Ongole Politics: ఆ మాజీ మంత్రి మళ్లీ పార్టీ మారబోతున్నాడా? పవన్ ఎందుకు ఎంటరవ్వాల్సి వచ్చింది? అయ్యాక పరిస్థితి ఏంటి? ఉప్పు-నిప్పులా ఉండే తాజా, మాజీ ఎమ్మెల్యేలు ఒక్కటవుతారా? అధిష్టానం ఆదేశాలను పాటిస్తారా? పక్కనబెడుతారా? ఇలాంటి ప్రశ్నలు ఒంగోలు కూటమి నాయకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఇంతకీ ఎవరా ముగ్గురు.
ఒంగోలు రాజకీయం ఎప్పుడూ ఆసక్తికరమే
ఒంగోలు రాజకీయం ఎప్పుడూ ఆసక్తికరమే. ఎందుకంటే ఏపీలోని మరే జిల్లాలో కూడా ఇలాంటి పొలిటికల్ సినారియో లేదని చెప్పాలి. అందుకారణం మాజీ మంత్రి, ప్రస్తుత జనసేన నాయకుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి. ఆయన జనసేన తీర్థం పుచ్చుకున్నప్పటి నుంచి కూటమి ప్రభుత్వంలో ఒంగోలు నియోజకవర్గ రాజకీయం నాటకీయ పరిణామాల నడుమ సాగుతోంది. బాలినేనితో పాటు ఆయన అనుచరులు జనసేనలో చేరారు. అలా వారు.. కొందరు పాత జనసేన నేతలు కలిసి బాలినేని వర్గం నడుస్తుండగా.. జిల్లా జనసేన అధ్యక్షుడు రియాజ్ ఆధ్వర్యంలో మరో వర్గం కార్యకలాపాలు చేస్తోందట. కూటమి ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్‌కు రియాజ్ వర్గం సన్నిహితంగా ఉంటూ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతోంది.
రియాజ్‌కు ఇటీవలే కార్పొరేషన్ పదవి
ఇటీవలే జనసేన జిల్లా అధ్యక్షుడు రియాజ్ కు లైవ్ స్టాక్ డెవలప్మెంట్ బోర్డ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కింది. దాంతో జిల్లా జనసేనకు కొత్త బాస్ ను నియమిస్తారని టాక్ నడుస్తోంది. రియాజ్ కార్పొరేషన్ బాధ్యతలు చూసుకోవాల్సి ఉంటుంది కాబట్టి.. కచ్చితంగా కొత్త అధ్యక్షుడిని నియమిస్తారనే సంకేతాలు జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి వెలువడ్డాయని సమాచారం. దాంతో బాలినేని శ్రీనివాస్ రెడ్డికే అధ్యక్ష పదవి వస్తుందని ఆయన వర్గం ధీమాగా ఉందట. అలా ఇస్తే పార్టీలో వర్గపోరు వస్తుందని హైకమాండ్ ఆలోచించినట్టు తెలుస్తోంది. జిల్లాలో వర్గ పోరును కంట్రోల్ చేసి పార్టీని ఒక తాటిపై నిలబెట్టే వ్యక్తి కోసం అధిష్టానం విస్తృత సర్వేలు చేస్తోందట. ఒకవైపు రియాజ్ వర్గం మరోవైపు బాలినేని వర్గం పోటాపోటీ కార్యక్రమాలతో సాగుతుండగా కూటమి ప్రభుత్వ మాత్రం రియాజ్ వర్గాన్నే కలుపుకొని పోతోంది. దాంతో బాలినేని వర్గం ఒకంత అసహనంగా ఉందట. ఈ నేపథ్యంలో బాలినేని వర్గం వారే తమ అధినేత పార్టీ మారతారని ప్రచారాన్ని కూడా మొదలుపెట్టారని టాక్ నడుస్తోంది.
ఇద్దరు కలిసి కార్యక్రమాలు చేస్తారా?
అయితే పార్టీ మార్పు అనే ప్రచారానికి బాలినేని మార్కాపురం సభతో పుల్ స్టాప్ పెట్టారు. సభకు హాజరైన బాలినేనికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ తగిన ప్రాధాన్యం ఇచ్చారని అతని వర్గం హ్యాపీగా ఉందట. పనిలో పనిగా జిల్లా అధ్యక్ష పదవిపై కూడా చర్చ మొదలైంది. జనసేన కొత్త బాస్ ఎవరు అనే చర్చ జోరందుకున్న నేపథ్యంలో మరోమారు పార్టీ అధిష్టానం దృష్టి సారించిందట. ఇది కూటమి ప్రభుత్వానికి కొత్త చిక్కు తెచ్చిపెట్టేలా ఉందని తెలుస్తోంది. నిన్నటి వరకు అవకాశం వచ్చినా, రాకపోతే, అవకాశం కల్పించుకోనైనా బాలినేనిని విమర్శిస్తూ వస్తున్న టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ అతనితో కలిసి కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తారా, కలిసి కార్యక్రమాలు చేసేది సాధ్యమేనా… అంటూ కూడా జోరుగా చర్చ సాగుతోందట. పవన్ కూటమి పార్టీ నేతలంతా కలిసి పనిచేస్తారని సభాముఖంగా తెలియజేసినప్పటికీ ఒంగోలులో అది జరిగేది నిజమేనా అనే అనుమానాలు మాత్రం పోలేదు.
సమన్వయం సాధించడం పెద్ద సవాల్
ఒంగోలు కూటమిలో ఈ ముగ్గురి మధ్య సమన్వయం సాధించడం అధిష్టానానికి పెద్ద సవాలుగా మారింది. ఎందుకంటే రియాజ్ వర్గం.. ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ కు సన్నిహితంగా ఉంది. బాలినేని వర్గం మాత్రం.. అటు రియాజ్ టీమ్ కు.. ఇటు దామచర్ల వర్గానికి కొరకరాని కొయ్యలా తయారైందనే టాక్ నడుస్తోంది. ఈ క్రమంలోనే పవన్ నేరుగా స్టేజ్ పైనే ఇరువర్గాలకు క్లాస్ తీసుకున్నట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలోనైనా తాజా, మాజీ ఎమ్మెల్యేలు ఒక్కటవుతారా? పాత పద్దతిలోనే సై అంటేసై అనుకుంటారా అనేది చూడాల్సి ఉంటుంది. ఓవరాల్ గా ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కలిసి కార్యక్రమాలు నిర్వహిస్తే చూడాలనకొనే ఒంగోలు ప్రజల ఆశలు నెరవేరే అవకాశం ఉందా అంటే చెప్పలేం అంటున్నారు పొలిటికల్ ఎక్స్ పర్ట్స్. ఎందుకంటే రాజకీయాల్లో ఏదైనా పాజిబులే.
Also Read: బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతుందా?
వాస్తవానికి బాలినేని జనసేనలో చేరికను ప్రస్తుత ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ తీవ్రంగా వ్యతిరేకించారు. పవన్ కల్యాణ్ తో ఉన్న పరిచయాల నేపథ్యంలోనే బాలినేని చేరికను దామచర్ల వర్గం అడ్డుకోలేకపోయిందట. కూటమిలో భాగస్వామి అయినప్పటికి బాలినేని పెద్దగా ఒంగోలు నియోజకవర్గంలో పర్యటించడం లేదట. అలాంటి వ్యక్తికి జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే వర్కవుట్ అవుతుందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మరికొందరు నేతలు. అదే టైంలో ఏడుసార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఐదుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసిన అనుభవం బాలినేనిది. ఆయన అనుభవం జిల్లా రాజకీయాల్లో పార్టీని మరింత స్ట్రెంతెన్ చేస్తుందనే అభిప్రాయం మరో వర్గం వ్యక్తం చేస్తుంది. మరి జనసేనాని మనసులో ఏముందో తెలియాలంటే కొంత వెయిట్ చేయాల్సిందే.
Story By Venkatesh, Bigtv