BigTV English

Macherla Politics: ఇలా అయితే కష్టమే.. మాచర్ల ఎమ్మెల్యేకు వింత పరిస్థితి

Macherla Politics: ఇలా అయితే కష్టమే.. మాచర్ల ఎమ్మెల్యేకు వింత పరిస్థితి

Macherla Politics: కూటమి ప్రభుత్వం ఏర్పడి మనకు కొద్ది రోజుల్లో ఏడాది కాలం పూర్తవుతుంది. ఈ సమయంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో అనేక ప్రాంతాల్లో నియోజకవర్గ ప్రజాప్రతినిధులపై స్థానిక నేతలు కొంత అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో మాచర్ల నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలతో తాము అధికారంలో ఉన్నామా లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నామా అనే విధంగా అనిపిస్తుంది అంటున్నారు అధికారపక్ష కార్యకర్తలు. అసలా ఫ్యాక్షన్ నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల అంతర్మధనానికి కారణమేంటి?


ఎమ్మెల్యేలపై ప్రభావం చూపించే అధికారుల పనితీరు

ఏ ప్రభుత్వం అయినా ప్రజల మన్ననాలు పొందాలి అంటే ఎమ్మెల్యే పనితీరుతో పాటు స్థానికంగా ఉన్న కార్యకర్తలు, నేతలు పనిచేయాలి. స్థానికంగా ఉండేటటువంటి అధికారుల పనితీరు ప్రజాప్రతినిధులకు ప్రజల్లో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చిపెడుతుంది. ప్రజా ప్రతినిధులు ఎన్ని ప్రణాళికలు రచించినా వాటిని గ్రౌండ్ లెవెల్ లో అమలు చేయాల్సింది అధికారులే. ఆ అధికారులు కనుక నిర్లక్ష్యంగా ఉంటే ప్రజాప్రతినిధులు ఎంత కష్టపడ్డా ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. అందుకే ప్రజా ప్రతినిధులు స్థానికంగా ఉన్న అధికారులతో కోఆర్డినేషన్ చేసుకొని ముందుకు వెళ్లాలంటారు


అధికారుల నిర్లక్ష్యం కారణంగా అనామకంగా మారిపోయిన నేతలు

ఎమ్మెల్యేగా గెలిచిన ప్రజాప్రతినిధులు తన నియోజకవర్గంలో పనిచేసే అధికారులతో ముందుగా సమన్వయం పెంచుకోవాల్సిన అవసరం చాలానే ఉంటుంది. అధికారులు నిర్లక్ష్యం కారణంగా గతంలో చాలామంది ప్రజాప్రతినిధులు తిరిగి ప్రజలకు తమ మొహాలు కూడా చూపించలేని పరిస్థితులు ఎదురయ్యాయి. దాన్నిబట్టే అధికారులకి ప్రజాప్రతినిధులకు మధ్య ఎంత కోఆర్డినేషన్ ఉండాలనేది అర్థమవుతుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి మరికొద్ది రోజుల్లో ఏడాది పూర్తి కానుంది. అయితే కొన్ని నియోజకవర్గాల్లో ఇంకా ఎమ్మెల్యేలకు అధికారులైతే పూర్తి స్థాయిలో సహకరిస్తున్న పరిస్థితులు లేవంటున్నారు. ఎమ్మెల్యేలు ఒక ఆలోచన చేస్తే అధికారులు మరో ఆలోచన చేస్తూ అందర్నీ గందరగోళ పరుస్తున్నారంట

మాచర్లలో 20 ఏళ్ల తర్వాత ఎగిరిన టీడీపీ జెండా

పల్నాడు జిల్లాలో అత్యంత ముఖ్యమైన నియోజకవర్గాల్లో మాచర్ల నియోజకవర్గం ఒకటి. మాచర్ల నియోజకవర్గంలో తిరిగి తెలుగుదేశం జెండా ఎగరడానికి 20 ఏళ్లు పట్టింది. నియోజవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కరిస్తామంటూ ప్రజలకు అనేక హామీలు ఇచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రజలకు తాము ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు నియోజకవర్గ అభివృద్ధి కోసం మాచర్ల నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మంచి ప్రణాళికనే రచించుకుంటున్నారు.

ఎమ్మెల్యే యాక్షన్ ప్లాన్‌కి భిన్నంగా ఉన్న పరిస్థితులు

కానీ స్థానిక పరిస్థితులు మాత్రం ఎమ్మెల్యే యాక్షన్ ప్లాన్‌కి భిన్నంగా ఉంటున్నాయని స్థానిక టీడీపీ శ్రేణులే అంటున్నాయి. మాచర్ల పట్టణ అభివృద్ధి తో పాటు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ఎమ్మెల్యే అధికారులతో అనేకసార్లు భేటీలు అయ్యారు. అందులో ప్రధానంగా అభివృద్ధికి అవసరమైన నిధులు, ప్రజలకు మౌళిక సదుపాయల కల్పనకు సంబంధించి అంశాల్లో ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళ్లాలని ఆలోచనలో ఎమ్మెల్యే ఉన్నట్లు కనిపిస్తుంది. అయితే నూతన ప్రాజెక్టులు పక్కన పెడితే ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న కొన్ని పథకాలు సైతం ప్రజలకు చేరువ చేయటంలో అధికారులు పూర్తిగా విఫలం అవుతున్నారని స్థానిక నేతలు విమర్శిస్తున్నారు. ఎమ్మెల్యే ఎన్నిసార్లు చెప్పినా అధికారులు నిర్లక్ష్యం వహించటం సర్వసాధారణంగా మారిందంటున్నారు

కార్యకర్తల ముందు శాంతి ప్రవచనాలు చెప్తున్న ఎమ్మెల్యే

అయితే ఇదంతా కూడా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తే ఆయన మాత్రం శాంతి మంత్రాన్ని కార్యకర్తలకు చెప్తున్నారట. అధికారులకు మరి కొంత సమయం ఇచ్చి చూద్దాం అంటున్నారంట. ఇంకొంత టైమ్ ఇచ్చి తర్వాత కూడా అధికారుల వైఖరి మారకపోతే అప్పుడు దూకుడుగా వెళ్దాం అని కార్యకర్తలకు చెప్తున్నారంట. దాంతో తెలుగుతమ్ముళ్లు ఎమ్మెల్యే ముందు మింగలేక కక్కలేక సతమతమవుతున్నారంట. ప్రతిపక్షం మీద దూకుడుగా వ్యహరించడం పక్కన పెడితే, అధికారగణం కూడా తమ మాట వినడం లేదని వాపోతున్నారు. ప్రజా సమస్యలకు సంబంధించి తాము అధికారులు దృష్టికి తీసుకెళ్లినా వాటి పరిష్కారానికి అడుగులు వేస్తున్న పరిస్థితులు లేవంటున్నారు.

ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేసినా తీరు మార్చుకోని అధికారులు

ఒకటికి రెండుసార్లు అధికారులతో జరిగిన కోఆర్డినేషన్ మీటింగ్లో ఎమ్మెల్యే స్వయంగా అధికారులు నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా అధికారుల ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేదని చర్చించుకుంటున్నారు.. ఎమ్మెల్యే కఠినంగా వ్యవహరించకపోతే అధికారుల్లో మార్పు వచ్చే పరిస్థితి లేదంటున్నారు. కొందరు అధికారులు ఇంకా మాజీ లకే సహకరిస్తున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. అదేమని అడిగితే కొత్త ఎమ్మెల్యే కూడా పాత ఎమ్మెల్యే కి చుట్టామే కదా అధికారులు కప్పదాటు సమాధానం చెప్తున్నారంట

ముందు ముందు అధికార పార్టీకి ఇబ్బందులు తప్పవని చర్చ

నియోజవర్గంలో కొన్ని ప్రాంతాల్లో అధికారులు పనితీరు చూస్తే తాము అధికార పార్టీలో ఉన్నామా .. లేకపోతే ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నామా అనిపిస్తోందని టీడీపీ క్యాడర్ గగ్గోలు పెడుతోంది. స్థానిక ఎమ్మెల్యే సామరస్యంగా వెళ్లాలని చెప్తుండటంతో అధికారుల ఇష్టారాజ్యంగా మారిపోయిందంటున్నారు. అధికారులు ఇదే విధంగా వ్యవహరిస్తే ప్రస్తుతానికైతే పర్లేదు కానీ రానున్న రోజుల్లో కూడా ఇలానే వ్యవహరిస్తే అధికార పార్టీకి ఇబ్బందులు తప్పవన్న చర్చ నడుస్తోంది. ఎమ్మెల్యే దూకుడు పెంచకపోతే ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు అందకుండాపోయి.. అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Related News

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Nellore Politics: అనిల్ దెబ్బకు వేమిరెడ్డి వెనక్కి తగ్గాడా?

AP BJP: ఏపీలో బీజేపీకి అన్యాయం జరుగుతుందా?

AP Liquor Scam Case: జగన్‌ను ఇరికించిన చెవిరెడ్డి?

BIG Shock To Donald Trump: ట్రంప్‌కు మోదీ దెబ్బ.. అమెరికా పని ఖతమేనా

T Congress: కాంగ్రెస్‌లో టెన్షన్..? కార్యవర్గ పోస్టుల భర్తీ ఎప్పుడు..

Big Stories

×