22A Land Row: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ రాజకీయం ప్రస్తుతం భూముల చుట్టూ, ముఖ్యంగా 22ఏ (నిషేధిత భూముల జాబితా) అంశంపై తీవ్ర స్థాయిలో వేడెక్కింది. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్నం వరకు పౌరులు, రైతులు, పారిశ్రామికవేత్తలు ఎదుర్కొంటున్న ఈ సమస్యను ప్రధాన రాజకీయ పక్షాలన్నీ తమ రాజకీయ అస్త్రంగా మార్చుకున్నాయి. బీఆర్ఎస్ పార్టీ 22ఏతో రైతులు, పట్టాదారుల భూములన్నీ జాబితాలోకి వెళ్లాయని గళం ఎత్తడంతో బీజేపీ,జనసేన, వామపక్ష పార్టీలు, ఇలా పలు సంస్థలు సైతం దీనిపై కార్యాచరణను ప్రకటించాయి.
గత నెలరోజులుగా బీఆర్ఎస్ పార్టీ 22ఏ అంశంపై నిరంతర గళంవినిపిస్తుంది. వేదిక ఏదైనా సరే ఇదే అంశాన్ని ఎత్తిచూపుతూ ప్రభుత్వంపై విమర్శలు సందిస్తుంది. మీడియా ముందు సైతం అందుకు సంబంధించిన వివరాలను, పట్టాదారు పాసుపుస్తకాలు సైతం నిషేధిత జాబితాలో పడిన సర్వే నెంబర్ల వివరాలను సైతం వివరిస్తున్నారు. పార్టీ సీనియర్ నేతలు హరీష్ రావు, కేటీఆర్ తో సహా అందరూ నేతలు ప్రభుత్వ తప్పిదాన్ని ఎండగడుతున్నారు. అంతేకాదు అన్ని జిల్లాల్లోనూ 22ఏ పరిధిలోకి వెళ్లి, సస్పెన్షన్‌లో లేదా వివాదాల్లో చిక్కుకున్న భూముల సమగ్ర వివరాలను బీఆర్ఎస్ నేతలు సేకరిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ భవన్ లో అందుకు సంబంధించి ప్రత్యేకంగా సిబ్బంది సైతం కేటాయించారు. న్యాయసలహాలు సైతం ఇస్తున్నారు. క్షేత్రస్థాయిలో భూ యజమానులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పాయింట్-టు-పాయింట్ లేవనెత్తుతూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడమే లక్ష్యంగా పార్టీ ముందుకు సాగుతుంది.
ప్రతిపక్షం చేస్తున్న తీవ్ర ఆరోపణలు, విమర్శలపై ప్రభుత్వం అలర్టు అయింది. దిద్దుబాటు చర్యలు చేపట్టింది. 22ఏ పరిధిలోకి వచ్చిన పట్టా భూములన్నింటిని తిరిగి యథావిధిగా కొనసాగేలా చర్యలు తీసుకుంటున్నారు. రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కౌంటర్లు ఇస్తూ ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొడుతున్నారు. గత ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపుతున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు కేవలం ‘ప్రతివిమర్శలు (కౌంటర్లు)’ ఇవ్వడానికే పరిమితమవుతున్నారనే ప్రచారం జరుగుతుంది. ప్రభుత్వమే ముందస్తుగా చర్యలు తీసుకుంటే బాగుండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.గత ప్రభుత్వ హయాంలో జరిగిన ధరణి లోపాలు, భూ సమస్యల వల్లే ప్రస్తుత పరిస్థితి దాపురించిందని కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నప్పటికీ, ప్రతిపక్ష దాడిని తిప్పికొట్టే బలమైన వ్యూహాత్మక కార్యాచరణ క్షేత్రస్థాయిలో లోపిస్తోందనే ప్రచారం జరుగుతుంది.
Also read: విజయసాయిరెడ్డి కీలక నిర్ణయం.. రాజకీయ పార్టీపై సోమవారం ప్రకటన, ఏపీ రాజకీయాల్లో…
పేదలు, అసైన్డ్ భూముల హక్కుదారుల తరఫున భూ పోరాటాలను మళ్లీ ఎజెండాపైకి తెచ్చేందుకు వామపక్షాలు సైతం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే 22ఏ తప్పిదాలను ఎత్తిచూపుతున్నారు. అదే విధంగా బీజేపీ సైతం 22ఏపై రెండు రోజులపాటు ధర్నాచౌక్ లో నిరసన కార్యక్రమం చేపడుతుంది. పోలీసుల అనుమతిసైతం వచ్చింది. జనసేన పార్టీ సైతం నిషేధిత భూముల జాబితాలోకి పట్టాదారు భూములు వెళ్లడంతో ధర్నా సైతం చేపట్టింది. నిబంధనలకు విరుద్ధంగా భూముల వర్గీకరణ జరిగిందని, 22ఏ వల్ల సాధారణ పౌరులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపిస్తూ తమ నిరసన స్వరాన్ని వినిపిస్తున్నాయి.
ప్రభుత్వ/సీలింగ్ భూములు ఒక సర్వే నంబర్ పరిధిలో ఉంటే, అదే సర్వే నంబర్‌లో ఉన్న వందలాది ఎకరాల ప్రైవేటు పట్టా భూములను కూడా అధికారులు 22ఏలో చేర్చేశారని పలువురు పేర్కొంటున్నారు. పరిశ్రమలు, సొసైటీలకు చెందిన భూములు కూడా ఈ జాబితాలోకి వెళ్లడంతో రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం మందగించే ప్రమాదం ఏర్పడిందనే నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం 22ఏ జాబితాలోకి వచ్చిన భూములను తొలగిస్తేనే ప్రభుత్వంపై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతకు సైతం చెక్ పెట్టవచ్చని పలువురు పేర్కొంటున్నారు.
ఒకప్పుడు ధరణి పోర్టల్ చుట్టూ తిరిగిన రాష్ట్ర రాజకీయం, ఇప్పుడు జిల్లాల వారీగా 22ఏ నిషిద్ధ భూముల జాబితా చుట్టూ కేంద్రీకృతమైంది. అంతేకాదు గతంలో కేవలం అధికారిక ప్రక్రియగా భావించిన 22ఏనిషిద్ధ భూముల అంశం, ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో అతిపెద్ద ‘భూ రాజకీయ’ వివాదంగా రూపాంతరం చెందింది. అసెంబ్లీ వేదికగానూ, జిల్లాల వారీగానూ ఈ అంశం రాబోయే రోజుల్లో మరింత తీవ్రస్థాయికి చేరడం ఖాయంగా కనిపిస్తోంది.