Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో బీజేపీ నేతలు పెద్దపెద్ద కబుర్లు చెప్పారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ విధానాలతో విసిగిపోయిన ప్రజలు బీజేపీకి పట్టం కట్టబోతున్నారని ప్రచారం చేసుకున్నారు.. అంతేనా బైపోల్స్ పోటీని మొలతాడు లేనోళ్ళకు, మొలతాడు ఉన్నోళ్లకు మధ్య పోటీగా అభివర్ణించారు. లక్ష ఓట్లు ఉన్న తూర్కొల్లకే అంత ఉంటే 3 లక్షల ఓట్లు ఉన్న హిందువులకెంత ఉండాలని, హిందువులంతా ఏకమై తమకే పట్టం కడతారని చెప్పుకున్నారు.. అయితే బీజేపీ మూడోస్థానానికి పడిపోతుందన్న ప్రచారంతో పార్టీ నేతలు మెజార్టీ ఊసెత్తడానికే భయపడుతున్నారంట ఇప్పుడు..
కార్పెట్ బాంబింగ్ ప్రచారం అన్నారు.. వికసిత్ భారత్ పాదయాత్ర అన్నారు.. మోడీ 3.0 విజన్ అన్నారు.. హిందుత్వం, జాతీయవాదం అన్న కమలం దళమంతా జూబ్లీహిల్స్ పోలింగ్ తర్వాత సైలెంట్ అయిపోయింది. ఈ సైలెన్స్‌కి రీజన్ ఏంటనే చర్చ నడుస్తుందట. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ తర్వాత కమలం పార్టీకి రిజల్ట్ భయం పట్టుకుందనే టాక్ జోరుగా నడుస్తుందట. ఇంతకు డిపాజిట్ అయినా వస్తుందా? గత ఎన్నికల్లో వచ్చిన ఓటింగ్ శాతానికి మించి ఓట్లు పడతాయా?.. ఉప ఎన్నికలో కనీసం పరువైన నిలుస్తుందా?..అనే ప్రశ్నలు రాష్ట్ర బీజేపీ నేతలకు నిద్ర పట్టనివ్వడంబ్లేదట.
జాతీయ వాదం అంటే ఏంటో చూపించాలని జూబ్లిహిల్స్ ప్రజలకు పిలుపు నిచ్చారు కాషాయ నేతలు. కానీ ఎన్నిక జరిగిన తీరులో.. జూబ్లీహిల్స్ లో ఉన్న 7 డివిజన్లలో ప్రజలు ఎక్కడా బీజేపీని.. బీజేపీ నేతలు చేసిన ప్రచార ప్రసంగాలను పెద్దగా పట్టించుకోలేదనే టాక్ నడుస్తుందట. పోలింగ్ తర్వత కూడా ఏ సర్వేలు చూసుకున్నా కాషాయ పార్టీ కార్పెట్ బాంబింగ్ మాయాజాలం ఊసే లేదనేది టాక్. ఏ సర్వే చూసినా బీజేపీకి కేవలం 4 నుంచి 5 శాతం మాత్రమే ఓటింగ్ కనిపిస్తుంది. బీజేపీ నేతలు చేప్పిన విషయాలను పట్టించుకోకుండా.. జూబ్లీహిల్స్ ఓటర్లు పట్టం కట్టాల్సిన వారికే పట్టం కట్టారనే టాక్ నడుస్తోందట.
జూబ్లీహిల్స్‌లో ఏ గల్లీలో చూసినా.. ఏ డివిజన్ లో అడిగినా కాంగ్రెస్‌దే విజయమన్న టాక్ వినిపిస్తోంది. హస్తం నేతల్లో విజయంపై ప్రగాఢమైన విశ్వాసం కనిపిస్తుండటంతో … కాషాయ పార్టీలో నేతలకు భయం పుట్టుకుందట. కనీసం పరువైనా నిలబడుతుందా అన్న అయోమయంలో పడ్డారట బీజేపీ నేతలు. అభ్యర్థి ఎంపిక నుంచి, ప్రచారం, పోలింగ్ వరకు కీలక నేతలతో పాటు క్యాడర్‌తో నానా తంటాలు పడ్డ రాష్ట్ర కమలం పార్టీ… రిజల్ట్ ఎలా ఉంటుందనే సందేహంలో పడిందట.
అంతేకాదు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం వచ్చే ఎన్నికలను డిసైడ్ చేస్తుందని… బీజేపీ ఆ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తన అనుచరుడు లంకల దీపక్‌రెడ్డికి తిరిగి టికెట్ ఇప్పించుకున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రచారబాధ్యతలు తన భుజానికెత్తుకుని పనిచేశారు. అంది వచ్చిన అంశాలను, అవకాశాలను, హిందుత్వం, జాతీయవాదం, ఏది వదలకుండా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎఫర్ట్ పెట్టారు. అయితే నేతల మధ్య సమన్వయం కోసం సునిల్ బన్సల్, అభయ్ పాటిల్ కృషి చేసినప్పటికీ ఏది ఫలించలేదట. సర్వేలు, పోలింగ్ సరళి, ప్రజల పల్స్ ప్రకారంగా చూసుకున్నా…అనుకున్న ఫలితాలు బీజేపీకి దక్కే పరిస్థితిలేదని తేలిందంట.
హిందువులు ఏకం కావాలి… హిందువులు ఏకం కాకపోతే జూబ్లీహిల్స్ కబ్రస్థాన్ గా మారిపోతుంది… ఓవైసీ బ్రదర్స్ కు కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్‌ను దాసోహం చేస్తుందని… ఇలాంటి పవర్ ఫుల్ పంచ్ డైలాగ్స్ కూడా జూబ్లీహిల్స్ లో పని చేయలేదనే అంతర్మథనంలో పరివారులు ఉన్నారట. జూబ్లీహిల్స్ లో గెలవకపోతే హిందువులు బీజేపీ వైపుకు లేరని, రెఫరెండంగా తీసుకుంటారా అన్న సీఎం ప్రశ్నలకు బీజేపీ నేతల నుంచి ఎలాంటి జవాబు లేదట. హిందువులంతా ఏకం కావాలనీ ఎప్పుడైతే నినాదాలు ఎత్తుకుందో నైతికంగా బీజేపీ జూబ్లీహిల్స్ లో ఓడిపోయిందనే టాక్ రాజకీయ విశ్లేషకుల్లో వినిపిస్తోందట.
గత ఎన్నికల్లో ఓటమి చెందిన అభ్యర్థికే మళ్ళీ అవకాశం ఇచ్చి బరిలో దిగిన బీజేపీకి ఈ ఉప ఎన్నికలో కూడా చేదు అనుభవమే ఎదురుతుందనే టాక్ ఆపార్టీ వర్గాల్లోనే వినిపిస్తోంది. అంతేకాదు ఈ ఉప ఎన్నికలో స్టేజిలెక్కి ప్రసంగాలిచ్చిన కొంతమంది నేతల నోర్లే బీజేపీకి మైనస్ అయ్యాయనే టాక్ సైతం వినిపిస్తుందట. బీఆర్ఎస్ పదేళ్ల అవినీతి పాలన, కాంగ్రెస్ రెండేళ్ల ఫెయిల్యూర్ పాలనలను చూశారు… బీజేపీకి అవకాశం ఇవ్వండి అన్న బలమైన నినాదం ఇచ్చినా జూబ్లీహిల్స్ ఓటర్లు పట్టించుకోలేదంటున్నారు. మరి చూడాలి బీజేపీ ఫేట్ ఎలా ఉండబోతుందో?
Story by Apparao, Big Tv