AP Politics Latest News: నారా లోకేష్ తొలి సారి మంత్రిగా పనిచేసినప్పుడు ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ నేతలు లోకేష్‌ను టార్గెట్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. టీడీపీ ప్రతిపక్షంలోకి వచ్చి అయిదేళ్లు గడిచేటప్పటికీ లోకేష్‌లో పొలిటికల్ మెచ్యూరిటీ స్పష్టంగా కనిపిస్తోంది. అదే వైసీపీ అధ్యక్షుడు జగన్ ఒక్క ఛాన్స్ అంటూ పవర్‌లోకి వచ్చి అయిదేళ్లు సీఎంగా పనిచేసినా రాజకీయ పరిపక్వత సాధించలేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అందుకు తాజా మీడియా సమావేశాల్లో ఆయన చేస్తున్న వ్యాఖ్యలే నిదర్శనమంటున్నారు..
నారా లోకేష్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్య నాయకుడు
నారా లోకేష్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్య నాయకుడిగా ఎదిగారు. ఒకప్పుడు చాలామంది ఆయనను తక్కువ అంచనా వేశారు. సోషల్ మీడియాలో పలు సెటైర్లు కూడా వచ్చాయి. వైసీపీ నేతలు పప్పు, పప్పు అని వ్యంగాస్త్రాలు సంధించారు. మాజీ మంత్రి రోజా అయితే వైసీపీ 2014లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంతసేపు ముద్దపప్పు అన్న పదాన్ని తన ఊతపదంగా మార్చుకుని లోకేష్‌పై విమర్శలు గుప్పించారు.. 2019 ఎన్నికల్లో తొలిసారి మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయిన లోకేష్ ఆ విమర్శలనే తన బలంగా మార్చుకొని, ఒక శక్తివంతమైన నాయకుడిగా ఎదుగుతున్నారు.
సమగ్ర విచారణ తర్వాత పక్కా ఆధారాలతో జరుగుతున్న అరెస్టులు
సహజంగా కక్షసాధింపు రాజకీయాలంటే అందరూ వ్యతిరేకిస్తారు. ఆ కక్ష సాధింపు చర్యలతో జగన్ పాలనలో ఆయనపై వ్యతిరేకత పెరిగింది. అయితే ప్రస్తుత కూటమి పాలనలో లోకేష్ రెడ్ బుక్‌పై అంత వ్యతిరేకత కనిపించడం లేదు. అప్పట్లో ఏ ఆధారాలు లేకుండా చంద్రబాబుని అరెస్ట్ చేసినట్లు.. ప్రస్తుతం అరెస్టులు జరగడం లేదు. ప్రతి ఇష్యూపై సమగ్ర విచారణ తర్వాత, పక్కా ఆధారాలతోనే జగన్ సన్నిహితులు, వైసీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు.
లోకేష్ రాజకీయ పరిపక్వతపై ప్రశంసలు
లోకేష్‌లో స్పష్టమైన మార్పు 2024 ఎన్నికల ముందు నుంచే ప్రజలకు కనిపించసాగింది. చంద్రబాబు అరెస్ట్ సమయంలో, యువగళం పాదయాత్రలో ఆయనలోని రాజకీయ పరిపక్వత, ప్రసంగాల్లో వచ్చిన మార్పు బహిర్గతమైంది. ఇప్పుడు ఆయన తన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మార్గదర్శకత్వంలోనే కాకుండా తనదైన శైలిలో పార్టీకి, ప్రభుత్వానికి సేవలందిస్తున్నారు. తండ్రి హైదరాబాద్‌లో ఐటీ రంగాన్ని అభివృద్ధి పరచినట్లే కుమారుడు డిజిటల్ పాలనను ప్రోత్సహిస్తూ వాట్సాప్ గవర్నెన్స్ వంటి కార్యక్రమాలను తీసుకొచ్చారు.
లోకేష్ ప్రసంగాల్లో కనిపిస్తున్న స్పష్టత
లోకేష్‌లో రాజకీయ పరిపక్వత పెరిగింది. మంత్రిగా శాఖలపై అవగాహనతో పని చేస్తున్నారు. ఇటీవల ఆయన ప్రసంగాల్లో ప్రజల సమస్యలపై స్పష్టత కనిపిస్తోంది. ఆయనను పార్టీలో భావితరాల నాయకుడిగా చూస్తున్నారు. చంద్రబాబుతో పొత్తును కొనసాగించాలని చూస్తున్న బీజేపీకి లోకేష్ కూడా సరైన నాయకుడిగా కనిపిస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వయంగా లోకేష్‌ను ఆహ్వానించి భేటీ అవుతున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాసహా బీజేపీ నాయకత్వం టీడీపీ వారసుడిపై అనుకూలంగా ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
బీజేపేకి పరోక్ష మిత్రుడిలా పనిచేసిన జగన్
ఇటు చూస్తే అధికారంలో ఉన్న అయిదేళ్లు కేంద్రానికి అన్ని విషయాల్లో మద్దతిస్తూ.. బీజేపీకి పరోక్ష మిత్రుడిలా వైసీపీ అధ్యక్షుడు జగన్ పనిచేశారు. అదే జగన్ గత ఎన్నికల్లో ఎన్టీఏ కూటమికి ప్రధాన శత్రువయ్యారు. అధికారంలో ఉన్నంత కాలం నియంత్రత్వపు ధోరణులతో వ్యవహరించిన మాజీ సీఎం.. పేరుకి పదుల సంఖ్యలో సలహాదారులను నియమించుకున్నప్పటికీ.. ఎవరి సలహాలను పాటించిన దాఖలాలు కనిపించవు. నవరత్నాలు, బటన్ పాలిటిక్సే తనను తిరిగి గెలిపిస్తాయన్న నమ్మకంతో ఏకపక్షంగా పరిపాలించారన్న విమర్శలున్నాయి.
ప్రజా సమస్యలపై పోరాటాల్లో పాల్గొనని జగన్
సాధారణంగా ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ప్రజలకు చేరువ అవ్వడానికి క్షేత్రస్థాయిలో గ్రౌండ్ వర్క్ మొదలుపెడుతుంది. అయితే ఓడి పోయి ఏడాది గడిపోయినా జగన్ ప్రజా సమస్యలపై పోరాటాల్లో పాల్గొనడానికి ఇష్టపడటం లేదు. ఏదైనా కార్యక్రమం తలపెడితే పార్టీ తరపున పిలుపిచ్చి బెంగళూరు వెళ్లిపోతున్నారు. ఇక ఎప్పుడైనా జనంలోకి వస్తే తన పార్టీ వారి ఓదార్పులు, జైళ్లలో పరామర్శలకే పరిమితమవుతుండటంపై వైసీపీ శ్రేణులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.
జగన్ పొదిలి పర్యటన సందర్భంగా రాళ్ల దాడి
గతంలో వైఎస్ జగన్ అనంతపురం జిల్లాలో పర్యటించారు. ఆ సమయంలో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. తెనాలిలో గంజాయి బ్యాచ్ పరామర్శకు వెళ్లి అభాసుపాలయ్యారు. అలాగే పొగాకు రైతులకు మద్దతు తెలుపుతూ ఇటీవల ప్రకాశం జిల్లా పొదిలిలో వైఎస్ జగన్ పర్యటించారు. ఈ సందర్బంగా రాళ్ల దాడి ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇదే తరహాలో అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ముందు మరో గలాటా సృష్టించేందుకు వైసీపీ పక్కా ప్రణాళిక రూపొందించిదన్న సమాచారంతో జగన్ పల్నాడు పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు.
జగన్ పర్యటనలో రెచ్చిపోయిన అంబటిపై కేసులు
అంత చేసినా వైసీపీ శ్రేణుల అత్యత్సాహం మాత్రం కొనసాగింది. జగన్ పర్యటనలో మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు రెచ్చిపోయారు. అంబటి, అతని సోదరుడు మురళి కలిసి రోడ్డుపై పోలీసులు అడ్డంగా పెట్టిన బారికేడ్‌లు విసిరిపడేశారు. వారిని అడ్డుకోబోయిన పోలీసులపై అంబటి రాంబాబు దౌర్జన్యంగా ప్రవర్తించారు. పోలీసులతో వాగ్వాదానికి దిగి ఏకంగా పోలీసులకే అంబటి సీరియస్ వార్నింగ్ ఇచ్చి ఇప్పుడు కేసులు పెట్టించుకుంటున్నారు. జగన్ పర్యటన మొత్తం దౌర్జన్యాలు, అపశృతులతో ముందుకు సాగింది. సత్తెన్నపల్లి టౌన్లో జగన్ రాకముందే ఓ సీఐపై వైసీపీ శ్రేణులు దౌర్జన్యం చేసి అతడిని నెట్టివేయగా.. మరోవైపు ఆర్టీసీ బస్సుపై జెండా కర్రలతో దాడి చేశారు. సత్తెనపల్లి గడియారం స్థంభం వద్ద ర్యాలీలో తొక్కిసలాట జరిగింది. దీంతో జయవర్ధన్ అనే వైసీపీ కార్యకర్త సొమ్మసిల్లి పడిపోయిడటంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. అదే రోజుఉదయం జగన్ కాన్వాయ్ లోని వాహనం ఢీ కొట్టడంతో సింగయ్య అనే వృద్ధుడు తీవ్రంగా గాయపడారు. పోలీసులు ఆసుపత్రికి తరలించడంతో చికిత్స పొందుతూ ఆయన మరణించారు.
మరణించిన వారిని పట్టించుకోని జగన్
రెంటపాళ్లలో ఏడాది క్రితం ఆత్మహత్య చేసుకుని మరణించిన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన జగన్ తన పర్యటనలో మరణించిన వారి పట్టించుకోకపోవడం తీవ్ర విమర్శల పాలవుతుంది. ఇక జగన్ పర్యటనలో ప్రదర్శించిన ప్లకార్డులు రాజకీయంగా పెద్ద దుమారమే రేపుతున్నాయి. గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు.. రప్పారప్పా నరికేస్తామని ప్రదర్శించిన ప్లకార్డులకు సంబంధించి పోలీసు కేసు నమోదైంది. దానిపై జగన్ క్యాంప్ ఆఫీసులో పెట్టిన మీడియా సమావేశంలో ప్రశ్నిస్తే ఆయన విచిత్రంగా రియాక్ట్ అయ్యారు. పుష్ఫ సినిమాలోని ఆ డైలాగ్ పూర్తిగా చెప్పించుకుని, దాన్ని రిపీట్ చేస్తూ .. అదేదో సినిమా డైలాగ్ అనుకుంటా కదా? సినిమా డైలాగులు పెట్టినా తప్పే.. ఫోటోలు పెట్టినా తప్పే.. గడ్డం ఇలా అన్నా.. అలా అన్నా తప్పేనా? అంటూ సదరు సినిమాలో హీరో మేనరిజం ప్రదర్శిస్తూ హావభావాలు ప్రదర్శించారు. వైసీపీ కార్యకర్తలు ప్రదర్శించిన పోస్టర్లను, అందులో ప్రదర్శించిన డైలాగులను ఖండించాల్సింది పోయి.. జగన్ సమర్థిస్తుండటం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. విధ్వంసకర పార్టీని భూస్థాపితం చేస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలపై అదే పనిగా ఆక్రోశం వెల్లగక్కుతున్న జగన్.. పొట్టేళ్లను నరికినట్లుగా నరికేస్తామంటున్న వారిని సమర్థించటం ఎంతవరకు సబబని అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: పలాసలో పవన్ కామెంట్స్ రీసౌండ్!
జగన్ వ్యవహారతీరుపై సొంత పార్టీలోనే వ్యతిరేకత
జగన్ కామెంట్స్‌కి.. సీఎం చంద్రబాబు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. క్రిమినల్ మైండ్స్.. క్రిమినల్‌గానే ఆలోచిస్తాయని… విశాఖలో జరగనున్న యోగా డేపై నుంచి ప్రజల దృష్టి డైవర్ట్ చేయడానికి జగన్ తాపత్రయపడుతున్నారని విమర్శించారు. మొత్తమ్మీద అయిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి, ఓటమి తర్వాత తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదని అసెంబ్లీకి ముఖం చాటేస్తున్న జగన్ చేస్తున్న వ్యాఖ్యలు, వ్యవహారతీరుపై సొంత పార్టీలోనే వ్యతిరేకత కనిపిస్తోంది. ఒక వైపు లోకేష్ తనదైన పనితీరుతో ప్రధానిని సైతం ఆకట్టుకుంటుంటే.. జగన్ ఓటమిని జీర్ణించుకోలేక పోతున్నట్లు వ్వహరిస్తూ బ్యాలెన్స్ కోల్పోతున్నారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
Story By Apparao, Bigtv