MVV Satyanarayana: ప్రభుత్వం మాదంటూ అధికారులను చెప్పుచేతుల్లో పెట్టుకుని దందాలు నడిపించారు. ప్రశ్నించిన వారిని నయానోభయానో దారిలోకి తేచ్చుకుని భూ అక్రమాలకు పాల్పడ్డారు. గత ప్రభుత్వ హయాంలోఅన్ని వ్యవస్థలను మేనేజ్ చేసిన ఆ మాజీ ఎంపీ వందల కోట్లు ఆస్తలు కొల్లగొట్టారు. ఇప్పడు ప్రభుత్వ మారింది. గత ఐదేళ్లు బెదిరించి, భయపెట్టి లాక్కున్న భూ వ్యవహారాలు బయటకు వస్తున్నాయి. ఎన్ని బయటపడినా.. కేసులు నమోదు చేసినా.. ఫలితం మాత్రం కనిపించడం లేదు. ఆ మాజీ ఎంపీ ఇంటిపై ఈడీ అధికారులు దాడులు జరిగి వారాలు గడిచిపోతున్నా.. ఇంత వరకు ఎలాంటి చర్యలూ లేవు. దాంతో సదరు మాజీ ఎంపీ ఇప్పటికీ వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
విశాఖ వైసీపీ నేత, మాజీ ఎంపీ ఎంవీవి సత్యనారాయణ.. గత ఐదేళ్లు ఆ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఆయన చెప్పిందే జరిగింది. అప్పటికే 20 ఏళ్లగా బిల్డర్ గా, వ్యాపారవేత్తగా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్న ఎంవివి సత్యనారాయణ రాజకీయాల్లోకి వచ్చి ఎంపీగా గెలిచిన తర్వాత తన పలుకుబడిన ఉపయోగించి విశాఖ నగరంలో అనేక భూ అక్రమాలకు పాల్పడ్డారు. కంటికి కనిపించిన సైట్ ను భయపెట్టి బలవంతంగా లాక్కున్న ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. భయపడరు అనుకున్న వాళ్లను నమ్మించి మోసం చేసి దొంగ పత్రాలు సృష్టించి కైవసం చేసుకున్నవి చాలా ఉన్నాయి. అధికారంలో ఉన్నంతకాలం నేను చెప్పిందే వేదం చేసిందే చట్టం అన్నట్లు వ్యవహరించిన మాజీ ఎంపీ.. అధికారం కోల్పోయిన తర్వాత అనేక కేసుల్లో ఇరుక్కున్నారు.
అధికారంలో ఉన్న సమయంలో హయగ్రీవ భూములను డెవలప్ చేస్తానన్న పేరుతో తీసుకుని.. వాటికి దొంగ పత్రాలు సృష్టించి కైవసం చేసుకోవడంతో భూ యజమాని జగదీశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. విశాఖ పోలీసులు కేసు నమోదు చేసినా ఆ కేసు ముందుకు కదల్లేదు. జగదీశ్వరరావు ఇంకో అడుగు ముందుకేసి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు ఫిర్యాదు చేశారు. కోట్ల రూపాయల నగదు లావాదేవీలు అక్రమంగా జరిగాయని ఈడీకి ఆధారాలు అందించారు. జగదీశ్వర్ రావ్ ఇచ్చిన కేసుతో ఈడీ శరవేగంగా రెక్కీ చేసి మరీ దాడులు నిర్వహించింది.
మాజీ ఎంపీ ఎంవీవీ ఇంటితో పాటు అతని ఆడిటర్ జీవి, బిజినెస్ పార్ట్‌నర్ గద్దె బ్రహ్మాజీల ఇళ్లల్లో కూడా ఈడీ సోదాలు నిర్వహించారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఇంట్లో నకిలీ స్టాంప్ పేపర్లు తయారు చేసే అనేక ఎలక్ట్రానిక్ డివైజ్లను గుర్తించడంతోపాటు అనేక పత్రాలను సీజ్ చేసి ఈడీ తీసుకు వెళ్ళింది. మాజీ ఎంపీ ఇంటి సహా మరో ఇద్దరి ఇళ్లల్లో ఐదు బృందాలు ఏకకాలంలో 20 మంది సభ్యులతో 17 గంటల పాటు తనిఖీలు నిర్వహించి సీజ్ చేసి తీసుకువెళ్లిన పత్రాలు, ఎలక్ట్రానిక్స్ డివైజ్ లలో ఏముందో అనేది ఇప్పటివరకు బయటపడలేదు.
Also Read: జాతీయ స్థాయిలో పవన్‌కి కీలక పదవి?
అధికారంలో ఉన్న అధికారం లేకపోయినా కోట్లకు పడగలెత్తిన వ్యక్తి కావడంతో ఎక్కడ వ్యవస్థను అయినా మేనేజ్ చేయగలరని మాజీ ఎంపీ ఎంవీవి సత్యనారాయణ ఇంట్లో దొరికిన ఆధారాలు, చేసిన తనిఖీలను బట్టి తెలుస్తుంది. ఇప్పటివరకు వ్యాపార సామ్రాజ్యంలో అక్రమ లావాదేవీలు, భూ ఆక్రమణలు మాత్రమే చేస్తున్నారనే ఆరోపణలున్న ఎంవీవి సత్యనారాయణ ఇంట్లో ఈడి తనిఖీలు చేసిన తర్వాత నకిలీ స్టాంప్ పేపర్లు కూడా తయారు చేశారా అని అనుమానాలు వ్యక్తం అయ్యాయి. నకిలీ స్టాంప్ పేపర్లు తయారు చేయడానికి ఉపయోగించే ఎలక్ట్రానిక్ డివైజ్ లతో పాటు మరికొన్ని పత్రాలను స్వాధీనం చేసుకున్న ఈడీ అధికారులు కేవలం ఒక చిన్న ప్రెస్ నోట్ ని రిలీజ్ చేసి చేతులు దులుపుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఎంవీవీకి ఈడీ ఏ విధమైన నోటీసులు ఇచ్చింది అనే దానిపై ఇప్పటి వరకు స్పష్టత లేదు.. ఎంవీవీకి నోటీసులు ఇస్తే ఆ నోటీసులకు ఏ విధమైన రిప్లై వచ్చింది. నకిలీ స్టాంప్ పేపర్లు తయారు చేయడానికి ఉపయోగపడే ఎలక్ట్రానిక్ డివైజ్‌లు దొరికినా ఈడీ అధికారులు కానీ పోలీసులు కానీ ఎందుకు చర్యలు చేపట్టలేదు అనేది ఎవరికి అర్థం కావడం లేదు. దీనికి తోడు ఇంట్లో దొరికిన స్టాంప్ పేపర్ల ఆధారంగా అవి నకిలీవా, ఒరిజినల్ వా అనేది తేల్చాల్సిన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కూడా తమకు ఏమీ తెలియదు అన్నట్లు కామ్ గా ఉంది. ఈడీ అధికారులు తనిఖీలు చేయడంతో ఇక తమకు సంబంధం లేదని పోలీసులు చేతులెత్తేస్తున్నారు. అనేక పత్రాలు దొరికాయని ఈడి ప్రెస్ నోట్ రిలీజ్ చేసినా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కన్నెత్తి చూడలేదు.
దాడుల తర్వాత తూతూ మంత్రంగా కొన్ని వివరాలను చెప్పిన ఈడీ అధికారులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు.. దీనిని బట్టి చూస్తుంటే మాజీ ఎంపీ, రియాల్టర్, బిల్డర్, సినీ నిర్మాత అయిన ఎంవీవీ అధికారంలో ఉన్న పార్టీలతో సంబంధం లేకుండా ఏ వ్యవస్థల్ని అయినా మేనేజ్ చేయగలరా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.. ఇదే పరిస్థితి కొనసాగితే అటు ప్రభుత్వాలపైనే కాదు ప్రభుత్వ యంత్రాంగం పైన ప్రజలు విశ్వాస కోల్పోయే ప్రమాదముందున్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.