కేటీఆర్ ఈ మధ్య జెన్‌జీ జపం చేస్తున్నారు. జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ పార్టీ చేపట్టిన ఆందోళన సక్సెసయిన నాటి నుంచి ఆయన నోటి వెంట పదే పదే జెన్‌జీ పదం దారాళంగా వస్తోంది. తాజాగా ఇవాళ కరీంనగర్‌లో జరిగిన బీఆరెస్ పార్టీ నిర్వహించిన యువత మీటింగులో ఆయన ప్రసంగమంతా జెన్‌జీని ఆకర్షించే విధంగానే కొనసాగింది.
నిరుద్యోగులను ఆకట్టుకునే విధంగా, పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలపై అసెంబ్లీలో గళం విప్పుతామని ప్రకటిస్తూ జెన్‌జీని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేసిన కేటీఆర్.. వీరితో కలిసి ఢిల్లీలో ఆందోళన కూడా చేపడతానని ప్రకటించడం కొత్త విషయం.
కాక్రోచులు మొన్న జంతర్ మంతర్ వద్ద చేపట్టిన నిరసన దీక్షకు మద్దతు తెలిపేందుకు వెళ్తే రాజకీయ రంగు పులుముతారని, అందుకే తాను అక్కడికి వెళ్లడం లేదని ప్రకటించిన ఆయన.. ఇప్పుడు అక్కడికే ఏకంగా తెలంగాణ యువతను వెంటబెట్టుకుని పోయి ఆందోళన చేపడుతానని ప్రకటించారు.
జెన్‌జీలు ప్రధాని మోడీనే వణికించారన్న కేటీఆర్.. ఇక్కడున్న రేవంత్‌ను వారికి ఏపాటి..? అని యువతను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. అంతే కాదు.. ఇన్‌స్టాగ్రామ్‌లో సర్కార్‌ను నిలదీస్తూ, ప్రశ్నిస్తూ వీడియోలు పోస్ట్ చేయాలని కూడా పిలుపునిచ్చారు. రాసుకుని వచ్చి మరీ సినిమా డైలాగులు కొట్టి వారిని ఆకర్షించే ప్రయత్న చేశారు కేటీఆర్.
ఎవరు కొడితే దిమ్మదిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో వారే కేసీఆర్ అని మహేశ్‌బాబు పోకిరి సినిమాలోని ఫేమస్ డైలాగు కొట్టి యువత చేత చప్పట్లు కొట్టించుకున్నారు. మల్లి పుడతామా ఏంటీ? అని పెద్ది ఫేమస్ డైలాగును కూడా పలికారు. అతడు సినిమాలో బ్రహ్మానందాన్ని మహేశ్‌బాబు కడపులో గుద్దే కామెడీ సీన్‌ను గుర్తు చేసి కేసీఆర్, రేవంత్‌కు దీన్ని ఆపాదించేలా వ్యంగ్యంగా మాట్లాడారు.
తెలంగాణకు బద్ద శత్రువైన కాంగ్రెస్‌ను ఎలా గెలిపించారో అర్థం కావడం లేదని, ఆదమరిచి ఓట్లేశారేమో అని తన అసహనాన్ని వ్యక్తం చేశారు.
యువత విషయంలో రేవంత్‌రెడ్డికి ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్, అసూయ, ద్వేషం ఉందని, అందుకే ఇంజినీరింగ్ విద్యార్ధులను క్రిమినల్ వేస్ట్ అంటున్నారని, ప్రభుత్వ భూముల కోసం పాలిటెక్నిక్ విద్యను స్కిల్ వర్సిటీలో కలిపేద్దామనుకుంటున్నారని అన్నారు.
ఫీజు రియంబర్స్ మెంట్ ఇవ్వడం లేదన్నారు. లక్ష్మీ సినిమాలో వెంకటేశ్, బ్రహ్మానందంల మధ్య కామెడీ సీన్ దేఖో మై శాడిజం.. అంటూ డైలాగు కొట్టి మరీ సర్కార్ యువతతో ఇలాగే ప్రవర్తిస్తున్నదని చెప్పుకొచ్చారు కేటీఆర్.