BigTV English

Nepal PM KP Sharma: రాముడు మావాడే.. శివుడూ మావాడే.. నేపాల్ ప్రధాని సంచలనం

Nepal PM KP Sharma: రాముడు మావాడే.. శివుడూ మావాడే.. నేపాల్ ప్రధాని సంచలనం

Nepal PM KP Sharma: ఇప్పటి వరకూ వాల్మీకి రామాయణమే ప్రామాణికంగా భావించే వాళ్లం. కానీ కొత్తగా నేపాలీ రామాయణం పుట్టుకొస్తోంది. గత కొంత కాలంగా నేపాలీ ప్రధాని ఓలీ పదే పదే రాముడు మా దేశంలో పుట్టాడని అంటున్నారు. అంతే కాదు శివుడు, విశ్వామిత్రుడు కూడా నేపాలీ వాసులేనంటారాయన. ఇంతకీ శ్రీ రాముడు ఎక్కడ పుట్టాడు? ఆయన నిజ జన్మస్థలమేంది?


1528 నుంచి ఇప్పటి వరకూ ఎన్నో పరిణామాలు

500 ఏళ్ల నాటి సుదీర్ఘ పోరాటం అయోధ్య బాలరామ మందిర నిర్మాణం. ఇక్కడి శ్రీరామ్ జన్మస్థలి ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఉద్యమంగా పేరు. 1528 నాటి నుంచి ఇప్పటి వరకూ ఎన్నో కీలకపరిణామాలు. ఆనాడు దేశాన్ని మొఘలులు పాలించగా.. నాటి బాబర్ పాలనలోని సైన్యాధ్యక్షుడు- మీర్ బఖీ అయోధ్యలో బాబ్రీ మసీదు నిర్మించారు. రామాయణం ప్రకారం.. అయోధ్యలోనే శ్రీరాముడి జన్మస్థలంగా భారతీయుల విశ్వాసం. బాబ్రీ మసీదు ఉన్న చోటే బాలరామ జననం జరిగిందని చెబుతారు. 1843 నుంచి 1949 వరకూ మసీదు చుట్టూ ఎన్నో వివాదాలు. 1853, 1859 కాలంలో మరెన్నో గొడవలు జరిగాయి. దీంతో నాటి బ్రిటీష్ ప్రభుత్వం.. అయోధ్య లోని ఈ ప్రాంతం చుట్టూ కంచె నిర్మించింది. మసీదు లోపలి భాగంలో ముస్లిములు, బయట భాగంలో హిందువులు ప్రార్ధించేలా అనుమతులిచ్చింది.


1949లో మరింత ముదిరిన వివాదం

స్వాతంత్రం వచ్చాక అంటే 1949లో ఈ వివాదం మరింత ముదిరింది. బాబ్రీ మసీదులో కొందరు హిందువులు బాలరాముడి విగ్రహముందని చెప్పడం ప్రారంభించారు. దీంతో మతపరమైన ఘర్షణలు జరుగుతాయని నాటి ప్రభుత్వం దీన్ని వివాదాస్పద స్థలంగా ప్రకటించింది. దీంతో తలుపులకు తాళాలు పడ్డాయి. 1984లో ఈ స్థలానికి విముక్తి కల్పించి.. రామ మందిరం నిర్మించాలంటూ విశ్వ హిందూ పరిషత్ ఒక ఉద్యమాన్ని లేవదీసింది. 1988 ఫిబ్రవరి ఒకటిన తాళాలు తీయాలని ఫైజాబాద్ జడ్జి తీర్పునిచ్చారు. హిందువులు లోపలికి వెళ్లి పూజలు చేసుకోవచ్చని చెప్పారు. అప్పుడే బాబ్రీ మసీదు కార్యాచరణ సంఘం ఏర్పడింది. 1990 లో అయోధ్య రామాలయానికి మద్దతుగా సోమ్ నాథ్ నుంచి బీజేపీ అగ్రనేత అద్వానీ రథయాత్ర చేపట్టారు. 1992 డిసెంబర్ 6న కొందరు కరసేవకులు బాబ్రీ మసీదును కూల్చి వేశారు. ఇది దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. అప్పటి వరకూ కలిసి మెలసి ఉన్న భారతీయ హిందూ- ముస్లిం సమాజం రెండుగా చీలిన పరిస్థితులు. అయోధ్యతో పాటు పలు ప్రాంతాల్లో వేలాది మంది మరణించారు.

2003లో భారత పురావస్తు శాఖ ఆధారాలు

మసీదు కింద ఒక నిర్మాణం ఉండేదని 2003లో భారత పురావస్తు శాఖ తవ్వకాల్లో తేలింది. ASI వెలుగులోకి తెచ్చిన ఈ విషయంపై తీవ్ర స్థాయిలో విబేధాలు వచ్చాయి. 2010 లో ఈ వివాదాస్పద భూమిని మూడు భాగాలుగా విభజిస్తూ అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. అలా సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహీ అకాడా, రామ్ లల్లా తరఫు ప్రతినిథులకు వీటిని కేటాయించాలని ఆదేశించింది. 2011లో ఈ తీర్పుపై సుప్రీం స్టే విధించింది. 2016 వరకూ అయోధ్య వివాదంపై అనేక సార్లు సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. 2019లో సుప్రీం చారిత్రక తీర్పు నిచ్చింది. 2. 77 ఎకరాల భూమిని రామాలయ నిర్మాణం కోసం ట్రస్టుకు కేటాయించాలని, సుప్రీం రాజ్యంగ ధర్మాసనం తీర్పునిచ్చింది. మసీదు నిర్మాణం కోసం అయోధ్యలో ప్రత్యామ్నయ ప్రదేశంలో 5 ఎకరాల భూమిని కేటాయించింది. 2020 ఫిబ్రవరి 5న రామాలయ నిర్మాణ నిర్వహణ బాధ్యతలను శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టును ఏర్పాటు చేసింది కేంద్రం ప్రభుత్వం. 2024 జనవరి 22న కొత్త బాలరాముడి విగ్రహంతో నూతన రామాలయ ప్రారంభం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధాని మోడీ చేతుల మీదుగా రాముడి ప్రాణ ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. దీంతో అయోధ్య మొత్తం రామభక్తులతో నిండి పోయింది.

ఇంత పెద్ద ఉద్యమాన్ని తేల్చేస్తూ నేపాలి ప్రధాని కామెంట్లు

ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. రామ జన్మ భూమి గురించి 500 ఏళ్ల సుదీర్ఘ పోరాటం జరిగితే.. ఇప్పుడొచ్చి.. ఈ మొత్తం ఉద్యమాన్ని తేల్చేస్తూ.. రాముడు జన్మించింది మా దేశంలోనే అంటూ నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ ఒకటికి రెండు సార్లు చెబుతుంటే.. ఏమనాలో అర్ధం కాని పరిస్థితి. ఇక్కడి సూర్య వంశజులు ఆలయ నిర్మాణం జరిగే వరకూ తాము తలపాగా కట్టమని భీష్మించుకు కూర్చున్న పరిస్థితులు. మొత్తంగా అయోధ్య బాలరాముడి ఆలయ ప్రారంభోత్సవ సందర్భంగా వారు తమ తలపాగాలు చుట్టుకున్నటు వంటి ఎమోషన్స్ ఎన్నో దాగి ఉన్నాయిక్కడ. ఎన్నో వివాదాలు- సంచలనాలు- ప్రాణ త్యాగాలు- పోరాటాలు దాగి ఉన్న ఈ మొత్తం రామజన్మభూమి ఉద్యమ క్రమంలో.. ఇదొక సుదీర్ఘ పోరాటంగా ప్రపంచ మంతా గుర్తించింది. నేపాల్ ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలీ మళ్లీ ఈ తేనె తుట్టె కదల్చడం ఏంటో అర్ధంకాని పరిస్థితి. సోమవారం నాడు కాట్మండులో జరిగిన పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న ఓలీ.. శ్రీరాముడు పుట్టింది నేపాల్లో అంటూ వ్యాఖ్యానించడంతో.. వ్యవహారం మళ్లీ మొదటికొచ్చినట్టు అయ్యింది.

రామాయణం ఆధారంగానే చెబుతున్నా- నేపాలీ ప్రధాని

ఓలి పైత్యం ఎంతటి పరాకాష్టకు చేరిందంటే రామాయణం ఆధారంగానే తానీ మాట చెబుతున్నాయని అంటున్నారు. దానికి తోడు రామ జన్మభూమి నేపాల్లో ఉందని ప్రచారం చేయడానికి దేశ ప్రజలు ఎంత మాత్రం సంకోచించరాదని కూడా పిలుపునిచ్చారు. అంతే కాదు శ్రీరామ జన్మస్థలి విషయంలో ఇతరులు వేరే కథలను ఎలా పుట్టించగలరని కూడా ప్రశ్నించారు. అయితే రాముడి జన్మభూమి నేపాల్లోనే ఉందని తాము సరైన ప్రచారం చేయలేక పోతున్నట్టు కూడా చెప్పారు ఓలీ. ఈ సందర్భంగా మాట్లాడిన ఓలీ.. శివుడు, విశ్వామిత్రుడు సైతం తమ దేశంలోనే పుట్టినట్టుగా చెప్పుకొచ్చారు. ఇది తన సొంత వ్యాఖ్యానం కాదని.. వాల్మీకి రామాయణంలోనే ఉందని అంటున్నారు.

దశరథుడు పుత్రకామేష్టి యాగం చేసిందీ ఇక్కడే- ఓలీ

అలాగని ఇది తొలిసారి కాదు. 2020లోనూ ఇలాగే చెప్పారీ నేపాలీ ప్రధాని. రామ జన్మభూమి తమ దేశంలోని చిత్వాన్ లోని థోరీలో ఉందని.. రాముడు ఇక్కడే పుట్టాడని నాడే అన్నారాయన. దశరథుడు పుత్రకామేష్టి యాగం చేసిన ప్రాంతం కూడా.. తమ దేశంలోనే ఉందన్నారు ఓలీ. అప్పట్లో ఓలీ చేసిన ఈ కామెంట్ల కారణంగా తీవ్ర దుమారం చెలరేగింది. ఈ క్రమంలో నేపాలీ విదేశాంగ శాఖ ఒక ప్రకటన సైతం విడుదల చేసింది. ఎవరి మనోభావాలు దెబ్బ తీయడానికి తామీ వ్యాఖ్యలు చేయలేదని ప్రకటించింది. రాముడి జన్మస్థలంపై అనేక వివాదాలున్నాయని.. రామాయణంపై విస్తృత సాంస్కృతిక- భౌగోళిక అధ్యయనం జరపాల్సిన అవసరం ఉందని మాత్రమే తమ ప్రధాని చెబుతున్నట్టు ఆ ప్రకటనలో తెలియ చేసింది నేపాలీ విదేశాంగ శాఖ. తాజాగా మరోమారు కూడా ఓలీ ఈ వ్యాఖ్యలు చేయడంతో.. మళ్లీ ఈ వివాదం చర్చకు వచ్చింది.

ఐదేళ్ల నుంచి నేపాల్ ప్రధాని ఓలీ.. అసలైన అయోధ్య ఉన్నది మా నేపాల్లో అని అంటున్నారు. శ్రీరాముడి నిజమైన జన్మస్థలం నేపాల్లోని థోరీ అనే ప్రాంతంలో ఉందని అంటారాయన. ఇక్కడ అయోధ్య ధామ్ నిర్మిస్తానని కూడా ప్రకటించారు. అందులో భాగంగా కనీసం ఇటుక రాయి కూడా ఈ ఆలయ నిర్మాణంలో ఇటు దీసి అటు పెట్టినట్టు లేదు. ఇంతకీ ఈ పరిశోధన ఎక్కడి వరకూ వచ్చింది? ఇప్పటి వరకూ రామ జన్మభూమిపై ఉన్న వివాదాలేంటి? ఆ వివరాలు ఎలాంటివి?

నేపాల్ జనక్ ఫురి నుంచి అయోధ్యకు 1100 కానుకలు

2024, జనవరి 22న అయోధ్య రామమందిర ప్రతిష్టాత్మక మహోత్సవం సందర్భంగా.. ఒక దృశ్యం అందరినీ ఆకర్షించింది. నేపాల్ జనక్ పురి నుంచి ఏకంగా 1100 కానుకలు రామజన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్ట్ కి వచ్చాయి. అక్కడి జానకీ మాత ఆలయ నుంచి వచ్చిన సారె ఇది. ఇందులో చీరలు, ధోతీలు, ఆభరణాలు, మంచం, టేబుల్, కుర్చీ, స్టవ్, పలు రకాల మిఠాయిలు కూడా ఉన్నాయి. వీటితో పాటు నేపాల్ నుంచి అదివరకే అయోధ్య రామాలయానికి సాలిగ్రామ రాయి, పవిత్ర జలం కూడా చేరాయి. ఇక్కడి నుంచి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సీతమ్మవారి జన్మస్థలి జనక్ పుర్ ఆలయానికి ఆహ్వానం పంపడంతో.. రామయ్య సన్నిధికి ఈ చీర సారెలు వచ్చాయి.

ఆలయ భూమి పూజ నాటి నుంచి కన్ను కుట్టిన నేపాల్ ప్రధాని

ఎప్పుడైతే.. అయోధ్య రామాలయ భూమి పూజ జరిగిందో.. నేపాల్ ప్రధానికి కన్ను కుట్టినట్టయ్యింది. వెంటనే ఆయన అసలైన అయోధ్య నేపాల్లోనే ఉందని కొత్త వాదన తెరపైకి తెచ్చారు. ఇది నేపాల్ పురావస్థు శాఖకు అతి పెద్ద సవాల్ ని తీసుకొచ్చి పెట్టింది. ప్రధాని అంతటి వారు.. ఇలా ప్రకటించడంతో.. ఈ మంత్రిత్వ శాఖ థొరిలోని రామజన్మస్థలి ఆనవాళ్లు కనిపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే అందుకు తగిన ఆధారాలున్నాయని తమ ఎరకలో ఇంత వరకూ ఎక్కడా కనిపించలేదనీ. కనీసం మా ఇతిహాసాల్లో కూడా అలాంటి ఆనవాళ్లున్నట్టు గాము గుర్తించలేదనీ. ఇప్పటి వరకూ అయితే మా దగ్గర ఆధారాలు లేవనీ అన్నారు నేపాలీ పురావస్తు శాఖ డైరెక్టర్. అంతే కాదు వచ్చే రోజుల్లో అందుకు తగిన ఆనవాళ్లు బయట పడతాయన్న గ్యారంటీ కూడా లేదని చెప్పారా నేపాలీ అధికారి.

దేశంలో వివిధ పార్టీ లీడర్ల నుంచి కూడా విమర్శలు

కేవలం అధికారులు మాత్రమే కాదు.. ఓలీ చేసిన ఈ కామెంట్లు దేశంలోని వివిధ పార్టీ నేతల నుంచి కూడా విమర్శలు ఎదురయ్యాయి. ఇది అర్ధం పర్ధం లేని అసంబద్ధ వ్యాఖ్యగా వారు అప్పుడే కొట్టి పడేశారు. ఇందులో ఎవరి మనోభావాలు దెబ్బ తీసే ఉద్దేశం లేదంటూ ఆనాడే నేపాల్ విదేశాంగ శాఖ- తమ ప్రధాని చేసిన కామెంట్ల ద్వారా ఏర్పడ్డ డామేజీని దిద్దుకునే చర్యలు చేపట్టింది. థాయ్ లాండ్ వంటి సుదూర ప్రాంతాల్లోని రామాయణ గాథలు.. అయోధ్యే రాముడి జన్మస్థలంగా పేర్కొన్నాయి. అయితే కొందరు వామపక్షజాల భావజాలం గల చరిత్ర కారుల నుంచి భిన్నమైన కథనాలు వెలువడ్డాయి. వీరు చెప్పేదాన్నిబట్టీ.. ప్రస్తుత అయోధ్యలోని కొన్ని ప్రాంతాలు.. రాముడు పాలించిన సమయం తర్వాత ప్రారంభమయ్యాయని అంటారు. ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్య అసలు పేరు సాకేత పురమని ఆనాడు గుప్త వంశ రాజైన స్కంద గుప్తుడు దీని పేరు మార్చారని చెబుతారు చరిత్ర కారులు..

రాముడి జన్మస్థలం.. హర్యానాలోని బనవాలీగా..

ఇక రామ, రావణ ఇన్ సింధూ ప్రింట్స్ అనే పరిశోధనా పత్రంలో ఒక పురావస్తు శాస్త్రవేత్త.. రాముడి జన్మస్థలం హర్యానాలోని బనవాలీగా రాసుకొచ్చారు. రాముడ్ని సింధులోయ అంటే ప్రస్తుత ఇరాన్, ఇరాక్, ఆఫ్గన్ వంటి ప్రాంతాలను పాలించిన రిమ్ సిన్ అనే లార్సా రాజుతో పోల్చారు. రావణుడ్ని హమ్మురాబీ రాజుగా గుర్తించారు. అతడితోనే రిమ్ సిన్ కి యుద్ధం జరిగినట్టు చెబుతాడీ పురావస్తు శాస్త్రవేత్త. కొందరైతే ఇరాన్, పాకిస్థాన్ లోనూ రామాయణ ఆనవాళ్లను చూపిస్తారు. లాహోర్, కరాచీ వంటి నగరాల పేర్లకూ రామాయణంలోని కొన్ని పాత్రలకూ సంబంధముందని కూడా చెబుతారు. ఈ రెండు నగరాలను రాముడి పుత్రులైన లవకుశులు స్థాపించినట్టుగా భావిస్తారు.

పార్టీలో అంతర్గత కలహాలు ఏర్పడ్డ ప్రతి సారీ.. ఓలీ ఇంతే

ఇక ఓలీ వ్యవహారానికి వస్తే.. పార్టీలో అంతర్గత కలహాలు ఏర్పడ్డ ప్రతి సారీ.. ఆయన అయోధ్య వివాదాన్ని కదిలిస్తారని అంటారు. రాముడి జన్మభూమి అంశాన్ని తెరపైకి తెచ్చి నేపాలీల దృష్టి మరలిస్తుంటారని చెబుతారు. బేసిగ్గానే ఓలీ నిరంకుశ పాలకుడనీ.. దానికి తోడు ఆయన భారత వ్యతిరేక వ్యాఖ్యలతో మరింత ఇబ్బందులు కొని తెస్తుంటారని చెబుతారు. ఇప్పుడే కాదు అప్పట్లోనే ఓలి కామెంట్లపై నేపాలీ కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. ఆయనిలాంటి చీప్ ట్రిక్స్ ద్వారా దేశాన్ని పాలించే నైతిక అర్హత కోల్పోయారని అంటారు. అయోధ్య విషయంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ కూడా స్పందించింది. ప్రధాని ఓలీ చేస్తున్న ఈ కామెంట్ల వ్యవహారంలో ప్రభుత్వ అధికారిక వైఖరి స్పష్టం చేయాలని కోరారు నేపాలీ కమ్యూనిస్టులు. అప్పట్లోనే ఓలీ కామెంట్లపై స్పందించిన వారు ఆయన రాజీనామా సైతం డిమాండ్ చేశారు. గతంలో ఓలీ అయోధ్య నేపాల్లో ఉందని అన్నప్పుడే బీజేపీ లీడర్లు తీవ్రంగా ఖండించారు. ఇక్కడ రాముడికి సంబంధించిన నమ్మకాలు అంత తేలికైనవి కావని. ఈ అంశంలో ఎవరెన్ని కామెంట్లు చేసినా.. భారతీయులు ఎంత మాత్రం అనుమతించరనీ అన్నారు. రాముడు భారతీయ వారసత్వం గురించి ప్రపంచమంతా తెలుసని అంటారు బీజేపీకి చెందిన నాయకులు. నేపాలీ విదేశాంగ శాఖ ఈ విషయంలో ఎప్పుడో క్లారిటీ ఇచ్చిందని. ఓలీ నేపాలీ ప్రధాన మంత్రి అయినంత మాత్రాన నేపాల్ మొత్తం ఇదే మాట అన్నట్టు కాదని.. అది కేవలం ఆయన సొంత విషయమని అంటారు బీజేపీల లీడర్లు.

ఇంకా నయం.. మొఘల్ చక్రవర్తి బాబర్ సైతం నేపాలి అనలేదు..

ఇంకా నయం మొఘల్ చక్రవర్తి బాబర్ కూడా నేపాలీ అనలేదని చమత్కరిస్తారు కొందరు. శ్రీరాముడంటే ప్రపంచ వ్యాప్తంగా తెలుసు. ఆయన భారత దేశానికి మాత్రమే సంబంధించిన చారిత్రక, ఆధ్యాత్మిక నిధిగా అభివర్ణిస్తుంది శివసేన అధికారిక పత్రిక సామ్నా. ఓలీ చైనా చేతిలో కీలుబొమ్మనీ భారత్ లో ఏదో ఒక అలజడి సృష్టించడంలో భాగంగానే ఇదంతా చేస్తున్నారని అంటారు.. శివసైనికులు. నేపాల్- చైనాతో అస్సలు పొంతన లేదని. అదే భారత్ తో నేపాల్ కి చుట్టరికముందని. ఈ చారిత్రక ఆధ్యాత్మిక చుట్టరికం మరచి పోయి కేవలం రాజకీయ లబ్ధి కోసం నేపాల్ ప్రధాని ఇలా కామెంట్ చేయడం కరెక్టు కాదని వారిస్తారు కొందరు.

Also Read: బాలినేనికి పవన్ ఇచ్చే పదవి ఇదేనా?

నాడు కరసేవకుల రక్తంతో ఎర్రగా మారిన సరయూ

సరయూ నది నేపాల్ లో ఏం లేదు. అది ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్యకు దగ్గర్లో ఉందని పురాణాలలో కూడా వర్ణనలు ఉన్నాయి. రామ మందిరం కోసం పోరాడిన కరసేవకుల రక్తంతో సరయూ ఎర్రగా మారిన స్థితిగతులు కూడా ఉన్నాయి. ఇలాంటివన్నీ మరచిన ఓలీ.. ఇష్టారాజ్యంగా మాట్లాడతే తగిన మూల్యం చెల్లించాల్సి ఉందని హెచ్చరిస్తున్నారు కొందరు శ్రీరామభక్తులు. ఓలీ ఇలా వ్యాఖ్యానించడంపై గతంలోనే ఆగ్రహించిన పలువురు హిందూ సాధువులు.. భారత్ నేపాల్ కి ఇచ్చే అన్ని ఆర్ధిక సహాయాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అంతే కాదు నేపాల్ తో ఉన్న దౌత్య సంబంధాలను కూడా తెంచుకోవాలని సూచించారు. భారతీయుల మనోభావాలను దెబ్బ తీసిన ఓలీ రామభక్తులకు క్షమాపణలు చెప్పాలన్న డిమాండ్లు కూడా వెల్లువెత్తాయ్.

Story By Adinarayana, Bigtv

Related News

Meeting Fight: ఎమ్మెల్యే Vs కమిషనర్.. హీటెక్కిన గుంటూరు కార్పొరేషన్ కౌన్సిల్

Congress: గుత్తా లేఖల వెనక సీక్రెట్ ఏంటి?

AP Politics: టీడీపీలో సంస్థాగత మార్పులపై రచ్చ!

Bigg Boss Agnipariksha: బిగ్ బాస్ అగ్ని పరీక్ష మొత్తం స్క్రిప్టా… మరీ ఇంత మోసమా?

AP Politics: జనసేన మీటింగ్ సక్సెస్ అయ్యిందా?

Telangana BJP: సీక్రెట్‌గా షోకాజ్ నోటీసులు.. తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతుంది?

Big Stories

×