• సౌత్ ను ఫిల్ చేస్తున్న నార్త్ జనం
• ప్లంబింగ్ టూ ఐటీ దాకా హవా
• వ్యాపారాల కోసం రాజస్థాన్ నుంచి రాక
• జనాభా ఎక్కువుండడంతో వలసలు
• 2028లో నియోజకవర్గాల పునర్విభజన
• జనం ఎక్కువుంటే ఎక్కువ సెగ్మెంట్లు
• సౌత్ స్టేట్స్ లో టెన్షన్, అటెన్షన్..
• స్పష్టమైన విధానం కావాలన్న సీఎం రేవంత్
• సౌత్ స్టేట్స్ జనాభా 18%, GDPలో వాటా 35%
• తలసరి ఆదాయంలోనూ దక్షిణాదే టాప్
• 1970ల్లో జనాభా నియంత్రించిన సౌత్
• జనాభాను కంట్రోల్ చేయలేకపోయిన నార్త్
• AP, TG, తమిళనాడు, కేరళ, కర్ణాటకకు నష్టం
• ఆర్టికల్ 81కు సవరణ చేస్తే కొత్త ఫార్ములాకు ఛాన్స్
• రూ.1,73,030 కోట్లను పంచిన కేంద్రం
• టాప్ త్రీలో యూపీ, బిహార్, మధ్యప్రదేశే
జనాభా తగ్గడం వల్ల దక్షిణ భారత రాష్ట్రాలకు సమీప భవిష్యత్ లో చాలా రకాలుగా నష్టాలు, సవాళ్లు ఎదురవబోతున్నాయి. ఇక్కడి వ్యాపార గ్యాప్, ఉద్యోగాల గ్యాప్ ను ఉత్తరాది రాష్ట్రాలు ఫిలప్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే అది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ప్లంబింగ్ దగ్గర్నుంచి హౌస్ కన్స్ స్ట్రక్షన్, ఐటీ దాకా నార్త్ జనమే సౌత్ లో పెరుగుతున్నారు. ఇక సౌత్ స్టేట్స్ లో వ్యాపారాలు చేసేందుకు రాజస్థాన్, యూపీ సహా ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున వలస వస్తున్నారు. మంచి పొజిషన్ కు వెళ్తున్నారు. కారణం ఇక్కడ భారీ గ్యాప్ ఉండడమే. వాళ్ల రాష్ట్రాల్లో పోటీ ఎక్కువుండడం, జనాభా ఎక్కువుండడంతో సౌత్ కు తరలి వస్తూనే ఉన్నారు.
రైట్ ఈ ఏడాది జనగణన జరగబోతోంది. ఇది 2026 దాకా కొనసాగుతుంది. ఆ లెక్కల ప్రకారమే నియోజకవర్గాల పునర్విభజన ఉండబోతోంది. అంటే జనం ఎక్కడ ఎక్కువుంటే అన్నేసి నియోజకవర్గాలు పెరుగుతాయన్న మాట. అదే జరిగితే జనం తక్కువగా ఉన్న సౌత్ లో నియోజకవర్గాల్లో పెద్దగా మార్పు ఉండదు. అదే టైంలో నార్త్ లో ముఖ్యంగా యూపీ, బిహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి చోట్ల విపరీతమైన జనాభాతో ఎక్కువ సీట్లు పెరిగే అవకాశం ఉంటుంది. సీట్లు ఒక్కటే కాదు… నిధుల పంపిణీ కూడా జనాభా ఆధారంగానే జరుగుతుంది. ఇప్పుడు కూడా అలాగే నడుస్తోంది. అందుకే సౌత్ స్టేట్స్ చాలా టెన్షన్, అటెన్షన్ తో ఉన్నాయి. కేంద్రం నుంచి అందాల్సిన నిధులపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన చెందుతున్నాయి.
జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేస్తే దక్షిణాదికి తీరని అన్యాయం జరుగుతుందని, దక్షిణాది-ఉత్తరాది అనే చర్చ వచ్చే ఆస్కారం ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వమే దీనికి స్పష్టమైన విధాన రూపకల్పన చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటి నుంచో చెబుతున్నారు. దేశ జనాభాలో సౌత్ స్టేట్స్ 18 శాతమే ఉన్నా.. జీడీపీలో వాటా 35శాతంగా ఉంది. అంతెందుకు తలసరి ఆదాయం విషయంలో జాతీయ సగటు కంటే దక్షిణాది రాష్ట్రాలే టాప్. కానీ ఏం లాభం? కేంద్ర నిధుల పంపిణీ మాత్రం జనాభా ఎక్కువున్న రాష్ట్రాలకే ఎక్కువ అన్న ఫార్ములా టోటల్ గా ఎఫెక్ట్ చూపుతోంది.
970ల్లో కేంద్ర ప్రభుత్వం జనాభా నియంత్రణ కార్యక్రమాలు చేపట్టింది. వీటిని సౌత్ స్టేట్స్ పక్కాగా అమలు చేసి అభివృద్ధికి బాటలు వేశాయి. కానీ ఉత్తరాది రాష్ట్రాలు జనాభాను కంట్రోల్ చేయలేకపోయాయి. అదుపు చేసుకోకుండా పెంచుకుంటూ వెళ్లాయి. ఇదే ఇప్పుడు సమస్యగా మారుతోంది. జనాభాను నియంత్రించుకుని ఇప్పుడు ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక నష్టపోవాల్సిన పరిస్థితి వచ్చింది. జన సంఖ్య అదుపు చేసుకోలేకపోయిన ఉత్తరాది రాష్ట్రాలు లాభపడే సీన్ ఏర్పడింది. అందుకే జనాభా ప్రాతిపదికన నిధుల బట్వాడా కాకుండా ఆర్థికంగా మంచి పర్ఫార్మెన్స్ చూపే ఆధారంగా ఇవ్వాలంటున్నారు. అది జరగాలంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 81కు సవరణ చేయడం ద్వారా దక్షిణ భారత రాష్ర్టాలు నష్టపోకుండా కొత్త ఫార్ములా తీసుకురావాలి. కానీ ఇది చేసేదెవరు? దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల వాదన వినేదెవరన్న చర్చ జరుగుతోంది.
ఒక్కసారి ఈ లెక్కలు చూడండి.. జనవరి నెలకు గానూ కేంద్రపన్నుల్లో రాష్ట్రాల వాటాను ఎలా పంచిందో? మొత్తం లక్షా 73 వేల 30 కోట్లను 28 రాష్ట్రాలకు డిస్ట్రిబ్యూట్ చేసింది. ఇందులో బిమారూ స్టేట్స్ అని నాలుగు రాష్ట్రాలకు పేరుంది. అవి బిహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్. ఇందులో బిహార్ కు ఏకంగా 17 వేల 403 కోట్లు, మధ్యప్రదేశ్ కు 13,582 కోట్లు, రాజస్థాన్ కు 10 వేల 426 కోట్లు, ఇక ఉత్తరప్రదేశ్ కు ఏకంగా 31 వేల 39 కోట్లు పంచింది కేంద్రం. ఇది 2025 జనవరి పన్నుల వాటా లెక్కలు. ఇందులో టాప్ త్రీలో బిమారూ రాష్ట్రాలైన యూపీ, బిహార్, మధ్యప్రదేశే ఉన్నాయి. మరి ఆ రాష్ట్రాల నుంచి కేంద్రానికి వెళ్లింది గోరంత. తీసుకున్నవి కొండంత. అదీ మ్యాటర్.
————————————-
రాష్ట్రం కేంద్రపన్నుల్లో వాటా
————————————-
బిహార్ రూ. 17,403 కోట్లు
మధ్యప్రదేశ్ రూ. 13,582 కోట్లు
రాజస్థాన్ రూ. 10,426 కోట్లు
ఉత్తరప్రదేశ్ రూ. 31,039 కోట్లు
————————————-
• బిహార్ రాష్ట్రానికే రూ.72,450 కోట్లు
• రూ.100 చెల్లిస్తే రూ.200పైనే రిటర్న్
• తెలంగాణకు దక్కింది రూ. 3,637 కోట్లు
• తెలంగాణ రూపాయి ఇస్తే తిరిగొస్తున్నది 43 పైసలే
• తెలంగాణ ఇచ్చేది 3 లక్షల కోట్లు
• తెలంగాణ తిరిగి పొందుతున్నది 1.68 లక్షల కోట్లే
• దక్షిణాది రాష్ట్రాలు కేంద్రానికి ఇచ్చేది రూ.22.26 లక్షల కోట్లు
• 5 సౌత్ స్టేట్స్ కు తిరిగి ఇస్తున్నది రూ.6.42 లక్షల కోట్లే
• డైరెక్ట్ ట్యాక్స్ లో సౌత్ వాటా 23.5%
• ప్రత్యక్ష పన్నుల వసూళ్లలో ఉత్తరాది వాటా 9.7 శాతమే
• పన్నుల వాటా తక్కువ, జీడీపీలో వాటా తక్కువ, జనాభానే ఎక్కువ
• పేద రాష్ట్రాలను ఆదుకోవడం అందరి బాధ్యత
• ఏళ్లకేళ్లు అభివృద్ధి చెందలేకపోతున్న ఉత్తరాది రాష్ట్రాలు
• సెగ్మెంట్లు ఎక్కువున్న రాష్ట్రాల్లో గెలిస్తే కేంద్రంలో అధికారం
సో జనాభా తక్కువున్న దక్షిణాది రాష్ట్రాలకూ నిధుల విషయంలో, నియోజకవర్గాల ఏర్పాటులో కొత్త ఫార్ములా తీసుకురావాల్సిన అవసరం ఉంది. లేకపోతే నార్త్, సౌత్ డిస్కషన్స్ మరింతగా పెరగడం ఖాయం.
ఏమైపోతోంది మన యువత..
నిన్న మొన్నటిదాకా భారత్ కు యువతే బలం, యువశక్తి ఎక్కువున్న దేశం అంటూ అంతా మాట్లాడుకునే వారు. కానీ ఇప్పుడు అది తగ్గుతోంది. ఇకపైనా తగ్గుముఖమే పడుతుందని పరిస్థితులు చెబుతున్నాయి. అందుకే గతంలో జనాభా నియంత్రణ అన్న వారే ఇప్పుడు కనండి బాబూ కనండి అంటున్నారు. కథ మార్చాల్సిన టైం వచ్చిందంటున్నారు. లేకపోతే పెను నష్టం తప్పదంటున్నారు. జనాభా పెరగకపోతే నిజంగానే అంత పెద్ద నష్టం ఉందా?
• వరుసగా మూడో ఏడాది చైనా జనాభాలో తగ్గుదల
• జపాన్, సౌత్ కొరియా, హాంకాంగ్ లోనూ తగ్గుదల
• చైనాకు బలం, బలగం ఆ దేశ జనాభానే…
• అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కల నెరవేరడం కష్టమే
• 2100కి చైనా జనాభా 73కోట్లకు తగ్గుతుందని అంచనా
• దక్షిణ భారత దేశంలో తగ్గుతున్న జనసంఖ్య
• జనాభా ఎక్కువున్న రాష్ట్రాల నుంచి సౌత్ కు వలసలు
• కుటుంబ నియంత్రణ కట్టుదిట్టంగా అమలు చేసిన సౌత్
• జనాభా పెంచాలని ప్రతిసందర్భంలో చెప్తున్న చంద్రబాబు
• జనాభా తగ్గుదలపై దక్షిణాది రాష్ట్రాల సీఎంల ఆందోళన
• స్థానిక ఎన్నికల్లో పోటీపై రూల్స్ మార్చే పనిలో ఏపీ
• కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరగడంతో పోషణ భయాలు
• ఒకరిద్దరితోనే సరిపెడుతున్న చాలా జంటలు
జనాభా లెక్కల విషయంలో చైనా నుంచి మొదలు పెడుదాం. ఒకప్పుడు చైనా ప్రపంచంలోనే ఎక్కువ జనాభా ఉన్న దేశంగా ఉండేది. కానీ భారత్ దాన్ని అధిగమించింది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు వరుసగా మూడో ఏడాది చైనాలో జనాభా తగ్గిపోయినట్లు లెక్కలు రిలీజ్ చేసింది. దీంతో అక్కడ భయాలు పెరుగుతున్నాయి. ఎందుకంటే ఓవైపు వృద్ధుల జనసంఖ్య పెరుగుతోంది. అదే సమయంలో పని చేసే యువత సంఖ్యలో తగ్గుదల స్పష్టంగా కనిపిస్తోంది. చైనా ఒక్కటే కాదు తూర్పు ఆసియాలో, జపాన్, సౌత్ కొరియా, హాంకాంగ్ లోనూ జనాభా పడిపోయింది. ఇందుకు కారణం పెరుగుతున్న ఖర్చులు, విద్య, ఉద్యోగం అనే సరికి పెళ్లిళ్లు, ఆ తర్వాత సంతానాలు వాయిదా పడుతున్నాయి. చైనాకు బలం ఆ దేశ జనాభానే. ప్రపంచంలో ప్రస్తుతం రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. ఇది ఫస్ట్ ప్లేస్ కు రాకముందే వృద్ధుల సంఖ్య పెరిగి రివర్స్ అవుతుందన్న భయాలు వారిని వెంటాడుతున్నాయి. 2100 నాటికి చైనా జనాభా 73 కోట్లు ఉంటుందన్న అంచనాలు ఆ దేశ ఆర్థికవ్యవస్థకు పెను సవాళ్లే.
ఓకే.. ఇప్పుడు మనదేశం విషయానికొద్దాం. కొన్ని రాష్ట్రాల్లో విపరీతంగా జనాభా ఉంటే ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం తగ్గుతోంది. సో ఆటోమేటిక్ గా జనాభా ఎక్కువున్న రాష్ట్రాల్లో విద్య, ఉపాధి, ఉద్యోగ, వ్యాపార అవకాశాలు లేని వారంతా దక్షిణ భారత రాష్ట్రాలకు విపరీతంగా వలస వస్తున్నారు. ఇక్కడున్న జనాభా గ్యాప్ ను వలసలతో ఫిల్ చేస్తున్నారు. ఇది శాశ్వత పరిష్కారం కాదు. ఒకప్పుడు కుటుంబ నియంత్రణ చర్యల్లో భాగంగా సౌత్ ఇండియన్ స్టేట్స్ కట్టుదిట్టంగా ఆ రూల్ ను ఫాలో అయ్యాయి. ఇంటికి ఒకరు లేదా ఇద్దరి వరకే సంతానాన్ని సరిపెట్టారు. కానీ ఇప్పుడు అలాగే ఉంటే కుదిరే పరిస్థితి కనిపించడం లేదు. అందుకే ఏపీ సీఎం చంద్రబాబు ప్రతి సందర్భంలోనూ ఇదే మాట మాట్లాడుతున్నారు.
జనాభానే అసలైన ఆస్తి అన్నది ప్రస్తుతం డౌన్ ట్రెండ్ లో ఉన్న చైనా ఆందోళన చూస్తే అర్థమవుతోంది. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆందోళన చూస్తే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే జనాభా లేకపోతే ఏ పనీ చేయలేని పరిస్థితి. సంపద సృష్టి, మ్యాన్ పవర్ జెనరేషన్ ఇవన్నీ తగ్గి మ్యాటర్ లేకుండా పోతుంది. ఇద్దరు పిల్లలకు మించి ఉన్న వారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులనే నిబంధనను కుటుంబ నియంత్రణ చర్యల్లో భాగంగా 1994లో ఉమ్మడి ఏపీలో తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు దాన్ని తీసేస్తామని పిల్లలు లేని వారికి పోటీకి అనర్హత విధిస్తామంటున్నారు చంద్రబాబు.
భారత జనాభా 2060ల నాటికి గరిష్ట స్థాయికి చేరుకుంటుందని, ఆ తర్వాత అది క్రమంగా తగ్గుముఖం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఒక్కరిద్దరినే కనాలి. వారికి మంచి చదువు, మంచి ఆరోగ్యం, మంచి భవిష్యత్ కల్పించేలా చూసుకోవాలన్న కాన్సెప్ట్ తో చాలా మంది ఉంటున్నారు. ఇవాళ్టి రోజుల్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా పెరిగింది. ఎంత సంపాదించినా డైలీ ఖర్చులకే సరిపోతుండడంతో మధ్యతరగతి జనం చాలా వరకు ఒకరిద్దరు సంతానంతోనే సరిపెడుతున్నారు. ఈ రోజుల్లో ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మందిని కనేందుకు ఎవరూ సిద్ధంగా లేరు. ఎందుకంటే ఆ స్థాయి ఖర్చులను భరించే స్తోమత ఉండడం లేదు. కానీ ఇది దేశానికే అందులోనూ సౌత్ ఇండియాకు పెద్ద ఎత్తున నష్టం కలిగించే పరిణామంగా మారుతోంది.
Also Read: భారత సైన్యంలో రోబో డాగ్స్.. ఇవి మన జవాన్లకు ఎలా సాయం చేస్తాయో తెలుసా?
జనాభా పెరుగుదల విషయంలో ఇప్పుడు కొత్త విషయాలు బయటికొస్తున్నాయి. ఈ ఏడాది జనగణన జరిగే అవకాశం ఉంది. ఆ ప్రకారమే నియోజకవర్గాల పునర్విభజన, నిధుల కేటాయింపులు ఉండబోతున్నాయి. దాంతో దేశానికి ఎక్కువ సంపాదించి పెడుతున్న దక్షిణాది రాష్ట్రాలైనా ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక విపరీతంగా నష్టపోయే ముప్పు ఎదుర్కొంటున్నాయి. అందుకే జనాభా పెంచాలని చంద్రబాబు, స్టాలిన్ అంటున్నారు. మరోవైపు జనాభా ప్రకారం కాకుండా రాష్ట్రాల పన్నుల వాటా ఆధారంగా నిధుల డిస్ట్రిబ్యూషన్ ఉండాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వాదిస్తున్నారు. మరి సౌత్ ఇండియాకు జరగబోయేదేంటి?