Annadata Sukhibhava: కూటమి ప్రభుత్వం ప్రకటించిన సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా నేడు అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయనున్నారు. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రకాశం జిల్లా వీరాయపాలెంలో ఈ పథకం ప్రారంభం చేస్తారు. దీని అనంతరం అక్కడ రైతులతో మాట్లాడి వారి ఖాతాల్లోకి నిధులు మళ్లిస్తారు. ఉదయం పదిన్నరకు కార్యక్రమ స్థలానికి ముఖ్యమంత్రి చేరుకుంటారు. కార్యక్రమం ప్రారంభించిన తర్వాత అక్కడే రైతులతో మాట్లాడుతారు. అనంతరం పార్టీ శ్రేణులతో కూడా చర్చించనున్నారు.
తొలి విడత రూ.5 వేలు.. పీఎం కిసాన్‌తో కలిపి మొత్తం జమ రూ.7 వేలు
రాష్ట్ర వ్యాప్తంగా 46లక్షల 85వేల 838 మంది రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. మొదటి విడతలో రాష్ట్ర వాటాగా ఒక్కో రైతుకు 5 వేలు, కేంద్ర కోటా 2వేలు కలిపి మొత్తం 7వేల చొప్పున మొత్తం 2వేల 342వందల కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు.
రైతులకు సాయం భారం కాదు.. బాధ్యత -చంద్రబాబు
నిన్న కలెక్టర్లతో జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం చంద్రబాబు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి రైతుకూ అన్నదాత సుఖీభవ పథకం లబ్ధి అందాలని, రైతులకు చేయూతనివ్వడం భారం కాదన్నారు. పథకం అమలు కార్యక్రమం పండుగ వాతావరణంలో జరగాలన్నారు. ప్రతి గ్రామ సచివాలయాలు, పంచాయతీలు, మండల కేంద్రాల్లో కార్యక్రమం నిర్వహించాలన్నారు.
ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్నాం -చంద్రబాబు
ఏడాదికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6వేల సాయానికి రాష్ట్ర సర్కార్ మరో 14 వేలు జోడించి ఏడాదికి మొత్తం 20వేలు రైతు ఖాతాలో జమ చేయనున్నారు. మూడు విడతల్లో డబ్బులు జమకానున్నాయి. సుపరిపాలలో తొలి అడుగు వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించారు. ప్రజలకు మాట ఇచ్చినట్టు ఎన్ని ఆర్థిక కష్టాలు ఉన్నప్పటికీ సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్న విషయం పెద్దలకు తెలియాలని వివరించి చెప్పాలని తెలిపారు. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని ఆ విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని విమర్శలను, తప్పడు ప్రచారాన్ని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలన్నారు.
Also Read: కవితే బీఆర్ఎస్‌కి దిక్కా?
ఎక్కడికక్కడ రైతులతో టీడీపీ శ్రేణులు మాట్లాడి పథకం గురించి వివరించాలని తెలిపారు. ఎవరికైనా అర్హత ఉండి పథకం వర్తించకపోతే వెంటనే వారిని సచివాలయ సిబ్బందితో అనుసంధానించి ఎందుకు వారి పేరు అర్హుల జాబితాలో లేదా.. ఉన్నా ఎందుకు డబ్బులు రాలేదు.. దాని గురించి తెలుసుకొని వారికి సహాయం చేయాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరి ఖాతాలో నగదు పడేలా చర్యలు చేపట్టాలని కూడా చెప్పారు. అవసరం అయితే 155251 నెంబర్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవాలని తెలియజేశారు.