Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను అధికార కాంగ్రెస్‌తో పాటు బీఆర్‌ఎస్, బీజేపీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. నియోజకవర్గంలో కుల సమీకరణలపై మూడు ప్రధాన పార్టీలు ఫోకస్ చేస్తున్నాయి. సెగ్మెంట్‌లో పట్టున్న సామాజిక వర్గాలను ప్రసన్నం చేసుకునేందుకు…ఆ వర్గాలవారీగా నేతలను రంగంలోకి దించి మూడు పార్టీలు కసరత్తు చేస్తున్నాయి.. ఎంఐఎం మద్దతుతో అధికార కాంగ్రెస్ జూబ్లీహిల్స్‌లో నిర్ణయాత్మకంగా ఉన్న మైనార్టీ ఓట్లపై నమ్మకంతో పావులు కదుపుతోంది. మరోవైపు వివిధ వర్గాలను ఆకట్టుకోవడానికి ఆయా వర్గాల మంత్రులను వర్గాలను ఆకట్టుకోవడానికి పావులు కదుపుతున్నారు. దానికి ప్రతిగా విపక్షాలు సైతం అదే స్థాయిలో పావులు కదుపుతుండటంతో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఉత్కంఠ రేపుతోంది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను అధికార కాంగ్రెస్‌తో పాటు బీఆర్‌ఎస్, బీజేపీలకు జీవన్మరణ సమస్యగా మారాయి. బైపోల్‌లో విజయం సాధించడానికి మూడు పార్టీ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఓవైపు ఓటర్లును అటకుట్టుకోవడానికి ఎడాపెడా హామీలు, తాయిలాలు ప్రకటిస్తున్నాయి. హామీలు, తాయిలాలకే పరిమితయితే సరిపోదనే విషయాన్ని గమనించిన పార్టీలు వివిధ వర్గాలపై కన్నేసి పావులు కదుపుతున్నాయి. సామాజికవర్గాల వారీగా కూడా అందర్నీ సంతృప్తిపర్చాలని తమవంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. కులాలకు పెద్దపీట వేసి, ఓటర్లకు గాలం వేసేలా వ్యూహారచన చేస్తున్నాయి . ఇందుకోసం కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీలు తీవ్రంగా కసరత్తులు చేస్తున్నాయి.
కులాలు, మతాలు వారీగా ఆకర్షించి, గంపగుత్తగా ఓట్లు వేయించుకోవడానికి మూడు పార్టీలు శ్రమిస్తున్నాయి. ఇందులో భాగంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు ఇప్పటికే కీలకమైన నేతలను రంగంలోకి దించాయి. బీజేపీ కూడా వివిధ సామాజిక వర్గాల ఓటర్లను ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు ప్రారంభించది. ఎన్నికల వేళ కార్తిక మాసం కూడా రావడంతో కులాల వారీగా పసందైన విందులకు ఆయా పార్టీలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉండగా…ఇందులో సామాజిక వర్గాల వారీగా ఓటర్లను ఆకర్షించేందుకు ప్రధాన పార్టీలు అన్ని రకాల ప్రయత్నాలూ చేస్తున్నాయి.
నియోజకవర్గంలోని ఓటర్లలో బీసీలు 1.34 లక్షల మంది ఉండగా, ముస్లింలు 1.20 లక్షల మంది ఉన్నారు. కమ్మ సామాజిక వర్గ ఓట్లు 22,746 ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ ఓట్లు 39వేలకు పైగా ఉన్నాయి. ఆయా ఓట్లను దక్కించుకోవడానికి పార్టీల నేతలు కుల పెద్దలతో చర్చిస్తున్నారు. తమ పార్టీల్లో ఉన్న ఆయా కులాల నేతలను ఇన్‌చార్జిలుగా నియమించి, ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తీవ్ర కసరత్తులు చేస్తున్నాయి. ప్రస్తుత బైపోల్‌లో ప్రధాన పార్టీల నుంచి మూడు సామాజిక వర్గాలకు చెందిన వారు బరిలో నిలబడ్డారు. బీఆర్‌ఎస్ నుంచి కమ్మ సామాజిక వర్గానికి చెందిన మాగంటి సునీత….యాదవ్ సామాజిక వర్గానికి నవీన్ యాదవ్ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక బీజేపీ నుంచి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన దీపక్ రెడ్డి బరిలో నిలిచారు.
బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్న మాగంటి సునీత కమ్మ కులస్థురాలు కావడంతో ఆ సామాజికవర్గం ఓట్లు తమకు గంపగుత్తగా వస్తాయని బీఆర్‌ఎస్ భావిస్తోందట. ఆ క్రమంలో పార్టీకి చెందిన కమ్మ నేతలు పువ్వాడ అజయ్, ఇతరులను రంగంలోకి దించి ఆ వర్గీయులతో సమావేశాలు జరుపుతోంది. 2014 నుంచి కమ్మసామాజిక వర్గానికి చెందిన మాగంటి గోపినాథ్ జూబ్లీహిల్స్‌ను ఎమ్మెల్యేగా ఎన్నిక అవుతున్నారు. ఆయన మృతి తర్వాత జరుగుతున్న బైపోల్‌లో కమ్మసామాజిక వర్గం…బీఆర్ఎస్‌కు అండగా నిలుస్తుందా అనేది చర్చినీయంశంగా మారింది.
ఇక కాంగ్రెస్ అభ్యర్ధి యాదవ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్ధి కావడంతో ఆ ఓట్లను గండికొట్టేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు ప్రారంభించింది. యాదవ సామాజిక వర్గానికి ప్రసన్నం చేసుకోవడానికి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను రంగంలోకి దించింది. తలసాని తన కులానికి చెందిన ఓట్లను ఏ మేరకు బీఆర్‌ఎస్‌కు పడేలా చేస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది. ఇక మైజార్టీ ఓట్ బ్యాంక్ అయిన మైనార్టీ ఓటర్లను కూడా ఆకర్షించేందుకు పార్టీలోకి మైనార్టీ నేతలను రంగంలోకి దింపింది. ఇప్పటికే మజ్లిస్ నేతలను పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు మొదలుపెట్టిందట బీఆర్ఎస్.
ఇక కమ్మ ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి ఇప్పటికే కాంగ్రెస్ అదే సామాజికవర్గానికి చెందిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావును రంగంలోకి దించింది. నియోజకవర్గానికి ఆనుకొని ఉన్న నియోజకవర్గాల నేతలు సైతం తెరవెనక ప్రయత్నాలు చేస్తున్నారట. ఇప్పటికే కమ్మ సంఘాల నాయకులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి..తమ సమస్యలను సీఎం దృష్టికి తీసుకువచ్చారు. కమ్మ సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తులపై సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. దీంతో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్ధతు ఇస్తున్నట్లు కమ్మ సంఘాలు ప్రకటించాయి. ఇక కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్ తన సామాజికవర్గ ఓట్లన్నీ తనకే పడతాయనే ధీమాలో ఉంది. ఎంఐఎం మద్దతుతో మైనార్టీ ఓటర్లు కాంగ్రెస్‌కు అండగా నిలుస్తారనే కాన్ఫిడెన్స్‌లో హస్తం పార్టీలో కనిపిస్తోంది. ఎస్సీ, ఎస్టీ ఓటర్లను కూడా తమవైపు తిప్పుకునేందుకు ఆ సామాజిక వర్గానికి చెందిన మంత్రులను విసృత్తంగా ప్రచారం చేసేలా రంగంలోకి దించింది కాంగ్రెస్ పార్టీ.
బీజేపీ తరఫున లంకెల దీపక్‌రెడ్డి బరిలో ఉన్నారు. నియోజకవర్గంలో రెడ్డి ఓటర్లు కూడా పెద్ద సంఖ్యలో ఉండడంతో ఆయా ఓట్లను దక్కించుకోవడానికి కిషన్‌రెడ్డి దృష్టి సారించారట. ఇప్పటికే కార్పెట్ బాంబింగ్ పేరిట బీజేపీ ముఖ్యనేతలందరూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నియోజకవర్గంలో ప్రచారం చేశారు. అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన నేతలను స్టార్ క్యాంపెయినర్లగా నియమించి ప్రచారాన్నిహోరెత్తిస్తున్నారు. స్టార్ క్యాంపెయినర్లతో పాటు బీజేపీ పాలిత ముఖ్యమంత్రులను కూడా రంగంలోకి దించి ఓటర్లను తమ వైపు తిప్పుకునేలా ప్రయత్నాలు చేస్తోంది. మరి అక్కడ క్యాస్ట్ ఈక్వేషన్స్ ఎంత వరకు పనిచేస్తాయో? ఏ పార్టీ జూబ్లీ హిల్స్‌లో జెండా ఎగరవేస్తుందో చూడాలి.
Story by Vamshi, Big Tv