Krishna Water: తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల పంచాయితీ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) త్రిసభ్య కమిటీ సమావేశంలో తేలలేదు. హైదరాబాద్‌లోని జలసౌధలో శుక్రవారం బోర్డు సభ్య కార్యదర్శి సతీష్ కుమార్ కాంబోజ్ ఆధ్వర్యంలో ఇరు రాష్ట్రాల ఈఎన్‌సీల సుదీర్ఘ భేటీ జరిగింది. సుమారు 3 గంటల పాటు చర్చకొనసాగింది. శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల నుండి తాగునీటి అవసరాల కోసం నీటిని పంచుకునే అంశంపై పట్టువిడుపులు లేకపోవడంతో ఇరు రాష్ట్రాల ప్రతినిధుల మధ్య ఎటువంటి ఏకాభిప్రాయం కుదరలేదు.దీంతో ఈ వివాదాస్పద అంశాన్ని తదుపరి బోర్డు పూర్తి స్థాయి సమావేశంలో చర్చించి తేల్చాలని కమిటీ నిర్ణయించింది.
రాబోయే నీటి సంవత్సరానికి (సెప్టెంబరు 2026 నుంచి ఆగస్టు 2027 వరకు) తాగునీటి అవసరాల కోసం 104 టీఎంసీల నీరు కావాలని ఏపీ ఈఎన్‌సీ కోరారు. ప్రస్తుతం జలాశయాల్లో ఉన్న నీటి లభ్యతను బట్టి, 66:34 నిష్పత్తి ప్రకారం తమకు దక్కాల్సిన 97.41 టీఎంసీల వాటాను తక్షణమే విడుదల చేయాలని పట్టుబట్టారు. అలాగే శ్రీశైలం ఎడమగట్టు పవర్ హౌస్ నుంచి తెలంగాణ జరుపుతున్న ఏకపక్ష నీటి విడుదలను నిలిపివేయాలని ఏపీ కోరింది.
Also read: టీచర్స్‌కు సీఎం రేవంత్ శుభవార్త.. పీఆర్సీపై కీలక ప్రకటన, రెండేళ్ల తర్వాత..
ఉమ్మడి జలాశయాల్లో లభ్యతగా ఉన్న నీటిని ఇరు రాష్ట్రాల మధ్య 50:50 నిష్పత్తిలోనే పంపిణీ చేయాలని తెలంగాణ ఈఎన్‌సీ పట్టుబట్టారు. బేసిన్‌లోని జనాభా ప్రాతిపదికన తాగునీటి అవసరాలను పంచుకోవాలని ఆయన ప్రతిపాదించారు. రాబోయే నీటి సంవత్సరానికి గాను తాగునీటి అవసరాల (46 టీఎంసీలు)తో కలిపి మొత్తం 200 టీఎంసీల నీరు తెలంగాణకు కావాలని బోర్డును కోరారు. అలాగే ఏపీకి చెందిన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా జరుపుతున్న నీటి డ్రాబ్యాక్ ను నిలిపివేయాలని తెలంగాణ పట్టుబట్టింది. వెలిగొండ ప్రాజెక్టుకు నీటి విడుదలను సైతం నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
ప్రస్తుతం నెలకొన్న ఎల్ నినో ప్రభావం, రాబోయే నెలల్లో తక్కువ వర్షపాతం నమోదవుతుందన్న వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో అందుబాటులో ఉన్న నీటిని అత్యంత పొదుపుగా వాడుకోవాలని బోర్డు సభ్య కార్యదర్శి హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం (APRA 2014) షెడ్యూల్ XII ప్రకారం సాగునీరు, విద్యుత్ ఉత్పాదన కంటే తాగునీటి అవసరాలకే ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. కేవలం విద్యుత్ ఉత్పత్తి కోసమే జలాశయాల నుండి నీటిని విడుదల చేయరాదని ఉమ్మడి రాష్ట్రాలకు సూచించారు. అలాగే పోతిరెడ్డిపాడు నుండి జరిగే నీటి విడుదలను జలాశయాల నీటి నిల్వలను బట్టి క్రమబద్ధీకరించాలని ఆదేశించారు. త్వరలోనే కృష్ణా బోర్డు (కేఆర్ఎంబీ) పూర్తి స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నట్లు, దీనికి సంబంధించి అనుకూలమైన తేదీలను త్వరగా తెలియజేయాలని ఇరు రాష్ట్రాల ఈఎన్‌సీలను బోర్డు కోరింది.
Also read: విజయసాయిరెడ్డి కీలక నిర్ణయం.. రాజకీయ పార్టీపై సోమవారం ప్రకటన, ఏపీ రాజకీయాల్లో…