Tirumala News: తిరుమలలో భక్తులకు శ్రీవారి దర్శనం వేగంగా జరిగేలా చర్యలు చేపట్టింది టీటీడీ. ముఖ్యంగా భక్తులకు కేటాయించిన సమయంలో దర్శనం కల్పించేందుకు టెక్నాలజీని వినియోగించుకోనుంది. క్యూఆర్ కోడ్, ముఖ గుర్తింపు ద్వారా భక్తులను ధృవీకరించే అంశాన్ని పరిశీలన చేస్తున్నారు. అదే గనుక జరిగితే గంటలో శ్రీవారి దర్శనం కానుంది.
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించేందుకు దేశ, విదేశాల నుంచి భక్తులు తిరుమలకు వస్తుంటారు. సమ్మర్ సీజన్ తగ్గినా, తిరుమలలో మాత్రం రద్దీ కొనసాగుతూనే ఉంది. దీనివల్ల భక్తుల దర్శనాలు ఆలస్యం అవుతున్నాయి. వీటికి చెక్ పెట్టేందుకు కీలక నిర్ణయం తీసుకుంటోంది టీటీడీ.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో భక్తులకు సమయానికి దర్శనం అయ్యేలా చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. దీనికి సంబంధించిన టీసీఎస్ ప్రతినిధులతో టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఆన్‌లైన్ ద్వారా టీసీఎస్ ప్రతినిధులు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా ఈవో శ్యామలరావు మాట్లాడుతూ సర్వదర్శనం, ఎస్ఎస్డీ, 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు, టోకెన్ల ద్వారా వేల సంఖ్యలో భక్తులు ఉంటారని అన్నారు. ఆయా విభాగాల వారికి టెక్నాలజీ సాయంతో సకాలంలో దర్శనం చేయించాలన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా శ్రీవారి దర్శనంలో మార్పులు చేయాలన్నారు.
ALSO READ: ప్రసన్నకుమార్ చుట్టూ బిగిసిన ఉచ్చు.. అరెస్టు ఖాయం?
క్యూఆర్ కోడ్, ముఖ గుర్తింపు పద్దతి ద్వారా భక్తులను వేగంగా దర్శనానికి పంపితే సమయం ఆదా అవుతుందన్నారు. ఈ కోణంలో పరిశీలించాలని అధికారులను ఈవో కోరారు. దీనిపై సత్వర చర్యలు తీసుకోవాలన్నారు. కేటాయించిన సమయానికి భక్తులు రాకపోవడం కారణంగా మరింత ఆలస్యం అవుతుందన్నారు.
భక్తులకు కేటాయించిన సమయానికి సంబంధిత ప్రాంతానికి వచ్చేలా అవగాహన కల్పించాలన్నారు. దీనివల్ల సమయం ఆదా కావడమే కాకుండా భక్తులకు సంతృప్తికరమైన శ్రీవారి దర్శనం చేసుకుంటారని అన్నారు. భక్తులు క్యూలైన్లలో ప్రవేశించినప్పటి నుండి దర్శనం ముగిసే వరకు ఎంత సమయం పడుతుంది? అనేది రియల్ టైమ్ ద్వారా అధ్యయనం చేయాలన్నారు.
వైకుంఠం క్యూకాంప్లెక్స్ కంపార్ట్‌మెంట్లల్లో భక్తులు ఎంతసేపు ఉంటున్నారు? క్యూలైన్లలో చేరిన నుంచి దర్శనానికి ఎంత సమయం పడుతోంది? ఆలయం బయటకు రావడానికి ఎంత సమయం పడుతోంది? అనే విషయాల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా టీసీఎస్ ప్రతినిధులు వివరించారు.