Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచిందా…? కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా కీలక నేతలు ప్రచారం చేయనున్నారా..?ప్రచార షెడ్యూల్ ను ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఫైనల్ చేశారా…? ఇంతకు సీఎం ప్రచారం ఎన్ని రోజులు ఉంటుంది…? కాంగ్రెస్ వర్గాల్లో ఏం చర్చ జరుగుతోంది…?
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయం దగ్గర పడుతోంది..దీంతో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో స్పీడ్ పెంచింది. ఇప్పటికే ముగ్గురు మంత్రులకు ఇంఛార్జీలుగా నియమించింది..ఇక డివిజన్ల వారీగా కార్పొరేషన్ చైర్మన్లకు ఇంఛార్జ్ బాధ్యతలు అప్పగించారు.. తాజాగా కాంగ్రెస్ పార్టీ తన వ్యూహాన్ని మార్చింది. ప్రతి డివిజన్ కు ఇద్దరు మంత్రులకు భాద్యతలు ఇచ్చారు. ఆ డివిజన్ లో ప్రచారం చేయడంతో పాటుగా అక్కడ మెజారిటీ తెచ్చే భాధ్యత మంత్రులపై పడింది. ఇప్పటికే మంత్రులు సైతం ప్రచారాన్ని ప్రారంభించారు.
ఇక ఉప ఎన్నికల ప్రచారంలో కీలక నేతలు రంగంలోకి దిగనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రచారం చేయనున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రచార షెడ్యూల్ డిసైడ్ అయింది. అక్టోబర్ 30, 31 తేదీల్లో వరుసగా రెండు రోజులు సాయంత్రం నాలుగు డివిజన్లలో రేవంత్ రెడ్డి కార్నర్ మీటింగుల్లో పాల్గొననున్నారు. దీంతో పాటు నవంబర్ 4,5 తేదీల్లో సైతం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా సీఎం రంగంలోకి దిగనున్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు ఏళ్ళు పూర్తి అవుతోంది. దీంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది. త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరుగనుండటంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా హస్తం పార్టీ పావులు కదుపుతోంది. ఒకవేళ ఉప ఎన్నికల ఫలితం తేడా వస్తే ప్రభుత్వ పనితీరుపై ప్రభావం పడుతుంది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. స్వయంగా ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఇక మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ ఛైర్మన్లతో పాటు ఇతర నేతలకు రేవంత్ రెడ్డి టాస్క్ ఇచ్చారు.
మొత్తానికి సీఎం రేవంత్‌రెడ్డి ఈ ఉపఎన్నికపై ప్రత్యేక దృష్టి సారించారు. సీఎం స్వయంగా రెండు రోజులు ప్రచారం చేయనున్నారని పార్టీవర్గాలు తెలిపాయి. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నగరంలో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేదు. కానీ ఆ తరవాత జరిగిన ఉపఎన్నికల్లో కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని కైవసం చేసుకుంది. ఇప్పుడు జూబ్లీహిల్స్‌లోనూ విజయం సాధించాలని సీఎం ప్రత్యేక దృష్టి పెట్టారు.
ఈ నేపథ్యంలో పార్టీశ్రేణుల్లో ఊపు తెచ్చేందుకు ఆయనే నేరుగా ప్రచారానికి రానున్నారని నేతలు చెబుతున్నారు. ఇప్పటికే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో విస్తృతంగా తిరుగుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 22 నెలలుగా అమలు చేస్తున్న పథకాల గురించి పెద్దయెత్తున ప్రచారం చేస్తున్నారు. ఈ నియోజకవర్గం ఉపఎన్నికలకు ఇన్‌ఛార్జులుగా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, వివేక్‌లను పార్టీ నియమించింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతుగా రహ్మత్‌నగర్ డివిజన్‌లో కోమటిరెడ్డి ప్రచారం నిర్వహించారు.
ఆయన వెంట రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి, టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేష్‌రెడ్డి, స్థానిక కార్పొరేటర్, తదితరులున్నారు. పార్టీ నేతలందరూ ఉపఎన్నికలో గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ తెలిపారు.సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచారం చేస్తే రాజకీయం హీటిక్కె అవకాశం ఉంది..సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతారు..సీఎం ప్రచారం కాంగ్రెస్ అభ్యర్ధి గెలుపుకు ఏ మేరకు ఉపయోగపడుతుంది అనేది చూడాలి.
Story by Apparao, Big Tv