Kolkata Murder Case : దేశవ్యాప్తంగా సంచలం సృష్టించిన కొల్ కత్తాలోని ఆర్జీకర్ వైద్య కళాశాలలో వైద్య విద్యార్థినిపై హత్యాచారం కేసులో కోర్టు తీర్పు వెలువడింది. ఈ ఘటనలో ప్రధాన ముద్దాయిగా ఉన్న సంజయ్ రాయ్ తప్పు చేసినట్లుగా బలమైన ఆధారాలు లభించడంతో అతనే నేరం చేసినట్లుగా కోర్టు నిర్థరించింది. దీంతో.. నిందితుడిని దోషిగా తేల్చుతూ సంచలన తీర్పు వెలువరించింది. ప్రస్తుతానికి అతను తప్పు చేసినట్లుగా తేల్చిన కోర్టు.. శిక్షను సోమవారం వెలువరించనుంది.
అభయ హత్యాచార కేసులో కోర్టు తీర్పు నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైద్య విద్యార్థిని దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడు సంజయ్ రాయ్ ని ఉరి తీయాలంటూ సిల్దా కోర్టు బయట ప్రజలు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. కోర్టు బయట పెద్ద సంఖ్యలో గుమ్మిగూడిన మెడిసిన్ విద్యార్థులు, ప్రజలు.. సంజయ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
నిందితుడు సంజయ్ కు విధించే శిక్షను చూసి ఇంకొకరు ఇలాంటి దారుణాలకు పాల్పడేందుకు భయపడాలంటూ నినాదాలు చేశారు. రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలన సృష్టించిన కేసు కావడంతో పోలీసు యంత్రాంగం.. గట్టి బందోబస్తు చర్యలు చేపట్టింది. కేసు తీవ్రత దృష్ట్యా భారీ బందోబస్తు మధ్య సంజయ్ రాయ్ ను కోర్టుకు తీసుకొచ్చారు. ప్రత్యేక బృందాలతో పాటు 300 మందికి పైగా పోలీసులు కోర్టు చుట్టూ మోహరించి, ఎలాంటి ఆందోళనలు, హింస చెలరేగకుండా చర్యలు చేపట్టారు.
ఈ కేసులో సీబీఐ బలమైన సాక్షాధారాలు సమర్పించడంతో కేసు నుంచి తప్పించుకోవడం నిందితుడి వల్ల కాలేదని పోలీసులు వెల్లడించారు. దేశ వ్యాప్తంగా అనేక వర్గాల నుంచి వ్యతిరేకత ఉండడం, కేసు దర్యాప్తులో మొదటి నుంచి పోలీసు యంత్రాంగం సీరియస్ గా తీసుకుందని పోలీసులు తెలిపారు.