ఎన్నికలకు ఇంకా ఎంతో సమయం ఉన్నా.. తెలంగాణలో మాత్రం రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఒకరిపై మరొకరు, పరుష పదజాలం ప్రయోగించుకుంటున్నారు. ఎవరు ఎక్కు వ తిట్టారో.. ఆ రెండుపార్టీల నేతలు సరిపోల్చుకుంటున్నారు కాబోలు.. పోటీలు పడినట్టుగా రోజుకో వేదికల మీద తిట్ల దండకాలు చదవుతున్నారు.
అరేయ్, తురేయ్, వాడు, వీడు.. అనే పదాలు సీఎంపై ప్రయోగించడం కామన్‌గా మారింది. గతంలో ఈ సంస్కృతి లేకుండె. దీనికి కొత్తగా కేటీఆర్ శ్రీకారం చుట్టాడు. ఇవాళ జరిగిన బాన్సువాడ మీటింగులో ఇష్టమొచ్చినట్టు మాట్లాడాడు. రేవంత్‌పై పరుష పదజాలంతో విరుచుకుపడ్డాడు. చిచోరగాడు, బేకార్గాడు, సన్నాసి, పిచ్చోడి చేతిలో రాయి.. గుంపు మేస్త్రీ.. ఇలా వరుసబెట్టి.. సర్కార్‌ను విమర్శించే ప్రతీ అంశంలో.. సీఎం ప్రస్తావన తేవడం.. రేవంత్‌ను ఏదో రకంగా ఓ తిట్టును జోడించి విమర్శించడం… అలవాటుగా చేసుకున్నాడు కేటీఆర్.
రైతు సంగ్రామ సదస్సు పెట్టిన నాటి నుంచి ఈ క్రమాన్ని మెయింటేన్ చేస్తూ వస్తున్నాడు. హౌలాగా, అంటూ ఆ వేదికగా సంబోధించిన కేటీఆర్.. ఇకపై అన్నీ సభల్లోనూ ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాడు. దీనికి బదులుగా రేవంత్ కూడా వెంట వెంటనే ఘాటుగానే రిప్లై ఇవ్వడం… కూడా దీనికి కారణం కావొచ్చు. రేవంత్ .. కేటీఆర్ మాటలకు రిప్లై ఇచ్చే క్రమంలో ఆయనకు అలవాటైన దోరణిలో చెలరేగిపోతున్నాడు. దీంతో ఇది మరింతగా అప్పటి పరిస్థితులను వేడెక్కిస్తున్నాయి. రెచ్చగొడుతున్నాయి.
అందుకే కేటీఆర్ కూడా ఇంకా రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు తప్ప.. సంయమనం పాటించడం లేదు. హుందా రాజకీయాలకు ఇక కేటీఆర్ స్వస్తి పలికినట్టే. అంతో ఇంతో హరీశ్ రావు దీన్ని మెయింటేన్ చేస్తున్నాడు. తిట్టే సమయం వచ్చినప్పుడల్లా హుందాగానే తిడుతున్నాడు. విమర్శలూ హద్దులు దాటించడం లేదు. కానీ కేటీఆర్ రోజు రోజుకు తన తిట్ల స్వరం పెంచుతూ పోతున్నాడు. ఆరోపణలు, విమర్శల గళానికి పరుష పదాల ప్రయోగం కూడా కలగలిపడంతో ఇది మితి మీరిన భాషగా రాజకీయాల్లో చర్చకు వస్తోంది.
ఇలా మాట్లాడితేనే బీఆరెస్‌లో ఉత్సాహం పెరుగుతుందని భావిస్తున్నాడా..? కాంగ్రెస్ మమ్మల్ని ఇదే రీతిన ట్రీట్ చేస్తుంటే… మేమేందుకు ఇంకా హుందా రాజకీయాలు అంటూ పట్టుకు వేలాడాలే..! అనే అభిప్రాయానికి వచ్చినట్టుగా కనిపిస్తున్నది. మూడు నెలలకే పిల్లలు పుడతారా? అని రేవంత్ అన్న మాటలను పదే పదే తన బహిరంగ వేదికల మీద ఆ ప్రస్తావను తీసుకువచ్చి.. మరి 31 నెలలు అయినా ఏం చేయలేకపోతున్న.. నిన్ను ఏమనాలె..? ఇన్ని నెలలైనా బిడ్డ పుట్టడం లేదా? అని హేళనగా మాట్లాడిన మాటలు.. కేటీఆర్ మార్చుకున్న కొత్త రాజకీయ పంథాకు మచ్చుతునకగా చెప్పాలి.
ఆయన తీరంతా మార్చుకున్నాడు. పదేళ్లు అధికారం అనుభవించినప్పుడు.. ఇంతటి పరిస్తితి కేటీఆర్ కు రాలేదు. అప్పుడు వెనుక కేసీఆర్ ఉన్నాడనే ఓ భయం ఉండేదేమో.. ఇప్పుడు అంతా తానై చూసుకుంటున్నాడు.. కేసీఆర్ కూడా పూర్తిగా కేటీఆర్‌కు అప్పగించేశాడు..అందుకే నేను కేసీఆర్ అంత మంచోడిని కాదు.. అని చెప్పిన మాటలను నిజం చేయడానికి అయితే బెదిరింపులు.. లేదా తిట్లు.. వెకిలి మాటలు.. హేళన ప్రసంగాలు చాలా కామన్‌గా చేసేస్తున్నాడు కేటీఆర్. ఇదిప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తోంది.