BJP: ఏడున్నర దశాబ్దాలుగా ఉగ్రభూతం కారణంగా అశాంతికి, అంతులేని హింస, రక్తపాతాలకు చిరునామాగా మారిన జమ్మూ కాశ్మీర్‌లో పదేళ్ల తర్వాత బుధవారం అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. తొలిదశలోని 24 సీట్లలో కశ్మీ్ర్‌లో 16, జమ్మూలో 8 సీట్లకు పోలింగ్ ముగిసింది. ఈ దశలో మొత్తం 219 మంది అభ్యర్థులు బరిలో నిలవగా, 23.27 లక్షల ఓటర్ల కోసం 3,276 పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. బుధవారం ఓటేసేవారిలో 1.23 లక్షల మంది తొలిసారి ఓటుహక్కును నమోదుచేసుకున్న వారే కావటం విశేషం. బుధవారం సాయంత్రం ఓటింగ్ ముగిసే సమయానికి…. శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ వెల్లడించింది. ఎన్నికల్ని బహిష్కరించాలనే వేర్పాటువాద శక్తుల ప్రచారాలు, పోలింగ్ ప్రక్రియను భగ్నం చేయడమే లక్ష్యంగా ముష్కరులు చేసే దాడులు, అంతులేని రిగ్గింగ్ లాంటివేమీ లేకుండా ఈసారి అక్కడి తొలిదశ పోలింగ్ ముగిసింది. మరాజ్ రీజియన్‌లోని అనంత్‌నాగ్, పుల్వామా, కుల్గాం, షోపియాన్ జిల్లాలు, చీనాబ్ లోయలోని దోడా, కిష్టావర్, రాంబన్ జిల్లాల్లో జరిగిన ఈ తొలిదశ పోలింగ్‌లో పార్టీల కంటే.. స్థానిక సమీకరణాలు, సమస్యలు, ఆ ప్రాంత చారిత్రక నేపథ్యాల ఆధారంగానే పోలంగ్ సాగే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తొలిదశలో బీజేపీ, నేషనల్ కాన్ఫరెన్స్ – కాంగ్రెస్ కూటమి, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) మధ్య త్రిముఖ పోరు జరిగిందని పోలింగ్ సరళిని బట్టి అర్థమవుతోంది. తొలిదశలో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్న వారిలో సీపీఎం నేత మహ్మద్ యూసుఫ్ తరిగామి, AICC ప్రధాన కార్యదర్శి గులాం అహ్మద్ మీర్, నేషనల్ కాన్ఫరెన్స్‌కు చెందిన సకీనా ఇటూ, పీడీపీకి చెందిన సర్తాజ్ మద్నీ, అబ్దుల్ రెహ్మాన్ తదితర నేతలున్నారు.
జమ్మూకశ్మీర్‌లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలుండగా, వీటిలో జమ్మూలో 43 సీట్లు, కశ్మీర్ లోయలో 47 సీట్లున్నాయి. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ కూటమిగా ఏర్పడి బరిలో దిగాయి. నేషనల్ కాన్ఫరెన్స్ 51 సీట్లలో, కాంగ్రెస్ 32, సీపీఎం, పాంథర్స్ పార్టీలు చెరోచోటా పోటీ చేస్తుండగా, మిగతా 5 చోట్ల ఎన్‌సీ, కాంగ్రెస్ స్నేహపూర్వక పోటీకి దిగుతుండటం విశేషం. మరోవైపు బీజేపీ, పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీలు ఒంటరి పోరుకు సిద్ధమయ్యాయి. మొత్తం 90 సీట్లలో బీజేపీ ఈసారి 62 సీట్లలో(జమ్మూలోని 43, లోయలోని 19 సీట్లలో)నే పోటీ చేస్తోండగా, మిగిలిన 27 సీట్లలో స్థానిక అభ్యర్థులకు పరోక్ష మద్దతునిచ్చే వ్యూహాన్ని అవలంబిస్తోంది. గత కొన్నేళ్లుగా జమ్మూ కశ్మీర్‌లో గతంలో కంటే ఉద్రిక్తతలు గణనీయంగా తగ్గటంతో 2020లో జరిగిన జిల్లా అభివృద్ధి మండళ్ల ఎన్నికలలో ప్రజలు ఉత్సాహంగా ఓటేశారు. అలాగే, 2024 మే నెలలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇక్కడ ఊహించని రీతిలో 58 శాతం పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికలలో బీజేపీ 24.36 శాతం, నేషనల్ కాన్ఫరెన్స్ 22.3 శాతం, కాంగ్రెస్ 19.38 శాతం, పీడీపీ 8.48 శాతం ఓట్లు సాధించాయి. సీట్ల పరంగా బీజేపీ, నేషనల్ కాన్ఫరెన్స్‌లకు చెరో రెండు, ఉపా చట్టం కింద అరెస్టయిన పాత్రికేయుడు ఇంజనీర్ రషీద్ జైల్లో వుంటూ బారాముల్లా స్థానం నుంచి ఇండిపెండెంట్‌గా గెలిచారు. కాగా, ఈసారి కూడా పోలింగ్ శాతం పెరిగే అవకాశముందని పార్టీలు అంచనాలు వేసుకుంటున్నాయి.
కశ్మీర్ రాష్ట్రంగా ఉండగా, చివరిసారిగా 2014 నవంబరు, డిసెంబరు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో 65.52 శాతం పోలింగ్ నమోదైంది. ఉగ్రవాదుల బెదిరింపులు, వేర్పాటువాదుల బహిష్కరణ పిలుపును పక్కనబెట్టి ఓటర్లు అప్పట్లో పోలింగ్ కేంద్రాల ముందు క్యూ కట్టారు. ఆ ఎన్నికల ఫలితాల తర్వాత పీడీపీ 28 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించగా, 25 సీట్లతో బీజేపీ రెండవ స్థానాన్ని పొందింది. నేషనల్ కాన్ఫరెన్స్ 15, కాంగ్రెస్ 12, స్థానిక పార్టీలు, ఇండిపెండెంట్లు కలిపి 7 సీట్లు దక్కించుకున్నారు. ఈ ఎన్నికల్లో ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాకపోవటంతో మూడు నెలల పాటు గవర్నర్ పాలన సాగింది. తర్వాత ఊహించని రీతిలో పీడీపీ – బీజేపీ పార్టీలు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా, 2018లో అంతర్గత విభేదాలతో మూడేళ్లు కూడా సాగకుండానే కుప్పకూలింది. ఈ క్రమంలోనే 2019లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దుచేయటమే గాక, జమ్మూ కశ్మీర్‌కున్న రాష్ట్రహోదాను తొలగించి కేంద్రపాలిత ప్రాంతంగా మార్చింది. నాటి నుంచి పాలన అంతా లెఫ్టినెంట్ గవర్నర్ కిందనే సాగుతూ వచ్చింది. ఇదిలా ఉండగా, 2024 సెప్టెంబర్ 30 నాటికి జమ్ము కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇందుకు అనుగుణంగా నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం అడుగులు వేసింది. కానీ, కొన్ని అనివార్య కారణాల వల్ల కొంత ఆలస్యమైంది.
ఆయా పార్టీల పట్ల ప్రజల అభిప్రాయాన్ని గమనిస్తే.. రాష్ట్రాన్ని సుదీర్ఘకాలం ఏలిన నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఆర్టికల్ 370 రద్దును ఆపలేకపోయిందనే అసంతృప్తి లోయలో బాగా ఉంది. అయితే, అక్కడ ఆ పార్టీకి మరో బలమైన ప్రత్యామ్నాయం లేకపోవడంతో ప్రజలు అయిష్టంగానైనా దానినే సమర్థించాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో నేషనల్ కాన్ఫరెన్స్- కాంగ్రెస్ కూటమికి కశ్మీర్ లోయలో మెజారిటీ సీట్లు దక్కుతాయనే అంచనా ఉంది. ఇటు జమ్ములోని 43 సీట్లలో 37 సీట్లలో బీజేపీ సత్తాచాటే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బీజేపీ రద్దుచేసిన ఆర్టికల్ 370ను పునరుద్ధరించి, ప్రత్యేక ప్రతిపత్తితో కూడిన రాష్ట్రహోదా కల్పిస్తామని కాంగ్రెస్ ఓటర్లకు హామీ ఇస్తుండగా, కమలనాథులు మాత్రం ఆర్టికల్ 370 రద్దు ముగిసిన అధ్యాయమని, దానిని ఎట్టిపరిస్థితుల్లో పునరుద్ధరించేది లేదని తెగేసి చెబుతున్నారు. ఆ ఆర్టికల్ మూలంగానే ఇక్కడి యువత ఉగ్రవాదం వైపు మళ్లారని చెబుతూనే, కశ్మీర్‌ను వదిలి వెళ్లిన పండిట్లకు పునరావాసం కల్పిస్తామని చెబుతున్నారు. ఇక్కడి మూడవ ప్రధాన రాజకీయ శక్తిగా ఉన్న పీడీపీ, గతంలో బీజేపీతో పొత్తు పెట్టుకోవటంతో అది ప్రజల్లో విశ్వసనీయతను కోల్పోయింది. దీంతో ఆ పార్టీ దక్షిణ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్, కుల్గాం, పుల్వామా, షోపియన్ జిల్లాల్లోని 18 సీట్లకే పరిమితం కానుంది. ఇక్కడ పీడీపీ- ఎన్సీల మధ్య హోరాహోరీ పోరు సాగనుంది. గతంలో జరిగిన మూడు లోక్‌సభ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ఒక్క సీటూ గెలవలేకపోయినా, క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి బలమైన నిర్మాణం ఉంది. రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్ర శ్రీనగర్‌లో ముగించడంతో, అది అక్కడ పార్టీ పట్ల ప్రజల్లో సానుకూలతకు దారితీసింది. పైగా, నిరుద్యోగం పెరిగిపోడంతో జమ్మూలోని యువత కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర హోదా పునరుద్దరణపై కాంగ్రెస్ గట్టిగా మాట్లాడటమూ ఆ పార్టీకి కలిసివచ్చే మరో సానుకూల అంశం కానుంది. ఇక మాజీ సీఎం గులాం నబీ ఆజాద్ స్థాపించిన డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ (డీపీఏపీ) తన అభ్యర్థులను బరిలో దించినా.. దాని ప్రభావం లేదనే చెప్పాలి.
Also Read: MSME Policy 2024: కోటి మంది మహిళలను కోటీశ్వరుల్ని చేయడమే లక్ష్యం : సీఎం రేవంత్
జమ్మూ కశ్మీర్లో ఏ మూలకు వెళ్లి.. ఎన్నికలపై ఎవరిని కదిలించినా నిరుద్యోగంతో పాటు అవినీతి పెరిగిందని, పరిపాలనతో పాటు వ్యాపారాల్లో కూడా స్థానికేతరుల జోక్యం తట్టుకోలేకపోతున్నామని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు జమ్మూ కశ్మీర్ను పాలించిన ఎన్సీ, కాంగ్రెస్, పీడీపీ, బీజేపీలు ఈ సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యాయని ప్రజలు ఏకాభిప్రాయంగా చెబుతున్నారు. దీంతో ఈ పార్టీలకు ప్రత్యామ్నాయంగా వచ్చే చిన్న పార్టీలకు ఈసారి ఆదరణ దక్కే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అయితే, గతంలో బీజేపీతో పీడీపీ చేతులు కలిపినట్లుగా ఈ పార్టీలు వ్యవహరించకుండా ప్రాంతీయ ఆకాంక్షలకు పెద్దపీట వేయాలని లోయలోని యువత కోరుకుంటోంది. అదే సమయంలో కేంద్రం పెత్తనం లేని, స్వపరిపాలనకు పెద్దపీట వేసే ప్రభుత్వం వస్తేనే తిరిగి తమ జీవితాల్లో వెలుగులు వస్తాయని కశ్మీర్ ప్రజలు భావిస్తు్న్నారు. గత పదేళ్లలో ఈ ప్రాంతంలో అనేక మార్పులు తీసుకొచ్చిన పార్టీకి బీజేపీకి ఈ ఎన్నికలు అగ్నిపరీక్షగా నిలుస్తుండగా, ఎన్సీపీ అండతో ఇక్కడ అధికారాన్ని చేజిక్కించుకుని సత్తా చాటాలని కాంగ్రెస్ తహతహలాడుతోంది. సెప్టెంబరు 25, అక్టోబరు 1 నాటి రెండవ, మూడవ దశ పోలింగ్ పూర్తయ్యే నాటికి మొత్తంగా కశ్మీరీయుల అభిప్రాయంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.