Political War: విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీలో కిమిడి ఫ్యామిలీ పాలిటిక్స్ చర్చనీయాంశంగా మారాయి. చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణను ఓడించిన కిమిడి కళావెంకట్రావు తన కుమారుడి పొలిటికల్ ఫ్యూచర్ కోసం చక్రం తిప్పుతున్నారంట. కొడుకు కోసం సోదరుడి కుమారుడైన కిమిడి నాగార్జునకు ఎర్త్ పెట్టాలని చూస్తున్నారంట. పెదనాన్న సీనియర్ కిమిడి కోసం తన సీటు త్యాగం చేసి, గత ఎన్నికల్లో పోటీకి దూరమైన నాగార్జున రాజకీయ భవిష్యత్తుపై టీడీపీ అధిష్టానం హామీ ఇచ్చింది. ఎప్పటికైన సముచిత స్థానం దక్కకపోతుందా అని ఎదురు చూస్తున్న నాగార్జునకు ఏ పదవి దక్కకుండా చేయడానికి కళా వెంకట్రావు పావులు కదుపుతున్నారంట. అసలు కిమిడి కుటుంబంలో ఆ పదవుల రచ్చేంటో మీరే చూడండి.
చీపురుపల్లిలో బొత్సపై విజయం సాధించిన కళావెంకట్రావు
మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావు ..రాష్ట్రంలోనే కీలక నియోజకవర్గాలలో ఒకటైన ఉమ్మడి విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి ఎమ్మెల్యే .. ప్రస్తుత శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణపై సుమారు 10 వేల ఓట్ల మెజారిటీతో గెలిచిన కళా వెంకట్రావు 2024లో ఆరోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టారు . ఇంకేముంది ఆయన సీనియార్టీ, అదీకాక బొత్సపై గెలవడం.. ఇలా అనేక సమీకరణాలతో మంత్రి పదవిపై కన్నేశారు. బొత్సకు పెట్టని కోట లాంటి చీపురుపల్లిలో ఆయన్ని ఓడించిన కళావెంకట్రావుకి మంత్రి పదవి గ్యారంటీ అనుకున్నారంతా . జిల్లాలో కూడా అదే టాక్ నడిచింది .
స్పీకర్, డిప్యూటీ స్పీకర్ రేసులో వినిపించిన కళా పేరు
మరోవైపు మంత్రి పదవి కాకపోతే కళావెంకట్రావు సీనియర్టీ దృష్ట్యా స్పీకర్ పదవి అయినా దక్కుతుందని ప్రచారం జరిగింది. ఆ రెండూ కాకపోతే డెప్యూటీ స్పీకర్ పదవి కోసం కళా ప్రయత్నం చేస్తున్నారన్న టాక్ నడిచింది. తీరా చూస్తే ఆయన కేవలం చీపురుపల్లి ఎమ్మెల్యేగా మాత్రమే మిగిలిపోయారు. ఎలాంటి పోర్ట్ ఫోలియో గానీ , క్యాబినెట్ ర్యాంక్ గానీ దక్కలేదు . అందుకే కళావెంకట్రావు కూడా కిమ్మనకుండా ఉండిపోయారు . పూర్తిగా సొంతూరు రాజాంకే పరిమితమైపోయారు .
చీపురుపల్లిలో చక్రం తిప్పుతున్న కళా కుమారుడు రామ్‌మల్లిక్
కళావెంకట్రావు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న చీపురుపల్లి నియోజకవర్గానికి మాత్రం తన తనయుడు కిమిడి రామ్‌మల్లిక్ నాయుడుని పంపించి కార్యకలాపాలు సాగిస్తున్నారు . అక్కడి అధికారులకు ఎమ్మెల్యేతో ఏదైనా పనున్నా , సమీక్షలు నిర్వహించాలన్నా రాజాం వెళ్ళాల్సిందే . ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు అవాలన్నా, స్కూళ్ళు, కాలేజీల్లో మధ్యాహ్న భోజన పధకం లాంటివి తనిఖీ చేయాలన్న , ప్రభుత్వ పధకాలు ప్రారంభించాలన్నా రామ్‌మల్లిక్ నాయుడు అన్ని తానై నడిపిస్తూ షాడో ఎమ్మెల్యేగా చక్రం తిప్పుతున్నారు.
కిమిడి ఫ్యామిలీలో పదవుల కోసం పొలిటికల్ వార్
అయితే వారసుల్ని ప్రోజెక్ట్ చేయడం రాజకీయాల్లో కామనే .. కానీ చీపురుపల్లిలో వచ్చిన చిక్కేంటంటే కిమిడి ఫ్యామిలీలో పదవుల యుద్దమే అంటున్నారు. 2024 ఎన్నికల ముందు వరకూ ఆ నియోజకవర్గంలో టీడీపీ ఇన్చార్జ్‌గా కష్టించి పని చేసింది కళావెంకట్రావు తమ్ముడి కొడుకు కిమిడి నాగార్జున . 2019 ఎన్నికల్లో చీపురుపల్లి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన కిమిడి నాగార్జున బొత్స చేతిలో పరాజయం పాలయ్యారు. అంతకు ముందు అదే చీపురుపల్లి నుంచి నాగార్జున తల్లి కిమిడి మృణాళిని గెలుపొంది చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా పనిచేశారు.
ఎచ్చె్ర్ల నుంచి వలస వచ్చి చీపురుపల్లిలో గెలిచిన కళావెంకట్రావు
అలాంటిది గత ఎన్నికల్లో కిమిడి నాగార్జునకు టీడీపీ టికెట్ దక్కలేదు. ఎచ్చెర్ల నుంచి వలస వచ్చిన కళా వెంకట్రావుకి సీటు ఇవ్వడం గెలవడం అన్ని చక చకా జరిగిపోయాయి . కళావెంకట్రావుని చీపురుపల్లి టీడీపీ అభ్యర్ధిగా ప్రకటించినప్పుడు నాగార్జున అలకపాన్పు ఎక్కారు. అయితే చంద్రబాబు, లోకేష్‌ల నుంచి పొలిటికల్ ఫ్యూచర్‌పై స్పష్టమైన హామీలు లభించడంతో… అప్పటికే విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా నాగార్జున చీపురుపల్లితో పాటు జిల్లాలో టీడీపీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు.
నాగార్జునని పూర్తిగా పక్కన పెట్టేసిన తండ్రీ కొడుకులు
ఆ క్రమంలో అప్పటి వరకు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌గా నాగార్జునకి కూడా చీపురుపల్లిలో పవర్స్ ఉంటాయని , ఆయన పాత్ర ఆయన పోషిస్తారని నియోజకవర్గ కేడర్ భావించింది . కానీ గెలిచాక నాగార్జునను పూర్తిగా పక్కన పెట్టేశారట తండ్రి కొడుకులు. అందుకే నాగార్జున నియోజకవర్గానికి కూడా రాకుండా విశాఖలోనే ఉంటున్నారంట. అక్కడి నుంచే అధిష్టానంతో టచ్‌లో ఉంటూ పదవి కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారట . అయితే విజయనగరం జిల్లా పార్టీ అధ్యక్షుడు హోదాలో జిల్లా పార్టీ కార్యాలయానికి వచ్చి, మీడియా సమావేశాలు నిర్వహిస్తూ విపక్షాలను ఎండగడుతూ .. క్యాడర్‌కి అందుబాటులో ఉండే ప్రయత్నం చేస్తున్నారు .
నాగార్జునకి కళా పదవి దక్కకుండా చేస్తున్నారని ప్రచారం
పార్టీ అధికారంలోకి వస్తే నగార్జునకు కీలక పదవి వస్తుందని అంతా భావించారు కానీ ఇప్పటివరకు ఎలాంటి పదవీ దక్కలేదు. అయితే నాగార్జునకి పదవి రాకపోవడానికి కళా వెంకటరావే కారణమన్నది జిల్లా తెలుగు తమ్ముళ్ల వాదన . అంతేకాదు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో నాగార్జునకి జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
Also Read: ప్రేమ్‌సాగర్ VS వివేక్.. పదవి లొల్లి.!
నియోజకవర్గంలో తనయుడి యాక్టివ్‌గా తిప్పుతున్న ఎమ్మెల్యే
అయితే ఈ పదవికి కూడా కళా వెంకట్రావు ఎసరు పెడతారేమోనని చీపురుపల్లి తమ్ముళ్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దానికి తగ్గట్లు ఇప్పటికే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసిన సీనియర్ కమిడి , తన తనయుడు రామ్‌మల్లిక్ నాయుడుని అందుకే నియోజకవర్గంలో యాక్టివ్ గా తిప్పుతున్నారట .
కొడుకుని జడ్పీ చైర్మన్‌గా చూడాలని ఆరాటం
జడ్పీటీసీ ఎన్నికల్లో రామ్‌మల్లిక్‌ని నియోజకవర్గంలోని గరివిడి నుండి పోటీ చేయించి జడ్పీ ఛైర్మన్‌గా చూడాలని కళా ఆరాటపడుతున్నారట . ఎలాగో తనకు మంత్రి పదవి దక్కలేదు కాబట్టి జడ్పీ చైర్మన్ పదవైనా ఇవ్వాలని అధిష్టానాన్ని రిక్వస్ట్ చేస్తూ, కన్వీన్స్ చేసే పనిలో పడ్డారంట ఆ సీనియర్ నేత. ఆ క్రమంలో మరోసారి నాగార్జునకి రాజకీయ భవిష్యత్ లేకుండా కళా వెంకటరావు పావులు కదుపుతున్నారని చీపురుపల్లి తెలుగు తమ్ముళ్ళు భగ్గుమటున్నారంట. చూడాలి మరి చర్యకి ప్రతి చర్యగా నాగార్జున ఎలాంటి స్టెప్ వేస్తారో.