Medak politics: మెదక్ కాంగ్రెస్ పార్టీ లో కోవర్ట్ లు ఉన్నారన్న ప్రచారం కలకలం రేపుతోంది. ఆ కోవర్టులను ఏరి పారేస్తే కాని పార్టీకి పునర్వైభం కాదుకదా..కనీసం పుంజుకునే పరిస్థితి లేదని పార్టీ శ్రేణులు వాపోతున్నాయి. ఇప్పటికైనా కోవర్టులకు చెక్ పెట్టకపోతే కాంగ్రెస్ పార్టీకి పాతాళానికి పోతుందని మాజీ ఎమ్మెల్యే మైనం పల్లి.హనుమంత్రావు చేసి వ్యాఖ్యలు కాంగ్రెస్ పెద్ద కుదుపునకు కారణమవుతున్నాయి. అసలు ఉమ్మడి.మెదక్ జిల్లా కాంగ్రెస్‌లో కొనసాగుతున్న కోవర్ట్ పాలిటిక్స్ ఏంటి?
మెదక్ జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీలో కోవర్ట్ రాజకీయాలు అధికార కాంగ్రెస్ పార్టీని నిండా ముంచుతున్నాయా….అంటే.. ఔను అంటున్నారు ఆ పార్టీ నేతలు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు చేసిన ఈ కోవర్ట్ వ్యాఖ్యలు మరోసారి తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయట. ఇటీవల మెదక్ లో మీడియాతో మాట్లాడుతూ మైనంపల్లి ఓపెన్ గానే తమ పార్టీలో కోవర్టులు ఉన్నారని… అందువల్లే అధికారంలో ఉన్నప్పటికీ జిల్లాలో కాంగ్రెస్ ఎదగడం లేదన్నట్టుగా మాట్లాడారు. కాంగ్రెస్‌లో ఉంటూ ఇతర పార్టీల కోసం పనిచేస్తున్న కార్యకర్తలను, నేతలను గుర్తించాల్సిన అవసరం ఉందన్నారట. జిల్లాలో చాలా మంది కాంగ్రెస్ నాయకులు ఇప్పటికీ బీఅర్ఎస్ కు బీ టీమ్ గా పని చేస్తున్నారన్న పద్ధతిలో తీవ్ర ఆరోపణలు చేశారటా. అలాంటి వారినందరినీ గాలం వేసి పట్టుకుని మరీ బయటకు పంపేస్తానని కాస్త ఘాటుగానే హెచ్చరించారు.
రెండేళ్ల కిత్రం కూడా మైనంపల్లి ఇలాంటే వ్యాఖ్యలు చేశారన్నది జిల్లాలో టాక్. పార్టీకి వ్యతిరేకంగా పని చేసేవారెవరైనా, ఎంతటి వారైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని అప్పట్లోనే వార్నింగ్ ఇచ్చారు . సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలలో కొందరు పార్టీ కోసం నిజాయితీగా పని చేస్తూ పార్టీ సిద్ధాంతాలను తు.చా. తప్పకుండా అనుసరించేవారూ ఉన్నారు. అలాగే పార్టీ, ప్రజలను పట్టించుకోకుండా ఇతర పార్టీలతో లోపాయికారీ ఒప్పందాలతో అంట కాగేవారు, పార్టీకి నష్టం కలిగించేవారు మరి కొందరు ఉన్నారనేది టాక్.
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యానికి కొదవ లేదు. ఈ స్వేచ్ఛ ముసుగులో ఇప్పుడు కోవర్ట్ పాలిటిక్స్ నడుస్తున్నాయని ప్రకటించి కలకలం రేపారు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు. అలాంటి వాళ్ళవల్ల పార్టీకి తీరని నష్టం జరిగిపోతోందని ఆరోపించారు. ఈ కోవర్ట్ సిస్టం పోతే తాము వంద శాతం గెలుస్తామన్నది మాజీ ఎమ్మెల్యే మాట. మెదక్ నియోజకవర్గంలో 75 శాతం మేర పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులు గెలిచారని…కోవర్ట్ రాజకీయాలు లేకుంటే ఇంకా మెరుగైన ఫలితాలు సాధించే వాళ్లమంటున్నరు మైనంపల్లి వర్గీయులు
జిల్లాలో అధికారులు కూడా కాంగ్రెస్ నేతల మాట వినడం లేదంట.. అధికారం మారినా జిల్లాలో ఇప్పటికీ మాజీ మంత్రి హరీష్ రావు, కేసీఆర్ చెప్పిందే నడుస్తుందనే మాట కాంగ్రెస్ నేతల నోట నుండి వస్తుందట. బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయినా మాజీ మంత్రి హరీశ్ రావుకు ఇప్పటికీ పోలీసులు, అధికారులపై పూర్తిస్థాయి కమాండ్ ఉందని చెప్పి ఇంకో సంచలనానికి తెర తీశారు మైనంపల్లి. కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ప్రత్యర్థులకు సమాచారం అందిస్తున్నారని.. వాళ్ళ వల్ల కాంగ్రెస్‌కు తీవ్ర నష్టం జరుగుతోందంటున్నారు మైనంపల్లి. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట వేదికగా హరీష్ రావు.. ఇక నీ రాజకీయం క్లోజ్ అని చెప్పినా, స్థానిక ఎన్నికల్లో సిద్దిపేట నియోజకవర్గంలో 78 సర్పంచ్ స్థానాలు కైవసం చేసుకోవడం కాంగ్రెస్ పెద్దలు జీర్ణించుకోలేక పోతున్నారట. ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ రాజకీయాన్ని క్లోజ్ చేద్దామని అనుకున్నా.. ఆది ఇక్కడి మంత్రులు, కాంగ్రెస్ నేతలకు సాద్యం కావడం లేదనే చర్చ నడుస్తుందట. సిద్దిపేట జిల్లాలో ఒకరకంగా అధికారంలో ఉన్నప్పటికీ, తమ పరిస్తితి ప్రతిపక్షం కంటే హీనంగా మారిందన్న ఆవేదన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల్లో వ్యక్తం అవుతుతోందంట.
మెదక్, సిద్దిపేట జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ కోవర్టులు ఉన్నారని, వారివల్లే పంచాయితీ ఎన్నికల్లో కొన్ని సీట్లు కోల్పోవాల్సి వచ్చిందని అనడంలో ఆంతర్యం ఏంటని నాయకులు చర్చించుకుంటున్నారట. మైనంపల్లి వ్యాఖ్యల్లో నిజం ఉందా… లేదా… ఒకవేళ లేకుంటే గనక ఆయన టార్గెట్ ఎవరన్న చర్చలు సైతం నడుస్తున్నాయట. మెదక్, సిద్దిపేట జిల్లాల్లో చాలా గ్రామపంచాయతీల్లో కాంగ్రెస్ రెబల్స్ ఎక్కువగా పోటీ చేసి గెలిచారు. వాళ్ళకు బీఆర్ఎస్ ఆర్థిక సహాయం చేసి గెలిపించిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. అసలు ఈ పరిస్ధితి ఎందుకొచ్చిందనే చర్చ నడుస్తుందట. ఏళ్ళ తరబడి పార్టీని నమ్ముకుని పని చేస్తే… చివరికి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం రాకపోవడంతోనే రెబల్స్‌గా పోటీ చేశారన్నది మరో వాదన నడుస్తుందట. రెబల్స్‌ను బుజ్జగించి దారిలోకి తీసుకురావడంలో నాయకత్వం విఫలమైందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయట. ఆ క్రమంలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి తీరుపై కూడా కొందరు నాయకులు పెదవి విరుస్తున్నారట
కోవర్టుల ప్రమాదాన్ని, వారి వల్ల జరుగుతున్న నష్టాన్ని గుర్తించిన కొందరు కట్టర్ కాంగ్రెస్ వాదులు ముందునుంచి హెచ్చరిస్తూనే ఉన్నారట. కోవర్టులకు పదవులు వస్తె ప్రమాదమని, పార్టీలో అనేక తప్పిదాలు జరిగాయని, జరుగుతున్నాయని…పద్ధతి మారకుంటే పార్టీకి ఇబ్బందులు తప్పవని కాంగ్రెస్ నే నమ్ముకున్న క్యాడర్ హెచ్చరిస్తున్నాయట. ఇప్పటికైనా పార్టీలో తప్పిదాలను, దొంగలను గుర్తించి, ప్రక్షాళన చేయాలని, అసలు సిసలైన కాంగ్రెస్ నాయకులను గుర్తించాలని హైకమాండ్ కు సూచిస్తున్నాదట. వారి పై నిజంగానే చర్యలు ఉంటాయా అనేదివేచి చూడాలి.
Story By Ramireddy, Big Tv