Rs 12000 Per Year Scheme : రైతు కూలీలకు ఎన్నికల్లో హామి ఇచ్చిన మేరకు ఏడాదికి రూ.12 వేల సాయం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ ప్రతిష్టాత్మకమైన పథకాన్ని జనవరి 26 నుంచి ప్రారంభించనున్నారు. ఈ పథకం అమలు గురించి అధికారులతో చర్చించిన పంచాయితీ రాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క.. తమ ప్రభుత్వం పేదలు, మహిళల పక్షపాతి అని వ్యాఖ్యానించారు.
గణతంత్ర దినోత్సవం నుంచి నాలుగు ప్రతిష్టాత్మక పథకాలను ప్రభుత్వం ప్రారంభించనుందని తెలిపిన మంత్రి సీతక్క.. సొంత భూమిలేని ఉపాధి హామీ కూలీలకు ఏడాదికి రూ. 12 వేల ఆర్థిక చేయూత అందించనున్నట్లు ప్రకటించారు. దేశంలోని ఏ రాష్ట్రంలో ఇలాంటి పథకం లేదన్న మంత్రి.. కూలీల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా నగదు బదిలీ చేయనున్నట్లు వెల్లడించారు. కుటుంబంలోని మహిళాల బ్యాంకు ఖాతాల్లో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సాయాన్ని జమ చేయనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా పక్షపాతి ప్రభుత్వమని.. అందుకే మహిళల ఖాతాల్లోకి నగదు బదిలీ చేస్తున్నాం అని ప్రకటించారు.
తాను మంత్రిగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వంటి కార్యక్రమం ద్వారా పేదలకు సాయం చేసే అవకాశం రావడం సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. ఈ పథకం ద్వారా నిరుపేదలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులు జాగ్రత్త పడాలని సూచించిన మంత్రి సీతక్క.. జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు పథకం అమలులో జాగ్రత్తగా ఉండాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చారిత్రాత్మక ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
అర్హుల గుర్తింపులో పారదర్శకత ముఖ్యమని, గ్రామ సభ వేదికగానే అర్హుల గుర్తింపు, లబ్ధిదారుల ఎంపిక జరగాలని అన్నారు. శాంతియుత వాతావరణంలో గ్రామ సభలు జరిగేలా చర్యలు తీసుకోవాలని.. గ్రామసభ నిర్ణయమే అంతిమం అని వ్యాఖ్యానించారు. గ్రామసభలోని నిర్ణయం మేరకే ఈ పథకాన్ని అమలు చేయాలని అన్నారు. మానవీయ దృక్పథంతో, సామాజిక స్పృహతో అధికారులు వ్యవహరించాలని, సాంకేతిక కారణాలు చూపించి పేదలకు నష్టం కలిగేలా వ్యవహరించవద్దని సూచించారు.
ఇక.. ఈ పథకం అమలుపై వస్తున్న రాజకీయ విమర్శలను ఖండించిన మంత్రి సీతక్క.. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాపై అనవసర రాజకీయాలు తగవని సూచించారు. కూలీలకు రూపాయి సహాయం చేయని బీఆర్ఎస్ నేతలు.. ఈ పథకం గురించి వ్యాఖ్యానించడం హాస్యాస్పదం అన్నారు. రైతులకు, కూలీలకు మధ్య తగవులు పెట్టేలా బీఆర్ఎస్ వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
అర ఎకరా ఉన్న రైతు కన్నా.. ఏ భూమి లేని కూలికే అధిక లబ్ధి చేకూరుతుందంటూ కూలీలను అవమానపరిచేలా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని.. రైతులకు రుణమాఫీ చేయని నాయకులు ఇప్పుడు రైతులపై మొసలి కన్నీరు కారుస్తున్నారంటూ చురకలు అంటించారు. రైతులకు రైతు భరోసా, పంట బోనస్ ద్వారా కౌలు రైతులకు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా కూలీలకు ఆర్థికంగా అండగా నిలుస్తున్న ప్రభుత్వం తమదని అన్నారు.
అభివృద్ధి, సంక్షేమం నిరంతర ప్రక్రియ, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామి ఇచ్చిన మంత్రి సీతక్క.. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమల్లో తలెత్తే లోటుపాట్లను సవరిస్తామని ప్రకటించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ సాయాన్ని అందిస్తామని.. ఈ పథకం మంచి ఉద్దేశాలను చెడగొట్టాలని కొంత మంది చూస్తున్నారని మంత్రి అన్నారు. గ్రామ సభల్లో కవ్వింపు చర్యలకు పాల్పడే అవకాశాలున్నాయి.. కూలీలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలి సూచించారు. ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా సామరస్య పూర్వక వాతావరణంలో గ్రామసభలు జరిపించాలి అధికారులను ఆదేశించారు.
Also Read : చిట్టి గుండెకు CPR.. అప్పుడే పుట్టిన పాపకు తిరిగి ప్రాణం పోసిన అంబులెన్స్ టెక్నీషియన్
నల్గొండలో 99 మంది పంచాయతీ కార్యదర్శలు అనుమతులు లేకుండా విధులకు నెలల తరబడి గైర్హజరయ్యారని వెల్లడించిన మంత్రి సీతక్క.. అందుకే వారి సర్వీస్ బ్రేక్ చేయాల్సి వచ్చిందని వెల్లడించారు. ఏ స్థాయి అధికారులైనా అనుమతులు లేకుండా విధులకు గైర్హాజరైతే చర్యలు తప్పవని హెచ్చరించారు. కొత్త రేషన్ కార్డుల మంజూరి, ఇందిరమ్మ ఇండ్ల మంజూరి కూడా గ్రామ సభ వేదికల మీదే జరగాలని ఆదేశించారు. అర్హులైన వారికి వెంటనే ఇందిరమ్మ ఇళ్ల ప్రోసీడింగ్స్ అందించాలని, అర్హుల గుర్తింపులో, లబ్దిదారుల ఎంపిక లో గ్రామ సభలు వ్యక్తం చేసే అభ్యంతరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సూచించారు.