Nellimarla Ex MLA Baddukonda Appalnaidu: కుటుంబ రాజకీయాలు కలిసి వచ్చి పొలిటీషియన్ అవతారమెత్తారు.. పెద్ద దిక్కుగా ఉన్న బంధువు అండతో 14 ఏళ్లుగా పాలిటిక్స్‌లో చక్రం తిప్పుతున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు బోల్డంత వెనకేసుకున్నారన్న ఆరోపణలు కూడా మూటగట్టుకున్నారు. ముందు నుంచి పార్టీ శ్రేణులను చిన్నచూపు చూస్తూ వచ్చిన సదరు నేత ఇప్పుడు కష్టకాలంలో వారికి కనిపించడమే మానేశారంట. ఆయన ఇంట్లో ఉన్నారో లేదో కూడా స్థానికులకు తెలియడం లేదంట. ఎవరా వెరైటీ లీడర్ అంటారా?
విజయనగరం రాజకీయాల్లో బొత్స సత్యనారాయణ ఫ్యామిలీది ప్రత్యేక స్థానం . ఎన్నికలు వస్తే కుటుంబం మొత్తం పోటీలో ఉండేందుకు ఇష్టపడతారు . ఎలాంటి లాబీయింగ్ లు చేసైన సరే తాము అనుకున్న సీట్లు సాధించుకోవడానికి తాపత్రయపడతారు. ప్రతి ఎన్నికల్లోనూ వారి కుటుంబం నుండి కనీసం నలుగురు పోటీ చేయడం ఆనవాయితీగా మారిపోయింది . అలా గత సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన ఆ నలుగురిలో రక్త సంబంధీకుడు కాకపోయనా, దగ్గర బంధువైన నెల్లిమర్ల వైసీపి మాజీ ఎమ్మెల్యే బద్దుకొండ అప్పలనాయుడు కూడా ఉన్నారు.
బొత్స ఆశీస్సులతో ఓ సారి జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా, అదేవిధంగా నాలుగు సార్లు పోటీ చేసి రెండు సార్లు ఎమ్మెల్యేగానూ బద్దుకొండ అప్పలనాయుడు గెలుపొందారు . అటు కాంగ్రెస్ నుండి ఇటు వైసీపీ నుండి ఒక్కోసారి ఎమ్మెల్యేగా పని చేశారు . అంతేనా బొత్స హవాను వాడుకొని గట్టిగానే వెనకేసుకున్నారనే టాక్ కూడా జిల్లాలో గట్టిగానే వినిపిస్తుంది . కొండలు, గుట్టలు నుండి భోగాపురం ఎయిర్‌పోర్ట్ స్థల సేకరణ వరకు బడ్డుకొండ దేన్ని వదల లేదంట… ఆయనది ఒక్క ముక్కలో చెప్పేంత అవినీతి కాదని వైసీపీ వర్గాలే దీర్ఘం తీస్తుంటాయి. గత ఎన్నికల్లో ఆయన ఘోర పరాజయం పాలవ్వడానికి అది కూడా ఒక కారణమంటారు.
అనేక అవినీతి ఆరోపణలు వచ్చినప్పటికీ ఆయన ఎన్నడూ వాటిని పట్టించుకోలేదు.. సరికదా వాటికి కౌంటర్ కూడా ఎక్కడా ఇవ్వలేదు . ఎవరేమనుకుంటే నాకేంటి అనే చందాన… నిమ్మకు నీరెత్తినట్లు తన పని తాను చేసుకుపోతూ వచ్చారు. వాటికి తోడు పార్టీ కార్యకర్తలను కూడా ఏనాడూ పట్టించుకోలేదని ఆరోపణలు బలంగా వినిపించేవి . గత అయిదేళ్లలో ఏనాడూ కార్యకర్తలని గాని, నాయకులని గానీ ఆయన పలకరించలేదన్న విమర్శలు ఉన్నాయి . సమస్యలు చెపుదామనుకుంటే అందుబాటులో ఉండేవారు కాదని సొంత పార్టీ కార్యకర్తలే ధ్వజమెత్తుతుంటారు
ఫాస్ట్ కంటిన్యూస్ టెన్స్‌లా అప్పలనాయుడు ఓటమి తర్వాత కూడా అదే ఒరవడి సాగిస్తున్నారట . సాధారణంగా ఓటమి తరువాత సమీక్షించుకోవడం ద్వితీయ శ్రేణి నాయకులని పిలిపించుకొని మాట్లాడడం చేస్తుంటారు రాజకీయ నాయకులు . కానీ సదరు తాజా మాజీ మాత్రం అవేమీ పట్టనట్లు అసలు ఇంటి నుండి బయటకి రావడం లేదట . అసలు లోకల్‌గా ఉన్నారో లేదో కూడా ప్రజలకి తెలియదంట. ఇప్పటివరకు ప్రజల పక్షాన నిలబడి అధికార కూటమిని ప్రశ్నించిన పాపాన పోలేదట . కూటమి పొత్తులో భాగంగా జనసేనకి ఇక్కడి సీటును కేటాయించగా లోకం మాధవి భారీ మెజార్టీతో విజయం సాధించారు . ఆ తరువాత ప్రాధాన్యత పేరుతో టీడీపీ , జనసేన బహిరంగంగానే బాహా బాహీకి దిగినా బద్దుకొండ కనీసం పన్నెత్తి కామెంట్ కూడా చేయదు. కూటమిని చెడుగుడు అడుకోవడానికి అవకాశం దొరికినా కనీసం వ్యంగ్యాస్త్రాలు కూడా సంధించలేదు.
Also Read: సౌత్‌కు నార్త్ దెబ్బ.. పడిపోతున్న దక్షిణాది రాష్ట్రాల జనాభా, ఇలాగైతే భవిష్యత్తు..
పోనీ కార్యకర్తల కోసం కాకపోయినా నమ్మి అవకాశం ఇచ్చిన పార్టీ కోసమైన కనీస కార్యక్రమలు చేయకపోవడం ఎంతవరకు సమంజసమని వైసీపీ వర్గాలు భగ్గు మంటున్నాయి . జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ వైసీపీ సర్పంచ్ లను, కౌన్సిలర్ లను, ఎంపీటీసీలను తమవైపు తిప్పుకుంటుంటే .. కనీసం దిద్దుబాటు చర్యలు చేపట్టడం లేదని కేడర్ అసహనం వ్యక్తం చేస్తుంది . మరి బద్దుకొండ వారి లెక్కలేంటో ఆయనకే తెలియాలి.