TDP VS YSRCP: అప్పుడెప్పుడో.. ఐదేళ్ల కిందటి కేసు. మళ్లీ.. ఇప్పుడు తెరమీదికొచ్చింది. అమృత్ పథకం పైలాన్ కూల్చివేత కేసు.. ఇప్పుడు నెల్లూరు జిల్లా కావలిలో మలుపుల మీద మలుపులు తిరుగుతోంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి ఈ కేసులో ఐదో నిందితుడిగా ఉండటంతో.. లోకల్ పాలిటిక్స్ ఒక్కసారిగా హీటెక్కాయ్. అప్పట్లో రాజకీయ దుమారం రేపిన ఈ కేసు.. ఇప్పుడెందుకు తెరమీదికొచ్చింది? కూటమి నేతలు రివేంజ్ ఏమైనా ప్లాన్ చేశారా? అసలు.. కావలిలో ఏం జరుగుతోంది
2018లో అమృత్ పథకం పైలాన్ ఆవిష్కరించిన లోకేశ్
2018లో టీడీపీ నేత నారా లోకేశ్ కావలిలో అమృత్ పథకానికి సంబంధించిన ఓ పైలాన్‌ని ఆవిష్కరించారు. దానిని 2020లో ఓ అర్ధరాత్రి కూల్చేసి.. మందాడి చెరువులో పడేశారు. అయితే.. అప్పట్లో ఈ ఘటన స్థానికంగా పెద్ద దుమారమే రేపింది. ఆనాటి ప్రతిపక్ష పార్టీ నేతలు నిరసనలు తెలిపినా.. పట్టించుకున్న నాథుడే లేడు. మళ్లీ.. ఇన్నాళ్లకు.. ఆ కేసు తెరమీదికొచ్చింది.
వైసీపీ టౌన్ ప్రెసిడెంట్ కేతిరెడ్డి శివకూమార్ రెడ్డి
పైలాన్ ధ్వంసం కేసులో.. కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డితో పాటు మరో 11 మంది నిందితులుగా ఉన్నారు. ఇప్పటికే.. నలుగురిని అరెస్ట్ చేసి సబ్‌జైలుకు పంపారు. మిగతా వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసులో.. మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డితో పాటు మాజీ ఏఎంసీ ఛైర్మన్ మన్నెమాల సుకుమార్ రెడ్డి, వైసీపీ టౌన్ ప్రెసిడెంట్ కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, వైసీపీ నేతలు కేతిరెడ్డి జగదీశ్ రెడ్డి, చెన్ను ప్రసాద్ రెడ్డి ఉన్నారు.
ప్లెక్సీలో రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి ప్రభుత్వ అధికారుల ఫోటోలు
తెలుగుదేశం ప్రభుత్వంలో.. కావలిలో అమృత్ పథకం కింద 80 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు సంబంధించిన పైలాన్‌ని.. మంత్రి నారా లోకేశ్ ఆవిష్కరించారు. వైసీపీ సర్కార్ 2020 ఏప్రిల్‌లో.. ఈ శిలాఫలకాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేసినట్లు.. అప్పటి మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేశారు. దాంతో.. పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే.. అదే స్థలంలో మరుసటి రోజు ప్రెస్ క్లబ్ నిర్మిస్తున్నట్లు భూమి పూజకు ప్రముఖులను ఆహ్వానిస్తూ.. ఓ ప్లెక్సీని కూడా ఏర్పాటు చేశారు. ఆ ప్లెక్సీలో.. అప్పటి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డితో పాటు కొందరు ప్రభుత్వ అధికారుల ఫోటోలు కూడా ఉండటం అప్పట్లో దుమారం రేపింది.
Also Read: ఆర్కేతో జగన్ ప్లాన్.. అమరావతి ప్రజలు నమ్ముతారా?
మళ్లీ తెరమీదికొచ్చిన పైలాన్ ధ్వంసం కేసు
పైలాన్ ధ్వంసమైన ప్రాంతంలో సీసీ కెమెరాలున్నా పోలీసులు ఎందుకు మౌనంగా ఉన్నారో తెలియట్లేదని.. అప్పటి ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, బీజేపీ, వామపక్ష పార్టీలు ప్రశ్నించాయ్. అయినా.. ఈ ఇష్యూని పెద్దగా పట్టించుకోలేదనే విమర్శలున్నాయ్. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో.. మళ్లీ పైలాన్ ధ్వంసం కేసు తెరమీదికొచ్చింది. ఆనాడు పైలాన్ ధ్వంసం చేసిన ఘటనకు సంబంధించి.. ఇప్పుడు సీసీ ఫుటేజ్ ఉందా? అప్పుడు పోలీసులు ఎందుకు మౌనం వహించారు? రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గారా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయ్.
తనను అరెస్ట్ చేస్తే వేల మంది కార్యకర్తలు వస్తారనే హెచ్చరికలు
అయితే.. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే.. తమపై అక్రమ కేసులు బనాయించారని మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి ఆరోపిస్తున్నారు. అవసరమైతే తానే లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నానని.. వివిధ మాధ్యమాల ద్వారా చెబుతున్నారు. తనని అరెస్ట్ చేస్తే.. కావలిలో వేల మంది కార్యకర్తలు వస్తారనే హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. అయితే.. యువగళం పాదయాత్ర సమయంలోనే.. పైలాన్ ధ్వంసం చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదని.. లోకేశ్ హామీ ఇచ్చారు. దాంతో.. కావలి నియోజకవర్గంలో అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు.. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. అటు తిరిగి.. ఇటు తిరిగి.. ఈ పైలాన్ ధ్వంసం కేసు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మెడకు చుట్టుకుంటుందనే చర్చ మొదలైంది. అయితే.. పోలీసులు ఈ కేసులో ఎలా వ్యవహరించబోతున్నారనే దానిపై జిల్లా రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ప్రతాప్ రెడ్డిని గనక అరెస్ట్ చేస్తే.. కావలి రాజకీయం ఎలా మారుతుందనేది కూడా ఆసక్తి రేపుతోంది.