Mega DSC: మెగా డీఎస్సీ నియామకాల ప్రక్రియలో నిబంధనల ఉల్లంఘనపై పలువురు అభ్యర్థులు బిగ్‌టీవీని సంప్రదిస్తున్నారు. కడప జిల్లా పరిధిలో ఓసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు ఎంపికైన మునవ్వర్ రసూల్ వ్యవహారం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. టి.సుండుపల్లి మండలం మడితాడు గ్రామంలో స్కూల్ అసిస్టెంట్ బయాలజీ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న మునవ్వర్ రసూల్, గతంలో జరిగిన డీఎస్సీల్లో బీసీ-ఈ కేటగిరీ కింద దరఖాస్తు చేసుకున్నారు. 2008, 2012, అలాగే 2018 డీఎస్సీ పరీక్షల్లో ఆయన బీసీ-ఈ కేటగిరీలోనే ఉద్యోగానికి పోటీ పడ్డారు. కానీ ఈసారి మెగా డీఎస్సీ వచ్చేసరికి ఏకంగా ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో పరీక్ష రాసి ఉపాధ్యాయ పోస్టును సొంతం చేసుకున్నాడు.
మునవ్వర్ రసూల్‌కు మైదుకూరు రెవెన్యూ అధికారులు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ జారీ చేసినట్లు సమాచారం. గతంలో బీసీ-ఈ కేటగిరీకి సంబంధించిన అధికారిక ధ్రువపత్రాలు ఉన్న వ్యక్తికి, ఏ నిబంధనల ప్రకారం ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఇచ్చారనేది మిస్టరీగా మారింది. కులం అనేది నోటిఫికేషన్‌ను బట్టి మార్చుకోవడం సాధ్యమేనా..? రెవెన్యూ రికార్డుల్లో ఉన్న కులాన్ని అధికారులు ఏ విధంగా మార్చారు. కాసులకు కక్కూర్తి పడి పత్రాలు ఇచ్చారా? లేక ఒత్తిళ్లకు తలొగ్గి నిబంధనలను పక్కన పెట్టారా? అనేది తేలాల్సి ఉంది.
Also read: సీఎం రేవంత్ పట్టు.. కులం కార్డుతో కొండాకు చెక్
గత డీఎస్సీల్లో బీసీ-ఈగా అప్లై చేసిన వ్యక్తికి, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ జారీ చేయడానికి ప్రాథమిక ఆధారం ఏంటనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ సర్టిఫికెట్ జారీ చేసే సమయంలో పాత కుల ధ్రువీకరణ రికార్డులను, గత దరఖాస్తులను అధికారులు ఎందుకు పరిశీలించలేదు? నిజమైన అర్హులకు న్యాయం జరగాలంటే ఈ అక్రమ నియామకంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Also read: బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!