మావోయిస్టులపై క్లైమాక్స్ ఆపరేషన్
చూశారుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్. తెలంగాణ – ఛత్తీస్ గఢ్ బార్డర్ లో జరిగిన ఎన్ కౌంటర్ పై పెట్టిన పోస్ట్ ఇది. దేశంలో నక్సలిజం క్లైమాక్స్ లో ఉందని, మొత్తం ఎలిమినేట్ చేసి పడేస్తామంటూ గట్టిగానే పోస్ట్ చేశారు. ఏ అడవుల్లో అయితే మావోయిస్టులు బలంగా ఉన్నారో.. అదే అడవుల్లో సైనిక స్థావరాలను ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు. ముఖ్యంగా అబూజ్ మడ్ దండకారణ్యం మావోయిస్టులకు సేఫ్ జోన్ గా ఉంది.
2026 నాటికి మావోల అంతమే డెడ్ లైన్
ఇక్కడ బయటి వారు లోపలికి వెళ్లడమే తప్ప బయటకు తిరిగి వెళ్లడం కష్టం. కానీ సెక్యూరిటీ ఫోర్సెస్ ఇక్కడే సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకునే ప్లాన్ తో ఉన్నాయి. పై నుంచి డ్రోన్లు, గ్రౌండ్ లో ఆర్మీ క్యాంప్ లు.. సో కేంద్ర ప్రభుత్వ స్ట్రాటజీ చూస్తుంటే 2026 మావోయిస్టుల అంతానికి డెడ్ లైన్ గా పెట్టుకున్నట్లుగానే అర్థం చేసుకోవచ్చు.
బీజాపూర్ జిల్లా పూజారి కాంకేర్ అడవుల్లో ఫైరింగ్
ఈ మాట ఇంత గట్టిగా చెప్పడానికి కారణం.. ఛత్తీస్ గడ్ లో జరుగుతున్న వరుస ఎన్ కౌంటర్లే కారణం. దొరికిన వారిని దొరికినట్లు ఎన్ కౌంటర్లతో ఎలిమినేట్ చేసేస్తున్నారు. మొన్నటికి మొన్న ఛత్తీస్ గఢ్ బీజాపూర్ జిల్లా పూజారి కాంకేర్ అడవుల్లో ఫైరింగ్ తో మోతెక్కిపోయింది. అక్కడా పెద్ద సంఖ్యలో మావోయిస్టులు హతమయ్యారు. భద్రతా దళాలు పైచేయి సాధించాయి. లేటెస్ట్ గా ఒడిశా -ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని గరియాబంద్ జిల్లాలో మావోయిస్ట్‌లు, భద్రతా బలగాలకు జరిగిన ఎన్ కౌంటర్లోనూ మావోలకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటి వరకు ఎన్ని కూంబింగ్ లు జరిగినా.. ఎన్ని ఎన్ కౌంటర్లు జరిగినా చిన్న గాయాలు కూడా కాకుండా తప్పించుకున్న తెలుగు రాష్ట్రాలకు చెందిన మావోయిస్టు లీడర్లు ఇప్పుడు హతమవుతున్నారు.
బడే చొక్కారావు బతికున్నాడా?
లేటెస్ట్ గా కేంద్ర కమిటీ సభ్యుడైన చలపతి అలియాస్ రామచంద్రారెడ్డి, స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు గుడ్డు ఉన్నట్లు గుర్తించారు. చలపతి తలపై కోటి రూపాయల రివార్డు ఉంది. అటు బీజాపూర్ జిల్లా పూజారి కాంకేర్ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ మృతిచెందారనే ప్రచారం జరిగింది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. మావోయిస్టు బస్తర్ డివిజన్ కమిటీ పేరుతో వచ్చిన ప్రకటనలో దామోదర్ వీరమరణం పొందారని ఉంది. అయితే పోలీసులు రిలీజ్ చేసిన ఫోటోల్లో బడే చొక్కారావు లేడు. సో చనిపోతే డెడ్ బాడీ ఎక్కడ ఉందన్నది కీలకంగా మారింది.
యాంటీ నక్సల్స్ మిషన్-2026 స్ట్రాంగ్ యాక్షన్
ఛత్తీస్‌గఢ్‌లో యాంటీ నక్సల్స్ ఆపరేషన్ లో భాగంగా మిషన్-2026 పేరు పెట్టారు. దీని అర్థం.. వచ్చే ఏడాది చివరి నాటికి ఎక్కడెక్కడైతే మావోయిస్టులు బలంగా ఉండి ఉనికి చాటుకుంటున్నారో అక్కడ మొత్తం మ్యాటర్ క్లోజ్ చేసే పనిలో ఉన్నారు. ఇందుకు నిదర్శనం కేంద్ర హోంమంత్రి అమిత్ షా పెట్టిన ట్వీటే. ప్రస్తుతం మావోయిస్టులు గడ్చిరోలి, బీజాపూర్, ఛత్తీస్ గఢ్, ఏఓబీ, ములుగు సరిహద్దుల్లో ఉనికి చాటుకుంటున్నారు. గట్టిగా ఫోకస్ పెడితే వచ్చే ఏడాది నాటికి మ్యాటర్ అంతా ఫినిష్ చేస్తామంటున్నారు.
DRG, CRPF, కోబ్రా, SOG జాయింట్ ఆపరేషన్స్
ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై మరో లెక్క అంటున్నారు. మొన్న భద్రతా సిబ్బందిని ల్యాండ్ మైన్ పెట్టి చంపేయడంతో మరింత సీరియస్ గా తీసుకున్నారు. యాంటీ మావోయిస్టుల ఫోర్సెస్ అన్నీ అంటే ఛత్తీస్ గఢ్ డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, CRPF, కోబ్రా, ఒడిశాకు చెందిన స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ ఇలా అన్ని బలగాలు జాయింట్ ఆపరేషన్స్ తో అడవులను జల్లెడపడుతున్నాయి.
లొంగిపోయిన వారికి నెలకు రూ.10వేలు సహాయం
మాట విన్నారా.. జనజీవన స్రవంతిలో కలిపేస్తామంటున్నారు. వినకపోతే లేపేస్తామంటున్నారు. ఇదే సెక్యూరిటీ ఫోర్సెస్ టార్గెట్. ముఖ్యంగా ఛత్తీస్ గఢ్ లో లొంగిపోయిన మావోలకు నెలకు 10 వేల రూపాయలు ఇవ్వడంతో పాటు మూడేళ్ల పాటు ఉచిత భోజనం, వసతి, వారికి నైపుణ్యం ఉన్న రంగాల్లో శిక్షణ ఇచ్చి జనజీవనంలో కలిపే లక్ష్యం పెట్టుకున్నారు. అందుకోసం బిల్డింగ్ లు కూడా రెడీ చేస్తున్నారు. సో నక్సల్స్ వింటే ఒకలా.. వినకపోతే మరోలా ట్రీట్ మెంట్ ఇచ్చేందుకు ఆపరేషన్ అంతా రెడీ అయింది. అందులో భాగంగానే వరుస ఎన్ కౌంటర్లు రెడ్ కారిడార్ ను దడదడలాడిస్తున్నాయి. దండకారణ్యాలు తుపాకుల మోతతో మోతెక్కిపోతున్నాయి.
తెలుగు రాష్ట్రాల మావో లీడర్ల ఎన్ కౌంటర్
ఇన్నాళ్లూ చిక్కకుండా తప్పించుకున్న తెలుగు రాష్ట్రాలకు చెందిన మావోయిస్టు లీడర్లు ఇప్పుడు ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అవుతున్నారు. ఇందులో మావోయిస్టు అగ్రనేత చలపతికి పెద్ద హిస్టరీయే ఉంది. సల్వాజుడుం వ్యవస్థాపకుడు మహేంద్ర కర్మ హత్య ఘటనలో చలపతి కీలకంగా పాల్గొన్నాడు. మావోయిస్టు అగ్రనేత RKకు అత్యంత సన్నిహితంగా మెలిగాడు. హిడ్మాలకు గురువుగానూ చెబుతుంటారు. 2018లో నాటి అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోముల హత్యాకాండలో చలపతి కీలకంగా పాల్గొన్నాడు.
బాలన్న వరంగల్ జిల్లా మడికొండ వాసి
తలపై కోటి రివార్డు ఉంది. అటు ఇదే ఎన్ కౌంటర్ లో మోడెమ్ బాలకృష్ణ అలియాన్ బాలన్న కూడా హతమైనట్లు చెబుతున్నారు. ఈయన వరంగల్ జిల్లా మడికొండ వాసి. మావోయిస్టు కేంద్రకమిటీలో కీలకంగా ఉన్నారు. సో వీళ్లే కాదు.. రాబోయే రోజుల్లో కీలక నేతలందరినీ రౌండప్ చేసి CRPF ర్యాంపేజ్ చేస్తుందంటున్నారు.
తెలుగు రాష్ట్రాల మావోయిస్టు లీడర్లే కీలకం
ఏపీ, తెలంగాణలో మావోయిస్టు అణచివేత చర్యలు విపరీతంగా జరగడంతో ఒక దశలో ఇక్కడున్న మావో లీడర్లంతా ఛత్తీస్ గఢ్, ఒడిశా, గడ్చిరోలి లాంటి సేఫ్ జోన్లకు తరలిపోవాల్సి వచ్చింది. అక్కడ దట్టమైన దండకారణ్యాల నుంచి టోటల్ మ్యాటర్ నడిపించారు. జోనల్ కమిటీలను, దళాల్లో రిక్రూట్ మెంట్లు, ఆయుధాలను సమకూర్చుకోవడం ఇలా అన్నిట్లోనూ తెలుగు రాష్ట్రాల మావోయిస్టు లీడర్లే ముందున్నారు. నిజానికి ఏపీ, తెలంగాణ నుంచి షిఫ్ట్ అయిన వారు తమ కుటుంబాలకు టచ్ లోకి వెళ్లలేదు. అజ్ఞాతంలోనే ఉండిపోయారు. ఇప్పుడిప్పుడే ఎన్ కౌంటర్ల ద్వారా వారి వివరాలు బయటికొస్తున్నాయి. అయితే వారంతా ప్రాణాలతో మాత్రం మిగలడం లేదు.
గతేడాది మేలో అబూజ్ మడ్ లో ఎన్ కౌంటర్
ఛత్తీస్ గఢ్, ఒడిశా బార్డర్ లో ఏ ఎన్ కౌంటర్ జరిగినా అందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఉంటున్నారు. లేటెస్ట్ ఎన్ కౌంటర్లతో చనిపోయిన వారి సంఖ్య పెరిగింది. గతేడాది మేలో అబూజ్‌మడ్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో 10 మంది మావోయిస్టులు చనిపోగా అందులో ముగ్గురు తెలుగువారిగా గుర్తించారు. వారిలో పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం జియ్యారం గ్రామానికి చెందిన జోగన్న అలియాస్ చీమల నర్సయ్య, మంచిర్యాల జిల్లాకు చెందిన వినయ్ అలియాస్ రవి, వరంగల్‌కు చెందిన సుష్మిత అలియాస్ చైతె ఉన్నారు.
జోగన్నపై 196 కేసులు, రూ. 25 లక్షల రివార్డు
వీరు చాలాకాలంగా ఛత్తీస్‌గఢ్‌లో పనిచేస్తున్నారు. స్పెషల్ జోనల్ కమిటీ సభ్యునిగా పనిచేస్తున్న జోగన్నపై 196 కేసులు ఉండగా ప్రభుత్వం 25 లక్షల రివార్డు ప్రకటించింది. మావోయిస్టు డివిజనల్ కమిటీ సభ్యుడైన రవిపై 8 లక్షలు, మావోయిస్టు పార్టీ సభ్యురాలైన తిక్క సుష్మితపై 2 లక్షల రివార్డు ఉంది. 2016లో ఇంటర్ చదువుతున్న టైంలోనే సుష్మిత మావోయిస్టు దళంలో చేరింది.
గతేడాది ఏప్రిల్ లో కాంకేర్ జిల్లాలో ఎన్ కౌంటర్
ఇక గతేడాది ఏప్రిల్ లో ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లా దండకారణ్యంలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్లో 29 మంది మావోయిస్టులు మరణించగా వారిలో భూపాలపల్లి జిల్లాకు చెందిన శంకర్‌రావు, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సుమన అలియాస్ రజిత ఉన్నారు. వీరిద్దరూ భార్యా భర్తలు. ఛత్తీస్ గఢ్ పోలీసులు వెతుకుతున్న వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారి వివరాలను ఇప్పుడు చూద్దాం. వారి రిలీజ్ చేసిన లిస్టు ప్రకారం 37 మంది ఉన్నారు. ఇందులో లేటెస్ట్ గా గరియాబంద్ ఎన్ కౌంటర్ లో చలపతి, బాలన్న చనిపోయారు. సో మరో 35 మందిని టార్గెట్ చేసినట్లుగా చెబుతున్నారు. వీరిని పట్టుకుంటే నక్సల్స్ కథ క్లైమాక్స్ కు చేరుకున్నట్లే అని భావిస్తున్నారు.
35 మందిని పట్టుకుంటే కథ క్లైమాక్స్ కు చేరుతుందా?
లిస్టులో ఉన్న వారిలో గణేష్, రాజమోహన్ అలియాస్ యాదగిరి హన్మకొండ వాసి. చిన్నన్న అలియాస్ నాగన్న ఆత్మకూర్ ఏపీ వాసి. సుజాత అలియాస్ సుజాతక్క, మధు అలియాస్ కమలాకర్, గోపి అలియాస్ గోపన్న ఏపీ వాసి. దీనా అలియాస్ నందే, సరిత అలియాస్ అరుణ నల్గొండ వాసి. రుపీ, అనిత, తక్కళ్లపల్లి వాసుదేవరావు వరంగల్ వాసి, సత్యగంగాధర్ రావు విశాఖపట్నం వాసి. ప్రమోద్ అలియాస్ పాండూ యాప్రాల్ రంగారెడ్డి వాసి, కమలేష్ అలియాస్ రామకృష్ణ విజయవాడ వాసి, కేశవరావ్ అలియాస్ గంగన్న శ్రీకాకుళం వాసి, గణపతి అలియాస్ లక్ష్మణ్ రావు కరీంనగర్ వాసి, మల్లోజుల వేణుగోపాల్ కరీంనగర్, తిరుపతి కరీంనగర్, మోడెం బాలకృష్ణ అలియాస్ బాలన్న ఈయన లేటెస్ట్ ఎన్ కౌంటర్ లో చనిపోయాడు.
2026 నాటికి లిస్ట్ క్లియర్ చేస్తామంటున్న పోలీసులు
ఇక ఉదయ్ అలియాస్ గణేష్ నల్గొండ వాసి, రామచంద్రారెడ్డి కరీంనగర్, చందూ అలియాస్ చందర్ వరంగల్ వాసి, చలపతి మంథని వాసి. ఈయన గరియాబంద్ ఎన్ కౌంటర్ లో చనిపోయాడు. విమల్ అలియాస్ వెంకటి ఆదిలాబాద్ వాసి. గౌతమ్ అలియాస్ గోపన్న కరీంనగర్ వాసి, పూలూరి ప్రసాద్ రావు పెద్దపల్లి వాసి, కంకణాల రాజిరెడ్డి మంథని వాసి, సంజీవ్ అలియాస్ అశోక్ రంగారెడ్డి వాసి ఉన్నారు. రవి అలియాస్ భాస్కర్ నిజామాబాద్ వాసి (29), రెడ్డి అలియాస్ శ్యాం వరంగల్ వాసి, కమలేష్ అలియాస్ నాగరాజు విజయవాడ వాసి,
చందు వరంగల్ వాసి, రఘు అలియాస్ వికాస్ వరంగల్ వాసి, విమల ఆదిలాబాద్ వాసి, ప్రతాప్ ఏపీ వాసి, రణధీర్ వరంగల్ వాసి, నిర్మల అలియాస్ కోడి మంజుల తెలంగాణ వాసి వీరంతా మావోయిస్టు కమిటీల్లో వివిధ హోదాల్లో ఛత్తీస్ గఢ్ దండకారణ్యాల్లో పని చేస్తున్నారు. ఈ 37 మందిలో ఇద్దరు చలపతి, బాలన్న గరియాబంద్ ఎన్ కౌంటర్ లో చనిపోయారు. మిగితా వారిని ప్రాణాలతో పట్టుకోవడం లేదంటే లొంగిపోయేలా చూడడం లేదంటే ఎదురుకాల్పులు జరిగితే హతమార్చడమే టార్గెట్ గా బలగాలు కూంబింగ్ జరుపుతున్నాయి. 2026 చివరి నాటికి మొత్తం లిస్ట్ క్లియర్ చేస్తామని ఛత్తీస్ గఢ్ పోలీసులు అంటున్నారు.
విప్లవ భావజాలంతో 40 ఏళ్ల క్రితం అడవిబాట
ఇప్పటికే రాష్ట్రంలో ఉద్యమం బలహీనపడగా, ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్న వారు వరుసగా హతమవుతుండడంతో మావోయిస్టు పార్టీలో ఆందోళన పెరగడానికి కారణమవుతోంది. మరోవైపు ఉడుకు రక్తం విప్లవ భావజాలంతో వీరంతా 40 యాభై ఏళ్ల క్రితం నక్సల్స్ లో కలిశారు. ప్రస్తుతం ఛత్తీస్ గఢ్, ఒడిశా, మహారాష్ట్ర ప్రాంతాల్లో తలదాచుకుని ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. ఇంకోవైపు వీరి రాక కోసం తమ వాళ్లు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఒక్కసారి కనిపించు బిడ్డా అంటున్నారు.
అనారోగ్యాలు చుట్టు ముట్టినా ఉద్యమబాటే
ఎన్ కౌంటర్ లో హతమై ఇంటికి వచ్చే బదులు ప్రాణాలతోనే రావాలని, జనజీవన స్రవంతిలో కలవాలని వారి కుటుంబీకులు వేడుకుంటున్నారు. కానీ 80, 90వ దశకంలో అడవి బాట పట్టిన వారు అనారోగ్యాలు చుట్టు ముట్టినా సరే అడవి దాటి రామంటున్నారు. మరి ఇప్పుడు ఎలిమినేషన్ ఆపరేషన్ తో ఏం జరుగుతుందో చూడాలి.