Pawan Kalyan Comments: 2019లో జనసేనాని పవన్‌కళ్యాణ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు పలాసలో రీసౌండ్ ఇస్తున్నాయి. ప్రస్తుత డిప్యూటీ అప్పటి ఎన్నికల ముందు టీడీపీ నేతలపై చేసిన వ్యాఖ్యలు చుట్టూనే ఇప్పుడు అక్కడ రాజకీయం నడుస్తోంది. ప్రస్తుత పలాస గౌతు శిరీష, మాజీ మంత్రి సిదిరి అప్పలరాజులు ఆ వ్యాఖ్యలకు సంబంధించి ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు గుప్పించుకుంటున్నారు. అసలు పవన్ కళ్యాణ్ అప్పుడు చేసిన కామెంట్స్ ఏంటి? ఇప్పుడు నడుస్తున్న రాజకీయం ఏంటి?
పలాసలో జనసేనాని కాక
పలాసలో ట్రెండింగ్ అవుతున్న అల్లుడు టాక్స్..
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పలాసలో అల్లుడు టాక్స్ అన్న పేరు.. ట్రెండింగ్ అవుతోంది. పలాస టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీష భర్తను ఉద్దేశించి వైసీపీకి చెందిన మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు సంధించిన రాజకీయ అస్త్రం ఈ అల్లుడు టాక్స్. దానికి తగ్గట్టుగానే కౌంటర్ చేస్తూ సవాల్ విసిరారు ఎమ్మెల్యే గౌతు శిరీష. కానీ ఉందో లేదో తెలియని ఈ అల్లుడు టాక్స్ అనే మాటకు ఫేమస్ వేసింది మాత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. 2019 ఎన్నికల ముందు ఆయన అప్పటి పలాస ఎమ్మెల్యే గౌతు శివాజీని ఉద్దేశించి చేసిన విమర్శలు ఇప్పుడు వైసీపీకి అస్త్రంగా మారాయి.
2014- 19 మధ్య ఎమ్మెల్యేగా పని చేసిన గౌతు శిరీష తండ్రి
2014 నుంచి 19 మధ్య ఎమ్మెల్యేగా పని చేసిన గౌతు శివాజీపై పవన్ కళ్యాణ్ అప్పట్లో అవినీతి ఆరోపణలు చేశారు. పలాసలో ఆయన అల్లుడు టాక్స్ వసూలు చేస్తున్నారని విమర్శించారు. గౌతు శివాజీ అల్లుడు, ప్రస్తుత ఎమ్మెల్యే శిరీష భర్త యార్లగడ్డ వెంకన్న చౌదరిని ఉద్దేశించి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు, ఇసుక, గ్రావెల్ అక్రమ రవాణాలతో సొమ్ములు పోగు చేసుకున్నారని పవన్‌కళ్యాణ్ అప్పట్లో ఆరోపించారు. అయితే ఇప్పుడు రాజకీయం మారింది. రాజకీయ పరిణామాలు మారాయి. అప్పటి శత్రువులు ఇప్పుడు మిత్రులయ్యారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులుగా కలిసి పనిచేస్తన్నారు. అయితే అప్పుడు సెగలు రాజేసిన పవన్ కామెంట్స్ మాత్రం ఇప్పటికీ నిప్పును రగల్చుతునే ఉన్నాయి.
పవన్ కళ్యాణ్ ఆరోపణలను గుర్తు చేస్తున్న అప్పలరాజు
మద్యం బాటిల్ పై పది రూపాయల అల్లుడి టాక్స్ వసూలు చేస్తున్నారని మాజీ మంత్రి అప్పలరాజు ఇటీవల ఆరోపించారు. అయితే ఇది తాను కొత్తగా చేస్తున్న ఆరోపణ కాదని అప్పట్లో పవన్ కళ్యాణ్ ఈ కామెంట్స్ చేశారని అప్పలరాజు గుర్తు చేశారు. అధికార పార్టీని ఇరుకును పెట్టాలని ఉద్దేశ్యమో? కూటమిలో చిచ్చు పెట్టాలని వ్యూహమో తెలియదు కానీ మాజీ మంత్రి పవన్ కామెంట్స్ ను రాజకీయంగా వాడుకుంటున్నారు. అల్లుడు టాక్స్ పేరుతో పలాసలో ప్రజల రక్తాన్ని పీల్చుతున్నారని విమర్శలు చేశారు.
అప్పలరాజుపై మండి పడుతున్న గౌతు శిరీష
అప్పలరాజు ఆరోపణలపై గౌత శిరీష తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తన హయాంలో అవినీతి జరిగిందని నిరూపిస్తే గౌతు కుటుంబం శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటుందని సవాల్ విసిరారు. అప్పలరాజు అవినీతిని తాను ఎప్పుడో ఆధారాలతో సహా ప్రజల ముందు ఉంచానని, అందుకే ఆయన 40 వేల పైచిలుకు ఓట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయారని కౌంటర్ ఇచ్చారు. అలాంటాయన తాను చేసిన తప్పిదాలకు సగం గుండు కొట్టించుకొని, తన ఇంటి ముందు చెప్పుతో కొట్టించుకొని ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
అవినీతి ఆరోపణలపై గౌతు శిరీష విపక్షానికి గట్టిగానే సమాధానం చెప్పినప్పటికీ.. ఆరోపణలకు బీజం వేసిన పవన్‌కళ్యాణ్ పేరు మాత్రం ప్రస్తావించడం లేదు. ఆమె కౌంటర్లన్నీ వైసీపీ వైపే ఉంటున్నాయి. కానీ పవన్ కళ్యాణ్ కూడా ఆ ఆరోపనలు చేశారు కదా అంటే ఆమె రియాక్ట్ అవ్వడం లేదు. సిదిర అప్పలరాజు మాత్రం అప్పటి జనసేనాని డైలాగ్స్‌ని పట్టుకుని గౌతు కుటుంబంపై బురద జల్లే ప్రయత్నం చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
Story By Apparao, Bigtv