఇదే.. 2026లో ఓ గర్జనలా మారబోతోంది. ఇప్పటికే.. చంద్రయాన్, మంగళ్‌యాన్, ఆదిత్య ఎల్1, ఆస్ట్రోశాట్ లాంటి ప్రయోగాలతో.. ఇండియా పేరు ప్రపంచం మొత్తం మార్మోగింది. అయితే.. స్వదేశీ స్పేస్‌క్రాఫ్ట్‌తో.. మానవులను అంతరిక్షంలోకి పంపే మిషన్ ఇస్రో నెక్ట్స్ టార్గెట్‌గా ఉంది. ఇందులో భాగంగా.. LVM3, PSLV, SSLV, GSLV మార్క్ 2 సహా అన్ని లాంచ్ వెహికిల్స్.. 2026లో కీలక మిషన్లకు సిద్ధమవుతున్నాయ్.
వచ్చే మార్చి నాటికి.. ఇస్రో అత్యంత కీలకమైన ప్రయోగాలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. భారత్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న గగన్‌యాన్ మిషన్‌తో.. భారత్ ప్రపంచంలోని టాప్-4 దేశాల సరసన నిలబడబోతోంది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా.. వ్యోమమిత్ర అనే రోబోను అంతరిక్షంలోకి పంపి.. సురక్షితంగా తిరిగి భూమి మీదకు తీసుకురావడమే ఈ ప్రయోగం ముఖ్య ఉద్దేశం. 2027లో చేపట్టబోయే మానవ సహిత యాత్రకు ఇది అత్యంత కీలకమైన రిహార్సల్. మానవులను అంతరిక్షంలోకి పంపే ఈ మిషన్ కోసం.. LVM3 రాకెట్‌నే ఉపయోగిస్తున్నారు. అందువల్ల.. తాజాగా జరిగిన LVM3-M6 రాకెట్ విజయం ఇస్రోకు కొండంత బలాన్నిచ్చింది. మనుషులను అంతరిక్షంలోకి పంపే ముందు, రాకెట్ పనితీరులో వంద శాతం కచ్చితత్వం ఉండాలి. LVM3 రాకెట్లు సాధిస్తున్న వరుస విజయాలు.. ఈ రాకెట్ మానవ సహిత ప్రయోగాలకు సిద్ధంగా ఉందని నిరూపిస్తున్నాయి. గగన్‌యాన్ క్రూ మాడ్యూల్ చాలా బరువు ఉంటుంది. అంత బరువును మోసుకెళ్లే సత్తా LVM3కి ఉందని.. తాజా ప్రయోగం మరోసారి స్పష్టం చేసింది. ప్రతి ప్రయోగంలోనూ.. రాకెట్‌లోని క్రయోజనిక్ స్టేజ్, సాలిడ్ బూస్టర్స్ ఎలా పనిచేస్తున్నాయో ఇస్రో సైంటిస్టులు పరిశీలిస్తారు. ఈ డేటా..
గగన్‌యాన్ డిజైన్‌ని మరింత మెరుగుపరచడానికి ఉపయోగపడనుంది.
గగన్‌యాన్‌తో పాటు ఇస్రో.. గతంలో విఫలమైన జీఐశాట్-1 స్థానంలో.. జీఎస్ఎల్వీ-మార్క్ 2 రాకెట్ ద్వారా ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ప్రయోగించనున్నారు. ఇది దేశ సరిహద్దులను మానిటర్ చేయడంలోనూ, విపత్తుల నిర్వహణలోనూ కీలకపాత్ర పోషిస్తుంది. ఈవోఎస్-ఎన్1 వ్యూహాత్మక అవసరాల కోసం పీఎస్ఎల్వీ ద్వారా ప్రయోగించబోయే భూపరిశీలన ఉపగ్రహం. దీనితోపాటు 18 చిన్న శాటిలైట్లని కూడా ప్రయోగిస్తారు. చిన్న ఉపగ్రహాలను తక్కువ ఖర్చుతో పంపే.. స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికిల్.. తన పూర్తి స్థాయి కార్యకలాపాలను ప్రారంభించనుంది. మొదటిసారిగా.. పూర్తిగా ప్రైవేట్ రంగం నిర్మించిన పీఎస్ఎల్వీ రాకెట్ కూడా వచ్చే ఏడాదిలోనే నింగిలోకి ఎగరనుంది. 2026లో ఇస్రో రోడ్‌మ్యాప్‌లో.. గగన్ యాన్ మిషనే అత్యంత కీలకమైంది. మానవులు తిరిగి భూమి మీదకు చేరుకోవడమే అత్యంత కీలకమైన దశ. ఈ స్టేజ్‌లో.. స్పేస్‌క్రాఫ్ట్ హైపర్‌సోనిక్ వేగంతో వాతావరణాన్ని తాకుతుంది. ఆ సమయంలో.. వ్యోమ నౌక చుట్టూ ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతాయ్. దీనిని అధిగమించడమే ఇస్రో ముందున్న టార్గెట్. గగన్‌యాన్ కోసం.. స్పీడ్ కంట్రోల్ సిస్టమ్ మాడ్యూల్‌ని.. బంగాళాఖాతంలో సున్నితమైన స్ప్లాష్‌డౌన్‌కు మార్చాలి. రాబోయే దశల్లో రిహార్సల్ చేసి అమలు చేయనున్నారు.
ప్రస్తుతం.. రష్యా, అమెరికా, చైనా మాత్రమే.. మానవులను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టే కెపాసిటీ కలిగి ఉన్నాయ్. గగన్‌యాన్ విజయవంతమైతే.. ఇండియా కూడా ఈ అల్ట్రా ఎక్స్‌క్లూజివ్ క్లబ్‌లోకి ప్రవేశిస్తుంది. ఇది.. కేవలం భారత ప్రతిష్ఠ గురించి కాదు. అత్యున్నత సాంకేతిక సామర్థ్యానికి ఓ నిదర్శనంగా మారుతుంది. హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సామర్థ్యం అనేది.. హై-ఎండ్ టెక్ ప్రాక్సీ. ఇది.. ఒక దేశం అధునాతన మెటీరియల్ సైన్స్, కాంప్లెక్స్ ఏవియానిక్స్, మెడికల్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌లో.. ఎంతో ముందుందని సూచిస్తుంది. ఇండియా అలాంటి కెపాసిటీని ప్రదర్శించినప్పుడు.. భారతీయ తయారీ, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌పై ప్రపంచానికి ఉన్న అభిప్రాయం, అవగాహన మారిపోతాయ్. ప్రపంచంలోని బ్యాక్ ఆఫీస్ నుంచి.. ప్రధాన ప్రయోగశాలల్లో ఒకటిగా ఇండియా ఎదుగుతుంది. రాబోయే కొన్నేళ్లలోనే.. స్పేస్ ఎకానమీ ట్రిలియన్ డాలర్ల రంగంగా ఉంటుందనే అంచనాలున్నాయ్. మానవ అంతరిక్ష ప్రయాణంలో స్థానంలో సంపాదిస్తే.. భారత్ కేవలం ప్యాసింజర్‌గా కాకుండా పైలట్‌గా మారుతుంది. యూఎస్ అపోలో మిషన్లు.. ఒక జనరేషన్.. సైన్స్, ఇంజనీరింగ్‌ని స్వీకరించేందుకు ప్రేరేపించాయ్. 2026లో గగన్‌యాన్ సహా ఇస్రో చేపట్టబోయే ఇతర కీలక మిషన్లతో.. అంతరిక్ష రంగంలో ఇండియా స్థాయి పూర్తిగా మారిపోనుంది.