Film industry:మరణం.. ఒక మనిషి జీవితాన్ని ముగించే ఘట్టం.. అప్పటివరకు మన మధ్య సంతోషంగా తిరిగిన వ్యక్తి.. క్షణాల్లో మన మధ్య లేడు అని తెలిసేసరికి ఆ బాధ వర్ణనాతీతం. అలా సినిమాలతో ప్రేక్షకులను అలరించి.. అభిమానుల హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్న సినీ నటుల మరణాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ఈ ఏడాది సినీ ఇండస్ట్రీకి చెందిన చాలామంది పలు అనారోగ్య కారణాలవల్ల మరణిస్తున్నారు. అయితే ఈ సెలబ్రిటీల మరణం వారి కుటుంబాలకే కాదు ఇటు సినిమా ఇండస్ట్రీకి, అభిమానులకు తీరని దుఃఖాన్ని మిగులుస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు తాజాగా మరో సినీ నటుడు కన్నుమూశారు.
గుండెపోటుతో సినీ నటుడు మృతి..
ప్రముఖ మలయాళ నటుడు, మిమిక్రీ ఆర్టిస్ట్ కళాభవన్ నవాస్ (51) శుక్రవారం నాడు కన్నుమూశారు. చోటానిక్కర లోని ఒక హోటల్లో శుక్రవారం సాయంత్రం ఆయన కన్ను మూసినట్లు సమాచారం. సినిమా షూటింగ్ కోసం హోటల్లో బస్ చేసిన నవాస్ అపస్మారక స్థితిలో కనిపించడంతో సిబ్బంది అధికారులకు సమాచారం అందించారు.. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.. గుండెపోటు కారణంగానే ఆయన మరణించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే నవాస్ మరణానికి అసలైన కారణం మాత్రం ఇంకా బయటకు రాలేదు.
కళాభవన్ నవాస్ సినీ కెరియర్..
భారతీయ సినీ నటుడిగా, హాస్యనటుడిగా, మిమిక్రీ ఆర్టిస్టుగా తనకంటూ ఒక పేరును సొంతం చేసుకున్నారు. ఇండస్ట్రీలోకి రాకముందు మిమిక్రీ ఆర్టిస్ట్ గా స్టేజ్ షోలలో ప్రదర్శన ఇస్తూ కెరియర్ ను కొనసాగించేవారు. ప్రముఖ దర్శకుడు బాలు కిరియాత్ మిమిక్స్ యాక్షన్ 500 అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. 1995లో వచ్చిన ఈ సినిమా మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత హిట్లర్ బ్రదర్స్, జూనియర్ మాండ్రేక్ , మట్టు పెట్టి మచ్చన్, చందమామ వంటి చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా సినిమాలే కాదు టెలివిజన్ రంగంలో కూడా సత్తా చాటారు.
కళాభవన్ నవాస్ వ్యక్తిగత జీవితం..
కళాభవన్ నవాస్ వివాహం విషయానికి వస్తే.. రెహనాను వివాహం చేసుకున్నారు. ఈమె కొన్ని సినిమాలు, టెలివిజన్ సీరియల్స్ లో కూడా నటించింది. వీరికి ముగ్గురు సంతానం. నహరిన్, రిహాన్ , రిద్వాన్.. ఇక పిల్లల వివాహం తర్వాత నవాస్ చుండిలో రెండు అంతస్తుల భవనాన్ని కూడా నిర్మించినట్లు సమాచారం.. ప్రస్తుతం భార్యతో కలిసి అక్కడే నివసిస్తున్నట్లు తెలుస్తోంది. పై అంతస్థుని బోటిక్ గా అలాగే గ్రౌండ్ ఫ్లోర్ ను నర్సరీ స్కూల్ గా కూడా మార్చారు. ఇకపోతే అటు మలయాళం ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి పేరు సొంతం చేసుకున్న ఈయన ఇలా గుండెపోటుతో మరణించడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అభిమానులు, సినీ సెలెబ్రెటీలు ప్రస్తుతం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు. అలాగే ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.