Telangana News: తెలంగాణ కాంగ్రెస్‌లో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ షాడో పీసీసీగా వ్యవహారిస్తున్నారా..? ప్రభుత్వంపై తనదే పెత్తనమన్నట్లు అనధికార సీఎంలా ప్రవర్తిస్తున్నారా? గత కొంత కాలంగా ఆమె తీరుతో ఇవే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.. ఆ క్రమంలో తాజాగా మేడం పాదయాత్ర నిర్ణయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.. ఏఐసీసీ ఇన్ఛార్జ్ పాదయాత్ర చేయడం ఏంటి..?పార్టీ కోసం పీసీసీ అధ్యక్షుడు ఉన్నారు, పాలనకు ముఖ్యమంత్రి ఉన్నారు.. మరి ఎక్కడ నుంచో వచ్చిన ఇన్ఛార్జ్ పాదయాత్ర చేస్తాననడం వెనుక ఉన్న మర్మం ఏంటి..?
మీనాక్షి షాడో పీసీసీగా వ్యవహరిస్తున్నారని విమర్శలు
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లో షాడో పీసీసీ అధ్యక్షురాలిగా ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ వ్యవహరిస్తున్నారన్న చర్చ గాంధీభవన్‌లో జోరుగా సాగుతోంది. గతంలో ఉన్న ఇన్చార్జిల కంటే భిన్నంగా మీనాక్షి నటరాజన్ వ్యవహారశైలి ఉండడంతో ఇప్పుడు హస్తం పార్టీ లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. పార్టీ నేతలను సమన్వయం చేయడం, పార్టీ కార్యక్రమాలు సజావుగా కొనసాగేలా నేతలను సిద్ధం చేయడం ఇంఛార్జి పని. గతంలో ఉన్న ఇన్చార్జిలు అంతా ఇదే చేసేవారు. కానీ మీనాక్షి నటరాజన్ మాత్రం నేరుగా తానే ముందుండి.. పీసీసీని వెనక్కినెట్టడం కాంగ్రెస్ నేతలను అవాక్కయ్యేలా చేస్తోందంట. తాజాగా ఆమె చేపట్టిన పాదయాత్రే ఇందుకు నిదర్శనం అంటున్నారు.
మహేష్‌గౌడ్ విధులను నిర్వర్తిస్తున్నానంటున్న మీనాక్షి
పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ చేయాల్సిన పనిని ఇంఛార్జి డైరెక్ట్ గా చేస్తానని అంటుండటంతో షాడో పీసీసీ ప్రెసిడెంట్‌గా ఇంఛార్జి వ్యవహరిస్తున్నారన్న టాక్ ఎక్కువవుతోంది. ప్రతీ చిన్న విషయంలో ఇన్చార్జ్ జోక్యంతో పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారంట.. పీసీసీ కి ఫ్రీ హ్యాండ్ ఇవ్వకుండా తానే పీసీసీ అన్నట్లు గా ఇంఛార్జి వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు. గతంలో పీసీసీని ముందు పెట్టి.. ఇంఛార్జి తెరవెనుక పనిచేసేవారని.. ఇప్పుడు పీసీసీని వెనక్కి నెట్టి.. ఇంఛార్జే డైరెక్ట్ గా రంగంలోకి దిగడం పీసీసీ స్థాయి తగ్గించడమే అవుతుందని అంటున్నారు పార్టీ నేతలు మీనాక్షి నటరాజన్ వ్యవహారశైలితో రాష్ట్రం లో పీసీసీకి వాల్యూ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
6 ఉమ్మడి జిల్లాల్లో ఇన్చార్జ్ పాదయాత్రకు షెడ్యూల్
ఏకంగా ఇప్పుడు మీనాక్షి నటరాజన్ పాదయాత్ర కు సిద్ధం అవ్వడం రాష్ట్ర పార్టీ నేతలను ఆశ్చర్యానికి గురి చేస్తుందట.. మొదటి విడతలో 6 ఉమ్మడి జిల్లాలోని ఒకో అసెంబ్లీ నియోజకవర్గంలో పాదయాత్ర చేయాలని మీనాక్షి షెడ్యూల్ రూపొందించుకున్నారు. దానికి సంబంధించిన రూట్ మ్యాప్‌ను కూడా ప్రకటించింది పార్టీ. అయితే స్థానిక నేతలు, లేదంటే మంత్రులు, ఎమ్మెల్యేలు పాదయాత్ర చేస్తే పార్టీకి ఉపయోగంకాని.. ఎక్కడి నుంచో వచ్చిన ఇంఛార్జి, స్థానిక బాష తెలియని నేత పాదయాత్ర చేయడం ద్వారా ఏమి ఉపయోగమనే చర్చ తెర పైకి వస్తోంది..ఈ పాదయాత్ర లో ఇంఛార్జ్ తో పాటు పీసీసీ అధ్యక్షుడు కూడా పాల్గొంటారని ప్రకటించినప్పటికీ.. పక్కన ఢిల్లీ ఇంఛార్జి ఉండడం వల్ల నేతలు ఆమెకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని.. పీసీసీ చీఫ్ ఓక్కరితో పాదయాత్ర జరిపిస్తే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
Also Read: గుడ్‌న్యూస్.. నేడే ఏపీ రైతుల ఖాతాల్లో రూ.7 వేలు జమ..
సెక్రటేరియట్‌కు వెళ్లి సమీక్ష నిర్వహించిన ఏఐసీసీ ఇన్చార్జ్
ఇప్పటికే కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో మీనాక్షి నటరాజన్ సెక్రటేరియట్ కు వెళ్లి సమీక్ష చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది.. దానికి తోడు ఇతర పార్టీ ల నుంచి వచ్చిన వారికి పదవులు లేవంటూనే.. పార్టీ కమిటీ లలో, ప్రభుత్వంలో వివిధ పోస్ట్ లు కొత్త వారికి ఇవ్వడం తో ఆమెపై పార్టీ సీనియర్లు తీవ్ర అసహనంతో ఉన్నారంట. ఏదేమైనా ఇప్పరికైనా మీనాక్షి నటరాజన్ అధిష్టానం తనకు అప్పగించిన విధులకే పరిమితమై.. అన్ని వ్యవహరాల్లో అనవసర పెత్తనం తగ్గించుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. మరి చూడాలి ఇకనైనా ఇంచార్జి తన శైలి మార్చుకుంటారో? లేక నా రూటే సపరేటు అన్నట్లు వ్యవహారిస్తారో?
Story By Rami Reddy, Bigtv