Jogi Ramesh: జోగి రమేష్ అదృష్టం ఏంటో కాని ఎన్నికల్లో ప్రతిసారి ఇష్టమున్నా లేకపోయినా ఏదో ఒక నియోజకవర్గానికి వలస వెళ్లి పోటీ చేయాల్సి వచ్చేది ఆయనకి.. అయితే వైసీపీ అధ్యక్షుడు కరుణించి ఈ సారి ఆ నాయకుడ్ని సొంత నియోజకవర్గానికే ఇన్చార్జ్‌గా ప్రకటించారు. అయినా కూడా పొలిటికల్‌గా యాక్టివ్ అవ్వలేదు సరి కదా అసలు కనిపించడమే మానేశారు. అధికారంలో ఉన్న అయిదేళ్లు పలు వివాదాల్లో చిక్కుకున్న ఆ మాజీ అమాత్యుడు.. కేసుల భయంతో టీడీపీలో చేరడానికి చాలా ప్రయత్నాలే చేస్తున్నారంట. అయితే ఆయనకి టీడీపీ పెద్ద, చిన్న బాసులు నో ఎంట్రీ బోర్డు పెట్టేశారంట.
2014లో మైలవరం నుంచి పోటీ చేసి ఓడిపోయిన జోగి రమేష్
ఏపిలో వైసిపి ఓటమి తరువాత మాజీ మంత్రి జోగి రమేష్ మౌనవ్రతం పట్టారు. మూడు సార్లు వైసీపీ నుంచి పోటీ చేసిన జోగి రమేష్ ఒక్కటంటే ఒక్కసారే గెలిచి.. జగన్ కేబినెట్లో బెర్త్ దక్కించుకున్నారు. 2014లో సొంత నియోజకవర్గం మైలవరం నుంచి పోటీ చేసిన ఆయన తన రాజకీయ ప్రత్యర్థి అయిన మాజీ మంత్రి దేవినేని ఉమా చేతిలో ఓటమి పాలయ్యారు. దాంతో ఇక మైలవరంలో జోగి రమేశ్ గెలుపు అసాధ్యమని భావించిన వైసీసీ అధ్యక్షుడు జగన్.. 2019 ఎన్నికల నాటికి ఆయన్ని పెడనకు షిఫ్ట్ చేశారు. 2009లో జోగి రమేశ్ కాంగ్రెస్ తరపున అదే పెడన నుంచి మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లోనూ విజయం సాధించి మంత్రి పదవి దక్కించుకోగలిగారు.
దూకుడుకి మూల్యం చెల్లించుకుంటున్న జోగి రమేష్
ఇక 2024 ఎన్నికల్లో అటు మొదటి సారి వైసీపీ నుంచి పోటీ చేసిన మైలవరం, రెండో సారి పోటీ చేసిన పెడన కాకుండా జగన్ ఆయన్ని పెనమలూరుకు షిఫ్ట్ చేశారు. అక్కడ ఓడిపోయిన జోగి రాజకీయ భవితవ్వం ఏంటనేది ఆయనకే అర్థం కాకుండా తయారైందంట. జగన్ ఆయనకు మూడు సార్లు మూడు చోట్ల నుంచి టికెట్ ఇచ్చినా ఒక్కసారే గెలిచిన ఆయన ఇప్పుడు పొలిటికల్‌గా క్రాస్‌రోడ్స్‌లో నిలబడ్డారు. ఓటమి తర్వాత వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో జోగి అటు వైసీపీలో కొనసాగే పరిస్థితి లేక.. ఇటు కూటమి పార్టీల నుంచి గ్రీన్ సిగ్నెల్ రాకదిక్కులు చూడాల్సి వస్తుందంట.
విచారణ పేరుతో స్టేషన్ల చుట్టూ తిప్పుతున్న పోలీసులు
ఏపిలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జోగి రమేష్ తమ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రదర్శించిన దూకుడుకి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు, అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో జోగి కుటుంబంపై ఆరోపణలు రావడం, జోగి రమేష్ కుమారుడు రాజీవ్‌ని అరెస్టు చేయడం జోగి రాజకీయ భవిష్యత్తున ఒక్క కుదుపు కుదిపింది. ఒక వైపు కుమారుడి అరెస్టు.. మరో వైపు జోగి రమేష్ ను విచారణ పేరుతో స్టేషన్ల చుట్టూ తిప్పడం లాంటి పరిమాణాలు ఆయన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయంట.
తనకు శని పట్టిందని వాపోతున్న జోగి రమేష్
ఆ క్రమంలో జోగి రమేష్ తన కష్టాలు అన్నీ ఇన్నీ కావని .. తనకు శనిపట్టిందని అంతా కష్టకాలమే నడుస్తోందని కనిపించిన అందరి దగ్గరా మొత్తుకుంటున్నారట. పార్టీ అధికారంలో ఉన్నపుడు జగన్ దగ్గర మంచి మార్కులు కొట్టేయడానికి చేసిన ఓవరాక్షన్ ఇప్పుడు తన కొంప ముంచిందని కన్నీరుమున్నీరవుతున్నాడట. వాస్తవానికి నారా లోకేశ్ రెడ్ బుక్ లో టాప్ ఫైవ్ లో తన పేరు ఉందని.. తనని కూడా త్వరలో అరెస్ట్ చేస్తారనే భయంతో టీడీపీలో చేరడానికి సిద్దమయ్యారాయన.. ఆల్రెడీ ఇప్పటికే.. ఆయన కొడుకుని అగ్రిగోల్డ్ భూముల కేసులో అరెస్ట్ చేశారు.
చంద్రబాబు నివాసంపై దాడి కేసులో అరెస్ట్ చేసే అవకాశం
ఇంకా రాజకీయ అరంగేట్రం కూడా చేయని తన కొడుకుని ఇప్పటికే జైల్లో వేశారని.. ఇక తన వంతేనని ఆ మాజీ మంత్రి బాధపడిపోతున్నారంట. గతంలో చంద్రబాబు ఇంటిపై మందీమార్భలంతో వెళ్లి దాడి చేసిన కేసులో తనని అరెస్ట్ చేసేస్తారని ఆయన డిసైడ్ అయిపోయాడట. అప్పుడేదో మంత్రి పదవి వస్తుందని ఆశతో.. జగన్ ను ప్రసన్నం చేసుకోవడానికి అలా చేశానని.. కానీ చంద్రబాబు అంటే తనకు చాలా గౌరవ మర్యాదలు ఉన్నాయని కనిపించిన టీడీపీ వాళ్లందరితో చెబుతున్నారట. పైగా తాను బీసీ సామాజిక వర్గానికి చెందినవాడిని.తనను అరెస్ట్ చేయకుండా వదిలేయమని అడుగుతున్నారట.
కృష్ణాజిల్లాకు చెందిన బీసి నేతతో రాయబారాలు
జోగి రమేష్ అరెస్ట్ తప్పించుకోవాలంటే టీడీపీలో చేరితేనే మంచిదని ఇప్పటికే చంద్రబాబు, లోకేశ్‌లను కలిసేందుకు అపాయిట్మెంట్ అడిగారట. గతంలో వైసీపీలో పని చేసి తర్వాత టీడీపీలో చేరి ఇప్పుడు ప్రభుత్వంలో కీలక పొజిషన్ లో ఉన్న కృష్ణాజిల్లాకే చెందిన బీసీ నేతతో కలిసి టీడీపీలో చేరేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారంట. అయితే టీడీపీ పెద్దలు ఎట్టి పరిస్థితుల్లోనూ జోగిరమేష్ ను పార్టీలో చేర్చుకునేది లేదని తెగేసి చెప్పేశారంట.. ఇటీవల నూజివీడులో టీడీపీ నేతలతో కలిసి ఆయన ర్యాలీలో పాల్గొన్న విషయంలో కూడా పార్టీ అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దాంతో ఆ ప్రయత్నం కూడా బెడిసికొట్టిందని తలపట్టుకున్నాడట.
జోగి రమేష్ ని పిలిపించి మాట్లాడని జగన్
ఏం చేస్తే చంద్రబాబును కలవొచ్చో చెప్పాలని.. పార్టీలో చేరడానికి సాయం చేయండని టీడీపీ నేతలకు ఫోన్లు చేస్తున్నారట. ఆ క్రమంలో వైసీపీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారాయన.. ఆయన టీడీపీ లో చేరేందుకు ప్రయత్నిస్తున్న విషయం జగన్ కు కూడా తెలిసిందట. అయితే జగన్ పిలిపించి మాట్లాడతారేమోనని జోగిరమేష్ ఎక్స్ పెక్ట్ చేశారంట. అయితే పార్టీ నుంచి పోవాలనుకునేవాళ్లు ఎవరైనా.. ఎంతమందైనా పోవొచ్చని అందువల్ల తమకేమీ నష్టం లేదని విజయసాయిరెడ్డి పార్టీ వీడినపుడు జగన్ చెప్పడంతో అది తనకు వర్తిస్తుందని జోగి రమేష్ సరిపెట్టుకుంటున్నారంట. విజయసాయిరెడ్డి పార్టీ వీడితేనే పట్టించుకోని జగన్ తననేం పట్టించుకుంటారని ఫీల్ అవుతున్నారంట. మొత్తానికి ఇప్పుడాయన పరిస్థితి ఎటు కాకుండా తయారైందిప్పుడు.