Kavitha: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన కొత్త పార్టీ ఏర్పాటు ప్రయత్నాల్లో వేగం పెంచారు. ఈ నెల 25వ తేదీన పార్టీని ప్రారంభించనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన ఆమె, దానికి తెలంగాణ రాష్ట్ర సమితి పేరును పరిశీలిస్తున్నట్లు చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ శ్రేణుల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయంట. “పాత పేరు, కొత్త జెండా, కొత్త అజెండాతో ప్రజల ముందుకు వస్తాను” అని ఆమె చెప్పడం ఈ చర్చకు మరింత బలాన్నిచ్చింది. దీంతో తెలంగాణ సెంటిమెంట్‌తో మమేకమైన పేరును కవిత సొంతం చేసుకుంటే .. దాని ప్రభావం బీఆర్ఎస్‌పై ఎలా ఉండబోతుందనేది ఉత్కంఠ రేపుతోంది
తెలంగాణ జాగృతి చీఫ్ కవిత కొత్త పార్టీ ఏర్పాటుపై వేగంగా అడుగులు వేస్తున్నారు. జెండా, అజెండా విషయంలో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈనెల 20 నాటికి అంతా పూర్తి కావచ్చని, 25న అన్ని డీటేల్స్ ప్రకటించేందుకు అవకాశం ఉంది. అదే పార్టీ ప్రకటన ముహూర్తమని కవిత ఇప్పటికే ప్రకటించారు. అయితే ఆమె పెట్టబోయే పార్టీ పేరుపై జరుగుతున్న ప్రచారాలతో బీఆర్ఎస్‌లో తీవ్ర దుమారం మొదలైదంట.
కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్)గా మారడంతో ప్రస్తుతం టీఆర్ఎస్ పేరు ఎవరైనా వాడుకోవచ్చని కవిత వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమ సెంటిమెంట్‌తో పాటు టీఆర్ఎస్ పేరుతో ముడిపడిన భావోద్వేగాలను తనవైపు తిప్పుకోవాలనేది ఆమె వ్యూహంగా కనిపిస్తోంది. అయితే, పార్టీ పేరు టీఆర్ఎస్ అయినా జెండాలో మాత్రం గులాబీ రంగు ఉండదని ఆమె స్పష్టం చేశారు. తమ పార్టీ ప్రొఫెసర్ జయశంకర్ సిద్ధాంతాల పునాదిపై నడుస్తుందని, ‘బిహార్ సిద్ధాంతాలకు’ తమ పార్టీలో చోటుండదని స్పష్టం చేశారు.
పార్టీ రిజిస్ట్రేషన్ కోసం తెలంగాణ జాగృతి బృందం ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద ‘తెలంగాణ ప్రజా జాగృతి పార్టీ’ పేరుతో ప్రక్రియ ప్రారంభించింది. అయితే ఆ దరఖాస్తుపై అభ్యంతరాలు వ్యక్తం అవ్వడంతో మళ్లీ దరఖాస్తు చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని కోర్టు ఆదేశించడంతో ఈసీ ఆ పనిలో ఉంది. ఆ క్రమంలో కవిత టీఆర్ఎస్ గురించి ప్రస్తావించడం ప్రాధాన్యత సంతరించుకుంది. కొత్త పార్టీకి తెలంగాణ రాష్ట్ర సమితి పేరు పరిశీలిస్తున్నట్లు వార్తలు జోరందుకున్నాయి.
కవిత నోట టీఆర్ఎస్ పేరు వినిపించగానే తెలంగాణ రాజకీయాల్లో దుమారం మొదలైంది. దీంతో తెలంగాణ ఉద్యమంతో ముడిపడిన టీఆర్ఎస్ పేరును సొంతం చేసుకోనున్నారా? అదే జరిగితే బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? ఆ పార్టీకి ఇబ్బందికర పరిణామాలు తప్పవా? అన్న ప్రశ్నలు గులాబీ శ్రేణులను తీవ్ర కలవరానికి గురిచేస్తున్నాయంట. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్‌గా మార్చడంతో పాత పేరును ఎవరైనా వాడుకోవచ్చని బహిరంగంగా వ్యాఖ్యానించారు కవిత.
టీఆర్ఎస్‌ను ఉద్యమ పార్టీగా పేర్కొంటూ కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని నడిపారు. ఆ పేరుతో కేసీఆర్ పార్టీ రెండు సార్లు అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఆ పార్టీ పేరు వెనుక ఉద్యమ సెంటిమెంట్, ఆ పేరుతో ముడిపడిన భావోద్వేగాలను తన వైపు తిప్పుకోవాలనేది కవిత వ్యూహంగా కనిపిస్తోందని అంటున్నారు. కవిత వ్యూహం వెనుక ఎవరున్నారు? ఎందుకు ఆమె టీఆర్ఎస్ పేరు పెట్టాలనుకుంటున్నారు? అంటే.. దాని వెనుక రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. ఈ
2023 అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లే ముందు బీఆర్ఎస్ కీలక నేతలు ప్రశాంత్ కిషోర్‌ని హైదరాబాద్‌కు రప్పించారు. రాష్ట్రవ్యాప్తంగా డేటా తెప్పించుకున్న పీకే గులాబీ పార్టీకి పలు కీలక సూచనలు చేశారు. ఆ సమయంలో బీఆర్ఎస్ నేతలు ఆయన్ని చిన్నచూపు చూశారట. దీంతో పీకే అక్కడి నుంచి వెళ్లిపోయారు. బీఆర్ఎస్‌లో జరిగిన ఈ పరిణామాలు అప్పట్లో ఆ పార్టీలో కీలకంగా ఉన్న కవితకు తెలియనేవేమీ కాదు. అందుకే ఈ ఏడాది జనవరిలో హైదరాబాద్‌కు పీకేను రప్పించారట. ఆయన ఇచ్చిన సూచనలు, సలహా మేరకు కవిత అడుగులు వేస్తున్నట్లు బీఆర్ఎస్ లోని ఓ వర్గం చర్చించుకుంటోంది.
కొత్త పార్టీ పేరును ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కొంత సమయం పడుతుందని, పాత పేరు అయితే బాగుంటుందని ప్రశాంత్ కిషఓర్ సలహా ఇచ్చినట్టు పొలిటికల్ సర్కిల్స్‌లో ప్రచారం సాగుతోంది. పీకేతో కవిత చర్చల తర్వాత రీసెంట్ గా జరిగిన మీడియా సమావేశంలో ఆమె ఆ పేరును ప్రస్తావించారని నేతలు అనుకుంటున్నారు. టీఆర్ఎస్ పేరుతో కవిత వస్తే తమ పార్టీకి గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎదురుదెబ్బ తగులుతుందని బీఆర్ఎస్ నేతలు బెంబేలెత్తి పోతున్నారంట. మొత్తానికి కవిత రాజకీయ పార్టీ ఏమోగానీ బీఆర్ఎస్ నేతల్లో మాత్రం టెన్షన్ పీక్ స్టేజ్‌కి చేరిందంటున్నారు.
Also Read: వివాహేతర సంబంధాలు కోరుకునే వారికి కొత్త యాప్.. దేశంలో జోరుగా సాగుతున్న ట్రెండ్
Story by: Apparao, Big Tv