Misuse of scholarship funds: రాష్ట్రంలో పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ నిధుల దుర్వినియోగంపై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫీజు రీయింబర్స్‌మెంట్, మెయింటెనెన్స్ ఫీజు కింద విడుదలవుతున్న ప్రభుత్వ నిధులను కొన్ని విద్యాసంస్థలు అక్రమాలకు పాల్పడి దుర్వినియోగం చేస్తున్నట్లు ప్రభుత్వ దృష్టికి వచ్చింది. ఈ ఆరోపణల నేపథ్యంలో, B.Ed, D.Ed కళాశాలలతో సహా స్కాలర్‌షిప్ పొందుతున్న అన్ని సంస్థలపై సమగ్ర విచారణ జరపాలని విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాన్ని ఆదేశిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ భారీ విచారణకు విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది. ఈ బృందాలకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, వరంగల్ పోలీస్ కమీషనరేట్లు, అలాగే CID, ACB, ఇంటెలిజెన్స్ విభాగాల నుండి పూర్తి సహకారం అందించాలని సీఎస్ ఆదేశించారు. ఉన్నత విద్యా, పాఠశాల విద్యా శాఖల అధికారులను కూడా ఈ తనిఖీ బృందాల్లో భాగం చేయనున్నారు.
ALSO READ: SFI: స్టూడెంట్స్‌కు అలెర్ట్.. రేపు అన్ని కాలేజీలు బంద్.. ఎందుకంటే?
ఈ తనిఖీల్లో భాగంగా కళాశాలలు నిజంగా పనిచేస్తున్నాయా, విద్యార్థులకు తగిన అర్హతలు ఉన్నాయా, నిబంధనల ప్రకారం ప్రవేశాలు జరిగాయా వంటి అంశాలను పరిశీలిస్తారు. అలాగే, విద్యార్థుల సంఖ్యకు తగిన బోధన సిబ్బంది, తరగతి గదులు, ఫర్నిచర్, ల్యాబ్‌లు వంటి మౌలిక సదుపాయాలు ఉన్నాయా, విద్యార్థులకు కనీస హాజరు, సరైన అకడమిక్ పనితీరు ఉన్నాయా అని కూలంకషంగా దర్యాప్తు చేయాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.
పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి ఉద్దేశించిన నిధులను రక్షించేందుకే ఈ చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. తనిఖీ బృందాలకు అన్ని శాఖలు తక్షణ ప్రాతిపదికన సహకరించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.